నువ్వు వచ్చేవరకు తెలియలేదు నేను అందరి లాంటి అమ్మాయినే అని
మగరాయుడిలా కాదు ఆడపిల్లలా ఉండడం నేర్చుకో అనిపించుకున్న
అణుకువ ఎక్కడ ఉందనే ప్రశ్నలను ఎదుర్కున్నాను కూడా
అలంకరణ,వినయం,ఓర్పు లాంటివి ఎరుగను నేను
ముక్కుమీద కోపం ఉండొచ్చు కానీ మరీ ఇంతా అనే వాళ్ళే అందరూ
అదేమిటో కాని...ఏం మాయ చేసావో..ఏ మంత్రమేసావో మరి
ఆడపిల్లని చేసేసావుగా నన్ను...
నీతో ఉన్నంత సేపు ఆడపిల్లగా..నీ ముందర నీ మగువనై నీ జతనైపోతాను
నీతో మాట్లాడుతూ ఉంటే చిన్నపిల్లనై నేను చేసే చిలిపి పనులు
నువ్వు ప్రేమగా మాట్లడుతుంటే...నాకేనాడు పరిచయం లేని
ఆ సిగ్గు ,బిడియం నాతో ఆటలాడుతున్నాయి...
వాటిపై కోపం ఉన్నా ఆ క్షణం అవంటే నాకు ఇష్టమేలే...
మగాడిని అయ్యుంటే బాగుండేది అనుకున్న సందర్భాలు ఎన్నో
నువ్వొచ్చాక ఆ మాట తలంపుకే రాలేదు తెలుసా
నీకోసం ఎదురు చూపులు వాటి వెనకున్న విరహం,చిరు కోపం
ఇవన్నీ నీ పిలుపు విన్న మరుక్షణమే ఎటుపోతాయో తెలియదు
నువు చేసే గాయాలు కూడా నువు రానంత వరుకే నన్ను బాధిస్తాయి
నీ రాకతో ఆ గాయాలు ఆ క్షణంలో కనుమరుగై పోతాయి
నాకు నేను ముందు తరువాతనే ఎవరైనా అనేది ఒకప్పటి మాట
ఇప్పుడు నీ తరువాతే నేనైనా..ఓయ్ మరీ ఇంతలా మార్చడం నీకు తగునా
ఇంత ఓర్పు నాకు ఎక్కడిదో ఇప్పటికి అంతు చిక్కట్లేదు
మారాను అంటే ఇంకేదో అనుకోకోయ్..ఈ మార్పు నీ ముందరే సుమీ
నీకు మాత్రమే నేను అమ్మాయిని..అందరికి కొరకరాని కొయ్యను ఇప్పటికి
నా ముక్కుకి తాడు వేసేవాడు రావాలి అని దీవిస్తున్నారు అందరూ..
వాళ్ళ దీవెనెలో,శాపాలో కాని ఫలించేసాయి అనే సంగతి ఎవరికి తెలియదు.
.........అరుణని........
No comments:
Post a Comment