Thursday, 14 November 2019

తాను నేను

నా భావాలలో నువ్వు ఎప్పుడు
బందీవే ఇక్కడ..

కంటి నిండా
కన్నీరు ఉన్న చెరగని రూపానివే నువ్వు...

నీ తలపే
ఇప్పుడు తపస్సు నాకు..

నువ్వు వద్దు నాకు
అనే పదాన్ని పలకడానికి
అధరాలెంత బెదిరాయో...

నువ్వు పలికించాలి అనుకున్న
ఆ పదాన్ని పలకడానికి
నాతో నేను ఎంత పోరాడానో..

మనసు వేస్తున్న ప్రశ్నలకు
మౌనాన్ని జవాబుగా ఇస్తూ
ఎదురొస్తున్న కాలంలో ఎదురీదుతున్న..

భరించలేనప్పుడు
బాధ్యతగా తీసుకోలేనప్పుడు
నీకెందుకు ఈ ప్రేమంటూ
ఎద రొద పెడుతుంది..

మెదడు లెక్కలు
మనసుకు అనవసరం కదా
ఏదైనా భరించేయ్ అంటుంది..

అందుకే
మనసు గుచ్చి గుచ్చి
గాయాలను చేస్తుంది
నాకెందుకు ఈ వేదన అంటూ..

ముణ్నాళ్ళ ముచ్చట్లు
అంటే ఇవేనా..

సరదాగా ఉన్నప్పుడు
సర్దుకుపోయి..

భారంగా ఉన్నప్పుడు
భరించలేనంటు
మనసును తుంచేయడం
ఇంత తేలికా..

ఒసే మనసా...
నాలో ఉన్న నువ్వు
నన్ను వదిలేసి ఎవరి కోసమో
ఏడుస్తావేమే..

స్వార్ధం నేర్చుకో కొంచెం
నువ్వు బతుకు
నన్ను బతకనివ్వు..

✍️అరుణిమలు

తాను నేను

ప్రియతమ నీవచట కుశలమా
నేనిచట .........

నీవు లేని కుశలం
నా దరికి చేరుతుందా..

దిగులేదో
పెదవి మాటున దాగుని ఉంది..

ఏ క్షణానైనా
కనుల ఆనకట్టలను
దాటి వచ్చేందుకు..

ఎదకెందుకు
ఇంత యాతన..

మన దూరాన్ని
నువ్వు ఎదురించ లేవంటు
సవాలు విసురుతుంది..

చెల్లాచెదురైన
మనసును ఊరడిస్తున్న
ఇంకా తీరదే...

నాకే తెలియని
నేను వివరించలేని
పదాలకు అందని పేచి పెడుతుంది..

కుశలమే..
నీ తలపులలో
తలో దారైన నా ఆలోచనలలో..

✍️అరుణిమలు

తాను నేను

సరదాగా గడిపి పది నిమిషాలు కాదు
ఏదో ఒక‌ గొడవ మొదలు..

రాక రాక వస్తావు
దాచుకున్న నవ్వులను
కన్నీరు పాలు చేసి పోతావు...

అయినా మళ్ళీ మళ్ళీ
ఎదురు చూస్తుంది
ఇదేం పాడు మనసో..

అర్థం చేసుకుని
మనసు ముందు గొంతు చించుకు అరిచిన మనమేంటో అర్థం కాదు ఎప్పటికి...

నేను మాట్లాడటమే గొప్ప,
నేను దొరకడమే ఎక్కువ అని
నేను నేను అనే వారిలో..

మనల్ని, మనకున్న చోటును
ఎంత వెతికిన శూన్యమే...

నేను కాదురా...
మనం అనుకుని చూడు ఒక్కసారి
నీకై అలమటించే ప్రాణంలో నీ ఆయువే కనిపిస్తుంది..

✍️అరుణిమలు

తాను నేను

మాటలు ఆడుకోని రోజులు
ఎన్నో మన మధ్య..

కానీ ఒకరి గురించి
ఒకరం ఆలోచించని రోజు మాత్రం లేదు..

మన బంధానిది అర్ధాయుష్షే
ఙ్ఞాపకాలు మాత్రం పూర్ణాయుష్షు పోసుకున్నాయి..

ఎక్కడ
నువ్వు ఉన్న..

నీ గురించి
ఆలోచించే ఒక మనిషి ఉందని మరచిపోకు..

నిన్ను తలచే
ఒక మనసు నీ పిలుపు కోసం ఎదురు చూస్తుంది అని..

నిన్ను వలచే
ఒక జీవి నీ పేరుతో ఊపిరి పోసుకుంటుందని..

మరచిపోకే
నవ్వే ఈ పెదవుల మాటున
నలుగుతున్న నీ ఎడబాటు గాయాలను దాస్తున్న అని...

✍️అరుణిమలు

తాను నేను

నిను చేరని నా పలుకులన్ని
పదాలుగా మారుస్తున్న..

నీతో చెబుదామన్న
మాటలన్ని అక్షరాల మాలలు కడుతున్న..

నీతో పంచుకోని
నా ఇష్టాలు, కష్టాలు కవిత్వాలు అవుతున్నాయి..

నువ్వు కదిలించిన
అక్షర రాశిని నేను..

భావాలలో బందీని చేసి
ఏకాంతాన్ని ఇచ్చేసావుగా రాసుకోమంటు..

దేనికోయ్ ఈ అక్షరాలు
ఓదార్చేవే ఇవి కానీ లాలించేవా నీలా..

కదిలిపోతున్న కాలంలో
గడుపుతున్న ఒంటరి ఘడియలను
లిఖిస్తున్న కలంలో సిరా ఈ కన్నీరేగా..

నిన్ను చేరని ఈ లేఖలు
నీ చిరునామా కోసం వెతుకుతున్నాయి..

కనిపించకే వాటికి
నీ ముందు మౌనమై దాగిపోతాయి..

ఇవి అక్షరాల విన్నపాలు
చెరగని నీ ఙ్ఞాపకాలు..

✍️అరుణిమలు

తాను నేను

ప్రేమకు దూరం అన్నావు
అందుకేనా..

ప్రేమించే వారిని
కోరి దూరం పెడతావు..

ఎక్కడ
నీ విలువ తగ్గిపోతుందో
ఇష్టంగా నైనా ఎక్కడ తగ్గాలో అని..

అహం ముందు నీ గెలుపే
నా ఓటమి కూడా..

వలచిన మనసు ముందు
ఓటమి కూడా గెలుపేనోయ్..

తెలుసుకుంటే ఆ తీయదనాన్ని
వద్దన్న వదల్లేవు..

అలవాటు కాలేవు
మరెందుకు నిన్ను అలవాటు చేస్తావోయ్..

నిన్ను నువ్వు
దూరం పెట్టుకుని గర్వపడుతున్నావ
నీకై ఎదురు చూసే వారున్నారంటు..

నిరీక్షణ ఒక పరీక్షరా
సమయం ఇవ్వలేని బంధంతో
సమరమే చేస్తుంది ఈ మనసు....తెలుసా

✍️అరుణిమలు

తాను నేను

నోరార పిలిచి
నెలలు గడిచి పోయాయి...

మనసార తలచి
గడియ కూడా కాలేదింకా..

కంటి నిండా గంగే
కునుకు కు చోటు లేకుండా..

తనివితీరా నవ్వి
ఎన్నో తరాలు అయ్యినట్టే ఉంది..

తనువు ఇక్కడ
మనసెక్కడో దాని జాడేది
అని ఎవరిని అడిగేది..

ఓయ్........
నిన్నే రా

నింగి అంతా నీదే అంటూ
తారలు చుట్టూ తిరిగితే..

కొంగుకు చుట్టుకు పోతా
నిన్ను జాగ్రత్త...

పిలవాలని ఉంది
కలవాలని ఉంది
అలగాలని ఉంది
మనసుకు..

కానీ
మెదడు కసిరి పొమ్మంటుంది
వెనక్కి...

దూరాన ఉన్నావు
అంతే...
దూరం కాలేదు
కాలేవు..

నే పిలిస్తే
నీ తలపకు వచ్చే దూరమే మనది..

నువ్వు తలచితే
తడబడే మనసే నాది..

✍️అరుణిమలు