Thursday, 30 August 2018

తాను నేను

నువ్వెవరో అనుకున్న
నాకేంటి అనే ఆలోచన కూడా లేదు ఒకనాడు..

నువ్వెవరో... ఇప్పుడు తెలుసుకున్న
నీకేంటి నేను అని కూడా తొంగి చూసా..

మనమెవరు అనుకున్న..
తీరానికి చెరో వేపు ఎదురెదురుగా ఉన్నామని కనిపించింది..

ఎంతవరకు ఇలా అని ప్రశ్న వేసుకున్న..
నువ్వనే శ్వాస నన్ను వదలనంత వరకు అని చెప్పింది..

మన మధ్య దూరం ఎంతుందో అని కొలిచా..
కొలమానానికి కూడా చోటు లేదని మనసు పొమ్మంది ..

ఇంతకు, ఇప్పుడు మన మధ్య ఉన్నది ఏంటి
తెగని బంధమని ఋజువులు దొరికాయి..

విడదీయగలమా ఆ నింగిని, ఈ నేలను
వేరు చేయగలమా ఆ విశ్వాన్ని, ఈ చుక్కను..

✍️అరుణిమలు

తాను నేను

ఎవరికి ఎవరు శాశ్వతం..?
ప్రతీ దగ్గర తనం మధ్య
ఏదో రోజు దూరం అనేది దూరుతుంది..

పొందింది ఏముందో
పోగొట్టుకున్నది ఎంతో

అందనివి ఎన్నో
కోరనవి ఎన్నెన్నో
చెరగని మరకలు ఎన్నో
చెదిరిపోని అనుభవాలు ఎన్నో
చెరిపేయలేని జ్ఞాపకాలు ఎన్నో
బంధీగా మిగిలిపోయే భావాలు ఎన్నో
తెంచేసిన వాగ్దానాలు ఎన్నో..

తుంచేసిన కాలం వాడిన మాలై పోయింది నేడు
ఏరి కోరి కూర్చిన ఆశలన్ని నిర్జీవమై నవ్వుతున్నాయి..

ఏం శాశ్వతమని ఇంత కాలానికి అంత చోటిచ్చావు
ఏ అపురుపాన్ని గుండెల్లో అంత గుట్టుగా దాచేసావో..

ఆ కాలం ఒక బహుమతి
ఈ కాలం ఒక అనుభవం

శాపమై వచ్చిన కాలాన్ని అనుభూతుల బావిలో తోసేసి..
అక్షరాలను తోడుతున్న తరుగుతుందా ఈ వ్యధ అంటూ..

✍️అరుణిమలు

Tuesday, 28 August 2018

తాను నేను

మన మనసుల నీడన
మొలిచిన ఒక‌ మధుర స్వప్నం..

నిన్ను కలిసాక
నన్ను విడి పడిన జాడ
మనమై కలిసింది ఇలా..

చీకటి ముచ్చటపడి
చిత్రించిన చిత్రం..

రేయి సంబరపడి మరి
రచించిన మన కథ..

రాతిరి కలలు
ఇచ్చిన తీర్పు
వేకువన దీపమై వెలుగుతుంది..

ఏనాటి బంధమో ఇది
ఇలా
ముడిపడి మాయ చేస్తుంది మనసును..

పరాకులేమో ఏమో కానీ
నీ పిలుపే నా పరువానికి మేలుకోలుపోయ్..

✍️అరుణిమలు

తాను నేను

మనిషిని ఎక్కడున్నా
నా చూపుల నీడలు నీ వెంటనే ఉంటాయి..

తనువు ఇక్కడే ఉన్న
ఆలోచనలు అన్ని నిను అల్లుకునే ఉంటాయి..

ఈ క్షణంలో నేను ఉంటే
మరు గడియలో నా తలపులలో నీతో దోబూచు లాడుతా..

అక్కడ నువ్వు, ఇక్కడ నేను
ఇద్దరిలో ఎవరు దారి తప్పామో అని ఎదురు చూస్తున్న నీకై..

ప్రథమ స్థానం నీదే ఇక్కడ
తరువాతే కదా నేను ఉన్నది నాకై..

అవకాశానివి కాదు,అవసరానివి కాదు
అందుకోలేని నా మనసుకు అధిపతివి..

నిర్లక్ష్యం నా నుండి నీ వేపుకు రాదు
అలక్ష్యానికి నేను అందని చిరునామాను..

అలకలకు మాత్రం పుట్టినిల్లును
ఏం చేయను మరి..
కోపం కూడా నీ పిలుపు వినపడనంత సేపే కదా
నా చెంత ఉండేది..

✍️అరుణిమలు

తాను నేను

ఎదురుగా ఉన్న నీకై ఈ తలపులు ఏంటో
కసరాలని ఉన్న కారణమే మని అనను..

ఎదురపడనంత సేపు దిగులు తోడవుతుంది
ఎదుట నిలిచాక మౌనం పరకాయ ప్రవేశం చేస్తుంది..

ఆలోచనల అంగడి నుండి నిన్ను అందుకున్న
నన్ను నేను నీకు రాసి ఇచ్చేసాక..

ఎదురు చూపులను ఊరించే నీ రాకపోకలు
నువ్వు ఎదురయ్యాక అలకల మూతి ముడుపులు..

నన్ను నేను నీ ముందు పారేసుకోలేను
అలాగని నిన్ను నేను పోగొట్టుకోలేను..

ఎంతిష్టమో చెప్పలేను ఇంతకుమించి
ఎంత కష్టమో కూడా చెప్పలేను
నీ ముందు నా మౌనం..

ఆశ ఉన్నచోట ఆశించడం ఉంటుంది
ఆ ఆశ వెంట నీరాశ ఉందని
ఎప్పటికప్పుడు ఋజువు
అవుతునే ఉంది..

అయినా కూడా
ప్రతీరోజు వచ్చే ఉదయం లానే
నీకై నా ఆశ
మళ్ళీ మళ్ళీ పూస్తునే ఉంటుంది..

ఓయ్....నా చందమామ
చూడటమే కాదు,
చెప్పింది
గుర్తు పెట్టుకోవయ్య..

✍️అరుణిమలు

Thursday, 23 August 2018

తాను నేను

ఎందుకిలా....
ఎందుకో ఇలా...

పగలకు ఎంత ఆరాటమో
కలలో అయినా నిన్ను చూడాలని..
రేయికి ఎంత కంగారో
కలవై వచ్చిన నీవు కరిగిపోతావని..

స్వప్నానిది ఎంత అదృష్టమో
నువ్వు తనను వెతుకుతూ వస్తున్నందుకు..
తలగడ కూడా నీ తలపులలో
తూలుతుంది రేతిరంతా..

చూపులను గురి పెడుతున్న
గాయాలను చేయడానికి కాదోయ్..
గుండెలో నువ్వు రగిలుస్తున్న
వేడి నిన్ను తాకాలని..

మౌనమై ఎదురు నిలుచున్న
పదాల కొరతలో ఉన్నానని కాదోయ్..
నా పలుకలలో నీ పేరు
నలిగి ఊపిరాడదేమో అని..

గాలికి గంధాలను పూస్తున్న
నీ ఊపిరిలో చేరి నీలో సగమై పోవాలని..
నా అడుగుల గురుతులను చెరిపేస్తున్న
నీకై నువ్వు, నాకోసం నన్ను చేరాలని..

కాలానికి ఎదురు నిలబడి ఉన్న
గతమనే గడపను దాటి
రేపటి ఉదయాన్నివై ఎదురు వచ్చేయ్...

✍️అరుణిమలు

Wednesday, 22 August 2018

తాను నేను

ఏ పూజకో పూచే నవ్వులను ఏరుతున్న
ఏ నోముకో కోరే వరాన్ని వెతుకుతున్న..

ఏ వరానివై వచ్చి వరిస్తావనో
మనసు గడపకు రాసిన పసుపై ఎదురు చూస్తుంది..

ఏ మహిమవై వచ్చి మాయచేస్తావో అని
ముస్తాబయ్యింది ఈ సొగసు..

అరచేత చందమామ వై
పాదానికి అద్దిన పారాణివై
నుదుటి మధ్యన పొద్దు పొడిచే భాస్కరుడు వై
నాలో భాగమై పోతావని..

జుంకాలు చెబుతున్నాయి నీ చిలిపి చేతలు
మట్టి గాజులు చెబుతున్నాయి ఆనక మేం చేసే గాయాలను కసరకంటూ..

ముడిస్తే నిలవని కురుల అల్లరి
మాట మాటకు వస్తున్న వెక్కిళ్ళు చెబుతున్నాయి
నీ రాక దగ్గర్లోనే ఉందని..

కోరికల పల్లకిలో
భవిష్యత్తు బాజాల నడుమ
ఆశల బాసికాన్ని కట్టుకుని
విచ్చేయవోయ్..

✍️అరుణిమలు

తాను నేను

అలా పిలవకోయ్
మనసు మౌనాన్ని వీడి రెక్కలు తొడుగుతుంది..

అలా చూడకోయ్
నీ కళ్ళ వాకిళ్ళల్లో రంగ వల్లికను అయిపోతా..

ఎన్నెన్ని దాచానో నీకోసం నాలో ఊసులను
చెప్పాలని ఉంది నాలో నీకై దాగిన ఆశలను..

ముద్దుగా ముడిచిన పెదవులతో
నీ అరచేత లిఖించాలని..

అల్లరి చేసే ముంగురులను
నీకై పానుపును చేయాలని..

నా చెక్కిలిని తాకిన నీ చిరునవ్వు
అద్దకమై పోవాలని..

ఏయ్....నీ తలపులలో ఈ మునకలు ఏంటోయ్
నీ కనులలో నాకై ఆ కైపెందుకో..

కొరికిన మింగుడు పడని
నీ చిలిపి తగాదాలలో నే తడిసి పోతున్న..

✍️అరుణిమలు

తాను నేను

నిశ్శబ్దాన్ని నిశితంగా వింటున్న..
నా గుండె సడి నన్ను కదిలిస్తుంది..

నా శ్వాస చేస్తున్న ప్రయాణం జలపాతమల్లే తోస్తుంది
వేణువైన మేనులో ఎన్ని రాగాలో నా చుట్టూ ఉన్న శూన్యంతో జత కలిసి..

మనసు చెబుతున్న ఊసులకు ముంగురలు ఊరడింపులు
విశ్వమంతా నా కన్ను రెప్పలలో కాటుకను అద్దకుని దాగుంది

వెలుగంతా నా మేనుని పావడాగా మారి అలంకరించేసింది
మాటలన్ని మౌనాక్షరాలుగా మారి మంత్రమై మరిపిస్తున్నాయి

పెదవుల చాటున ఆగిన పలుకుల ప్రవాహం
ఆలోచనలు ఆనకట్టలను దాటి ముందుకు వస్తున్నాయి..

జవాబులు లేని ప్రశ్నకు చిరునవ్వును ఇస్తున్న
తడబడిన అడుగులకు నిట్టూర్పును ఇస్తున్న

నాపై నే చేస్తున్న సమరమే ఇది
నాతో నేను కుదుర్చుకున్న ఒప్పందాలు ఎన్నో

నన్ను నేను దోచుకుంటూ
నా నుండి నేను పారిపోతు
నన్ను నేను నిందించుకుంటు

ఏ మిగిలిన కొద్ది క్షణాలనో నాదని హత్తుకుంటు
ఈ నిశ్శబ్దాన్ని అంతరంగాన బద్దలు చేస్తున్న..

✍️అరుణిమలు

తాను నేను

మరచిపోవడం అంత తేలికా ?
నువ్వు అతిధిగా వచ్చావా...
అవసరానికి అవకాశం చేసుకు వచ్చావా..!?

ఏమో....ఎలా వచ్చావో
ఎటు పోయావో కానీ..

నడి మధ్య నడిచిన కాలం నన్ను వదలనంటుంది
నువ్వు రచించిన మన అనే కథలో నేనో పాత్రనే నీకు
మరి నువ్వు నాకు పాత్ర కాలేక పోయావే..

నమ్మకాన్ని పెట్టుబడిగా నీకు ఇచ్చి నేనోడిపోయా
నమ్మకాన్ని పొంది నీ ఆట గెలిచింది..

మనసు విరిగిన,మది విలపిస్తున్న నీ జాడ ఇంకా చెరగనే లేదు..
ఏ గురుతులను చెరపాలో..
ఏ కట్టు కథలు నాకు నేను చెప్పుకోవాలో ..

ఇంత నిశ్శహాయత ఎటు నుండి వచ్చింది
ఎంత బలం నాకు కావాలి నిన్ను పెరికి వేయడానికి..

ఈ కళ్ళలోకి ఇష్టమై వచ్చావు
నువ్వో ఆణిముత్యమై మిగిలిపోయావు
గతం కదిలితే చాలు కాలం కదలనంటు నన్ను కసాయిగా నరికేస్తుంది నీ ఙ్ఞాపకాలతో..

కదిలిపోవే తొందరగా ఓ కాలమా
తనంటు గుర్తే లేని ఏ మలుపుకో.

✍️అరుణిమలు

తాను నేను

నీ ముద్దు ముచ్చట్లో మురిసిన కాలాన్ని
మనసు అద్దంలో అద్దకమై ముద్రించేసావు..

ముసురేసిన వయసుకి వేడి ఆవిర్లు అద్దిన దగ్గరి తనం
ఏ దరికి చేరని పయనం లోనే ఉందోయ్..

కడలి పానుపు పై అలల దుప్పటి కప్పుకుని
ఏకమైన వెన్నల రాత్రులలో జాబిలికి సిగ్గు వచ్చిందోయ్..

నీ బాహువులలో దాగిన నా సిగ్గు తన మనసు ముద్రను వేసింది నీ ఎదపై..

వెన్నెల వేడి ఎక్కింది నీ మునిపంటిలో నలిగిన నా అదరాల ఎర్రదనం చూసి..
నలుగై నలుగుతున్న ఇరువురి వలుపు వద్దంటూనే రాలిపోతుంది..

నీ ముద్దుకు నా సిగ్గు ముక్కరై మెరిసిపోతుంది
రేయి కూడా దాగుడుమూతలు ఆడుతుంది కరిగిపోనంటు

💗💗💗❣️❣️❣️
✍️అరుణిమలు

తాను నేను

ఎలా ఉన్నావనే ప్రశ్న లోపల నులి పెడుతుంది
చిన్న పలకరింపు కూడా
చిక్కి పోయింది మన మధ్యలో...

ఒకనాటి రోజులు మాటలకు  కరువు లేవు..
ఆనాటి రోజులు మనసు నీకోసం తపించింది..

నీ మాటల ప్రవాహంలో మునిగిన రోజులు నుండి
నిన్ను పలకరించడానికి మనసు అడుగులు తడబడే కాలానికి చేరింది మన బంధం..

బంధముందా..??
ఏ మనసువై వచ్చి మన అనే విత్తును నాటావో
రోజులు నిముషాలుగా మారి కాలం కదిలి పోయింది..

మన అంటు పడిన జంట అడుగులు దారిని
నేడు వెనక్కి తిరిగి చూస్తుంటే మూగ పోయింది నేడు..

ఆకులు రాలిన వసంతమా ఇది
చిగురులు తొడిగిన శిశిరమా
కాలం కూడా తారుమారు అయ్యినట్డే ఉందోయ్..

నువ్వు చెప్పిన వలపు పాఠాలు
నువ్వు నేర్పిన చెలిమి చిత్రాలు
వెలవెలబోయాయి నేడు
నిన్ను నిన్నుగా చూసి..

అందుకే.. అడిగేసా ఎలా ఉన్నావని నా మనసును.
బదులు ఏదని అడగను..
కళ్ళల్లో ఉన్న కరి మబ్బులు కరిగి పోయేలా ఉన్నాయి..

✍️అరుణిమలు

తాను నేను

నీకు అర్థం కాదు
విడమరచి నేను చెప్పలేను..

రెండు మనసుల మధ్య స్పందనకు
కారణాలను ఏమని వివరించను..

మనసు యాతనకు
మాటలను ఏమని రచించను..
కన్నుల నుండి కారుతున్న నీటితో రాసి చూపించన..

నీ ఒక్కొక్క మాటకు పెరుగుతున్న ఎద సవ్వడికి ఏమని మాటలు అందించను..
గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటే, పెరుగుతున్న నా అసహనానికి తలొంచనా..

నీ మాటలు మిగిల్చిన వేదన
నీ చేతలు చేస్తున్న చిత్రవధ
మధ్య మనసు మూగదై పోయింది..

ఏది నాది
ఎక్కడ నా మనిషి..

అనుమానపు మాటల మన్నులో కలిసిపోతున్న బంధం దేహి అంటుంది..
అంటు కట్టనా...
వాడిపోతున్న గతాన్ని భవిష్యత్తుకు జత చేసి..

ఎదలో ఊరిస్తున్న ఎండమావులను రెప్ప మూసి చెరిపేయనా..
మరో కొత్త ఆశను కనులు తెరిచి స్వాగతించనా..

ఆ ఆశలో కూడా నీ రూపునే
చూడాలంటుంది ఈ పిచ్చి మనసు..
తొలి కిరణాని వై వాలిపో
నా మది వాకిలిలో సరికొత్తగా..

✍️అరుణిమలు

తాను నేను

యాదృచ్ఛికమేనా నీ రాక
లేక గతజన్మ ఋణమా..

ఏ వెతుకులాటలో ఫలితమో
నా మనసులో నువ్వు దాచిన ప్రేమ..

వరసైన నా సొగసువేమో
మానసాన తిష్ట వేసింది నీ మోము..

అడుగులో అడుగులు కలుపుతూ
అలకల చిలక ఎదను దోచి, దాచేసుకున్నావు..

ఎంత దగ్గరో కదా మనం
ఏ దూరానికి చోటివ్వలేని కనురెప్పలం..

విడివిడిగా మనం అసంపూర్ణమే
ఏకమైన చోట వసంతమే..

ఏ మాయలో ఆరితేరావో కానీ
నా మనసు నీ వశమై చిక్కు కుంది..

జాగ్రత్తరోయ్...నీ చేతిలో ఉన్నది
నీ జతను చేరినది...
నీ ఎదను వాలింది నేనని మరవకు..

నమ్మకాన్ని ఇచ్చేసా...
నగు పాలు చేసి... అగచాట్లు రుచి చూపించకే

చిక్కిన ఈ చెలి ప్రేమని
చుక్కగా చేసి అలంకరించేసుకో
నీ కంటిలో కనుపాపలా..

లోకమంతా నువ్వే అప్పుడు
నా లోకమే నువ్వు ఇప్పుడు.

✍️అరుణిమలు

తాను నేను

మనసు ముసురు పెట్టింది
అంతరంగాన చెలరేగిన తుఫానులు ఎన్నో..

అనంత సాగరమే కదా ఆదర్శం
అలజడులను గర్భాన దాచి
అరనవ్వుల నడుమ నర్తించడం..

ఏకాకుల లోకంలో చుట్టూ అయిన వారే
కానీ మనసు మాత్రం ఎప్పుడు ఒంటరిదే..

నాది నాదంటు హత్తుకున్న బంధాలు గుండెలను తన్నుతుంటే
చిటికెన వేలు ఊతకోసం వెంపర్లాడుతుంది..

మాటలు తూట్లు పొడిచిన, రేపు నాదనే మాసికలను వేస్తూ..
అనుమానాల పలకరింపుల మధ్య మనసు తలొంచిన..
గంభీరంగా నిలబడి, నావారే కదా అని మనసును ఊరడిస్తుంది..

ఎలా ఉన్నావనే పలకరింపు కోసం పడిగాపులు కాస్తూ...
రోజులను గతంలోకి వదిలేస్తూ..
బాగున్నాను కదా, ఇంకేం అని జవాబును ప్రశ్నగా వదిలేస్తున్న..

అహం నీ సొత్తే, అదే నాకు కానుక చేసావని తెలిసి కూడా ఆత్మాభిమానాన్ని మనసు కోరుతుంది..
గుండె లపై కాస్త చోటు కోసం ఎదురు చూస్తే...
గడప దగ్గర అటా, ఇటా అనే ఆలోచనలలో చోటిచ్చావు..

నా ఎదురు చూపులన్ని వాకిట వదిలేసా ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ..
అలసి పోని మనసుకు నీ తలపే ఆయువు పోస్తుంది..
మునిగి పోయానుగా నువ్వనే సంద్రంలో
నిన్ను వదిలిపోలేని తపనే ఆ అలల పోరు..

✍️అరుణిమలు

తాను నేను

నన్ను నేను పొగొట్టేసుకుని
ఎక్కడ ఎక్కడ అంటూ వెతకడం నా అలవాటు..

నీలో దొరకాలని ఆశ
నీలో చూడాలనే తపన

నీలో దాగున్నది నేనే అని తెలుసుకోవాలనే కోరిక
ఏంటో వెర్రి ఆశలు...

నేనున్నది నీలోనే కదా అనే భ్రమ
నిజమా, కాదా అనే ప్రశ్నకు జవాబు కోసం వెతికే అల్ప జీవిని..

జవాబు తెలిసినా
ఒప్పుకోలేని మనసుకు అధిపతిని..

నాలో ఉన్నది మాత్రం నీవేనోయ్
ఒకసారి తడిమి చూడు..

మొగ్గ విచ్చుకున్న పువ్వునై... నువ్వనే పరిమళాన్ని వెదజల్లుతూ మరి చెబుతుంది..
నేనున్నది నీకోసమే నాలో ఉన్నది నీవేనని..

✍️అరుణిమలు

తాను నేను

పిలిచావని వెనుతిరిగి చూసా
భ్రమ అని తెలిసింది..

పిలిచావని వెనక్కి వచ్చా
నీకు అవసరం ఉందని అర్ధమయ్యింది..

పిలిచావని ఆగాను
నీ సాదింపులు, విమర్శలు అనే అక్కసును చూపించడానికే అని తట్టలేదు..

పిలిచావని అడుగులు
వెనక్కి ముందుకు తడబడ్డాయి
నేనే నీకు శాశ్వతం కాదని తెలిసింది..

అరిచావని ఆగాలి అనుకున్న
కానీ అహం దెబ్బ తిన్న ఆక్రోషం కదా అది..

పిలుపు వినపడలేదు ఇప్పుడు...
వినిపించినా స్పందన లేదేమో...
నాతో నేను మిగిలాను జంటగా...

✍️అరుణిమలు

తాను నేను

మునిగిపోయా కనిపించని
నీ చూపుల మాయలో..

తడిసిపోయా
నీ పిలుపుల బుజ్జగింపులలో..

ఒదిగిపోవాలి
నీ ఒడిలో వెచ్చని శ్వాసనై..

పారేసుకున్న
నీ నీడలలో నా జాడని..

అద్దుకున్న
నా అరచేతిలో నీ పెదవి చెమ్మను..

పవళించనా
నీ ఎదపై నా చోటు ఇదేనని..

చీకటికి కాటుక చుక్క పెట్టా
చిట్టి పెదవి పై చిరునవ్వుకు ఏ దిష్టి తగలనివ్వకని..

ఓయ్....కనుల దుప్పటి కప్పేయకోయ్
నీ ముంగిట నిలిచిన ఈ క్షణాన్ని..

అల్లుకుపోదాం
మరలి రాని ఈ ఘడియలను..

✍️అరుణిమలు

Thursday, 16 August 2018

తాను నేను

చూపులన్ని గుమ్మానికి తోరణమై పోయాయి
నా మనసేమో నీ దగ్గర నిలిచిపోయింది..
ఎదురు చూసేది నీ కోసమా
నా మనసు కోసమా..😍😍

Wednesday, 8 August 2018

తాను నేను

కళ్ళ నిండా స్వప్నాలే
మెలకువలో కూడా వెన్నంటి ఉంటూ..

కనుల నిండా బాసలే
కమ్మని కబుర్లను
మనసు కాగితం పై లిఖిస్తూ..

చూపులు చిత్రిస్తున్నాయి
ఎద కాన్వాస్ పై మదిలో దాగిన నీ రూపాన్ని..

వాలు కనుల బావిలో
ఎన్నెన్ని భావాల ఊటలో నీకై
లోకాన్ని ముస్తాబు చేస్తున్నాయి నాకై..

చూపులతో గాలిలో లిఖిస్తున్న
నీకై వలపు లేఖలను
చిరుగాలై నిను వచ్చి తాకి ప్రశ్నిస్తుంది
క్షేమమేనా అని

ప్రత్యుత్తరం ఏదని
గుసగుసలు చేస్తుంది నీ చెక్కిళ్ళను తాకి మరీ

కబురంపవోయ్
చిరునవ్వును అద్దిన నా కానుకను..

✍️అరుణిమలు

తాను నేను

నన్ను నేను చదువుతూ
ప్రతీ రోజును ఒక పేజీగా మడిచి  ముందుకు కదులుతున్న..

క్షణం ఒక ఙ్ఞాపకమై కదిలి పోతుంది
నవ్వులన్ని వాడి రాలి పోతున్నాయి
గాయాలు మాత్రం వెంటాడుతున్నాయి

ఎద లోతు అగాధాలలో
ఎన్నెన్ని చీకటి తలపులో

పెదవి పలకని పలకరింపులను
దాచేసుకుంటూ..
మౌనంగా మింగేస్తున్న కన్నీటి చుక్కలు ఎన్నో..

కలల సంద్రంలో కన్నీటి ప్రయాణం
నిర్జీవమైన ఆశలు అలలుగా మారి
తీరాన్ని తాకాలంటున్నాయి..

తుఫాను వెలసిన ఆనవాళ్ళు
చెంప లను ఆరనే లేదు..
మరో రేయి ప్రశ్నలను మోసుకొస్తుంది..

ఏకాంతానికి, చీకటికి
మధ్య విడదీయని అనుబంధమే ఉంది..
నువ్వు, నేను లా..
పగలంతా ఆలోచనలలో,రేయి అంతా కన్నీరులో కలిసిపోయాం కదా..

✍️అరుణిమలు

తాను నేను

మనసు ముడి విప్పాలని ఉంది..
నాది నాదంటు దాచిన తాయిలం
చేదుగా మారుతుంది...

కాస్త నమ్మకాన్ని కలిపి, అనుమానాలను తొలగించి మునపటిలా మార్చుకుందామని..

ఆశలు ఎన్నో.. జరిగేవి ఇంకేవో
కదలని ఆలోచనలు మరెన్నో
ఏదంటే అదే ప్రశ్నగా కనిపిస్తుంది..

నువ్వు ఎవరంటు.. అనలేను
జవాబు మనసు దగ్గర ఉంది కనుక..

నేను దేనికంటు.. అడగనూ లేను
నాకు కనిపించేది ఒకటి
నువ్వు చూపించేది ఇంకొకటి..

ఒహ్హో....ఈ మనసు గోరంతని కొండంత
చేయడం మానదు..
ఒక జవాబు కోసం వంద ప్రశ్నలను
సంధించడం మానదే..

ఎందరిలో ఉన్న ఈ ఏకాంతం వదలదు
పెదవికి అంటిన మౌనం వీడదు..

✍️అరుణిమలు

తాను నేను

కాలం చాలా దోచేస్తుంది..
నిజమే.. నిన్ను ఇచ్చినట్టే ఇచ్చి నా నవ్వును చిదిమేసింది..!!

కళ్ళకు ఒకలా
మనసుకు ఒకలా
మెదడుకు ఒకలా.. చూపిస్తుంది నిన్ను..!!

నిన్నే నమ్మానేమో.. నువ్వు చేసే కనికట్టు పసిగట్టలేకున్న..
నీ ఆలోచనలలో ఉన్నానేమో.. నీలా ఆలోచించాలనే ఉపాయం మరిచా..!!

ఎరిగినదంత వ్యధగా మారి సొద పెడుతుంది..
ఎరగనిదంత ప్రశ్నలలో పడేసి ముందుకు కదలనివ్వను అంటుంది..!!

కూసింత తెప్పరిల్లేది ఎలా..!?
ఈ మనసు..

మౌనమై నీ మనసు దాడి చేస్తుంటే
నీ మాటల ఈటెల గాట్లు ఆరనే లేదే
నీ అహం వెనుక అర్ధం వేరు
నీ పలుకలలో తీయదనం వేరు..

నా బలం నువ్వే
బలహీతగా మారింది నువ్వే
బెదిరింపుగా కనిపించేది నువ్వే
నిందగా మారి ప్రశ్నించేది నువ్వే..!!

✍️అరుణిమలు

తాను నేను

గాలి ఉందని ఊపిరి శ్వాసించి ఋజువు చేస్తుంది
ప్రేమ ఉందని మన అనుబంధం కంటి చెమ్మగా మారి చెబుతుంది..!!

నువ్వు గుర్తుకు వస్తే చాలు ఈ కళ్ళు తడిసిపోతాయి..
నీ ఊహా తాకితే చాలు పెదవి విచ్చుకుంటుంది..
నీ పిలుపు వినిపిస్తే చాలు మనసు ఉరకలేస్తుంది..!!

నా అడుగులు ఎటు పడిన
నా ఆలోచనలు ఎటు కదిలిన
చివరికి చేరేది నీ చెంతకే..!!

ఇంత చింత దేనికిరా
ఎక్కడో నువ్వు
ఇక్కడ నేను ఉన్నందుకా..??

లేదా ఒకరి మనసులో
ఒకరం దాగినందుకా..!?

చుట్టూ వేడెక్కుతున్న వాతావరణం చెబుతుంది
మనసులో నీ తలపులు చేస్తున్న తప్పస్సు గురించి..

వరం అడగడానికి ఏముంది..!?
నీ మనసే నాదయ్యాక..
నీ వసమే నేనయ్యాక.!!

మరింక దేనికో ఈ తపో భంగం..?
ఇలా నన్ను కదిపేస్తుంది..!!
ఎదురుగా నువ్వు లేకేనేమో..!!

✍️అరుణిమలు

తాను నేను

ఎదురు చూసే మనసులకి ప్రతి సవ్వడి ఒక పిలుపై వినిపిస్తుంది..
తిరిగి చూసే ప్రతి సారి మిగిలేది నిరాశే కాని ఆశ మాత్రం సజీవమే ఆ నిరీక్షణలో..

నన్ను నేను నీలో పోగొట్టేసుకున్న ఏమో...నాకై నా చేతిలో శూన్యమే మిగిలింది..

మన మధ్య అంతం అనే దానికి అవకాశం లేదు..
నా మది మందిరం అనంతమై పోయింది నీకై..
ఇక్కడ నీ స్థానం‌ పదిలం..

కదిలి పోతున్న కాలమే సాక్ష్యం
క్షణక్షణం నీకు కానుకను చేస్తున్న అని..

నిన్ను దాచుకున్న ఎద సవ్వడి చెబుతుంది
ఊపిరిలో చేరి నీ తలుపులు చేస్తున్న గాయాలు..

అతిధివై వచ్చావు
ఎద రాజ్యాన్ని గెలిచావు
భవిష్యత్తుని బంధించావు

నీ విజయానికి కానుకను
నీ ప్రేమకు భానిసను
నీ మనసుకు ...

అక్షరాల అరణ్యంలో 
దారి మరిచిన బాటసారులం..
చేరేది ఎక్కడికో
చేరువకు చెరొక వేపు మనం నిలచాక..

✍️అరుణిమలు

తాను నేను

కొన్ని కలలు నిజం అయ్యాయి
కొన్ని ఆశలు ఎదురు నడిచి వచ్చాయి
నువ్వనే రూపంలో..

అరచేత హస్త రేఖవై
పెదవి పై చుంభనమై
హత్తుకునే చిరునవ్వు వై
సిగ్గులన్ని ఎరుపెక్కి నుదుటి తిలకమైపోగా..

కరిగి పోని రాతురులను కానుకను చేసి
పవిట కొంగున కట్టేసావు..

చందమామ కథలను చెబుతానంటు
మన కతలను ఆ మామకు చూపిస్తున్నావోయ్..

తారలన్ని తరలి పోయాయి తలో తీరానికి
మన లోగిలిలో తమకు చోటేదని అలిగి..

నా అరచేత విశ్వమంతా గోరింటై అద్దేవు
ఈ కలువ కళ్ళలో జాబిల్లివై కొలువయ్యావోయ్..

చలించని రాతిరిని పానుపు చేసి చుట్టేద్దాం
చిరుగాలిని ఊయల చేసి పవళిద్దాం..

✍️అరుణిమలు

తాను నేను

వర్ణనలు ఎన్నో వరించే మనసుకు
విరహాలు ఎన్నో కాసంత దూరాలకు..

ఓరచూపులను ఒలక పోసేది నీ కొరకే
ఒయ్యారాలను అదుపు చేయలేనిది నీ ముందరే..

కవ్విస్తు కవ్వింపులుకు కదిలేది నీ వేపే
కరిగి కలిసిపోయేది నీ చూపులలోనే..

క్షణాన్ని కూడా కదలనివ్వకుండా అడ్డేది నీ జతలోనే
నీ అడుగుల నీడలలో అల్లరి ఆటలు ఆడేది నేనే..

ఓయ్... స్నేహమా
వరానివో, వేదనవో, విరహానివో
వరించిన నా మది తరలిపోయింది నీకై..

జాగ్రత్తరా...
సున్నితమైన పిల్ల మనసు
నీ ముందర ఉన్నది దాచేసుకో
ఎవరు దోచడానికి వీలు లేకుండా..
😍😍😘😘

✍️అరుణిమలు

తాను నేను

ఎన్నో చెప్పాలి అనిపిస్తుంది
ఇంకెన్నో నీ ముందు ఉంచాలని అనిపిస్తుంది
ఇంకా ఎన్నెన్నో పంచుకోవాలనిపిస్తుంది..

నీ రాకకై ఎదురుచూసే చూపులలో ఆశే కాదు
నీ నుండి ఎన్నో కోరుకోవాలని మది తపిస్తుంది..

ఆడదాని మనసులో ఇష్టాలన్ని
అద్దంలో ఉన్న చందమామ లాంటివే..

తీర్చే నాదుడు ఉన్నాడనే ధైర్యమే కానీ
అందరాని చందమామని చూస్తూ ఊహలలో మురిసిపోవడమే ఎప్పుడు...

నువ్వు ఎదురయ్యాక నన్ను నేనే మరిచాక
నా మాటలు,ఆలోచనలు,ఇష్టాలు,కోరికలు ఇక ఎక్కడ ఉంటాయి...

నీ ఇష్టం తీరుస్తూ, నీ మాటలలో మునిగి, నీ కష్టాన్ని గుండెలకు హత్తుకునే సరికి ఇక నాకు నేను మిగిలేది మళ్ళీ నీ దూరంలోనే..

ఏవోయ్...నీకేం కావాలి అని అడగాలని అనిపించదా...
అడిగి చూడవోయ్ ఒకసారి....మాటలు రాని దానినే అవుతాను కానీ కోర రాని కోర్కెలు కోరనుగా...

నా సిసలైన కోరికవే నువ్వు అయ్యాక
ఇంకేం ఉంటాయి..
కానీ నీ నోటి వెంట వినాలని స్వామి..

✍️అరుణిమలు