Thursday, 22 November 2018

తాను నేను

మనసుకు ఆంక్షలు విధించినప్పుడు
మౌనం పహారా కాస్తుంది..
ఇష్టాన్ని కసురుకున్నాక
చనువు చివుక్కుమంటుంది..

నిశ్శబ్దమే మన చుట్టూ
అలజడులో ఎన్నో ఎదలో..
పెదని చాటున దాగిన ప్రశ్నలెన్నో
జవాబు కోరని కోరిక అడ్డుగా నిలబడింది..

ఆలోచనల సాలె గూడులో
మెదడు,మనసు చేస్తున్న పోరాటాలు ఎన్నో..

జరిగింది నిజమని
జరుగుతున్నది మనది కాదని
జీవితం చెబుతునే ఉంది
జీర్ణించుకోమని..

ఆశించింది అంచనాలకు
అందనంత ఎత్తులో ఉంది..
పొందింది ఏమో
నువ్వు ఎవరు, ఏమౌతావనే అనే ప్రశ్నను సంధించి తిరిగి చూడకుండా పోయింది..

కానివారు చేసే గాయం
కన్నీటి చుక్కతో తుడుచుకు పోతుంది..
అయిన వారు ఇచ్చిన గాయం
ఆహుతి కోరుతుంది..

అంతే... అర్ధమయ్యే మనసుకు ఒకమాట చాలు
అర్థం కాని మనసుకు మౌనం కూడా పొగరులా అనిపిస్తుంది...

✍అరుణిమలు

Thursday, 15 November 2018

తాను నేను

మనసుకేం తెలుసు అలుసైతే ఎంత కష్టమో...
ఇష్టం ముందు ఏదైనా దిగదుడుపే దానికి..

తల వొంచినా, తలంపులో నువ్వే ఉండాలి అంటుంది..
గాయపడినా లేపనం నువ్వే కావాలంటుంది..

నిందలు, నిష్టూరాలు మోసిన పెదవి తెరవకు అంటుంది..
కసురుకున్నా, కను మూలలో దుఃఖాన్ని ఆపేయమంటుంది..

తక్కువ చేసినా నేనెక్కడ ఎక్కువ అంటూ తగ్గమంటుంది..

ఈ మనసుకు అభిమానంతో పనిలేదు..
దాని అభిప్రాయాలతో అవసరం లేదు..

ఇష్టమైన వారితో ఇష్టంగా ఉండిపోతే చాలు అంటుంది..
ఎంత స్వార్ధమో కదూ....కాదంటే, కూడదంటే వేదనకు అర్థం చెబుతుంది..

ఏకాంతాన్ని కూడా కరువు చేసేలా నస పెడుతుంది..
దేహాన్ని వదిలి పోయా నా ఇష్టం దగ్గరకు
నేను కావాలంటే నువ్వే రా అని దారులన్ని మూసేస్తుంది..

ఆలోచనలను ఆక్రమించేస్తుంది తన ఇష్టాలతో
ఎటు పారిపోతావు నా మాట వినకుండా అని..

బహిరంగ శత్రువులనైనా జయించోచ్చు కానీ
ఈ అంతర్గత శత్రువును ఎదుర్కొనే ఆయుధం ఉందా అసలు...

✍అరుణిమలు

Wednesday, 14 November 2018

తాను నేను

నాలుగు రోజులు రాయడం మానేసానేమో
నా పుస్తకంలో ఖాళీ కాగితం కూడా ఒక కథలా కనిపిస్తుంది...

ఆలోచనలన్ని సాలెగూడులా
ఎదంత చిందర వందరగా ఉంటే ఏమని రాసేది...

భావాలన్ని ఒకచోట ఆగి కదలనంటున్నాయి
ఏకాంతం అంటూ ఎక్కడ ఉందని వెతుకుతున్న..

శూన్యంలో ఎన్నో రాస్తున్న
ఎటు పోతున్నాయో ఆ పదాలు
ఎక్కడికి చేరాలని ఉందో...ఏమో

నా పదాల జాడ నాకే కానరావడం లేదు
మళ్ళీ చదువుదామంటే..

కొన్ని పదాలు తడిచి పోతుంటే
మరికొన్ని మెరిసిపోతున్నాయి

నాకు నేను దూరంగా
అక్షరాల వనంలో విహరిస్తున్న..

నీకు దగ్గరగా...

✍️అరుణిమలు