Saturday, 9 November 2019

తాను నేను

నమ్మించేసా మనసుని
నేను నీకోసం అని..

ఇప్పుడు నా కోసం
నా తోడుగా ఉండమంటే
పొమ్మంటుంది...

ఎక్కడ నువ్వంటు
వెతుకుతునే ఉంది ఇంకా మనసు..

నువ్వుండే చోటు తెలియదా
దానికి...!?

ఎదురు పడినా కూడా
చూపులు ఎందుకో నేలను వీడనంటున్నాయి..

ఆలోచనలలో ఉన్న దానికి
వాస్తవానికి ఉన్న వ్యత్యాసం చూసేందుకు జంకుతుంది.. 

కలలు ఎక్కడివి
మనసు మేల్కొనే ఉంటుంటే..

ఊహలకు, నిజాలకు
ఇంత తేడానా..

అందని ఊహలలో ఊరిస్తూ
నిజంలో వెనకడుగు వేయిస్తూ

అటా,ఇటా
ఎటు అంటూ పరీక్ష పెడుతుంది..

✍️అరుణిమలు

తాను నేను

గది నిండా నిశ్శబ్దం
గది అవతల సందడి..

ఎద నిండా చీకటి
కనులు నిండా వెలుగులే..

ఏకాంతం హాయిగా ఉంది
కొన్ని ఙ్ఞాపకాలను నెమరేయడానికి..

వదల లేని వాటిని వదిలేదెలా అనే మధనం
చేజారిన వాటిని చిరునవ్వుతో సాగనంపేదెలా..

ఇంతేనా...
కాదేమో...

కాలం ఇచ్ఛే కౌగిలింతల వెచ్చదనం
ఏనాడో చెక్కిలి పై నువ్వేసిన ముద్రను గుర్తు చేస్తుంది..

తడి పెదవుల ఉప్పదనం
ఏ ఉప్పెనగానో మారక మునుపే తేరుకోవాలని ఉంది...

ఎద సొద నుండి తప్పుకునేందుకు
మరుపనే వరం కోసం ఏ తపస్సు చేయాలి ఇప్పుడు..

దిగులు మబ్బులు
కన్నులను కమ్ముకుని ఉన్నాయి..

ఆపేదలా....
చెదరగొట్టేది ఎలా...

✍️అరుణిమలు

తాను నేను

అక్షరాలెందుకో అలిగాయి నాపైన
ఆలోచనలన్ని శూన్యంగా మిగిలాక..

నిదురకు దూరమైన కలలు
ఆశలు మిగలని చోట
మేమెందుకు అంటున్నాయి...

నాలో నేను చేస్తున్న నిశ్శబ్ద యుద్దాన్ని
చూసి భయపడ్డాయా..

నన్ను నేను వెతుకుతున్న, నేను లేని చోట
ఇలా ఎంతకాలమని అలసిపోయాయా..

మనసెక్కడో ఉంది
అనువు గాని చోట
నిస్సహాయంగా...

పదిమందిలో ఒంటరిని చేస్తున్న ఏకాంతం
పెదవి పై నవ్వు నిజమా
కళ్ళలో చెమ్మ నిజమా
అని ప్రశ్నిస్తుంది..

జవాబు ఎక్కడ ఉంది అని చూసా
మౌనమే జవాబుగా మిగిలింది

అక్షరాల వేపు చూసా
మొహం తిప్పుకుని పోయాయి..

✍️అరుణిమలు

తాను నేను

ఏది ఎవరి సొంతం
ఎవరు ఎవరికి ఏమౌతారో..

వరసలెన్నో
మనసుకు కలిసిన వరుసకు చోటేది..

గాలిలా నన్ను తాకి పోయింది
తనువుకు ఆ స్పర్శ కానుకై పోయింది..

ఏ పిలుపో ఎదను కదిలించింది
పలికనంతనే బదులే లేని ప్రశ్నగా మిగిలింది..

కళ్ళ నిండా వెలుగు ఆశలే
చుట్టూ చీకటని చీల్చలేనంత బాధ గూడు కట్టుకుని ఉంది...

ఎవరు నువ్వో
ఎవరు మనమో
ఎవరు నేనో

చివరకు
ప్రశ్నలు కూడా ఒంటరిగా మిగిలిపోయాయి..

✍️అరుణిమలు

తాను నేను

నన్ను గెలిపించి నువ్వు గెలిచే తీరు ఉంది చూసావు...

బతిమలాడటం నుండి
బుజ్జగింపుల దారి లోకి చేరి

మాటల యుద్దం నుండి
మూతి ముడుపుకు చేరాక

నువ్వు ఇచ్చే ముగింపే
మహా ముద్దుగా ఉంటుంది..

కాస్త పొగరును పక్కన పెట్టిన
నీ వగరు ఎంతెంత రుచిగా ఉంటుందో

గెలిచి నే ఓడిన ఆటలో
నా అల్లరి తనం సంపాదించిన సంపదకు
వెల కట్టగలరా ఎవరైనా..

లేదు కదా....
నువ్వనే నీపై నా అధికారం
నాకు దొరికిన కానుక..

దాచేసుకోనా ఆ బహుమతిని
నా మనసు మాటున
ఏ కంటి నీడ పడకుండా..

నీ ఎదలో ఒదిగిపోన
అందమైన ఙ్ఞాపకంగా ప్రతి జన్మకు..

✍️అరుణిమలు

తాను నేను

ఎన్నో అలజడులను దాటేసింది మనసు....ఙ్ఞాపకాల తీరానికి చెరువులో ఉన్న నేడు...ఇది కూడా దాటే రోజు వస్తుంది...

ఆ రోజు నేను ఎవరో నీకు
నువ్వు ఎవరో నాకు..

సంతోషంగా ఉండమంటావు......నువ్వు నాతో ఉండిపోతావా అయితే ??....ఉండలేవు, నువ్వు లేని సంతోషం ఎక్కడ ఉందో చూపించేయ్ కనీసం..!?

మొండి దానినే...మనసును రాయి చేసుకోవడంలో, ఎవరికి కాని దానిగా మిగిలి పోవడంలో....కోరుకున్న నీకే ఏం కాలేనిది, ఎవరికో చెందుతా అని అనుకోకు ఏనాడు...

ఎన్నో చెప్పాలని ఉంటుంది నీకు....ఎందుకీ మౌనం అని నువ్వు అడిగితే కదా...

నీటి మీద రాతలే నీ వాగ్ధానాలు....నా మనసులో మాటలు... ‌ఇట్లు అని రాయడానికి పేరు లేని బంధం ఇది....చిరునామా ఏముంది నా ఆలోచనలే కదూ...

✍️అరుణిమలు

Saturday, 5 January 2019

తాను నేను

అనుకోని అతిధులే ఈ కన్నీళ్ళు
ఆలోచనలలో నేనుంటే అవి పలకరింపుకి వస్తుంటాయి...

నువ్వు దూరమైతే అవే తోడు
భావాల భారం అక్షరాలుగా మారే లోగా అవి కరిగి ఏరులవుతాయి..

రాయాలని లేదు
చెప్పడానికి ఏముంది
చూపించడానికి ఏం మిగిలింది

మౌనానికి హద్దులు లేవు
మనల్ని దాటి పోయాయి ఆ సరిహద్దులు
నిశ్శబ్దానికి ఆకారం లేదు
మన మధ్య ఉన్న ఏకాంతంలా

కదిలితే ఆగననే దుఃఖం తప్ప
ఎదంతా శూన్యమే ఇప్పుడు

చీకటిలో చప్పుడు లేని విస్పోటనాలు ఎన్నో
గొంతు దాటి రాని గరళం గుండెల్లో మంట రేపుతునే ఉంది

నే అడిగానని వచ్చావా
నే వద్దంటే వెనుతిరిగావా

హా.....వచ్చి
నాదని ఉన్న నా ఏకైక సొత్తు
మనశ్శాంతిని తీసుకుపోయావు

ఇక ఎదుట ఉన్నదంత పోరాటమే
నాతో నేను మాత్రమే మిగిలా మునుపటిలా

✍అరుణిమలు