Saturday, 29 September 2018

తాను నేను

నువ్వంటే ఎంతెంత ఇష్టమొ
అరచేత అద్దిన గోరింటలా చూపించనా..
నీ మీద ఉన్న కోపాన్ని
ఎరుపెక్కని కంటి కొనలలో దాచి చూపించనా..

నీకై నా ఆలోచనలో ఎన్నో చెప్పలేక
ఆ ఆకాశంలో చుక్కలన్ని అంటూ చూపించిన..
నీలో తప్పి పోయిన నన్ను వెతుకుతున్న అని
ఆ విశ్వాన్ని బొమ్మ గీసి చూపించనా..

నీకోసం ఎదురు చూసిన చూపులను వర్ణించనా
ఆ కొలనులో కలువ, చందమామ లను ఉదాహరణ చేసి..

నీ ముందర ఆడిన ఆటలను
ఓడిన అలకలను నీకేమని చెప్పను..
నీ భుజాలపై తలవాల్చిన పాపాయిని అయ్యి మాటలే మరచిపోయా అని..

ఏ అగాధాలను తవ్వలేని కోపాలు
కరిగిపోతునే ఉన్నాయి మన మధ్య
మళ్ళీ మళ్ళీ పుడుతూ..

దయలేదంటూ మధ్యకు వచ్చిన దూరాలు దయచేస్తున్నాయి చోటు ఏదంటు..

చాలు ఇలా మనం
చెదరని చెలిమికి చిరునామాగా..
చెంతన లేవు అంతే
ఉన్నది మనసులోనే కదా..

✍️అరుణిమలు

Wednesday, 26 September 2018

తాను నేను

అనుభవాలు ఎప్పుడు మంచివే
కొన్ని పరిచయాలే కంటిలో నలుసులా మెదులుతూ ఉంటాయి..

మరుపుకు చోటు ఇవ్వవు
మనసును వెంటాడం మానవు..

ఙ్ఞాపకాలన్ని జలగలే
మనల్ని పీల్చి పిప్పి చేసేందుకు..

అనుభూతులు కథలుగా అక్షరాలలో మిగిలాక
పఠించేందుకు పెదవి కూడా వణుకుతుంది..

మనసు పుస్తకంలో ఎన్ని మజిలీలో
మలుపు మలుపుకు మనసు భారం పెరుగుతునే ఉంది...

నీతో గడిపిన భాగం చుట్టూ
మనసు పరిభ్రమిస్తుంది..
ఇంకా ఇంకా నీతో పంచుకోవాలనే తపన దేనికో...

కన్నీటి కలువలే ఈ అక్షరాలు
తడుస్తూ మెరుస్తూ ఉన్నాయి
నా కలల సాగరంలో..

✍️అరుణిమలు

తాను నేను

నా మౌనాన్ని చేదిస్తావెందుకు
నేను వైరాగ్యాన్ని మచ్చిక చేసుకుంటుంటే..

పిలిచాన రమ్మని
నా ఒంటరితనంలో ఒయాసిస్ లా..

నా ఏకాంత లోకంలో
నాతో నేను
నాకై నేను
సాగుతుంటే నీ రాకపోకలు
రేపుతున్న అలజడులు ఎన్నో..

నన్ను నా నుండి దూరం చేసి
మచ్చిక చేసేసుకోకోయ్ నీకు..

నువ్వనే అలవాటు నుండి
నాకు విముక్తిని ఇచ్చేయ్..
ఈ అనుబంధాల సంకెళ్ళను వేయకు
మనసు మోయలేనంటుంది..

కలలను సైతం కబ్జా చేసేసావుగా
కాలాన్ని ఎదిరించి నన్ను దాచేయకు ఇలా నీలో..

కొన్ని కొన్ని ఘడియలు నన్ను ప్రశ్నిస్తున్నాయి
నీలో దాగున్నది ఎవరని..
వారించే నా పిలుపులకి వినపడనంత దూరం
పోయింది నా నీడ నన్ను వదిలి..

వద్దు..ఏది వద్దురా వదిలేయ్
ఏ తీరం చేరని ఈ బంధాన్ని..

రేపు విడదీయాలన్న వీడిపోనంత
ఏకమైనా ప్రాణాలను ఇబ్బంది పాలు చేయక ముందే తెంపేయ్ మన ఈ బంధాన్ని...

✍️అరుణిమలు

Monday, 24 September 2018

తాను నేను

చూపులను సైతం తడిమేసే నీ చూపులను తప్పించుకుని తిరుగుతున్న...

నువ్వు లేని చోటేదంటు వెతుకుతూ కదులుతున్న
నా మనసు...పదే పదే నీవేపు తిరిగి చూస్తుంది..

ప్రాణం నీతో ముడిపడి పోయింది ఏమో
పాదమెటు పద పద మంటున్న మనసు నాతో రానంటుంది...

నీ ముందు బలహీనమవుతున్న ఆలోచనలు
ఆచరణకు ససేమిరా అంటున్నాయి...

కసిరిన, నిందించిన,దండించిన మార్పు లేదోయ్
దేనికైనా సిద్దమే అంటూ ఎదిరిస్తున్నాయి...

నీతో జరిగే పోరు తక్కువ
నాలో నాతో జరిగే సమరం ఎక్కువ...

అలుపన్నది లేదు నీ తపనలకు
అదుపే లేదు నీ ఊహలకు..

నీ ఎదలో ఒక పూటకు పూచే పువ్వును
కావాలని లేదోయ్..
నిను వీడని నీ నీడకు ప్రతిరూపాన్ని కావాలని ఉంది...

ఎంతెంత దూరం నేను నీకు కదులుతానో
అంతంత చేరువే అవుతుంది నా మనసు..

మనసు గిచ్చి మరీ చెబుతుంది
ఎందుకే ఈ దూరాల ఆట ఆడుతున్నావని...

✍️అరుణిమలు

Sunday, 23 September 2018

తాను నేను

అతిధిగా వచ్చావా ఈ మనసులోకి
ఆతిధ్యం ఇచ్చావా నా మనసుకు

అవసరాల ముసుగులో లోకం ఉంది
నేను నీ అవసరాన్ని కాను కదూ

కోరికల వలయంలో వయసులు ఊగుతున్నాయి
నీ కోరికలో నేనొక వస్తువును కాను కదూ

కాలక్షేపానికి ఆటలు ఎన్నో ఈ మనసులతో
నీ ఆటలో నేనొక బొమ్మను కానుగా

హక్కులు కోరే సమాజంలో
నా హక్కువు నువ్వే కదా

అధికారం ఆశించే అంగడిలో
ఇద్దరం అమ్ముడు పోలేదు కదు ఎవరికి

సమూహంలో నువ్వు ఉన్నావు
ఆ గుంపులో నేను ఒకదానిని కాదు కదా

నేను సమూహంలో ఉన్నా
నువ్వు నాలో సగ భాగానివై మాత్రం కనిపిస్తావు

హ్మ్్్్్్్్

ప్రశ్నలన్ని పదాల పేరికగా మిగిలాయి
జవాబులన్ని భవిష్యత్తులో దాగున్నాయి

✍️అరుణిమలు

తాను నేను

కొన్ని మాటలు మౌనాన్ని వీడాక
నిర్ణయాలు నిశ్శబ్దం నీడకు చేరుతాయి

తెంచేయలేని పదాలను
పంటి కింద పడి నలిపేస్తూ
మనసును తుంచేసి కదులుతుంటే
ఆ కాలమే ఒక సాక్ష్యమై చూస్తుంది..

ఎదంతా అల్లకల్లోలమే
ఒడ్డుకు చేరిన తుఫాను తాకిడికి
ప్రకృతి విలయంలా మారిన దేహపు
అవస్థలు అంతర్లీనంగా దాడి చేస్తున్నాయి..

ఉప్పు నీటికి కరువేముంది
ఉపకారం మరవని దేహం ఇచ్చిన కానుక కదా..

రెప్ప బరువుల్లో ఎన్ని భావాలో
తేల్చ లేని అనుభవాల్లో ములిగిపోతూ..

ఆనవాళ్ళుగా చారికలు మిగిలాయి
ఆనవాయితీగా మనసుకు సర్ది చెప్పుకోవడం జరిగాక..

✍️అరుణిమలు

తాను నేను

దూరం కూడా దూరమయ్యేందుకు
ఇష్టపడనంత దగ్గరతనం దేనికోయ్ మన మధ్య...

ఎగసే అలలే మన మనసులు
అలిసిన వేళ అలకై తీరాన్ని తాకి చల్లారుతూ..

ఏ మౌనాలు కట్డేసాయో
ఈ శరీరాలను ఏకం చేసి..

నా గతంలో నువ్వు లేవేమో
భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూస్తే
నా ప్రతి అడుగు జాడలో నీ తలపు ఉంటుందోయ్..

మనసెందుకో ఇంత సున్నితం
నీ చూపులను తాళ లేను
నీ మౌనాన్ని వినలేను..

ఇష్టమైన గాయాలు నీ ఙ్ఞాపకాలు
కష్టమైనవి నీ సమక్షంలో క్షణాలు..

నీ చిరునవ్వులతో ఎదను తడిమేయకోయ్
అవి నా పెదవులను అంటి చెరగను అంటున్నాయి..

రెప్ప లేవని నా కనుపాపల పందిరిలో
రెప్ప వాల్చనివ్వని నీ తాకిడులు ఎన్నో...

తట్టి లేపుతున్న ఉదయాలను
తలగడకు వదిలేసి...
నేనింకా నీ ఎదలోనే నిదురిస్తున్న వెచ్చగా...

నీ సొత్తునే ఎప్పటికి
ఎదురుగా నువ్వున్న, లేకున్న
ఎదను ఇచ్చేసింది నీకే కదా..

✍️అరుణిమలు

తాను నేను

నీ చుట్టూ తిరుగుతున్న నా ఆలోచనలలో
ఏముంది రా... బయట పడనివ్వడం లేదు..

నీ ఎదురు పడకుండా ఉండలేను
చూసాక చూడనట్టు వెళ్ళడం ఇంకా ఇష్టం..

మాట్లాడకుండా అస్సలు ఉండలేను
కానీ నిన్ను గిల్లే మాట అనడం ఎంత ఇష్టమో..

తగవులకు నే సిద్దం అంటా
నీతో తలబడితే తగువుకు కూడా తంటానే మనతో..

అలకలలో ముందు ఉంటా
అలిగిన వేళ నా తలపులలో నిన్ను ఉక్కిరిబిక్కిరి చేయడం మహా ఇష్టం...

ఎదురు చూపుల విసుగుల్లో
ఎన్నెన్ని వింత ఆలోచనలో నీకై, కష్టమైన అవీ ఇష్టమే...

అందీ అందని మన ఆటలో
దూరం అనే భయం భయపెడుతుంది
ఏదో రోజు తప్పదంటు...

మనిషికి దూరం ఉందేమో
మనసుకు దూరం లేదని ఆ భయానికి తెలియదు కదా...

ఎద గదిలో దాచేస్తున్న ఙ్ఞాపకాలు ఎన్నో
రేపటికి నీ తలపులకు ఆయువు పోసేందుకు...

ఈ క్షణాలను అనుభవిస్తూ
రేపటికి మనసు పడే యాతనకు సిద్దమే అంటున్న
సిధ్దమేనా...

ఏమో.......

✍️అరుణిమలు

తాను నేను

ఆహ్వానించావు చేయి అందించి
ఆజ్ఞాపించావు నువ్వు నాకేంటో తెలుసుకోమంటు

అధికారం అందుకున్నావు
నువ్వు నాలో సగమంటు

అజమాయిషీ ఇచ్చావు నీపై
నా హక్కని గుర్తించుకోమంటు

మందలించావు
మరుపుకు ఇక్కడ చోటు ఇవ్వకంటు 

నువ్వు నా దానివే అన్నావు
నేను నీ వాడినే అని సందేహం దేనికంటు

నీ బలం నేనయ్యానేమో
నా బలగం నువ్వుగా మారావు

నా అలకలు ఎంతసేపోయ్
నీ పిలుపు నా చెవిన పడనంత వరకు

నా మరోజన్మకు మూలానివి
నా మమతలన్నిటిని ఏలే రాజువి

నా గతజన్మ ఋణానివి ఏమో
నీ మనసు ఖైదులో బందీని అయిపోయా..

✍🏻అరుణిమలు

Monday, 17 September 2018

తాను నేను

నన్ను నేను ఎక్కడ దాచుకున్నాను
నన్ను నా నుండి దోచింది ఎవరు..?!

ధైర్యం నవ్వుతుంది నిబ్బరంగా..
మనసు వెతుకుతుంది
కారణలను కాగడాల వెలుగులో..!!

చూపులనిండా మనశ్శాంతే..
ఒకసారి ఆ చూపుల దారి వేపు చూస్తే
కనిపించేది అంతా అశాంతే..!!

మోము నిండా మనో నిబ్బరం..
మది లోతుల్లో
పొరలు పొరలుగా దాగిన
మానసిక సంఘర్షణ..!!

ఆవేదనలో వేదన లేదు
అవకాశం తీగలా అల్లిన చిక్కుముడులే ఉన్నాయి..
ఎలుగెత్తి అరవాలని ఉంది
ఎద బావిలో దాగిన దుఃఖాన్ని తోడేయాలని..!!

దహిస్తున్న నిన్నటిని
నేటితో చెరిపేసి రేపటిని ముస్తాబు చేయాలని..
అద్దుకున్న నవ్వులను కాస్త పక్కన పెట్టి
గుక్క పెట్టి మరీ గొంతులో దాగిన దుఃఖాన్ని బయటకు విసిరేయాలని ఉంది...!!

ఏది ఆ వేళ
ఊరించే ఎండమావే అది..
దేహానికి ఆ ధైర్యం ఎక్కడ ఉంది
ఆ ఉద్రేకాన్ని ఊరడించేందుకు..!!

బద్దలయ్యేందుకు సిధ్దమే అగ్నిపర్వతాలు
ఎదురెళ్ళి ఆర్పే నాధుడు ఏడి
కన్నీరు తప్ప..!!

✍🏻అరుణిమలు

తాను నేను

నీతో కలిసి ప్రపంచాన్ని చూడాలని ఉంది.. చూపిస్తావా.. ??

ఆ ప్రపంచం అంతటా నువ్వే కనిపించాలి
నా ప్రపంచం నువ్వైపోవాలి..
నీ లోకం నేనే కావాలి..

కలిసిన ఇద్దరి హృదయాలే కదా
మన'సు గా మారేది..
ఆ మనమైన మనసును
లోకానికి చూపించేద్దాం..

✍️అరుణిమలు

Friday, 14 September 2018

తాను నేను

ఏ రేణువై వచ్చావో
మదిని వేణు రాగమై మీటావు

ఏ స్వప్నమై వచ్చావో
నిదురించిన కనులలో కలవరం మొదలైంది

ఏ పాల మీగడల రుచి చూసావో
నా పెదవులకు తీపి తీపి నవ్వులను రుచి చూపించావు..

ఏ రచనలు రచించావో నన్ను చేరేందుకు
నా ముంగురల కొనలో దారి తప్పావు

ఏ ఏకాంతాలను జయించుకు చేరావో చెంతకు
నీ కాంతగా మారి చేరికై పోయాను

ఒంటరితనాన్ని పక్కకు తోసి
ఒడిసి పట్టేసావు నీ బాహు బంధనంలో

గాలి కబురులను ఉఫ్ అని ఊదేసి
నీ మాటల ఊటలలో ఊరించేసావు

వయ్యారాలు తెలియని వయసుకు
నీ వాడి చూపుల వడ్డనలే విందు అయ్యింది

ఓయ్....వినుకో
వింతలన్ని నీ ముంగిట ఉన్నాయి
ఏలుకోమంటు...

నే వింతను కానోయ్
నువ్వు ఎన్నుకొన్న నీ కన్యను...

పసుపు గడపకు పారాణినై
నీ ఎద గదిలో అడుగు పెట్టా..

మరో అడుగు పడేది
జీవితానికి ఆవలి వేపే నిన్ను వీడి...

✍🏻అరుణిమలు

Monday, 10 September 2018

తాను నేను

నీ చూపులను చదివే కొద్ది
నా అక్షరాలలో చనువు పెరుగుతుంది..

పెదవి మరిచింది నవ్వడం
నీ ముందర విరుపులు చెల్లవని..

నీ మనసును తట్టి లేపేందుకు
నా మౌనం మువ్వగా మారింది..

నదికి ఎదురొచ్చిన సాగరానివై
అణువణువునా ప్రవహించేయ్
నన్ను కలిపేసుకుంటూ..

సరసుడివే మనసును చైత్రమై మీటావు
మేను వేణువై పోయి రాగాలు పలుకుతుంది..

కనుల కౌగిలింతలో దాచేయకోయ్ నన్ను
నీ చూపుల కోకను తొలగించేసి..

వెక్కిరింతలు దేనికో నా అక్షరాలంటే
నా భావాలు నీ వెంట పడుతున్నాయి అనా..

పదాలలో దాగింది మనమే
ఈ మనసనే పదవులను పాలించేది మనమే..

✍️అరుణిమలు

తాను నేను

నిజమై నువ్వు ఎదురు పడితే
అందులో నా పాత్రను నే చూడాలని ఉంది..

బ్రహ్మ రాతవో
ఖర్మ ఫలానివో
ఏ కార్యానికి ప్రతిఫలానివో నాకై నువ్వు అని..

నువ్వు రచించిన చరితలో
అవసరాన్నా
ఉపయోగాన్నా..

ఎవరిని నేను..??

బాటసారి వై సేద తీరావా
బాటేసుకు వచ్చావా ఆకలితో

ఎవరివి నువ్వు..??

బదులు లేని ప్రశ్నలలో ఒక ఇష్టమైన ప్రశ్నవు
శేషం తెగని ఒక సశేషానివి..

కాలక్షేపానికి శరీరాన్ని ఇచ్చేయలేను... కానీ
నాదనే మనసుకు నా మనసును
ధారాదత్తం చేసేయగలను ఈ జన్మకు..

✍️అరుణిమలు

Saturday, 8 September 2018

తాను నేను

రాసినవి చెరిపేయగలను
రాలుతున్న కన్నీటి చుక్కలను తుడిచేయగలను
గతాన్ని ఏం చేయగలను.?

నీడలో నీడై పోయిన నీ ఙ్ఞాపకాలను ఎలా కడిగేయను..
రాజుకుంటున్న దుఃఖం ఆరనంటుంది..
తలపులు చేస్తున్న గాయాలను తాకుతున్న కన్నీటి చెమ్మ మంట పెడుతుంది..

ఆశలన్ని ఇసుక రాతలుగా గాలిలో కలిసిపోయాయి
నీ వాగ్ధానాలన్ని వట్టి మాటగా వడిలి పోయాయి
ఎవరికి ఎవరం అవసరమై పోయామో
ఎవరికి ఎవరం శాపమై పోయామో..

ఎంత రాసిన తరగని వ్యధ
ఎంతెంత రాస్తున్న మిగిలే ఉన్న మన కథ
అంతంత రాసిన నిన్ను మరుపుగా మార్చలేని నా మనసు వేదన..

భావానికి మనసును ఊతగా చేసి
ఇంకిపోని కన్నీటి సిరాలో ముంచి మరీ లిఖిస్తున్న..

నీ ఆటను...
నే ఓడిన నా మనసును..

✍️అరుణిమలు

Thursday, 6 September 2018

తాను నేను

కొన్ని ఇష్టాలను తెలపడానికి మాటలు చాలు
కొన్ని భావాలను చూపించాడానికి పదాలు చాలు..

మాటలలో చెప్పలేని నా భావాలకు అక్షరాలే ఆసరా
రంగులని అద్దిన సీతాకోకచిలుకలా ముస్తాబు చేసా..

సుగంధాలను అద్దిన కాగితంపై రచిస్తున్న
విరహాన్ని తామరాకు పై నీటి బొట్టుగా జారవిడచేసా..

అక్షరాల మాటున దాగిన నా జాబిల్లివి
నీపై నా భావాలన్ని...భావోద్వేగాలను నింపుకున్న నీటి బొట్డుగా రాలుతున్నాయి..

తడిసిపోవోయ్...
నీ తనువులో అణువణువునా నన్ను నింపేసుకుంటు.

ప్రేమ పల్లకీలో వయసు ఊరేగింపు
వరుడు నీవై వధువు నేనై..

ఊపిరి దేహాన్ని మోసినంత కాలం
సాగిపోవాలి ఈ పయనం..

ఏ చూపులు తాకని చోట
నిన్ను నేను దాచుకున్న ..
తనువును తాకకుండా నే
నువ్వు దోచేసిన ఆ చోటున..

అరచేత నా ముద్దుల చందమామ వై
నా కంటి పాపలో చిరునవ్వుల రాజువై నిలిచిపో..

✍️అరుణిమలు

సరదా ముచ్చట

వెళుతూ వెళుతూ వెనుతిరిగి చూసే చూపులో ఏదో గమ్మత్తు అయితే ఉంది..😍😍😍

నీ కోసం తిరిగొస్తా అంటు కళ్ళు చేసే వాగ్దానం..ఎదురు చూసే మనసుకు ఊరటనిస్తుంది..😇😇😇

నా కోసం ఎదురు చూసే మనిషి ఒకరున్నారనే బలం, బాధ్యత కవచంగా మారుతుంది 👉❤👈

పెద్దలు అందుకేనేమో ఒకసారి వెనక్కి చూసి వెళ్ళు అంటుంటారు 🤗🤗🤗

తాను నేను

మనసు అలసిపోతే
మౌనం చాటున దాగుంటుంది..

ఆలోచనలకు అలుపొస్తే
మరుపు ముందుకు వస్తుంది..

కలలు చెదిరితే
నిదుర దూరం అవుతుంది..

కలతలు ఎక్కువ అయితే
కనులలో కారు మేఘాలు కమ్ముకుంటాయి..

ఙ్ఞాపకాలు బలమైనవి అయితే
గాయాలు మాననంటాయి..

నువ్వు ఎదురైతే
గుండె సడి ఉరకలు వేస్తుంది..

నీ పిలుపు వింటే
ఉలిక్కిపాటే శరీరానికి..

నీ తలపొస్తే
నాకు తలుపేసేయాలని ఉంది..

గడియ పడని తలుపే
నీకై నా తలపులు..

తాళం నీ దగ్గరే ఉంది కదా
రాకపోకలన్ని నీ ఇష్టమే..

అనుభవాల
అనుభూతులు మాత్రం నావి..

✍️అరుణిమలు

Tuesday, 4 September 2018

తాను నేను

వెన్నెలవై నువ్వు వస్తే
చెకోరాన్ని నేనై నీ బాహువులలో బందీని కానా..

నాలుగు పెదవుల కలయికలో
రెండు కళ్ళు చేస్తున్న మౌనపోరాటాలు..

గాలికి తావే లేని కౌగిలిలో ఎదలు చెప్పుకునే ఊసులను వింటు..

శ్వాసల ఊయలలో ఏ ఊహాతీరాన్నో తాకుతున్నాయి తనువులు..

నిప్పు పొత్తిళ్ళల్లో ఒదిగిపోయానేమో
కణికనై వెలుగుతున్న ..

నే ఓనమాలు దిద్దిన
మరో పాఠశాల నీ దేహం..

బిడి కౌగిలిలో యుద్ధాలు బిడియాలన్నిటిని బట్టబయలు చేసేసాయి..

చెక్కిళ్ళు చెకుముకి రాళ్ళుగా మారి చెమట చుక్కలను అద్దుకున్నాయి..

ఓయ్.....పగటిని రేయి హత్తుకుందా...
రేయి పగటిని హకత్తుకుందా 🤔🤔

కాలం గోల చేస్తుంది
నన్నిలా కట్టి పడేయకండని..

లోకం కోసం కాస్త దూరమనే
విరామం తప్పదు కదా..

మళ్ళీ మళ్ళీ కలుద్దాం
మనసనే మంచె కాడ..

✍️అరుణిమలు

తాను నేను

పగటి కలలు పంతం పట్టాయి
నిదురను చెడకొడతామంటు..

కళ్ళ ఎదురుగా
నిలవడం కాదోయ్..

కలవై వచ్చి కౌగిలించేసుకో
నీ ఎద నీడన సోలి పోతా..

జోలపాటవై చేరిపో
జామురాతిరి కాస్త జోజో మనడం
మరచిపోయేలా..

పగలంతా పంతాలు
రాతిరికేమో పట్టింపులు

ఆ దూరం దేనికోయ్
ఏ దడి నిలబడింది మన మధ్య..

నీ తలపుల జాగారాలు ఎన్నో
శ్రావణాన్ని శివరాత్రిని చేసేస్తున్నాయి..

✍️అరుణిమలు

తాను నేను

నీకు,నాకు మధ్య
మూడో వ్యక్తి రావడం కష్టం
ఒకరి మీద ఒకరికున్న నమ్మకం అలాంటిది...

నిన్ను, నన్ను
దూరం చేయడానికి
ఏ మూడో వ్యక్తి తరం కాదు
మన బంధం బాహ్యమైనది కాదు కనుక..

నీ అహం, నా అభిమానం
చాలు మన మధ్య దూరాలకి
దారి వేయడానికి...

విడిపోవడానికి ఇద్దరం కలిసి లేము
కలిసి ఉండటానికి ఇద్దరం వేరు కాము...

మనమింతే
కలుసుకోలేం
విడిపోలేం

✍️అరుణిమలు

తాను నేను

తుడిచేద్దామని ఉంటుంది
కొన్ని ఇష్టాలను...

దూరం జరగలేనివి
దరికి చేరలేనివి..

నా చూపుల దూరాన్ని
తాకని తలపులలో
నీతో కలిసి నడుస్తున్న..

నా ఆలోచనలు అందని కోనలలో
నీ ఊహలలో విహరిస్తున్న..

నీ శ్వాస నా మేనుపై లిఖిస్తున్న
నీ ఇష్టాలను చెరపలేక పోతున్న..

నీ చూపులు చేస్తున్న గాయాలకు
ఏ లేపనాలు వద్దనిపిస్తుంది..

నీ చేతలు చేసే చర్యలకు
అచేతనంగా నిలిచిపోతున్న..

ఎందుకు ఇవి..
ఇవేం ఙ్ఞాపకాలు..
ఎందుకో ఈ ఇష్టాలు..

✍️అరుణిమలు

Saturday, 1 September 2018

తాను నేను

అనుభవాలన్ని గాయాలే
ఎద నిండా కోతలే..

అక్షరాల నివేదనలో ఆవేదనలు ఎన్నో
అనుభూతుల పాత్ర నిండి పోయింది
ఏం మిగిలింది ఇంకా..

ఆలోచనలు చేసే గాయాలు
ఆర్ద్రత నిండిన మనసు నివేదన
పెదవి మధ్యన నలిగి పోతున్న జవాబులు..

ఏకాంతంలో చీకటి చేసే దాడి
మిణుగురు లాంటి ఆశను ఆశించి
భంగపడుతున్న..

నమ్మకాన్ని ఇచ్చి ఓడుతున్న
కాలం చేతిలో..
అభిమానాల అభినయనాల నీడన
నాది, నాదేనా అనే భ్రమలో ఉన్న..

మనం అంటూ వచ్చే అతిధుల
ప్రేమను పొందుతూ..
వీడ్కోలు తెలపని దూరాల నడుమ
ఙ్ఞాపకాలను ఏరుకుంటున్న..

ఏ అధికారాన్ని నాది అనుకోవాలి
ఏ ఆత్మీయతను నాదే అని హత్తుకోవాలి..

మందలింపంటే మనసును గాయం చేసేది కాదేమో
మనమంటే ఆత్మాభిమానాన్ని అణచివేయడం కాదేమో...

✍️అరుణిమలు