Saturday, 2 December 2017
తాను నేను
ఏకాంత ప్రదేశంలో సీతాకోకచిలుకలా తిరుగుతుంది మనసు...
అణువణువును పరికిస్తూ,పలకరిస్తూ...
వెచ్చని రేయి కరగడానికి సిద్దంగా ఉందని నన్ను తాకిన గాలి చెబుతుంది...
కాళ్ళను తాకుతున్న తేమ చెబుతుంది మంచు దుప్పటి తొలుగుతుందని...
విరిసి విరియని మొగ్గలు చెబుతున్నాయి రాత్రి చేసిన జాగారం బరువు ఎంతగా ఉందో...
ఎక్కడ ఈ చోటని...నేనున్నది యాడని...ఎందుకీ కలవరమని ప్రశ్నలు వేసుకుంటే..
చెక్కిళ్ళు ఎరుపెక్కాయి...ఎద సడి పెరుగుతుంది ఎందుకో...
అదరాల మీద జారుతున్న సిగ్గులను తాకుతూ నలుగుతున్న పదాలలో ఎవరున్నారు...
ముంగురులు సైతం మోముని తాకి అడుగుతున్నాయి ఏంటోయ్ సంగతని...
కళ్ళు మాత్రం వెతుకుతున్నాయి ఈ కవ్వింతలకు కారణం కనపడదేం అని...
ఇక్కడే ఉన్నా అంటూ మదిలో నుండి వచ్చిన పలుకులకు తోడుగా నీ రూపం ఇలా ఎదురు పడేసరికి...
కలవరింతగా ఆ రెండక్షరాల నీ పేరును పలవరిస్తూ చప్పున లేచి కూర్చున్న....
చూట్టూ చీకటి...ఒంటరిగా నేను....నిట్టూర్పులో మాత్రం నువ్వు ఎదను తాకుతూ ఉంటే...
నిజంగానే నల్ల కలువలలో అలజడి మొదలు...
నువ్వు అక్కడ కలవరిస్తే, నే పలవరించానా ఇక్కడ...
నా పలవరింత మరి నిన్ను చేరుతుందా కలవరింతగా...
ఎందుకీ కలలు నాకు కల్లోలం రేపడానికి కాకపోతే...
✍️అరుణిమలు
No comments:
Post a Comment