Thursday, 15 November 2018

తాను నేను

మనసుకేం తెలుసు అలుసైతే ఎంత కష్టమో...
ఇష్టం ముందు ఏదైనా దిగదుడుపే దానికి..

తల వొంచినా, తలంపులో నువ్వే ఉండాలి అంటుంది..
గాయపడినా లేపనం నువ్వే కావాలంటుంది..

నిందలు, నిష్టూరాలు మోసిన పెదవి తెరవకు అంటుంది..
కసురుకున్నా, కను మూలలో దుఃఖాన్ని ఆపేయమంటుంది..

తక్కువ చేసినా నేనెక్కడ ఎక్కువ అంటూ తగ్గమంటుంది..

ఈ మనసుకు అభిమానంతో పనిలేదు..
దాని అభిప్రాయాలతో అవసరం లేదు..

ఇష్టమైన వారితో ఇష్టంగా ఉండిపోతే చాలు అంటుంది..
ఎంత స్వార్ధమో కదూ....కాదంటే, కూడదంటే వేదనకు అర్థం చెబుతుంది..

ఏకాంతాన్ని కూడా కరువు చేసేలా నస పెడుతుంది..
దేహాన్ని వదిలి పోయా నా ఇష్టం దగ్గరకు
నేను కావాలంటే నువ్వే రా అని దారులన్ని మూసేస్తుంది..

ఆలోచనలను ఆక్రమించేస్తుంది తన ఇష్టాలతో
ఎటు పారిపోతావు నా మాట వినకుండా అని..

బహిరంగ శత్రువులనైనా జయించోచ్చు కానీ
ఈ అంతర్గత శత్రువును ఎదుర్కొనే ఆయుధం ఉందా అసలు...

✍అరుణిమలు

No comments:

Post a Comment