Thursday, 3 January 2019

తాను నేను

మేఘసందేశం, హంస రాయబారాలు
అవసరమా అసలు...

అక్కడ ఆ మనసు తలంచితే
ఇక్కడ ఈ మనసు కదురు తప్పుతుంది కదా..

మనసును మించిన రాయబారం ఏముంది,
కళ్ళను మించిన లేఖలు ఏమున్నాయి..

చేతలను మించిన పదాలు ఏవి
నవ్వులను మించిన జవాబులు ఉన్నాయా..

ఏ దూరానికి బలముందోయ్ నా నుండి
నిన్ను వేరు చేయడానికి..
ఏ కోపానికి అంత తెగువ ఉంది నా కోరికను
కాల రాయడానికి..

ఏ అలకకు అంత శక్తి ఉంది నా ఆలోచనలలో
ఉన్న నిన్ను అణిచివేయడానికి..

ఎదురుగా ఉంటే పలకరింపువు...
ఎడబాటులో ఉంటే పలవరింతవు..

ఈ విషయం కాలానికి కూడా తెలిసిపోయింది ఏమో..
మీ మధ్యలో నన్ను లాగొద్దని తప్పించుకు పోతుంది..

జవాబులు మీరే
ప్రశ్నలు మీరే
బదులు నా దగ్గర లేదంటూ..

✍️అరుణిమలు

తాను నేను

నొప్పికి, బాధకి రూపానిచ్చేదే కన్నీరు...
నొప్పి కలిగితే నాకోసం వస్తుంది..
బాధ అనిపిస్తే నీకోసం వస్తుంది..

మొండి చేతులకు దండించడమే తెలుసేమో...
చెంపన ఉన్న వెచ్చని చుక్కని తాకడం కష్టమే లే..

నాకోసం ఏనాడు రాని కన్నీరు నీకోసం ఆగనంటుంది..
ఎంత అలుసో దానికి నేనంటే..

కళ్ళల్లో దాచుకున్న నిన్ను ఆ బాధతో పాటే జారవిడిచేయాలని అనుకున్న..
తోడుతున్న కొద్ది గంగ వస్తునే ఉంది కానీ నీ జాడ ఏది...

ఊట బావికే ఊపిరివా నువ్వు
ఇక నిన్ను కదిలించేది ఎలా..

నిన్ను వదిలి పోవాలని వెనుతిరిగాను కానీ...
ఆలోచన ఒక అడుగు ముందుకు వేస్తే,
మనసు ఒకడుగు వెనుకకు లాగేస్తూ ఆఖరుకు ఉన్నచోటనే ఉండిపోయా ఇలా..

నాలో నిన్ను దాచేసుకున్నానో,
నీలో నన్ను పారేసుకున్నానో కానీ
నాకు నిన్ను వదిలే శక్తి లేకుండా పోయింది..

✍️అరుణిమలు

తాను నేను

వెన్నెలలా తాకుతున్న చూపులు
తేలుతున్న ఊహలను పట్టి ఆపాయి

కోతకు వచ్చిన కోరికలా
కొత్త కోక రంగుల అద్దకాన్ని అద్దుకుంది

చందమామ చుట్టూ వెన్నెల గూడు కట్టినట్టు
నా చుట్టూ పెనవేసుకున్న నీ ఇష్టం

అల్లరి ఏదో చేస్తుంది
కాదు..చెబుతుంది సరికొత్త కిటుకులను

ఈ ప్రేమ..
ఒక ప్రయోగశాలగా మారింది ఇప్పుడు

ఉరికే జలపాతమై కదిలి
స్వేదమై ఆవిర్భవిస్తుంది తుదకు

నిప్పుల కొలిమిలో కాలుతున్నాం
ఒకరిని ఒకరు తీర్చిదిద్దుతూ..

ప్రణయమో, ప్రయోగమో
పక్వానికి చెరో అడుగై కలిసి జయిద్దాం..

✍అరుణిమలు

తాను నేను

చూపులు చేరాలన్న చోటు వేరు
మనసు మాట్లాడలన్న మాట వేరు

పొంతన లేని పనులు
కదురు లేని కునుకు

నీ రాక కబురు అందిందేమో అన్నట్టు ఈ ఎద సవ్వడి ఏంటో..
ఏ పిలుపుకు బదులుగా అటు చూసాననో మరి నువ్వు ఎదురుగా కనపడటం ఏంటో..

ఏ మాటకు జవాబుగా పెదవి పై నవ్వు పూస్తుందో ఇక్కడ..
పిలిచే ప్రతీసారి అదే నీ మొదటి పిలుపులా మనసుకు కొత్తగా అనిపిస్తుంది ఎందుకో..

ఏ దిష్టి తగిలిందో
ఏ కంటికి ఇంపుగా కనిపించామో
లేదా కాలానికే నచ్చని కలయిక ఏమో మనది..

దూరం అనే ఆలోచనకు కోసుల దూరంలో ఉన్న నేనే
ఆ దూరాన్ని హత్తుకున్నాను ఇప్పుడు..

కానీ..
మనసు తన మాట తప్పనంటు
ఇరుకైన తనలో నిన్ను దాచేసుకుంది ఎప్పటికి..

✍️అరుణిమలు

తాను నేను

నీ చోటు ఇక్కడ పదిలంగా ఉంది..
నేనే కదిలించలేని నీ స్థానాన్ని ఎవరు ఆక్రమించగలరు ఇక..

ఇష్టంగా ఆ చందమామను దోసిటపట్టిన నీటిలోకి పిలిచేసా..
ఎక్కడ చేజారుతుందో అని నా ప్రేమ దాహాన్ని తీర్చమని దాచేసా నాలో..

కదిలే నా కోర్కెవు..
కనుల కూడలిలో కావలి కాస్తున్న కాటిక గుర్తువు..

వింటికి చిక్కని గురివి
వలపుల ఒడిలో మాత్రం చంటి పాప వే...

మారాలు ఎన్నో
మొరటు తనం అంతే
మన ఇద్దరి మధ్య గీతను చెరిపేసే పెంకితనం నీదే..

నా ఎదను తాకే పిలుపు నీదే
ఈ ఎదను గాయం చేయగలిగే శక్తి నువ్వే..

నా కనుబొమ్మల మధ్య ఉదయించే ఆశవు నీవే
నా పెదవుల పై పదమై నడియాడేది నువ్వే..

ఎక్కడో నువ్వు ఉన్నావు
నన్ను ఆడిస్తూ, ఓడిస్తూ,నడిపిస్తున్నావు..

✍అరుణిమలు

తాను నేను

అక్షరాల పై అదుపు లేదు
భావాలన్ని చెల్లాచెదురుగా పడి ఉన్నాయి
ఆలోచనల వేపు నుండి మనసు ఎటో మళ్ళింది

నీ నుండి దూరం జరిగాక
నాకు నేను కూడా దూరమయ్యాను

వెనుతిరిగిన ఇష్టం
కష్టపెడుతుంది క్షణం క్షణం
కానీ ఏం చేయగలను..

దారులన్ని మూసేసావు తొందరపడి
అభిమానం తలవంచలేక వెనుతిరిగింది

మనసుకు మాత్రమే తెలిసిన వ్యధ ఇది
విప్పి చెప్పేందుకు పదాలు లేవోయ్..

చదవడానికి కన్నీళ్ళు మిగిలాయి
చదవగలవా ఈ మనసు వేదన..

దేహాన్ని విడిచిన ప్రాణం లా
జీవం మరచిన ప్రాణిని అయ్యాను..

✍అరుణిమలు

Thursday, 22 November 2018

తాను నేను

మనసుకు ఆంక్షలు విధించినప్పుడు
మౌనం పహారా కాస్తుంది..
ఇష్టాన్ని కసురుకున్నాక
చనువు చివుక్కుమంటుంది..

నిశ్శబ్దమే మన చుట్టూ
అలజడులో ఎన్నో ఎదలో..
పెదని చాటున దాగిన ప్రశ్నలెన్నో
జవాబు కోరని కోరిక అడ్డుగా నిలబడింది..

ఆలోచనల సాలె గూడులో
మెదడు,మనసు చేస్తున్న పోరాటాలు ఎన్నో..

జరిగింది నిజమని
జరుగుతున్నది మనది కాదని
జీవితం చెబుతునే ఉంది
జీర్ణించుకోమని..

ఆశించింది అంచనాలకు
అందనంత ఎత్తులో ఉంది..
పొందింది ఏమో
నువ్వు ఎవరు, ఏమౌతావనే అనే ప్రశ్నను సంధించి తిరిగి చూడకుండా పోయింది..

కానివారు చేసే గాయం
కన్నీటి చుక్కతో తుడుచుకు పోతుంది..
అయిన వారు ఇచ్చిన గాయం
ఆహుతి కోరుతుంది..

అంతే... అర్ధమయ్యే మనసుకు ఒకమాట చాలు
అర్థం కాని మనసుకు మౌనం కూడా పొగరులా అనిపిస్తుంది...

✍అరుణిమలు