Thursday, 30 November 2017

తాను నేను

నీతో నా అనుభవాలను రాయనా...అనుభూతులను రాయనా...
అనుభవాలేమో ఏడేడు జన్మలకు సరిపడా గుణపాఠాలు...
అనుభూతులేమో తాకేందుకు కూడా చోటు లేనన్ని గాయాలుగా మిగిలాయి...
గతమేమో భవిష్యత్తును శాసించింది ఆశలను తుంచేసి మరి....
భవిష్యత్తేమో భారంగా చూస్తుంది వెను తిరిగి ఎందుకింత బరువును ఇచ్చావంటూ....
ఎన్నో ప్రశ్నలు నిన్ను అడగాలని ఉన్నా...అక్కడ వచ్చే జవాబు ఒకటే....క్షమించు !!!
నువ్వంటే ఇష్టం అంటూ కోరి వచ్చింది నువ్వు...
తరువాత నేనొక అవసరాన్ని అన్నది నువ్వే...
ఇప్పుడు నేనెప్పుడూ నిన్ను ఇష్టపడలేదు అంటూ... క్షమించి మరచిపో గతాన్ని అని నువ్వంటుంటే...
నిన్నేమని అడగాలి....శరీర గాయానికి మందుంది ఈ మనసు గాయానికి మందుంటే ఇవ్వవా అనా....
మనసుతో ఆడుకోడానికి నేనే దొరికానా నీకు అని అడగనా...
నిన్ను నమ్మిన నేరానికి ఇంత శిక్షా....నేనెప్పుడూ నిన్ను ఇష్టపడలేదు ఈమాట చాలదా నన్ను దహించేయడానికి..
ఎవరివని వచ్చావు అసలు, అధికారం ఎందుకు  తీసుకొన్నావు..
మనసుకు మూడు ముళ్ళ బంధాన్ని సైతం వేసి ఈ రోజు మరచిపో అంటే నన్ను నేనే మరచిపోవాలనుంది ఇప్పుడు ...
ఆటబొమ్మనా నేను....నేను మనిషినిరా అని గొంతు చించుకొని అరవాలనుంది...
క్షమించు అనేమాటతో నువ్వు నీ తప్పును కడిగేసుకుని ఆ నీళ్ళను నామీద జల్లేసావు నా పాపంలో కాలిపో అంటూ....
ఒక్క అర ఘడియ నా మనసు భారాన్ని మోస్తే నీకు తెలిసేది నువ్వు చేసిన గాయాల లోతు ఎంతుందో....
జీవితంలో నిజాయితీగా ఎప్పుడూ ఎవరినీ నువ్వు ప్రేమించకురా...
కర్మ సిద్ధాంతం నిజమే అయితే ఇక్కడ నాకు నువ్విచిన ప్రేమ లాంటి ప్రేమ నీకు తిరిగి రావొచ్చు కదా....
నువ్వు అనుభవించగలవా ఇంతటి ఊహకు అందని నరకాన్ని....
ఇప్పుడు నవ్వుతునే ఉన్నాను జీవం లేని నవ్వు నా మనసు ఘోషను వినలేక...
ఇప్పుడు ఇంతకు నేను నిన్ను ప్రేమించానన్నది మరచిపోవాలా...నువ్వు నన్ను ప్రేమించలేదు అన్నది మరచిపోవాలా
ఏది మరచిపోవాలి.............??????

...................అరుణిమలు..................

No comments:

Post a Comment