Thursday, 20 April 2017

తాను నేను

ష్ ష్ ష్ ష్...............
మౌనానికి చోటిద్దామా కొద్దిసేపు..
మాటలకు నానార్ధాలు ఉన్నాయి..అవసరాన్ని బట్టి మారిపోవడానికి...
మౌనానికి లిపే లేదు కదూ...ఎవరు విన్నా అర్థం కాదులే..
ఈ నిశ్శబ్దం ఎన్ని సవ్వడులు చేసినా...పెదవి కదపకు.
మన ఇరువురి ఎద సవ్వడులు కలిసి తాళమేయనీ..
ఈ శ్వాసలు సరిగమలు ఆలపించనివ్వు అలా...
కాలాన్ని కదిలిపోనివ్వు కాని ఈ కొద్ది ఘడియలు మనం ఇలా ఇక్కడ ఈ మౌనంతో మాటాడుకుందాం...
ఈ నాలుగు కళ్ళు లోకాన్ని మరచిపోయి ఒకరిలో ఒకరు కలసిపోనివ్వు...
ఈ రెండు అక్షరాల ప్రేమకు అర్థం మాటలకు అందనిది కదా...
ఆ అర్ధాన్ని, నా ఆరాధనని నాకన్నా నా మౌనం బాగా వివరిస్తుంది ఒక్కసారి మనసు పెట్టి విను...
శరీరం ఒక రూపమే కాని నిను తాకింది కోరికతో కాదు..నా ఆత్మసాక్షిగా ఈ స్పర్శతో నా ప్రేమ లోతులను నీ ఆత్మకు తెలియడానికే...
ఏం కావాలి అనకు...నాకేం అక్కర్లేదు అని అబద్ధం చెప్పలేను..
అలాగని జరగనివి కోరుకోను కూడా...
నన్ను ప్రేమించమని అస్సలు కోరుకోను...
మరింకేం కావాలి అని ఆ చూపుల ప్రశ్నలకు జవాబు నా చిన్న నవ్వే...
ఇలా యుగాలు గడిచినా  ఇక్కడే ఇలా కాలాన్ని ఆపేసి ఇక్కడ నిలిచిపోదాము అన్న నాకిష్టమే...
కాని అది నీకు కష్టమని తెలుసు నాకు...
నిన్ను ఇబ్బంది పెట్టడం అంటే నన్ను నేను హింసించుకున్నట్టేగా...
సరే పో....వీలుంటే ఒక్కసారి వెనుతిరిగి చూడు...
నీకోసం ఎదురు చూసే వాళ్ళల్లో నేను తప్పక ఉంటాను...

        ............అరుణని............

No comments:

Post a Comment