Saturday, 2 December 2017
తాను నేను
ఈ దగ్గర తనంలో ఎంత దూరముందో కదూ
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేనంత...
నా కనుల నిండా ప్రశ్నలే కనిపిస్తున్నాయా నీకు...
చూడటానికి కూడా కష్టంగా ఉంది కదూ...
వాస్తవాలకు నువ్వెంతెంత దూరం అంటే నా పెదవికి,మెదడుకు ఉన్నంత దూరం అంటుంది మనసు...
అవును మెదడు కదిలిస్తున్న ప్రశ్నలు, పెదవి గడప చేరే సరికి మనసు హెచ్చరిస్తుంది ఎందుకిప్పుడని...
పరాయి అయితే ప్రశ్నించేదాన్ని...
వద్దనుకుంటే కడిగేసేదాన్ని...
మనసువి అయిపోయావు కదూ గట్టిగా అడగాలంటే ఊపిరి కూడా ఉలిక్కి పడుతుంది...
వాస్తవాలను చూపించలేక అలాగని సర్దుకుపోవడం చేతకాక నలుగుతున్న మనసు వేదన వినపడదే నీకు...
ఒక్కసారి నా కళ్ళలోకి చూడవయ్యా, నీ గుండెల మీద చేయి వేసుకొని అంతా అర్ధమవుతుంది...
చేతకాని తనం ఏమో మరి ఇది, నా ప్రాణం అయిన నిన్ను హింసించలేక నా శరీరం చీలి చీలిపోతుంది ఇక్కడ...
జీవితం ఒకటే కానీ ఈ మజీలీల మలుపులు మరీ ఇంత కర్కసంగా ఉన్నాయి ఏంటో...
నువ్వనే సిరా చుక్క అచ్చుగా మిగిలిపోయింది ఈ మది కాగితం పై...
చెరిపేయనా ఎలా.....చింపేయనా అదెలా.....
ఇదే మనసుకు లోంగిన వారి చేతకాని తనం అంటే...
✍️అరుణిమలు
No comments:
Post a Comment