Sunday 12 April 2020

తాను నేను

కొన్ని నవ్వులను ఏరుకుందామని వస్తే
కాసిన్ని కన్నీళ్ళను ఇచ్చి పంపుతావు..

మౌనంలో దాగిన వేదన
చదవ లేవు..
కన్నీటి చుక్క బరువు
తూయలేవు..

ఎందుకు మరి
ఎదను కోతల పాలు చేస్తావు..

సంతోషాన్ని ఏనాడైనా ఇచ్చావ
లేదు కదా...
మరి కన్నీటిని ఇచ్చే అధికారం నీకు ఎక్కడిదని అడగాలని ఉంది..

తప్పు నీది కాదు
ఆ అధికారం ఇచ్చిన నా మనసుది కదా తప్పు..

నిన్ను నన్ను మించి అభిమానించడమే
నా మనసు చేసిన తప్పేమో..
అందుకే నీ మాటలకు మనసు రోదిస్తుంది...

నీకు చేతనైతే 
మరో గాయాన్ని చేయకు..
మాను, మాకులా చూడకు మనిషిలా చూడు
అని అడగాలని కూడా లేదు ఇప్పుడు..

గుర్తింపును కూడా అర్ధించే చోట
బంధాలు ఏముంటాయి..
మానసిక మరణాలు తప్ప..

✍️అరుణిమలు

తాను నేను

మనసంటే లెక్క లేని చోట
కన్నీటికి విలువ ఉంటుందా..

కఠినమైన మాటలలో
కారుణ్యపు కోతలు ఎన్నో..

బరువెక్కిన కను రెప్పలలో
భారం ఎంతో 
కనులలో ఉబికే గంగకే తెలుసు..

నీతో తలపడిన ప్రతీసారీ 
మనసు అలసిపోతుంది...

తిరగబడటానికి నేను ఆయుధాన్ని కాను అభిమానాన్ని...
మౌనమే నా జవాబు..

✍️అరుణిమలు

తాను నేను

నీ పేరు నా చిరునామాగా మారి
నీ తలపో చిరునవ్వుగా నన్ను చేరింది..

నీకై మానసాన నే చేసిన తపస్సు
ఆరడుగుల రూపంలో నన్ను వరించింది..

నీ ప్రేమ తిలకం
నా నుదుటిన చుంబనంగా చేరాక..

నన్ను నీ నుండి 
విడదీసే శక్తి కాలానికి కూడా లేదోయ్..

మూరెడు తాడు పెనవేయక పోయినా
మనసును పెనవేసుకున్న ముడులు ఎన్నో ఇక్కడ..

ఎద పై చెక్కిన నీ పేరును
ఈ గుండెసడి ఎవరికైనా వినిపిస్తుంది ఏమో అని
మరే మనసుకు చేరువ కాలేదు కూడా..

గుప్పెడు గుండెలో ఉన్నది నీవే
ఈ ఎద చప్పుడు ఆగే వరకు..

కాలమేదైనా...తీరమేదైనా
నా ప్రయాణం నీతోనే
నీ ధ్యానం లోనే..

నేను ఎవరంటే
నువ్వేనంటా..

మరో తలపు
నా తలుపు తట్టదు..
నిన్ను దాటి నన్ను చేరేది
మెప్పించేది ఎవరోయ్..

✍️అరుణిమలు