Thursday, 3 January 2019

తాను నేను

గుప్పెడు ఙ్ఞాపకాలు చాలవా
గుండెను ప్రేమగా లాలించడానికి..
శూన్యం కూడా వేరు చేయలేని
వెలుగు రేఖలు మన మనసులు..

దూరం కూడా ఇంత అందంగా ఉంటుందా !!
ఏమో...!!

నిన్ను వదిలి రానన్న మనసును
నీ దగ్గర వదిలేసి కదిలిపోయేది దేహమే కదా..
చీకటి మనసులో అలజడులు రేపే
మరో మజిలీవి నువ్వే అవుతావనుకోలేదు..

గడియ పడిన మనసు తలుపు తట్టేది
కోరికలతో కాదు !! ఎలా ఉన్నావో అనే ఆత్రుతతో..

ఎందుకో ఈ అలజడి
అక్కడ అలికిడి లేకపోతే..
మౌనాన్ని కూడా తెంచేయగల
బంధమేదో నీతో ముడి వేసుకుంది..

నే దగ్గర కాలేని దొరవు నువ్వు
నా నుండి దూరం కాలేని ఇష్టానివి నువ్వు..

పదిమందితో పంచుకోవడానికి
నా ఆకలి తీర్చే ఫలానివి కాదు..
నా శ్వాసలో నిండిన వాయువు నువ్వు..

అల్లంత దూరాన ఉన్న తారనే నేను
అవసరమైన రోజున నువ్వు పిలవకుండానే నీ పక్కన నిలవగల నమ్మకాన్ని కూడా..

ఉండిపోదాం ఇలా..
ఒకచోటున లేకున్న
ఒంటిగా లేక జంటగా
ఎలా ఉన్నామో తెలుసుకోవాలనే లోకానికి ఒక ప్రశ్నగా..!!

✍️అరుణిమలు

No comments:

Post a Comment