Thursday, 6 January 2022

తాను నేను

నీ ఎద పై నిదురపోవాలని కలవరిస్తూ 
కళ్ళు మూతలు పడ్డాయో లేదో..

ఈ చేతులకు నీ గుండె సడి తెలిసింది
నా నుదుటిపై నీ వెచ్చని శ్వాస తాకింది

కళ్ళు తెరిచి నీ కోసం వెతికాన
నా గుండె లయ పెరిగింది
నా శ్వాస బరువెక్కింది తప్ప 
నీ జాడ తెలియ లేదు..

విన్నపాన్ని మన్నించి
తరలి వచ్చావేమో అనుకున్న
ఈ తనువు తపనలే కానీ నా తపస్సు ఇంకా పూర్తి కాలేదని చీకటి చెప్పింది

ఎదంతా భారంగా ఉంది
గదేమో ఖాళీగా ఉంది..

✍️అరుణిమలు

Friday, 10 December 2021

తాను నేను

ఊహించి రాయడానికి
ఊహవు కావు

వాస్తవం రాయడానికి
నువ్వు నిజానివి కావు

కథ రాయడానికి
గొప్పగా చెప్పుకునేంత ఏం లేదు

కవిత అల్లడానికి
నువ్వు కడ వరకు నిలిచే తోడువి కావు

ప్రస్తుతానికి నీ అనుభూతి నిజం
రేపటికి నువో గతానివో, జ్ఞాపకానివో

కాలానికే తెలియాలి
మన గాథ

#అరుణిమలు

Wednesday, 1 December 2021

మధి మథనం

నా చుట్టూ ఉన్న లోకం 
ఒక్కోసారి వింతగా తోస్తుంది..

తమ మెదళ్ళను 
పాడె పై మోసుకెళుతూ కొందరు..

రోజు నను పలకరించే నవ్వులలో 
వికృతానందం వినిపిస్తూ..

సుతారంగా తాకే గాలిలో 
ఎవరో వదిలి వెళ్ళిన చెమ్మ తడిగా నన్ను తాకుతూ..

అహ్లాదకరంగా ఉండే ప్రకృతి కాస్త 
వింత సవ్వడులతో.. 

రాలిపోతున్న ఆకు 
మరు జన్మ ఈచోట వద్దని శోకిస్తు..

వింత జీవుల వింత పోకడలని చూసిన భూమి
ఈ పాపాన్ని మోసే శాపం నాకెందుకని విలపిస్తున్నట్టు..

చుట్టూ చీకటే....  అంధత్వాన్ని మించిన అంధకారం మన మెదళ్ళను శాసిస్తుంటే..

వినిపిస్తున్న మాటలకు 
ఎన్ని శాపాలు పెట్టాలని ఉన్న..

మౌనం నా పెదవిని వీడనంటు... ఆంతర్యాన ఆలోచనల యుద్ధం చేస్తున్న..

✍️అరుణిమలు

Tuesday, 9 November 2021

తాను నేను

మనతో మనం గడిపేది
ఏకాంతంలో..

మనతో మనం మాట్లాడేది
అక్షరాలలో..

ఏ సమూహంలో ఉన్న
ఒంటరిగా ఉన్న..

నీకు తోడుగా ఉండేది
నీకు నువ్వే..

బదులు లేని ప్రశ్నలకు భయపడి
నీ నుండి పారిపోకు..

చుట్టూ ఉన్న వారివి వినడమే కాదు
నీ మనసు విన్నపాలని కూడా వింటూ ఉండు..

నీకోసం నీకు
కాస్త సమయం దాచుకో..

మోయలేని భారాలను మోస్తూ 
అలసిపోయే నీకు
నీ మనసే నీడను ఇవ్వగలదు..

నీ నుండి నువ్వు
తప్పించుకోకు
తప్పులు ఎంచకు..

✍️అరుణిమలు

Monday, 8 November 2021

తాను నేను

ఈ కాలం ఇలా ఆగిపోదు
ఏ పరిచయాలు శాశ్వతం కాదు..

జ్ఞాపకాల సంపదలో
దాచుకున్నవే ఎక్కువ..

నువ్వు, నేను అనే మనం
మన మనసుకు మాత్రమే పరిచయం..

కలిసి రాసుకున్న రాతకి
భవిష్యత్తు లేదు..

అనుభవాలలో దోచుకున్న
అనుభూతులు దాగను అంటున్నాయి..

చెరి సగమని 
చెరిపేద్దామనుకున్న అవి చెరగవే..

ఓయ్....
కలిసి రాని కాలాన్ని కాదని..

జీవితాంతం జతగా మసలే
జ్ఞాపకాలను ఇచ్చిపుచ్చుకుందాం..

ఏమంటావు !?

✍️అరుణిమలు

Thursday, 2 September 2021

తాను నేను

నిశ్శబ్దంగా మారిన మనసును కదిలించడానికి
పిలిచిందో స్వరం..

నిశ్చలంగా ఉన్న కొలనులో
అలజడి రేపుతూ..

చీకటిలో మెరిసిన
మిణుగురులా..

అలసిన మేనుని
పిల్లగాలి తాకినట్టుగా..

బీడు నేలని
తొలకరి పలకరించినట్టుగా..

రాగాలు మరచిన కోయిలకు
వసంతం కదిలించినట్టుగా..

శిలలా మారిన హృదయాన్ని
శిల్పంలా మలిచేటట్టుగా..

మాటలు మరచిన బొమ్మకు
పలుకులు మళ్ళీ నేర్పగలవా..

అలసిన మనసును
లాలించడం నీ తరమేనా..

ఎదురు చూపు లేని చోట
వెనుకటి జాడలు చెరిపేయగలవా..

అన్ని ప్రశ్నలే..

గాయం చేసినంత తేలిక కాదు
గతాన్ని తుడిచేయడం అంటే..

మళ్ళీ మొదలైన కథకు
ముగింపు ఏమై ఉందో ఈసారి..

✍️అరుణిమలు

Thursday, 22 July 2021

తాను నేను

నన్ను వెతుకుతూ వచ్చిన‌
నీ ఆలోచనలు ఏదో చెబుతున్నాయి..

మనసు విన్న ఊసులకు
మాటలు నేర్పేది ఎలా..

ఆ మాటలను
అక్షరాలలో పొదిగేది ఎలా..

✍️

అరుణిమలు