చూపులతో, మాటలతో, కోర్కెలతో మా ఒళ్ళంతా
తడిమేస్తుంటే ఒళ్ళు సచ్చిపోతుంటే సిగ్గుతో తప్పుకు
పోతున్నప్పుడు అనిపిస్తుంది ఏం తప్పు చేసానని..ఎందుకు తప్పుకు పోతున్నానని...
వావి,వరస,వయసు,బంధం,సంబంధంతో పనిలేకుండా
వెకిలి చేష్టలు చేసి...నీ వెనుకున్న కుటుంబాన్ని చూసి నేను ఊరుకుంటే...ఏం చేసానన్నట్టు నవ్వుతూ మా ఎదురుగా తిరుగుతూ...ఏమని చెబుతావు,చెబితే పోయేది నీ పరువే అనే తలపొగరు చూసినప్పుడు...ముప్ఫై రెండు పళ్ళు ఊడకొట్టి ఇప్పుడు నవ్వరా సన్నాసి అని చెప్పాలనిపిస్తుంది...
తప్పు చేసిన వాడికి పోని పరువు నాకెందుకు పోతుంది, అక్కడికి వాడికున్న బలం ఏంటి నాకు లేనిది ఏంటని...ఇలాంటి జవాబు లేని ప్రశ్నలు ఎన్నో...
ప్రేమించానని ఒకరు,మనసు గెలిచి ఒకరు,మూడుముళ్ళూ వేసి ఒకరు,అమ్మడుపోయి ఒకరు,కొనుక్కుని ఒకరు...ఏం చేసినా చూసేది ఈ తోలునే కాని అది కప్పుకున్న ఆత్మను కాదు....నేను మనిషినే నాకు మనసుంది,కోరికలు,ఇష్టాలు,ఆవేశం,కోపం, అయిష్టం ఇలా అన్నీ ఉన్న ప్రాణం ఉన్న మనిషిని...నాతో సంబంధం లేని నీ నిర్ణయాలు, నీ ఆటలు నాతో ఆడటానికి నువ్వు ఎవరివి అని అడగాలని ఉంటుంది ....
నా బట్ట,కట్టు,బొట్టు,నడత,నడక ఇదంటూ గిరి గీసే హక్కు నీకెవడు ఇచ్చాడు ....నీకు గిరి గీస్తాను ఉంటావా ఎందుకు ఉండలేవు...నీకొక న్యాయం నాకొక న్యాయం దేనికి...స్వేచ్ఛ లేదంటూ అందుకు నీ బలహీనత కారణమనడానికి సిగ్గు లేదురా అని గొంతు చించుకుని అరవాలని...మీ చెవుల తుప్పులు వదిలేల అరిచి చెప్పాలని ఉంటుంది..
అంగాంగాల వర్ణన...ఆడదాన్ని అంగాలను వర్ణించి తిట్టడం మగతనం అనుకునే యదవలను చూసి నేనెందుకు సిగ్గు పడుతున్నాను...ఈ అంగాంగాల తోలు కప్పుకున్నదే నిన్ను కన్నాదని మరిచిన యదవలను చూసి నాకెందుకు భయం...ఇలాంటి యదవలను కనడం కన్నా మాతృత్వాన్ని వదిలేయడం నాకిష్టం అని మొఖం మీద ఉమ్మేయాలని ఉంటుంది...
వాంఛలతో రగిలిపోతూ నాలో మనిషిని కాకుండా కోరికలను చూసే వాళ్ళకు చెప్పాలని ఉంటుంది ....వల్లకాడులో సగం కాలిన కట్టెతో తీర్చుకోరా నీ వేడికి ఆ వేడి సరిపోతుంది...మీకు మనసులతో మనుషులతొ పనేముంది అని...
ఆడది,అబల,సబల అంటూ నాకెందుకు ఈ మానసికమైన బలహీనతను ఇచ్చావని ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుడిని నిలదీయాలి అనిపిస్తుంది...ఈ బంధాలు,ప్రేమలు,ఎదురుచూపులు ఈ కన్నీళ్ళు నాకే ఎందుకు...ఈ బలహీనత నన్ను నా ఆత్మాభిమానాన్ని చంపేస్తుంటే నన్ను నేను ఆ బలహీనత నుండి బయటకు తీసుకురాలేనప్పుడు అనిపిస్తుంది ఈ కన్నీళ్ళలో నేను కొట్టుకుపోతే బాగుంటుంది అని....
సాటి మనిషిగా చూడలేని ఈ చీడ సమాజాన్ని చూస్తుంటే చీధరించుకుని...ఈ నమ్మక ద్రోహాలకు,నాటకాలకు,అబద్దాలకు,అవసరాలకు అసలు మనిషన్న వాళ్ళకు దూరంగా పోయి నాతో నేను మాత్రమే ఉండాలనిపిస్తుంది...మానభంగం నిత్యం జరుగుతునే ఉంది కంటికి కనిపించకుండా నా ఆత్మ శాక్షిగా...అవకాశం దొరికితే మృగాలు లేదా దొరలు...
...............అరుణిమలు................