నాకు నేనంటే చాలా చాలా ఇష్టం
నన్ను నేను ప్రేమించుకోవడం ఈ ప్రకృతి నుండే నేర్చుకున్న ...
నేను ప్రకృతి ఆరాధకురాలిని...అవును 😍
బతుకు...బతికించు...బతకనివ్వు అని చెబుతుంది
పడి లేవడం అంటే ఏంటో నేర్చుకో నన్ను చూసి అంటుంది
ఎన్ని అవాంతరాలు వచ్చినా చిగురించే ఆ ఆశ నాకిష్టం..
పుట్టుక ఏదైనా నలిగి నలిగి తనని తాను మలుచుకుని మెప్పించుకున్న సీతాకోక చిలుకంటే ఇష్టం...
బ్రతికే కాలం ఎంతన్నది ,తన అవసరం ఏమంత ఉందని లెక్కచేయకుండా పూచే పూల అందాలు ఇష్టం...
చూసే దృష్టి నీకు లేకపోతే నాకేంటంటూ ఏమాత్రం వెనుకడుగు వేయని గడ్డిపూలు అంటే ఇష్టం...
మోసే భారం తాలూకా ఫలితం తనది కాకపోయినా మనకి ఫలాలు అందించే ఆ తల్లి అంటే ఇష్టం...
జగమంత కుటుంబం నాదంటూ స్వేచ్ఛగా ఎగిరే ఆ పక్షులంటే ఇష్టం...
నేనెక్కడికి వెళ్ళినా నా వెన్నంటి ఉండే విశాలమైన ఆ గగనం అంటే ఇష్టం...
వెచ్చగా నను తాకే ఆ భానుడి కిరణాలంటే ఇష్టం..
రేతిరేళ చుక్కలను కలుపుతూ ముగ్గులు వేయడం ఇష్టం ...
ఇంకా రేరాజు గురించి వేరే చెప్పాల అర్ధరాత్రి దొంగలా కిటికీలోనుంచి నా పక్కకి చేరి నన్ను అల్లుకుపోయే నువ్వంటే పిచ్చి ఇష్టం ....
నను ఊరించే మేఘాలంటే ఇష్టం ...ఎక్కడ భారాన్నో నెత్తిన పెట్టుకొని ఇక్కడ దింపేసే ఆ కారు మేఘాలంటే ఇంకా ఇష్టం....
బీడు బారిన మనసుని ముంచి ముద్ద చేయడానికి ఆ నింగి నుండి జాలువారిన నీటి ముత్యాలంటే ఇంకా ఇష్టం...
కావాలన్నప్పుడు రాకుండా తనకి నచ్చినపుడు వచ్చి చెక్కిలి గింతలు పెట్టే ఆ గాలి గాడంటే కూడా ఇష్టమే...
తప్ప చేసిన ప్రతిసారీ గుణపాఠం చెప్పడానికి నువ్వు విరుచుకు పడడం కూడా ఇష్టమే...
అసలు నీలో ఇష్టం లేనిదేముంది నాకు...రాతిరేళ వచ్చి దాగుడుమూతలు ఆడదాం వస్తావా అనే ఆ మిణుగురులు అంటే ఇష్టం...
నన్ను పట్టుకో చూద్దాం అనే తూనీగలంటే ఇష్టం...
పొంగిపరలే నదులంటే ఇష్టం అవి సంగమించే సాగరుడు అంటే ఇంకా ఇష్టం..
ఎంతని చెప్పను నా ఇష్టాన్ని ఇంతని,అంతని అనంతమని....
ప్రేమించే వాళ్ళల్లో మంచినే కాదు చెడుని కూడా ప్రేమించడం, స్వీకరించడం ఈ ప్రకృతి నుండే నేర్చుకున్నాను..
ఇంతలా ప్రకృతిని, నన్ను ప్రేమించుకునే నేను..
నేను...నాలో ఉన్న నా మనసుని ఇంకెంతలా ప్రేమించగలనూ....
..............అరుణని.............
No comments:
Post a Comment