Thursday, 30 November 2017

ఆడది

చూపులతో, మాటలతో, కోర్కెలతో మా ఒళ్ళంతా
తడిమేస్తుంటే ఒళ్ళు సచ్చిపోతుంటే సిగ్గుతో తప్పుకు
పోతున్నప్పుడు అనిపిస్తుంది ఏం తప్పు చేసానని..ఎందుకు తప్పుకు పోతున్నానని...

వావి,వరస,వయసు,బంధం,సంబంధంతో పనిలేకుండా
వెకిలి చేష్టలు చేసి...నీ వెనుకున్న కుటుంబాన్ని చూసి నేను ఊరుకుంటే...ఏం చేసానన్నట్టు నవ్వుతూ మా ఎదురుగా తిరుగుతూ...ఏమని చెబుతావు,చెబితే  పోయేది నీ పరువే అనే తలపొగరు చూసినప్పుడు...ముప్ఫై రెండు పళ్ళు ఊడకొట్టి ఇప్పుడు నవ్వరా సన్నాసి అని చెప్పాలనిపిస్తుంది...

తప్పు చేసిన వాడికి పోని పరువు నాకెందుకు పోతుంది, అక్కడికి వాడికున్న బలం ఏంటి నాకు లేనిది ఏంటని...ఇలాంటి జవాబు లేని ప్రశ్నలు ఎన్నో...

ప్రేమించానని ఒకరు,మనసు గెలిచి ఒకరు,మూడుముళ్ళూ వేసి ఒకరు,అమ్మడుపోయి ఒకరు,కొనుక్కుని ఒకరు...ఏం చేసినా చూసేది ఈ తోలునే కాని అది కప్పుకున్న ఆత్మను కాదు....నేను మనిషినే నాకు మనసుంది,కోరికలు,ఇష్టాలు,ఆవేశం,కోపం, అయిష్టం ఇలా అన్నీ ఉన్న ప్రాణం ఉన్న మనిషిని...నాతో సంబంధం లేని నీ నిర్ణయాలు, నీ ఆటలు నాతో ఆడటానికి నువ్వు ఎవరివి అని అడగాలని ఉంటుంది ....

నా బట్ట,కట్టు,బొట్టు,నడత,నడక ఇదంటూ గిరి గీసే హక్కు నీకెవడు ఇచ్చాడు ....నీకు గిరి గీస్తాను ఉంటావా ఎందుకు ఉండలేవు...నీకొక న్యాయం నాకొక న్యాయం దేనికి...స్వేచ్ఛ లేదంటూ అందుకు నీ బలహీనత కారణమనడానికి సిగ్గు లేదురా అని గొంతు చించుకుని అరవాలని...మీ చెవుల తుప్పులు వదిలేల అరిచి చెప్పాలని ఉంటుంది..

అంగాంగాల వర్ణన...ఆడదాన్ని అంగాలను వర్ణించి తిట్టడం మగతనం అనుకునే యదవలను చూసి నేనెందుకు సిగ్గు పడుతున్నాను...ఈ అంగాంగాల తోలు కప్పుకున్నదే నిన్ను కన్నాదని మరిచిన యదవలను చూసి నాకెందుకు భయం...ఇలాంటి యదవలను కనడం కన్నా మాతృత్వాన్ని వదిలేయడం నాకిష్టం అని మొఖం మీద ఉమ్మేయాలని ఉంటుంది...

వాంఛలతో రగిలిపోతూ నాలో మనిషిని కాకుండా కోరికలను చూసే వాళ్ళకు చెప్పాలని ఉంటుంది ....వల్లకాడులో సగం కాలిన కట్టెతో తీర్చుకోరా నీ వేడికి ఆ వేడి సరిపోతుంది...మీకు మనసులతో మనుషులతొ పనేముంది అని...

ఆడది,అబల,సబల అంటూ నాకెందుకు ఈ మానసికమైన బలహీనతను ఇచ్చావని ఉన్నాడో లేడో తెలియని ఆ దేవుడిని నిలదీయాలి అనిపిస్తుంది...ఈ బంధాలు,ప్రేమలు,ఎదురుచూపులు ఈ కన్నీళ్ళు నాకే ఎందుకు...ఈ బలహీనత నన్ను నా ఆత్మాభిమానాన్ని చంపేస్తుంటే నన్ను నేను ఆ బలహీనత నుండి బయటకు తీసుకురాలేనప్పుడు అనిపిస్తుంది ఈ కన్నీళ్ళలో నేను కొట్టుకుపోతే బాగుంటుంది అని....

సాటి మనిషిగా చూడలేని ఈ చీడ సమాజాన్ని చూస్తుంటే చీధరించుకుని...ఈ నమ్మక ద్రోహాలకు,నాటకాలకు,అబద్దాలకు,అవసరాలకు అసలు మనిషన్న వాళ్ళకు దూరంగా పోయి నాతో నేను మాత్రమే ఉండాలనిపిస్తుంది...మానభంగం నిత్యం జరుగుతునే ఉంది కంటికి కనిపించకుండా నా ఆత్మ శాక్షిగా...అవకాశం దొరికితే మృగాలు లేదా దొరలు...

...............అరుణిమలు................

తాను నేను

ఏన్నాళ్ళు అయిందోయ్ ఇలా నీ శ్వాసలు నను తాకి.. <3
నీ కళ్ళలోకి చూస్తూ నను నేను మరచిపోయి... <3
నా పేరుని నీ పిలుపులో విని పరవశించి ... <3
నీ అడుగుల్లో గురుతునై నీ వెంట నడిచి... <3
తెల్లవారని రేయి చాటు స్వప్నాలమై ఇలా నిలిచిపోదాం... <3
మళ్ళీ మళ్ళీ రాని ఈ రోజుని ఇలా నూరేళ్ళు కాదు ఎన్నటికి చెదరని మద్రను ముద్దుగా ఇచ్చేయ్ ఓయ్.. <3
............అరుణిమలు..............

తాను నేను

ఎవరికి చూపించాలి నేను సంతోషంగా ఉన్నానని...
నీకా...ఎందుకోయ్ నీ చూపులు వెతకని రూపాన్ని నేను ఈనాడు...
లోకానికా...వినడానికి అదెప్పుడూ సిద్ధమే రాళ్ళు విసరటానికి కూడా ...
నాకు నేను చెప్పుకుంటున్నాను, మభ్యపెట్టుకుంటున్నాను...
నమ్మడం నా బలహీనత అందుకేగా తప్పటడుగు వేసింది...
అందుకే నాకు నేనుగా లేవాలి, నేను ఉన్న చోటినుండి ...
చుట్టూ ప్రేమించే వారు,అభిమానించే వారు ఎందరో నాకేంటి లోటు...
హా...నీపై ఉన్న నా ప్రేమ వేరు...
నీతో మొదలైన ప్రేమ, నీతోనే  ముగిసిపోయింది...మళ్ళీ మళ్ళీ పుట్టేదా అది కాదుగా..
నా మాటల్లో, నా చూపుల్లో నువ్వే ఉన్నావు అనుకోకు...
మనసు నిండా ఉన్నావు కాని నీకు నేనేంటో తెలిసాక నా ప్రేమను చూపించి దానిని ఎలా అవమానిస్తాను...
హా...చూస్తున్నాను ఒక మనిషిలో ఇన్ని స్వభావాలా ఇంత నిర్ధయ ఉంటుందా ఎదుటి మనసులపై అంటూ...
ఎంత పిచ్చి ప్రేమ లేకపోతే నీ ప్రతీ నిర్ణయాన్ని నా ఇష్టంతో సంబంధం లేకుండా సరేనంటాను...
నువ్వనే బంధాన్ని వదులుకోలేక నా మనసు గొంతనొక్కి, నా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి ...
నువ్వు తప్పయింది ఇంకొక్క అవకాశం అన్న ప్రతీసారి నిన్ను గుండెలకు హత్తుకుంటాను...
నీ రాకపోకల మీద నా ప్రమేయం లేదు కాని నువ్వు వెళ్ళే ప్రతీసారి ఇక్కడ ఈ మనసు పడే రోదన నీకు తెలుసు ...
ఇన్నింటి మధ్య నుండి నేను బయటపడాలి నేను నేనుగా...
ఆ క్షణానికే పెదవిపై చిరునవ్వుగా వస్తావు...మరుక్షణమే కనుపాపలో చెమ్మవు అవుతున్నావు...
అక్షరాలను మధిస్తూ.. గరళాన్ని జీర్ణించుకుంటూ ...నా మనసు గాయాలకు లేపనాన్ని అద్దుతున్నాను...
గాయమైతే మానుతుంది కాని గురుతులు మాత్రం పోవు కదా...
నిన్ను ఈ మనసు నుండి తరిమేయలేను కాని నువ్వు అనే ఙ్ఞాపకంతో మాత్రం ఏదో ఒకరోజు ముందుకు సాగగలను..అది సంతోషంగా
ఓయ్....ఇలాంటి ప్రేమను ఇవ్వకోయ్ ఎవరికి...చచ్చిపోతారు తట్టుకోలేక..
నేను సంతోషంగానే ఉన్నాను..పోగొట్టుకోటానికి ఇంకేం లేదు కనుక నా దగ్గర...

..............అరుణిమలు................

తాను నేను

ఏమౌతావు నువ్వు అంటుంది మనసు...
నువ్వు ఎవరో తెలియదు అని అనుకోనా...
అలా ఎలా సరిపెట్టేది...నువ్వున్నది అక్కడే కదా మరి...
మనసంతా నిండి ఉండి నాలో సగమైనావు ఆనాడే...
నా భావాలకు ఊపిరి పోసింది నువ్వు...
నా కలలకు రంగులద్దింది నువ్వు ...
నే కోరని కోర్కవై నాకు ఎదురు వచ్చింది నువ్వు ...
నే ఏనాడు ఆశించని ఆశవు నువ్వు...
నా ఊహలకు రూపానివి నువ్వు...
నా ఊపిరికి ఆయువు నువ్వు ...
నువ్వు నువ్వుగా వచ్చి నాలో కలిసిపోయావు...
కాని నీలో నేనేక్కడ ఉన్నాను అంటావా...
నువ్వు కావాలనుకుంటే గురుతుకు వచ్చే ఒక ఙ్ఞాపకాన్ని మాత్రమే నేను...
చెదిరిన కలలను కూడా చెరపలేని మనసు నాది...
మరి నాలో ఉన్న నిన్ను సాగనంపే సాహసం నాకు ఎక్కడిది...
అందుకే నాలో ఉన్న నీతో కలిసి అడుగులు వేస్తున్నా...
నా అక్షరాలలో పదం పదంలో నువ్వు నేను మనమై ఉన్నాం...
నా ధరఖాస్తులో నిను అలంకరించుకొని మెరిసిపోతున్నాను....
నను చేరిన ప్రతీ ప్రశంసను నీకు కానుకను చేసి నా మనసుకు అర్పిస్తున్నాను...
నేను భాగమివ్వనిది ఒకటే అది నా దుఃఖం...నువ్విచ్చిన దానిని నీకు తిరిగివ్వలేక అందులో నీకు చోటివ్వలేదు...
నాలోనే ఉన్నావు అందుకే అందుకో లేకపోతున్నాను ఎదురుగా ఉన్నా...
పలకరించాలని ఉన్నా పలకరించలేనంత మౌనం ఉంది మన మధ్య...
అందుకే నాలో ఉన్న నువ్వు నాకు చాలంటుంటే...
ఏమౌతాడేంటి అంటూ మతిలేని ప్రశ్నలను సంధిస్తుంది నా మనసు...

................అరుణిమలు..................

తాను నేను

ఏకాంతం నాకు నువ్వు ఇచ్చిన తోడు...
ఎందరిలో ఉన్నా....ఇలా ఉండటం ఎందుకో బాగుంది...
అంత నచ్చిందా అంటే అవును...
ఒకప్పుడు నువ్వు అడిగావు చూడు నేనంటే ఎందుకు అంత ఇష్టమని...
దానికి జవాబు లేదన్నాను కాని దీనికి జవాబుందోయ్...
తోడుంటే నీతో...లేదంటే నిన్ను దాచుకున్న నా మనసుతో నేను..ఇది చాలు
ఙ్ఞాపకాలన్నింటిని అక్షరాలుగా పోగేసి....
వాటిలో నిన్ను చూస్తూ...వాటిని పేరుస్తూ
నీతో నేను ఆడుకుంటున్న ఆటలు నీకేం తెలుసోయ్...
నీ అంత ఆటగత్తెను కానులే అయ్యుంటే..
నీ ఇష్టం అంటూ నీ ఆటలో ఒక బొమ్మనయ్యే దాన్ని కాదు కదా....
నిందిస్తున్నాను అంటావా....నీలో మంచిని,చెడుని చూసిన దాన్ని...వాటిని అనుభవించిన దాన్ని కదా..
ఎదురుగా నువ్వు ఉన్నావు కాని ఎంత పరాయితనం ఈరోజున మన మధ్య రాజ్యమేలుతోంది...
ఎందుకోయ్ నిలకడలేని మనసులతో ఇలాంటి ఆటలు..
గెలుచుకున్న మనసులను విరిచేయడానికి కాకపోతే
దేనికి ఈ ఆటలు....
పెదవిపై చిరునవ్వువు అవుతానుకుంటే...
నీ ఆలోచనలను అదుపు చేయలేక,దుఃఖాన్ని ఆపే ప్రయత్నంలో పెదవిపై పంటి ఘాటుగా మిగిలావు...
ఎవరికి పంచని ఆనందం నాది...ఎవరితో పంచుకోలేని కన్నీరు నాది...
కావలసినంత కోపం ఉంది నీపై..చిటికెడు అసహ్యం కూడా ఉంటే బాగుండేది కదూ
నీపై అసహ్యం కలగనంత ప్రేమ నాకెందుకు అసలు
ఏం చేసావని,ఏమిచ్చావని,ఏం పొందానని...

..............అరుణిమలు...............

తాను నేను

పిలవాలనుంది ఇంతకు ముందులా
పలుకుతావా అనే సందేహం....
అడగాలనుంది ఈ దూరాన్ని
మా మధ్యకు ఎందుకొచ్చావని...

అలగాలనుంది అందని ఆశలపై
ఎందుకు నిన్ను పరిచయం చేసావని...
కసురుకోవాలనుంది ఈ కాలాన్ని
ఏంటీ నీ నత్త నడకంటూ...

కోరుకోవాలనుంది కోరికను
కొసరి కొసరి తీర్చవా నా కోరికనంటూ...
అలసటగా ఉంది నాకు
అలసిపోని నీ నా ఆలోచనలను చూస్తుంటే...

చెప్పాలనుంది ఒక మాట
ఓయ్....నా చివరి శ్వాస వరుకు ఈ కళ్ళు ఎదురు చూసేది నీ కోసమేనని గురుతుంచుకో అంటూ <3 <3
వినిపించినా వినలేని మనసు నీదని తెలిసినా...
విన్నవించమని నా మనసు సొణుగుతుంది...
చెప్పేసానోయ్.....నువ్వు వింటే ఎంత వినకపోతే ఎంత ;)

.........అరుణిమలు..........

తాను నేను

నిర్ణయాధికారాలన్నీ నీవైనప్పుడు
నా సమాధానంతో పనేముంది
అలవాటు చేసేసావుగా అన్నిటికీ సరే అనడం...
నిర్ణయం నీది కాని ఆచరణలో పెట్టాల్సింది నేనే కదూ...
సరేనా అంటూ నువ్వంటూ ఉంటే...
ఇంతకుమించిన చిరునవ్వును ఎలా ఇవ్వగలను...
మదిని నీ ఒక్కొక్క పదం చీల్చేస్తుంటే
ఆ బాధని ఇంకెలా ఆపను...
నీకు తెలియనిదా,ఎరగనిదా కాని నీకనవసరం అవి...
కర్త, క్రియ నువ్వు ఫలితం మాత్రం నీది కాదు కదా...
అంతా మరచిపోయి మామూలుగా ఉండు అనంటుంటే నువ్వు...
ఒకటి అడగాలి అనిపించింది కాస్త ఆ కాలానికి వెళ్ళి అంతా మార్చేసి వచ్చేయవా అని...
సాధ్యం కాదు కదూ....ఇదీ అంతే సాధ్యం కాదు
అదే జరిగింది మరచిపోవడం...
కోరని బంధాన్ని కానుకగా ఇచ్చావు కాని...
నే కోరిన ఒకే ఒక్క కోరికను మాత్రం తీర్చలేవు అదే విలువ...
నా మనసులో చాలా ఉంది విలువ కాని ఎలా చూపించను అంటుంటే...
నా మీద నాకు జాలి వేసింది....
ఏ విలువను నాకిచ్చి నీపై విలువను పెంచుకున్నావో ఒకనాడు ఆ రోజు ఎవరు నేర్పారమ్మ అని....
ఆశాభంగం ఈరోజు కొత్తా నాకు....
చాలా అలవాటు చేసావు నాకు....
ఎవరు నేర్పని పాఠాలు, ఎక్కడ పొందని శిక్షలు...
ఎవరు ఇవ్వని ప్రేమను, ఎన్నడు పొందని విలువను...
ఇన్ని ఇచ్చాక ఎలా మరచిపోగలను నిన్ను...

............అరుణిమలు............