Friday, 15 May 2020

తాను నేను

ఓదార్చే చోటే 
కన్నీరు ఒలుకుతుంది..

బాధని 
అర్థం చేసుకోని చోట
మౌనమే రాజ్యమేలుతుంది..

విసిగిన చోట
బాధని కూడా చూపించాలని ఉండదు..

ఏ ఓదార్పుని
మనసు కోరుకోదు..

ఇష్టమనే నా తప్పుకు
నువ్వనే కష్టమే కానుకగా దొరికాక..

అంతరంగంలో 
ఆహుతి ఐపోవాలని ఉంది..

కన్నీరు కూడా
బరువుగా ఉంది నేడు..

అక్షరాలకు కూడా
విన్నవించలేను ఎద కోతను..

✍️అరుణిమలు

తాను నేను

కోపంలో ఉన్న
సంతోషంగా ఉన్న
పరధ్యానంగా ఉన్న

అనుకోకుండా
నా పెదవులు పలికే పేరు నువ్వు..

తలపుల్లో నీవే
తల్లడిల్లేది నీకోసమే..

ఊహలో నువ్వే
ఉప్పెనగా ఎగసే బాధవి నువ్వే..

ఎప్పుడు
నాలో నువ్వు ఇంతలా 
ఏకమయ్యావో తెలియదు..

నేనంటు లేనని
నాకంతా నువ్వేనని
ఎందుకు నమ్మేసిందో ఈ మనసు..

నీ నుండి విడిపోవడం అంటే
నా నుండి నేనే దూరమౌతున్నట్టు ఉంది..

అందుకేనేమో
నీకు దూరమవ్వడానికన్నా
నీ ఆలోచనల నుండి
నువ్వనే అలవాటు నుండి బయట పడటానికి
నాతో నేనే తలపడుతున్న..

ఓడిపోతున్న ప్రతీసారీ
మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్న..

దారి నీకు తెలిస్తే
మనసు మీద కొట్టి పోకు
మనసులో నుండి వెళ్ళిపో..

✍️అరుణిమలు

తాను నేను

చీకటికి చాలా చెప్పుకుంటా...
దానికి పక్కవారికి పంచే అలవాటు లేదనే ధైర్యంతో..

నిశ్శబ్దంగా ఉన్నచోట
గుండె సడి ఎన్నో చెబుతుంది..

అలుపో....ఆశలో
ఎదలో‌ దాగిన కందకాన్ని తవ్వుతుంది..

ఇన్నాళ్ళు మన మధ్య ఉన్నది అబద్దమా
నువ్విచ్చిన మాట నిజమేనా..

మన దారులు వేరంటు
నా నీడ నన్ను వదిలి పోతుంది నేడు..

గుండెల మీద గుద్ది
నువ్వు కదిలి పోతుంటే...

మనసెందుకో ఇంకా బతికే ఉంది
మరుజన్మ దేనికి ఈ జన్మకు నా మనసుకు తోడు నువ్వనుకున్నందుకా...

నిన్ను ఎంత ఎత్తున నేను ఊహిస్తే దేనికి...
నాకు నువ్వు ఇచ్చిన‌ చోటు నీ పాదాల దగ్గర అని తెలిసాక...

అంతా శూన్యంలా ఉంది
మనం అనే మాట మూగబోయింది..

కత్తి మీద సాము చేస్తుంది ఈ మనసు ఇప్పుడు
గాయాలు తప్ప ఙ్ఞాపకాలు లేవు అక్కడ..

కంటిలో ఏ నలుసు ఉందో
కళ్ళకు‌ అలసట తీరడం లేదు..

అధికారం దండించడానికే కాదు 
దగ్గర తీసుకోవడానికి కూడా ఉండాలి..

కొట్టడానికి తప్ప 
కళ్ళు తుడవ లేని చేతులు దేనికి...

రాత్రి వెళ్ళిపోయింది చీకటిని చెరిపేసి
ఏ కన్నీరుతో కడుగుతున్నావో వేకువ కోసం...

✍️అరుణిమలు

తాను నేను

రాయాలని ఉంది 
తడి కన్నులలో చెమ్మ ఇంకే వరకు...

మనసు విసిగే వరకు
తనువు అలిసే వరకు..

తెల్లని కాగితంపై ఇది నల్లని అక్షరం కాదు
ఈ ఎద పై నువ్వు చెక్కిన గాయాలు..

రాతిరిని మింగేసిన నిదుర
చెబుతున్న కలత రాతలు..

అలసిన కనులకు
ఊరడించే పదాల అన్వేషణ సాగుతుంది..

✍️అరుణిమలు