Thursday, 20 April 2017

తాను నేను

గమ్యం ఎరిగిన పయనం మొదలయింది
ఒంటరిగా కాదు...నా వాళ్ళు అనే వాళ్లతో
సరదా కబురులు..తీపి ఙ్ఞాపకాలు..చిలిపి చేష్టలు
అల్లరి పనులు..ఒకపక్క సంగీతం తోడై సాగుతున్న పయనం...
ఇంత సందడి నుండి ఒకసారి దృష్టి అలా మళ్ళింది
విండో వేపుకి...నన్ను పలకరిస్తూ వీడుకోలు తీసుకుంటున్న చెట్టు చేమ...
అరక్షణం కూడా కాని పరిచయం మరుక్షణంలో వీడుకోలుగా మారుతుంటుంటే ....
అవి అక్కడే ఉన్నాయి కదిలేది నేననే ఆలోచన కూడా లేదు...
నడుము ఒంపులు పోలిన దారులను చూసి ఏమిటా వయ్యారం అనిపించింది..
నాతో పాటే సరి సమానంగా పయనిస్తున్నట్టు ఉంది ఆకాశం...
ప్రకృతిని,పల్లెలను,పంటలను,పట్నాలను చూస్తూ మైమరచిన మనసు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది...
ఆలోచనలు ఏమి లేవు ...మౌనం నను నేను మరిచిపోయేంత...
ఇంతలో ఉలిక్కిపడి బయటకు వచ్చాను ఒకమాటకి...గాలికి కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి గ్లాసెస్ పెట్టుకో అంటూ ....
కంటి అంచుల నుండి అప్పుడే జారి చెంపలను తాకిన తడిని తడుముతుంటే...
మనసు నవ్విన అర నవ్వు నాకే ఎరుక...గాలికి వచ్చాయా నీళ్ళు అనే ఆ వెటకారం ....
అద్దాలు అవసరమా అనుకున్న కాని తప్పదని అర్ధమయింది..అప్పుడే ఎక్కడ నుండో ఇక్కడికి ఊడిపడ్డానేమొ..నామీద నాకు పట్టు ఇంతలో దొరకదని..
తప్పనిసరియై కంటిపాపలను ఈ అరువు అద్దాల మాటున దాచేసాను...
స్రవించిన దారని గాలి గాడి పేరిట గాలికి వదిలేసి ...
ఈ ప్రయాణం అయ్యేవరకు ఇంక నా దరికి రాకంటూ..
నేను నా ఏకాంతానికి సెలవిచ్చి...నా వాళ్ళవేపు జరిగాను...
ఎందుకు కన్నీరు వచ్చిందని నేను ప్రశ్నించుకోలేదు కారణం నాకు తెలిసీ తెలియంది ...
మీరు ఒక అర నవ్వు నవ్వేయండి చెప్పడం ఇష్టం లేదు కదా అడిగి కష్టపెట్టంలే అంటూ ...

         ..............అరుణని.............

No comments:

Post a Comment