Thursday, 30 November 2017

తాను నేను

ఓయ్....నిన్నేనోయ్
చాలా రోజులు అయిందిరా నిను చూసి..
అదేలే...తేరిపార చూసి..
ఎక్కడ కళ్ళారా చూస్తే పదపద మంటుందో ఈ పాడు మనసని...నేల చూపులు చూస్తున్నాను మరి...
ఇప్పటికీ ఏ మార్పు లేదెందుకో మరి...
నిను చూసిన క్షణానే మదిలో పదనిసలు మోదలు..
చిరుగాలి తాకిడికి తన్మయంతో ఊగిసలాడిన ఆ విరుల్లా ఈ గుండె దడదడలు ఏంటోయ్...
నీ పేరు మది స్మరించిన ఘడియలో ఎరుపెక్కిన చెక్కిళ్ళు పెదవి సాయాన్ని కోరి మరి చిరునవ్వై విచ్చుకుంటున్నాయి...
నీ ఆలోచనల అలలు తీరం చేరేది నా కాలి గోటి గిచ్చుళ్ళతోనే సుమీ..
కళ్ళలో ఈ కలవరపాటు ఎలా ఆపేది ఎవరి కంట పడనివ్వకుండా...
నా నవ్వుల జలపాతంలో స్థానాలు చేస్తున్నానోయ్..
నీ ఊహల ఉరకలను ఆపేదెలా ఉప్పెనై నను ముంచక మునుపే...
చేయాల్సిదంతా చేసేసి ఏం ఎరుగని పుంగవుడిలా ఆ చూపు ఏంటో...
ఉలిక్కిపడుతున్న నా అదరాలను ఆపేదెలా నిను తలంచకుండా...
ఎదనేలే వేళ నా రాజువి..పానుపును ఏలే వేళ నా చక్రవర్తివి నువ్వే..
నీ రాజ్యం ఇక్కడ తనని ఏలే రాజు లేకుండా ఉందోయ్ నీకోసం ఎదురుచూస్తూ...
నీ గుండె గూటిలో తిష్ట వేసాను చాలులే అనకు..
ఉసురు తగులుతుంది ఈ వయసుది నాది కాదులే..
ఇప్పుడు ఏంటిదని తుళ్ళిపడకోయ్ నిన్ను ఎవరు ఆహ్వానించలేదులే...

                              అరుణిమలు

తాను నేను

ప్రేమ అనే రెండు అక్షరాలలో ఒదిగిపోయాం అనుకున్నాను...
కాని మనం అనే స్వార్ధం బదులు...
నేను అనే స్వార్ధంలోనే నువ్వింకా ఉన్నావని తెలిసాక కూడా...
ప్రేమను పంచగలను కాని ప్రేమను అర్దించలేను...
మనం కానిచోట నేను ఒంటరినే కనుక...
నీ ఏకాంతాన్ని నీకు కానుకగా ఇచ్చి నే వెళుతున్న...
వీలైతే ప్రేమించడం నేర్చుకో వాడుకోవడానికి కాకుండా...

......అరుణిమలు.....

తాను నేను

ఏం ఆలోచిస్తున్నావంటూ ప్రశ్నించడం మానేసాను మనసును...
ఒక ప్రశ్న నేను వేస్తే వేల ప్రశ్నలను ప్రశ్నలుగా నా ముందు ఉంచుతుంది కనుక....
నాకంటూ ఎన్నో హద్దులు పెట్టుకొని, గిరి గీసుకుని ఉన్నన్నాళ్ళు హాయిగా ఉన్నాను....
మన కోసం అంటూ నేను గీసుకున్న గిరి దాటి ఎంత తప్పు చేసాను కదూ....
అందుకే ఈ వెంటాడే ఆలోచనలు నన్ను అనుక్షణం ప్రశ్నిస్తునే ఉన్నాయి...
ఒకరి కోసం లోకాన్ని సైతం ఎదురించవచ్చు...కాని ఆ ఒక్కరిని మరచపోడానికి ఈ లోకం మొత్తం ఏకమైనా కూడా కష్టమే....
నీ ముంగిట నేడు పూయని నా నవ్వులలో సుగంధాలు లేవోయ్...
ఎవరు ఏమని పిలిచినా వినపడని ఏమరుపాటు...
నీ స్వరం జతకానిదే నా పేరుకి అందం ఎక్కడ ఉందిరా...
ఏ పిలుపుకు పలకాలని లేదు...ఎవరినీ పిలవాలని లేదు...
నలుగురిలో మెలుగుతూ నలుగుతున్న మనసు మూలుగులు వినలేకపోతున్నా నేడు....
కాని తప్పదు కదా ఉన్నచోటనే ఆగిపోతే పయనం సాగించేది ఎలా....
అడుగులు వేస్తున్న ఇప్పుడే నడకలు నేర్చిన పాపాయిలా అదీ చేయూత లేకుండా....
ప్రతీ మాటలో,ప్రతీ పనిలో,ప్రతీ పాటలో అసలు నువ్వు లేనిది ఎక్కడ ....
ప్రతీ ఘడియ నా ఈ బతుకు చిత్రం పై కనిపిస్తున్నది నీ రూపే....
చెరిపేయడానికి మనసు ససేమిరా అంటూ నా ఉసురు తీయకంటూ వేడుకుంటుంది....
ఓయ్.....ఎలా సాధ్యంరా ఒకర్ని చెరిపేసి ఇంకొకరికి చోటు ఇవ్వడం...
నువ్వున్న చోటును ఇంకొకరికి ఊహకు సైతం అసహ్యంగా ఉందిరా....
నా దృష్టిలో నువ్వు లేవని చెప్పాలనుకున్నాను కాని ఎలా....
నీకు శిక్ష వేయాలంటే నాకు నేను లేకుండా పోవాలి అంతే....

...........అరుణిమలు............

తాను నేను

ఏం ఊహించని...ఆశించని రోజులు అవి
నాకై నేను...నాకోసం నేను గడిపే కాలం అది
నేను....అనే నన్ను విచ్ఛిన్నం చేయాలని భావించిందేమో కాలం....
నిన్ను పంపింది నా జీవితంలోకి కనికరం లేకుండా...
ఏం కావాలో ఏం చేయాలో అనుకుని మరీ వచ్చావురా నువ్వు....
ఎందుకు వచ్చావో...నాకేం కావాలో కూడా తెలియకుండానే నిన్ను ఆహ్వానించేసాను కదూ...
నిశ్శబ్దంగా ఉన్న నా మానసాన అలజడులు రేపి...కాలం కోరిన కోరికను నెరవేర్చి విజేతగా వెళ్ళిపోయావు...
కాని గెలిచి ఓడిపోయావురా...నిన్ను నిన్నుగా స్వీకరించిన మనసును...
నీదెప్పుడూ రంగుల లోకమే కదూ...అవును ఎదుటి మనసు కన్న కలలను కల్లలు చేసి మరీ రంగుల అద్దుకుంటావుగా నీ రేపటికి....
ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఓడిన మనసు కాదు...
విలువ ఇవ్వలేని ఒక అబద్ధం ఇక చాలంటూ నన్ను నా నిజాయితీకి వదిలి గెలుపును ఇచ్చేసింది కదా...
అవును ఈరోజు ఏకాంతం నా నేస్తం, కన్నీళ్ళు నాకు ఓదార్పు,గాయపడిన మనసు ఒక గుణపాఠం...
నీకు వెల కట్టలేదు ఏనాడు...విలువ ఇచ్చాను అది నన్ను మించి మరీ....
నువ్వు నా బలహీనతవు...ఇప్పుడు నువ్వే నా బలానివి కూడా...
నమ్మితే ఎమౌతామో చెప్పావు...ఎలా మెలిగితే ఒకరి మనసును విరిచేయొచ్చో చెప్పావు...
ఇవి చాలవా నేను ఇంకొక తప్పటడుగు వేయకుండా...
నేను బాధపడకుండ ఇంకొకర్ని బాధపెట్టకుండా ఎలా బతకాలో నేర్పావు....
ఈ కష్టం కొన్నాళ్లు మాత్రమే నువ్విచ్చిన అనుభవాలు జీవితాంతం నావెంటే ఉంటాయి తోడుగా నిన్ను గుర్తు చేస్తూ....
అనుభవాలను ఇచ్చే నీ ఆట బాగుంది...కాని గెలుపెప్పుడూ ఒకరి సొంతం కాదురా....

.............అరుణిమలు..............

తాను నేను

ఏముంది నీలో నను బంధించే మంత్రం...
ఈ ఆకర్షణశక్తి ఏంటోయ్ నీలో....
ఏ మూలనున్న నీవైపు లాక్కొచ్చే ఈ మాయ ఏంటి....
తెలుసుకోలేని ఈ వింతేనా ప్రేమంటే...
నీ పరిసరాలలో నేనుంటే చాలోయ్...
నీ మేను పరిమళాలు నన్ను మత్తులో ముంచేస్తాయి...
ఇంక నా ముందు నువ్వుంటే....
నాకు నేను ఎవరినో కూడా తెలియదే...
ఏయ్....కాస్త ఎడబాటు మంచిది కదా....
ఇలా నిన్ను నాకు అలవాటు చేయకురా....
రేపన్న రోజున నీకు దూరమైతేనో నేను ఊహించలేనోయ్.
నా లోకమంతా నీలోనే, నీతోనే ఉంది...
మరి నువ్వు దూరమైతే ఈ విశాలమైన ప్రపంచంలో నేను ఏకాకిని అయిపోతాను సుమీ...
నా వ్యసనానివి  కావోద్దురా అస్సలు...ఇంక నాకు నేను కూడా మిగలను....
ఇలా నీ శ్వాసలతో నాకు ఊపిరి పోస్తూ నాలో అణువణువునా నిండి పోయావు....
నువ్వు మలచిన వేణువునే నేను మరి నువ్వు లేకపోతే మూగదై పోతుందోయ్....
నా ప్రాణం ఉండాలంటే నీవెంట నడవక తప్పదోయ్ మరి నీవెంటే నేను.........నీ జంటనై

.............అరుణిమలు............

తాను నేను

మనం కలుసుకోవటం ఇలా ఇది మొదటిసారి అయితే కాదు అంటుంది నా మనసు....
మనల్ని చూసి పరవశించిన ఈ ప్రకృతే అందుకు ఋజువు....
నా మనసులోని పులకింతలన్నీ ఇలా వరాల జల్లై నను తాకుతూ ఉంటే...
పులకరింతలన్నీ పరవళ్ళు తొక్కుతూ నను చినుకై తాకి తడుముతుంటే....
నా అరచేత ఇలా క్షణకాలములో పడిజారే చినుకు లాంటి వాడివి నువ్వు...
నీ రాకపోకలకు సాక్ష్యం ఈ చేతికంటిన చెమ్మే సుమీ...
ఓయ్....దిక్కులు చూస్తావేం దిగాలుగా
సీత ఇటు ఉందోయ్..
ఇంకెన్నాళ్ళు ఈ సుందరాకాండ మన మధ్య
నిను తాకిన గాలి తాకిడి చాలోయ్ నాకు నా ఆశలకు జీవం పోయడానికి...
చినుకు చినుకుగా తాకి నేలంతా చిత్తడి అవుతున్నట్టే...
నీ ఊహలు నన్ను చిత్తు చిత్తు చేస్తున్నాయి చూడవోయ్ చిన్నోడా....
చూడకపోతే పో అటు శూర్పణఖేగా ఉంది చూడు బాగా...

...........అరుణిమలు............

తాను నేను

చిన్న చిన్న ఆనందాలే కదా జీవితమంటే...
కాసంత సమయం నువ్వు నేను మనమై గడిపితే చాలదా...
నీ కళ్ళలోకి చూస్తూ కరిగిపోతున్న కాలాన్ని మర్చిపోతూ భవిష్యత్తును చూడటం చాలా ఇష్టం...
మనసారా నే పిలిచే పిలుపు నిన్ను తాకుతుందో లేదో కాని నీ పేరు పలుకుతుంటే నా ఎద ఎన్ని హోయలు పోతుందో నీకు తెలియదు...
నా మాటలకు ఊ కొడుతూ నాకు ఊతపదాలను అందిస్తూ ఆట పట్టిస్తుంటే నాకు ఊపిరి ఆడదోయ్....
ప్రతీ చిన్న మాట నీ చెవినేయాలి...తెలిసిన విషయంలో కూడా నీ సలహ అడగాలి...
నీతో జాగ్రత్తలు చెప్పించుకోవాలి...నాలుగు చీవాట్లు తినాలి...
నీతో బాగుందని అనిపించుకుంటేనే కాని నా కంటికి ఇంపుగా కనిపించదే ఏది....
ఒక్కమాటలో నా కళ్ళను, నా మనసును నీముందు తెరిచి ఉంచుతాను నీమీద ఉన్న ప్రేమతో సహా....
అరచేత ఆశలన్నింటిని ఇలా పేర్చుకున్న చూడు...
పండించవోయ్ ఎర్రగా ఆ తూర్పున పొడిచే సూర్యుడిలా...
ఏ చీకటి నీడలు పడనివ్వకే తట్టుకునే శక్తి ఎక్కడదోయ్ ఈ మనసుకు...
ప్రేమకు అర్ధాలు తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే...
నా సంతోషం నీలో ఉందని...నీ సంతోషానికి కారణం నేనవ్వాలనీ ఇంతే....
వెనుదిరిగి చూసే కాలంలో నువ్వు ఒక ఙ్ఞాపకానివే కాదు రేపటి నా భవిష్యత్తుకు బాటవి కూడా....
ఓయ్....నిన్నే నా నిర్ణయానికి ఎక్స్‌పైరీ డేట్ లేదోయ్ గురుతుంచుకో...

........అరుణిమలు........