Thursday, 20 April 2017

తాను నేను

అందీ అందకుండా ఏంటోయ్ ఈ ఆటలు...😍
అలా అలా అలలపై తేలియాడుతూ ...
నీ చూపులు నను తాకుతుంటే...
నా శ్వాస నన్ను హెచ్చరిస్తుంది...
అదుపుతప్పకే ఓ కన్నె మనసా అంటూ...😍
చల్లగాలితో రాయబారం పంపుతున్నాను...
వెన్నెలతో జాబు పంపించడం మరువకే...
ఆ నింగి,ఈ నేల చూడు ఎలా చూస్తున్నాయో...
నిశ్శబ్దంగా సాగుతున్న మన సంభాషణను...
నేనేమన్నానో,నువ్వేమన్నావో అంతా ష్ గప్ చుప్...
లేకపోతే తెల్లారక ముందే లోకమంతా పంచేస్తాయి....
మన ప్రణయ గాధని పరిపరి విధాలుగా ...😄
నా పాదాలను ముద్దిడుతున్న నీ వెండి వెన్నెల చూడు...
నీ స్పర్శతో నా తనువు తపించేలా చేస్తుంది....😍
ఇది తగునా నీకు.. దరికి రాకుండా ఈ ఆటలేలరా....
ఇలా వచ్చి ..అలా వెళ్ళావు ఏమంత రాచకార్యం ఉందో చెప్పనే లేదు....
అలగాలని ఉన్నా....నిన్ను నేను ఇబ్బంది పెట్టలోనోయ్...
అందుకే ఈ ఏకాంత సంభాషణలు..నా ఏకాంతాన్ని పోగొట్టుకోడానికి...
పలవరింతలు ఉన్నమాట నిజమే అయితే...
నా కలవరింతల తాకిడి నిన్ను ఎక్కడున్నా నిలువనియ్యవు ...
ఇంకోసారి వదలి వెళ్ళాలంటే ఆలోచిస్తావు సుమీ...😍
ఎదురుచూస్తున్న ఎదను ఏలడానికి తొందరగా రావోయ్...

     ........................అరుణని

తాను నేను

కనిపించే మనం.. మనం కానేకాదు
నిజమే.. ఇష్టాలు,ఆలోచనలు,అభిప్రాయాలు..
వ్యసనాలు,పరిస్థితులు ఇలా ఎన్నో రకాల కలబోతే కదా మనిషి..
నేనేంటి..?? ఇది నాకు మాత్రమే తెలిసిన నిజం..
ఎవరికి వారే ఇక్కడ..ఇంకొకరికి అర్ధమయింది అన్నట్లు అనిపించే..
అర్థం కాని, కాలేని పజిల్స్ మనం..
సమాజానికి నేను ఇది.. అని మాత్రమే చూపించుకునే
అవకాశం ఉన్నవాళ్ళం..
ఇక్కడే.. నిన్ను నువ్వు చూపించుకునే చోటే తెలిసేది
నీ బలం,నీ ఆత్మవిశ్వాసం ఏంటన్నది..
గెలుపు.. ఓటములు ఇక్కడ నిన్ను నువ్వు చూపించుకునే
దాని మీదే ఆదారపడి ఉంటాయి...
లోలోపల నువ్వు ఓడుపోతునే ఉండాలి...
లోకానికి విజేతగా కనిపించాలి అంటే...
చాలా స్వేచ్ఛ ఉంది మనకి... కాని మనకు నచ్చినట్టుగా మాత్రమే
మనం ఉండలేనంత..
అన్నీ ఉన్నాయి మనకి... నాది అనే ఒక సొంత జీవితం తప్పించి..
నోరు ఉన్న జీవులం... మనసు విప్పి ఇష్టాల్ని పంచుకోలేని మూగవాళ్ళం..
అందంగా బతికేద్దాం అబద్ధంలో...నిజాలను మనసు పొరలలో దాచేసి..
తెంచేయాలనే ఉంటుంది ఈ కనిపించని కట్టుబాట్లు అనే సంకెళ్ళను..
కాని ఇక్కడ మనుగడ ఎలా సాధ్యం అప్పుడు...
ఇదే లోకం.. ఇక్కడ ఇంతే.. ఇలానే ఉండాలి..తప్పదు ఓ మనసా

     ..........అరుణని..........

తాను నేను

ఇదేనా...ఇంతేనా నేను...ఇలా ఎప్పుడు తయారు అయ్యాను..??
పిలుపులో తేడా వస్తేనే అంత ఎత్తున లేచే నేనేనా ఇది..??
నా ఇష్టాలని,అభిప్రాయాలని గౌరవించని వాళ్ళని....
మరో ఆలోచన లేకుండా తీసి పక్కన పెట్టేసే..
నా పొగరు...నా గర్వం ఏమయ్యాయి...??
నన్ను వద్దు అనుకొని పోయిన వాళ్ళ గురించి అర క్షణం కూడా..
అలోచించని నా తలపొగరు ఎక్కడికి పోయింది..??

లొంగి పోవడం నాకు అలవాటు..నా అనే నా బంధాలకి..!!
లొంగ దీసుకొవడం చేతకాని దానిని కాదు కాని..
నా వాళ్ళు ఇష్టంగా నా దగ్గర ఉండాలి కష్టంగానో,లొంగో కాదు...
లొంగి పోవడం అంటే మరీ ఇంతలా కాదే...ఇదేమి లొంగుబాటు
నన్ను నేను నగుపాలు చేసుకోవడమా...
నా ఉనికిని,నా విలువను లేకుండా చేసుకోవడమా...

ఇదే స్థితిలో ఇంకెవరన్నా ఉంటే...నీకు అవసరమా అని అడిగేదాన్ని
ఏం తక్కువ నీకు...నీకు నువ్వుగా ఉండలేవా అనేదాన్ని,తిట్టేదాన్ని
ఇదంతా నాణానికి అవతల మాత్రమే...ఇవతల నేను చేస్తుందేమిటి

ఒక అందమైన అబద్ధం...ఒక తప్పుడు నిర్ణయానికి దారి తీసింది
ఆ త్రోవలో ఇదిగో ఇలా నిశ్శేషముగా నిలుచున్న...
ఇవ్వడమే ఎరిగిన దాన్ని..అడగడం,సాధించడం ఎరుగనే
నా వాళ్ళ దగ్గర నేను దేహీ అంటే కాని దొరకదు అంటే
ఆ ముష్టి నాకొద్దు...వాళ్లకి కావలసింది తీసుకుపొమ్మంటాను కాని

ఇంకిపోని ఈ కన్నీరు నా మనసుకి,మస్తిష్కానికి మధ్య నలుగుతున్న
నా ఆత్మఘోషకి సాక్ష్యం...
దోసిట నిండిన కన్నీరు ప్రశ్నిస్తుంది ఇదేనా నువ్వు ఆశించిందని..
చతికిలపడిన ప్రతిసారీ చేయూత కోసం ఎదురు చూడలేదు..
కాని ఇప్పుడు గడ్డిపరకంత ఊతకోసం వెతుకుతున్నాను..

ఒక్కసారిగా నేను బయటపడలేను కాని..బయటపడతాను..
నా బలహీనత నువ్వు...నిన్నే బలంగా మార్చుకోవాలి..
ప్రయత్నం చేస్తున్నానా అంటే...ఎలా చెయ్యాలో కూడా తెలియటంలేదు..
నష్టపోడానికి ఏముంది నీ దగ్గర నాకు...నాకు నేను మిగులుతాను మహ అయితే. ..
అది చాలదా...నిన్ను దాచుకున్న నాకు నేను చాలనా..
కదలాలి..ఒక్కసారి ఒక్క అడుగు వెయ్యాలి ముందుకు..

          ..........అరుణని...........

తాను నేను

మనసెందుకో ముసిముసిగా నవ్వుతుంది
నీ చూపులు తాకిడికి ఎరుపు ఎక్కుతున్న
చెక్కిళ్ళను అదుపు చేయలేక 😍
  .....అరుణని....

తాను నేను

మాట మీద నిలబడితే నువ్వు,నువ్వెలా అవుతావు..
నమ్మకపోతే నేను,నేను ఎలా అవుతాను..
కోరాన నిన్ను నా చెంతకు రమ్మని..
అడిగాన ఆనందాన్నిఇమ్మని..
నేను కాళీగా వదిలేసిన ఆ స్ధానం నీది ఎలా అయ్యింది..
నువ్వు రాకముందు నేను వేరు...ఇప్పుడు నేను వేరు
ఇంత మార్పెలా సాధ్యం...
తెల్లకాగితంలా ఉంచుకున్న నన్ను,నా మనసుని..
నీ పేరుని చెదిరిపోని ముద్రగా ముద్రించేసావే..
పెనివిటివై నను చేరిన నిన్ను లతలా అల్లుకుపోయాను..
పెనవేసుకున్న బంధం శాశ్వతం కాదని తెలిసాక...
తల్లడిల్లిన మనసుకి సంజాయిషీ ఇవ్వలేక..
ఎందుకు ఇచ్చావు ఈ దుఃఖం అంటూ అది ప్రశ్నించే ప్రశ్నలకు
జవాబులు ఇవ్వలేక నాలో నేను..
నాకు నేను ఏమి కాకుండా పోయానని నలిగిపోతున్నాను...
ఏ జన్మ పాపమొ ఇలా ఇష్టంగా, నీలా దరికొచ్చి శిక్షించిందా..??
ఏమొ ....గాలివాటుగా వచ్చావనుకొలేదు...
ఎలా వచ్చినా నిజం తెలిసిన రోజు నుండి ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి
నేను ఒక అడుగు వేస్తే...
నీ చేతలు నాలుగు అడుగులు వెనక్కి లాగుతున్నాయి...
నువ్విచ్చిన దుఃఖాన్ని వదిలేసి.. నీ నుండి పొందిన ప్రేమను దాచుకుందామనే నా ప్రయత్నంలో విఫలం అవుతునే ఉన్నాను,నీ పనులకి నేను అవసరానికి వచ్చాను అనే నీ మాటలు,చేతలు..
నన్ను ఒక అవసరానికి అప్పచెప్పుకున్నాన అనే ఆలోచన నరకం చూపిస్తుంది..
మంచిగా నీ నుండి నాకు నేను సంతోషంగా సెలవు తీసుకోవాలి
అనే నా ఆలోచన.. నీకు నా బలహీనత,అసహనంగా ఉన్నాయి..
నేను ప్రేమించింది నన్ను ప్రేమించిన మనిషినే, కాని కలిసి జీవించే అవకాశం లేక వేరయ్యాము.. అనే ఆలోచన సృష్టించాలని
ఆ మాయలో దూరంగా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటుంటే..
నువ్వు ఒక అవసరానివి, నాకు అవకాశం దొరికింది లేదు నమ్మకంగా తీసుకున్నాను.. నా అవసరం తీరిపోయింది ఇప్పుడు, జరిగింది మరచిపోయి..నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అని నువ్వు అన్నదానికి
ఎంత తేడా ఉంది...??
ఈ తేడా చాలదా మనసు రోదించడానికి..??
నువ్వు ఎవరి కోసం మారలేవు, నీకోసం తప్పించి..
మరెందుకు ఎవరి జీవితాల్లోకొ అరక్షణం అయనా దూరడం..
నిన్ను అందమైన జ్ఞాపకంగా దాచుకుందాం అని నేను కోరుకుంటుంటే
అందమా...నన్ను నన్నుగానే గురుతు పెట్టుకో అంటూ నువు చేసే పనులు..
నిజమే అబద్ధం కాలేని నిజానివి నువ్వు...ఆ నిజాన్ని మరుగున పడేద్దాం అనే వెర్రిదాన్ని నేను..!!
నిన్ను బాగా అర్ధం చేసుకున్నాను కాని నేనేంటి అన్నది మాత్రం చెప్పలేకపోతున్నాను..
ఒకవేళ చెప్పినా.. ఆహ అనగలవు కాని విలువ ఇవ్వలేవని కూడా తెలుసు
నీకు దూరమైన నేను ఒక ఙ్ఞాపకంగా అయినా.. నీలో ఉండాలనే తపనతో
నీ ఇష్టాలను నా ఇష్టాలుగా చేసుకుని నువ్వు వెళ్ళే చోట నా ఙ్ఞాపకాలను
విత్తులుగా జల్లుతున్నాను...ఎప్పుడైనా ఏదో ఒక సమయాన నీ కంట పడతానుగా ఒక ఙ్ఞాపకాన్నై అది చాలదా అనే ఆశ..
పలవరింతలు వస్తే మాత్రం ఎవరో అనుకోకు నిను తలచే వారెందరున్నా
నిను ఎప్పటికీ మరువని నేను ఒకదానిని ఉన్నాని మరచిపోకు..
ఈ కన్నీరు ఇంకిపోతే బాగుందునని ఉంది..
దానికి తెలియదుగా ఎవరు ఎందుకు వస్తారో..ఎందుకు పోతారొ
ఇంతటి దఃఖాన్ని ఇంకెవరికి ఇవ్వకు కానుకగా...
నాతో ముగిసిపోనివ్వు అదైనా ఒక తృప్తి ఉంటుంది...ఈ కోరిక అత్యాశే..
      
         .......అరుణని.......

తాను నేను

చిక్కని చీకటిలో సైతం నీ రూపం నా ముందర స్పష్టంగా కనిపిస్తుంది
నిశీది నీడలలో మన నీడ సైతం మనతో ఉండదు కాని
ఆ చీకటిలో నీ ఉనికిని నా మనసు గ్రహించి, స్పందిస్తుంది
నీ ఇష్టం,కష్టం అన్నింటికి నా మనసుకి చెప్పకనే తెలుస్తుంది  
ప్రేమంటే ఇదేనా...అవునేమొ కదా...
దానిని రుచి చూసి,తనివితీరా అనుభవించాకే తెలిసింది...
అది కూడా నీకు దూరమయ్యాకే అర్ధమయింది..
నువ్వేంటో నాకు...నీ మీద నా ప్రేమేంటో
ప్రేమించి.. దానితో జీవించి..అందులో నిండా ములిగాక
తెలిసింది ...ఇదే కలిసి ఉంటేనే ప్రేమ కాదని
అందరికి అంత అదృష్టం దొరకదుగా..
కలవని తీరాల నడుమ కూడ వారధి ఇలా వేయొచ్చని తెలిసింది
ఇన్నాళ్ళూ నాలో నేను..నాకు నేను తోడుగా ఉన్నాను
ఇప్పుడు నాకు నువ్వు తోడయ్యావు...నాలో, నాతో మనంగా ఉన్నావు 😍
నా మనసుతో మాటలు అదే నీతో మాటలు
అలకలు,కోపాలు,తాపాలు...విరహలు అన్నీ ఉన్నాయి
మనిషిగా లేవేమో కాని నా మనిషిగా నాలో ఉన్నావు
నా మనసుతో చూడగలిగితేనే నీకైనా, నువ్వు కనిపించేది నా ప్రక్కన
ఇన్ని ఉన్న నాకు నువు పక్కన లేవనే బాధ ఇప్పుడు లేదు
నీ ఇష్టాలు నా సొంతం చేసుకున్నాను అనుకున్నాను కాని
నిన్నే నాలో నింపేసుకున్నానని అనుకోలేదు..ఇప్పుడిప్పుడే తెలుస్తోంది
ఇలా కూడా కలిసి బ్రతకొచ్చని...దీనినే లోకం పిచ్చి అని కూడా అంటుందిలే
పిచ్చి ప్రేమ అంటే అంతే మరి....

                                ...........అరుణని............

తాను నేను

ఓయ్ బుజ్జీ....
             ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియదు కాని రాసేస్తున్నాను ఈ లేఖని నీకు...నీకే బాబు రాసేది, చాలాసార్లు రాద్దామని అనుకుని మొదలు పెట్టి మధ్యలోనే చెరిపేసిన సందర్భాలు ఎన్నో,మాటల్లో చెప్పలేని నా భావాలకు అక్షర రూపం ఇద్దామనే చిరు ప్రయత్నం..తప్పులు ఉంటే మన్నించేయవోయ్ ఒక చిరునవ్వుతో..నాతో ఎన్నో తిప్పలు పడుతున్నావు అందులో ఇదొకటి అనుకో..
              నీ రాక నాకు అసలు గురుతే లేదు,ఎలా మొదలయిందో ఈ మన గాధ కాని కధగా మిగిలిపోయింది కదా మన మనసు పొరలలో...ప్రతీ ఉషోధయం నీ పలకరింపుతోనే  మొదలయ్యేది,వేకువనే వీచే పిల్లగాలిలా నీ తుంటరి మాటలకి నా అల్లరి జతకట్టేది ఇక రోజంతా మాటల ప్రవాహమే..ఆ పొద్దు ఇటెప్పుడు చేరిందో కూడా తెలిసేది కాదు..ఏదో మాయ ఉందిరా నీ మాటలలో, నను పడేసింది అవేగా...ఈ రేయి ఎందుకు మన మధ్య ఈ కాస్త ఎడబాటుకి కారణం అవుతుంది అని కసురుకునే రోజులవి...ఎన్నో ప్రశ్నలు సంధించే దాన్ని.. నిన్ను తెలుసుకోవాలి అనే ఆరాటంలో...నా అలకలు నువ్వు తీరుస్తుంటే మా నాన్నే గురుతుకొచ్చేవారు,నా కోపాన్ని నువు సరేలే అని భరిస్తూ ఉంటే నాకు మా ముద్దుగా కనిపించే వాడివి...మనం ఆడే ఆటలలో ఓడింది ఎవరయినా గెలుపు మజా ఇద్దరం అనుభవించే వాళ్ళం...ఏమి ఎరగని వాడివని పొరబడ్డానని తరువాత తెలిసొచ్చింది..అన్నీ ఎరిగిన సరసుడువని తెలుసుకున్నాక....
                          లోకమంతా ఆదమరచి నిద్రిస్తుంటే మనం మాత్రం మన ఊసులలో ఊయలలు ఊగేవాళ్ళం...ఈ పగలు రేయి వేరైన మనం ఒకటేగా అని అనుకున్నాను....నీ ధరఖాస్తుని అందుకొని నిన్ను ధరి చేరిన రేయి మనల్ని చూసి ఆ రేరాజుకి కూడా గుబులు పుట్టే ఉంటుంది...నా ప్రేమనంతా మూటకట్టి నీకు కానుకగా నన్నే నీకు ఇచ్చేసుకున్నాను...ఎంత ప్రేముంది అంటే ఇంతుంది అని మాటల్లో వివరించడానికి పదాలు దొరకకా వాటి బదులుగా నేనే నీ బంధంనంలొ బంధీని అయిపోయాను..
                         ఇవన్నీ శాశ్వతం కాదని,కొత్త మోజు అంతే అని తెలిసాక...కొంచం కష్టమే అనిపించింది కాని నీతో గడిపిన ఘడియలు,ఆ మాటలు,ఆటలు,అల్లరి,అలకలు ఇవెప్పుడు నాకు పాతబడి పోవు...నిలకడ లేనిది నీకు అందుకే తుమ్మెదలా తిరుగుతావు, దోచిన మకరందాన్ని దాచేసుకోకు లావైపోతావు బుజ్జి...ఎలా కలసిన ఏది జరిగిన నువ్వు నాకొక వరమైన శాపానివి...అందుకోలేను,వదులుకోలేను...ఓయ్ నన్ను నువ్వు కూడా మరచిపొలేవోయ్ నేను నేనే, నాలా నిన్ను ఇంకెవ్వరూ ప్రేమించలేరు ఆఖరికి నువ్వు కూడా... నువ్వు చుక్కల్లో చంద్రుడివే కాని నేను వెన్నెలను అని మరువకు...నువ్వు మణివో,రత్నానివో,రాయివో ఏదైనా ఈ బంగారం లేనిదే నీ వెలుగులు రావోయ్ బయటకి...నువ్వు, నేను యాడ ఉన్నా నీ జాడ ఈ మనసులో పదిలంగా ఉంటుందని మరువకు..
                              ఇది ఏ లేఖ అనకు ఏదో ఒక లేఖ..చిరునామాతో పని లేకుండా నీ చేతి రేఖలను తాకుతుంది ఇది వచ్చి ...ఈ జన్మకు అక్షరాలలోనే మనం ఉండేది...మళ్ళీ జన్మ ఉంటే నేను నువ్వుగా,నువ్వు నేనుగా పుట్టాలి అప్పుడు చచ్చినా నిను వదులుకోను...ఒట్టు
                                                      
                                                          ప్రేమతో
                                                             నీ
                                                           ....