నువ్వు నీలానే ఉన్నావు
నేనే నిన్ను నిన్నుగా చూడలేదు ఏమో..
పదే పదే నువ్వేంటో చెబుతానే ఉన్నావు
మాటల్లో, చేతల్లో..
గాయాలైన ప్రతీసారి కన్నీరై కరిగాను
నువ్వు వద్దంటు వెనుతిరిగాను..
నాకు నేనే ఓదార్పు నై
నన్ను నేనే నిలబెట్టుకుని మళ్ళీ నీవైపే అడుగులు వేసా...
పిచ్చి తనమో, వెర్రి తనమో
అహం, ఆత్మాభిమానం కలిసి ఉండలేవని తెలిసినా కూడా మరొక అవకాశం అనుకున్న..
గతాన్ని తిరిగేసి చదివా
నా అక్షరాలలో నిన్ను ఎంత అందంగా మలుచుకున్నానో..
నాలో నా కన్నా ఎత్తులో నిన్ను రచించా
నా ఆశలకు మరో రూపంగా మలిచా..
వాస్తవాలకు చాలా కోసుల దూరంలో
అతిశయోక్తికి దగ్గరగా ఉన్నాయి నాలో నీ ఊహలు..
నీ దూరం పెట్టిన పరీక్షలను చదివా
కొట్టిన చేతికి కారుణ్యం లేదని కనిపించింది..
అక్షరాలలో లక్షణాలు
అతనిలో ఎక్కడ కనిపించలేదు..
నీ జ్ఞాపకాలలో నన్ను వదిలేసి
నువ్వు నీ దారిన వెళ్ళిపోయావు అతిధిలా..
నీపై కోపమా....కోపానికి చోటు ఎక్కడ ఉంది
దేనికి చోటు లేనంత బాధలో నన్ను నిలబెట్టేసావుగా..
✍️అరుణిమలు
No comments:
Post a Comment