Friday, 8 March 2024

తాను నేను

దొరలా వస్తావని ఎదురు చూస్తే
దొంగలా వస్తావు

నీకు దొరకనిది ఏదో
నా దగ్గర దోచుకోవాలని

మాటలను మంత్రాలుగా వాడతావు
వశీకరణం విద్య చేతకాక పోయినా

నీ మాటలు వెళ్ళే దారిలో
నన్ను నడిపించాలని చూస్తావు

నీ చేతల్లో నన్ను ఇముడ్చుకోవాలని 
ఆరాట పడతావు

దొంగవిరా నువ్వు..
నీ నాటకాలు చూసి నవ్వు వస్తుంది
నీ బాధలు చూసి జాలేస్తుంది

కానీ నీకు కావలసింది దొరికితే 
నువ్వు ఒక్క క్షణం ఉండవని తెలుసు

మీ మగాళ్ళ కన్నా ఆ మకరందాన్ని దోచే తుమ్మెదలు నయం కదా
ప్రేమ, స్నేహం అంటూ కథలు చెప్పకుండా కావలసింది తీసుకు పోతుంది

దొరవిలా రా
దర్జాగా తీసుకోవచ్చు

దొంగలా రాకు
దొరకను నీకు

✍️అరుణిమలు

Thursday, 26 October 2023

తాను నేను

#600_తానునేను

ఎవరు నువ్వు
ఎంత వెతికినా కనపడవు
ఎందరిలో నిన్ను చూడాలన్న కనిపించవు

నా ఊహల్లో నీకు రూపాన్ని 
అద్దాలని అనుకుంటా
అంతలోనే..

ఎక్కడ ఉన్నావు
ఎక్కడని వెతకను
కనిపిస్తావా ?

అనే సందేహాల్లో
నిన్ను వెతుకుతూనే ఉన్న

శరీరాన్ని కాదు
మనసుని ఆశించే నిన్ను
ఏమని పిలవను
ఎవరవని వెతకను

కనిపించినట్టే అనిపిస్తావు
అంతలోనే నిన్ను వెతకలేనని నిరూపిస్తావు

తనువులు కోరే
ఆకలి దేహాలే 
ఎటు చూసినా

అందులో నిన్ను
ఎలా వెతకాలి !?

నిన్ను చేరే
దారేది ?

✍️అరుణిమలు

తాను నేను

నటిస్తున్న కనుక.. 
నువ్వు నా నవ్వును చూడగలుగుతున్నావు..

అవమానాలని భరిస్తున్న కనుక..
నీ బాధ్యతలు సక్రమంగా సాగుతున్నాయి..

నీ కోసం అని ఆగుతున్న కనుక..
నీ ఇల్లు ప్రశాంతంగా ఉంది..

మాట పెదవి దాటలేదు
కాలు గడప దాటలేదు కనుక ఆదర్శంగా ఉన్నాం..

నేను నటించడం మానెస్తే !?

నీ ముందు ఉండే నిజాలకి.... నువ్వు ఇచ్చే జవాబు "మౌనమే" అని తెలుసు...

✍️అరుణిమలు----

Wednesday, 10 August 2022

తాను నేను

కళ్ళు మూస్తే గాని
కళ్ళ ముందుకు రావుగా..

కనుల పల్లకీలో 
కలల ఊరేగింపు చేస్తావు..

మనం రచించే కథలు
మేల్కొనే సమయం ఇదేగా..

చెంతనే నువ్వు ఉన్నావేమో
చిరునవ్వు నీ చిరునామా చెబుతుంది..

మన ప్రపంచానికి
మనమే పహారా కాస్తూ..

చెక్కిలిపై చిలిపిగా
ముంగురుల ముగ్గులేవో వేస్తుంటే..

మళ్ళీ మళ్ళీ ఇక్కడే
ఇలాగే మనం ఉండిపోవాలని ఉంది..

అవును నీ దూరాన్ని
దగ్గర చేసేవి ఈ కలలేగా..

✍️అరుణిమలు

Tuesday, 1 March 2022

నేనిలాగే చెబుతా

నాలుగు గోడల మధ్య
నువ్వు ఏడ్చిన
నవ్విన
నిలదీసినా
నిరసన తెలిపిన
నోరు పారేసుకున్న 
ఉపయోగం ఏముంది..

దాని బదులు 
నీలో నువ్వు బతకడం మేలు కదా...

నాలుగు గోడలు కాదు.... నాలుగు దిక్కులే నీ హద్దులు చేసుకో....బతుకంటే అంటే ఏంటో తెలుస్తుంది..

Thursday, 6 January 2022

తాను నేను

నీ ఎద పై నిదురపోవాలని కలవరిస్తూ 
కళ్ళు మూతలు పడ్డాయో లేదో..

ఈ చేతులకు నీ గుండె సడి తెలిసింది
నా నుదుటిపై నీ వెచ్చని శ్వాస తాకింది

కళ్ళు తెరిచి నీ కోసం వెతికాన
నా గుండె లయ పెరిగింది
నా శ్వాస బరువెక్కింది తప్ప 
నీ జాడ తెలియ లేదు..

విన్నపాన్ని మన్నించి
తరలి వచ్చావేమో అనుకున్న
ఈ తనువు తపనలే కానీ నా తపస్సు ఇంకా పూర్తి కాలేదని చీకటి చెప్పింది

ఎదంతా భారంగా ఉంది
గదేమో ఖాళీగా ఉంది..

✍️అరుణిమలు

Friday, 10 December 2021

తాను నేను

ఊహించి రాయడానికి
ఊహవు కావు

వాస్తవం రాయడానికి
నువ్వు నిజానివి కావు

కథ రాయడానికి
గొప్పగా చెప్పుకునేంత ఏం లేదు

కవిత అల్లడానికి
నువ్వు కడ వరకు నిలిచే తోడువి కావు

ప్రస్తుతానికి నీ అనుభూతి నిజం
రేపటికి నువో గతానివో, జ్ఞాపకానివో

కాలానికే తెలియాలి
మన గాథ

#అరుణిమలు