అక్షర దోషాన్ని కూడా సవరించనిదే నా మనసు కుదుటపడదు...
అలాంటి నేనే నా సరిచేయలేని ఒక సరి సంఖ్య చెంతనున్నది ...
నువ్వెప్పుడు సశేషమే నా ఆలోచనలలో....
నిన్ను ఛేదిస్తున్న కొద్ది నాకు నేను భారమౌతున్నాను...
అబద్ధాలన్ని ఆవిరై కరిగిపోయి..నువ్వు నువ్వుగా కనిపిస్తున్నావు...
బాగున్నావు ఇప్పటికి ...ఆ మొదటి రోజుకి ఇప్పటికి తేడా ఏం లేదు...వాస్తవాలు తప్పించి
నా దృష్టి దోషమా ఏమో మరి...మనసుతో చూస్తాను కదూ మరి అందుకే మార్పేమి లేదు నీలో
నేనేంటి నీకు తెలిసినా...నా విలువ ఏంటి నీ దృష్టిలో అని తెలిసినా...నన్ను ఎలా చూపిస్తున్నావో లోకానికి తెలిసినా...ఇంకా నువ్వు నా మనిషిలానే కనిపిస్తున్నావు..
నీ పిలుపు నను తాకగానే నా పెదవిపై వెలిగే చిరునవ్వు అదే ..మొట్టమొదటి సారి నువ్వేంటో నాకు తెలిసినప్పుడు నా పెదవిపై మెరిసిన ఆ నవ్వే ఇప్పటికి..
నీ తప్పులకు కోపం చాలా ఉంది కాని ఆ కోపం నాలో నీమీద ద్వేషాన్ని మాత్రం రగిలించ లేకపోతుంది
నువ్వు తీసేసిన నా విలువ కూడా నీ విలువను నా దృష్టిలో దిగజార్చ లేకపోతుంది...
నువ్వంతే మారవు....నేను కూడా ఇంతేనేమొ
నిన్ను నిన్నుగా స్వీకరించేసింది ఎందుకో ఈ మనసు..
ఏం పొందానని అనుకోవట్లేదు...ఏం కావాలని కూడా కోరుకోవట్లేదు..
మనసంతా అల్లకల్లోలమే ...నా అంతరంగ ఘోషని నా చిరునవ్వుతో దాచేస్తున్న...
ఎద సంద్రంలో ఎన్ని ఉప్పెనలో వాటిని....నా నిట్టూర్పులతో చల్ల బరుచుకుంటున్నాను...
గుప్పెడు అనుభూతులను నా గుండెలకు హత్తుకుని ఆయువు పోసుకుంటున్నాను అనునిత్యం ....
నా గాయాలకు ఈ అక్షరాలను లేపనంగా రాసుకుంటున్నాను...
ఈ అంతర్మధనం అణువంత కూడా నిను తాకనీయకుండా నా అంతరంగంలోనే అణిచి ఉంచాను..
అడగాలని లేదు ఏది...అవకాశం నేనివ్వను నానుండి నువ్వు దూరం అవ్వడానికి ఏనాడు..
నీకు నీవుగా వచ్చావు...రమ్మని అనలేదు ఆనాడు
వెళతాను అంటే కూడా కాదనడానికి నేనెవరిని
ఇన్ని చూసినా ఇప్పటికి రాని ద్వేషం ఇంక ఎప్పటికి రాదు ఏమొ..
నువ్వెప్పుడు నాకు ఒక్కటే ....నా మనసువి అంతే
నేనేంటి అని నీకు తెలిసినా కూడా...నేనింతే
..............అరుణని............
No comments:
Post a Comment