Saturday, 5 January 2019

తాను నేను

అనుకోని అతిధులే ఈ కన్నీళ్ళు
ఆలోచనలలో నేనుంటే అవి పలకరింపుకి వస్తుంటాయి...

నువ్వు దూరమైతే అవే తోడు
భావాల భారం అక్షరాలుగా మారే లోగా అవి కరిగి ఏరులవుతాయి..

రాయాలని లేదు
చెప్పడానికి ఏముంది
చూపించడానికి ఏం మిగిలింది

మౌనానికి హద్దులు లేవు
మనల్ని దాటి పోయాయి ఆ సరిహద్దులు
నిశ్శబ్దానికి ఆకారం లేదు
మన మధ్య ఉన్న ఏకాంతంలా

కదిలితే ఆగననే దుఃఖం తప్ప
ఎదంతా శూన్యమే ఇప్పుడు

చీకటిలో చప్పుడు లేని విస్పోటనాలు ఎన్నో
గొంతు దాటి రాని గరళం గుండెల్లో మంట రేపుతునే ఉంది

నే అడిగానని వచ్చావా
నే వద్దంటే వెనుతిరిగావా

హా.....వచ్చి
నాదని ఉన్న నా ఏకైక సొత్తు
మనశ్శాంతిని తీసుకుపోయావు

ఇక ఎదుట ఉన్నదంత పోరాటమే
నాతో నేను మాత్రమే మిగిలా మునుపటిలా

✍అరుణిమలు

Thursday, 3 January 2019

తాను నేను

నన్ను గెలుచుకున్న తీరు చూసి మనసెరిగి‌న వాడివి అనుకున్న..
గాజు బొమ్మ లాంటి మనసును కోరి జారవిడిచాక కానీ తెలియలేదు... ఆ మనసు వెనుక దాగిన కాఠిన్యం గురించి..

కంటికి‌ కనిపించేదంతా మాయే
ఏది నిజం
నీ అవసరం

ఏది అబద్ధం
నీ మాటలు

ఏది నమ్మకం
అతుకు పడని ముక్కలై మిగిలింది ఇప్పుడు

రెప్ప పాటులో మారిపోయే నటనలు
పలకరింపుల మాటున దాగిన కుయుక్తులు
నోటి మాటలన్ని నీటి మూటలని చెప్పిన అనుభవాలు..

నువ్వో గాయానివే..
గతం తవ్విన ప్రతీసారి
గతి తప్పిన నా అడగులకు ఋజువుగా జారిపోతుంటావు... కన్నీటి చుక్కవై

తాకాలని ఉన్న కూడా దాహం తీర్చని తడివని ఎక్కడ మళ్ళీ మరో మచ్చగా
నన్ను అంటుంది ఏమో అని భయం..

✍️అరుణిమలు

తాను నేను

అలసిన చూపులకు
నీ కలలే బలం

నీరసించిన మనసుకు
నీ రాకే అమృతం

దారులన్ని నీ రాకకై
ఎదురు చూస్తున్నాయి

దప్పికతో ఉన్నది మనసు
వాన చినుకువై నన్ను ముంచేయ్

మనసును మెలిపెట్టి మదించా
ఎందుకే నీకీ యాతన అని

మౌనమై ఉంటా సదా
నా పదాల మాటున అంటుంది

పరిధులు లేని ఊహల
లోకం ఊరిస్తుంది..

పరదాలు వేయలేని
నీ ఆలోచనల తీరంలో
ప్రతీ నిమిషాన్ని లెక్కిస్తున్న..

అక్షరాలలో ఆ లెక్క
నా పదాలన్ని..

ఓయ్......బాకీ పెంచుకోకు ఎక్కువ
మళ్ళీ మళ్ళీ జన్మకు కూడా వదల లేనంత

✍️అరుణిమలు

తాను నేను

భావాలేమో సున్నితం
మనసేమో మొద్దుబారి పోయింది...

ఆశలనేవి తెలియదు
కోరికలనే ఆరాటం లేదు
రేపటి వేపు దృష్టి లేదు
గడిచిన నిన్నటి కోసం చింత లేదు..

కాసిన్ని నవ్వులలో ఊపిరి పోసుకుని
కూసిన్ని కన్నీళ్ళను రెప్పకు అవతలే ఆపేసి

పెదవికి వైరాగ్యాన్ని నేర్పించి
తనువుకు తాపాన్ని రుచి చూపించకుండా

నమ్మకాన్ని వదిలేసి
అక్షరాల లోకంలో నన్ను నేను సరికొత్తగా చూసుకుంటూ
చిమ్మటి చీకటిలో ఎన్నో తర్పణలను చేస్తూ

మళ్ళీ మళ్ళీ పుడుతున్న
నా కోసం నేనే
నే గీసిన గిరిలో స్వేచ్ఛగ బతికేందుకు

కళ్ళ నిండా వెలుగులే
కనుపాపలో దాచిన చీకటి
ఆ కాటుక గీతకే తెలుసు

నేనో అందమైన అబద్దాన్ని
పువ్వును నేనే
ముల్లును నేనే

కదిలి పోతున్న కాలానికి మాత్రమే తెలిసిన నిజాన్ని
కన్నీటి చుక్కని నేనే
ఆనంద బాష్పాన్ని నేనే

✍అరుణిమలు

తాను నేను

ఎదుట లేవేమో కానీ ఎద నిండా నీవే కదా....ఎదురు చూసే క్షణాలకు తెలుసు యుగాల భారం ఎంత బరువుగా ఉందో...

అలసట లేని పయనం...
ఘడియలు గుండె చప్పుడతో లయ కడుతున్నాయి...

కాలం కవ్వింపులను కన్నెర్ర చేస్తూ
మనసు నిండిన నమ్మకంతో వేచి ఉన్న..

నీ తలపు పెదవి పై చిరునవ్వై
కుడి కంట జారే వెచ్చని బిందువుగా మారుతుంది..

నీతో గడిపే కూసంత కాలానికి
ఎన్ని యుగాల నిరీక్షణ కైనా సిద్దమేనోయ్...

నీతో ఉన్న ఆ కొద్ది సమయం నా ఎదకు ఆయువు పోస్తుంది..
మళ్ళీ నీతో గడిపే రోజు వరకు నన్ను నిలబట్టే బలమై మారుతుంది..

పరాయి సొత్తువేమో కదా
అతిధివే ఎప్పుడు ఇక్కడ

పరిచయం చేసిన కాలాన్ని నిందించనా
దాచుకున్న మనసును దండించనా

నా చేయి దాటిన మనసు
నా మాట వినను పొమ్మంది ఏనాడో..

అందుకేగా
అందుకోలేక
అజమాయిషీ చేయలేక

అందీ అందనంత దూరంలో
దిక్కుల నడుమ
పయనం ఎటో తెలియక
దిక్కులు చూస్తున్న

✍️అరుణిమలు

తాను నేను

ఒయ్యారాలు ఒలక పోస్తూ
వలపు కవ్వింపులా తాకే తెమ్మర లాంటిది కాదు
నా ప్రేమ...

నమ్మకానై నీ పక్కన ఉంటూ
ఇష్టాన్నై నీ చుట్టూ అల్లుకుంటూ
కోపాన్నై కసురుతూ
అల్లరినై నిన్ను ఆటపట్టిస్తూ ఉండేది..

క్షణాలను లెక్కలు కడుతూ
కళ్ళల్లో వెలుగు ఒత్తులను వెలిగించి
ఎదురు చూసే మనసును..

జాగ్రత్త అంటూ చెప్పే నా మాటకు అర్థం
మళ్ళీ నాకోసం నువ్వు ఎదురు వస్తావనే మాటను ఇమ్మని..

ఏ కళ్ళు నిన్ను తాక కూడదని
ఎవరి దృష్టిలో నువ్వు పడకూడదనే కుళ్ళు ఉంది..
ఏ మాయ నిన్ను మాయ చేసి నా నుండి దూరం చేస్తుందో అని...

నీ మాట మీద నమ్మకం ఉంది
ఈ వయసుల మీదే లేదు..

దేనినైనా నీ ముందు చూపించగలను కానీ
ఈ జలస్ ని చూపించలేనురా..

నా మాటలు విన్నాక
నువ్వు నవ్వే నవ్వు ఉంది చూడు
ఉఫ్్్్్...

వినలేనబ్బ...

✍అరుణిమలు

తాను నేను

ఒకరికొకరికి ఇవ్వగలిగేది ఏమన్నా ఉందంటే
అది సమయమే..

అవును...
కాస్త కాలాన్ని నాకోసం రాసి ఇచ్చేయ్ చాలు..

తీరిగ్గా తీరుబాటు అయ్యాక గుర్తుకు వచ్చే కాలక్షేపాన్ని మాత్రం చేయకు..

తీరిక చేసుకునే నీ సమయంలో నేనో భాగం కావాలి
అంతకు మించిన భాగ్యం ఏముంది..

నువ్వో అలవాటు కాకూడదు అని అనుకున్న
కానీ ఎప్పుడు వ్యసనానివి అయిపోయావో తెలియదు..

కొన్ని మౌనాలు,కొన్ని దూరాలు
మన మధ్య అల్లుకున్న అనుబంధాన్ని
ఎంత గట్టిదో చూపించింది..

కోరికలు ఏం లేవోయ్
ఏయ్ పిల్లో అనే పిలుపు ఈ చెవిన పడాలి

తీరిక చేసుకునే నీ తీరే నాకు తరగని బలం,బహుమానం..

✍అరుణిమలు

తాను నేను

నిశ్శబ్దంలో జరిగే యుద్ధాలు ఎన్నో
గెలిస్తే మౌనం ఓడిపోతుంది
ఓడితే మనసు గెలుస్తుంది

నా ఆలోచనలతో అంతర్యుద్ధం..
కాలానికి మాత్రమే తెలిసిన జవాబులు కోసం వెతుకులాట..

విచిత్రమైన జీవాలు
విచిత్ర వేషధారణలు

సుఖానికి అమ్ముడు పోయే దేహాలు..
మనసుకు మేకప్ వేసి మురిసే మాలిన్యం..
జీవితానికి పేకప్ చెప్పే పనులలో మునకలు..
బంధాల వెనుక కొందరు..
అనుబంధాలను తెంచుకుని కొందరు..

ఎన్నెన్నో అనుభవాలు చెబుతున్న
నడక చేతకాని నిర్ణయాలు..

ఎన్ని విచిత్రాలో నా చుట్టూర..
తప్పటడుగు వేయలేని వారు అంతర్యుద్ధాలు చేస్తారు..
తెగించిన వారు లోకంతో యుద్ధం చేస్తారు నేనే నిజం అంటూ..

నిశ్శబ్దం చెప్పే నిజాలను వినగలిగే దమ్ము ఉంటే..
నీ వేపు వేలెత్తే అవకాశం ఈ లోకంలో ఎవరికి ఉండదు..
ఆ దమ్ము లేని పిరికిపందకు మూర్ఖత్వమే ఆయుధం...

జవాబులు ఇవ్వడం కన్నా..
ప్రశ్నించుకోవడం నేర్చుకుంటే ఎవరికి నువ్వు జవాబుదారీగా నిలబడవు...

నిశ్శబ్దం చాలా చెబుతుంది
నిశ్శబ్దంగా వినగలిగితే..

✍అరుణిమలు

తాను నేను

బంధం ఉంటేనే బాధ్యత ఉంటుందా అంటే కాదేమో అనిపిస్తుంది...
ఏ అభిమానం ముడివేసిందో మన మధ్య ఈ అనుబంధాన్ని...

ఒక కోపం ఇంకొక కోపాన్ని ఊరడిస్తూ
ఒక అల్లరి ఇంకొక అల్లరిని ఆటపట్టిస్తూ

పెంకి తనాన్ని సైతం చిరునవ్వుతో చూస్తూ
అలకలను ఓపికగా అక్కున చేర్చుకుని ఊరడిస్తూ

గడుసుతనాన్ని గిచ్చి
స్వాభిమానాన్ని మెచ్చి
నేనెవరిని అని ప్రశ్నిస్తూ.. ??

అవును ఎవరి వోయ్ నువ్వు !?

ఇంత ఓపిక ఎక్కడ నుండి వచ్చింది రా..

మాటేమో మొరటాయే
చేతలేమో సవాలుకు సిద్దమాయే..

ఆడపిల్లననే భయాన్ని తుడిచేయమని
ఆడించే బొమ్మను కాదని హెచ్చరిస్తూ
నా పొగరుని పొగరుగా మెచ్చుకుంటావు చూడు

మొగలి పొదల్లో సువాసనలే
నీకు ఉదాహరణ
మొండి మనసులో మచ్చలేని మమత నీది

ఏ బంధం లేని బాధ్యత నీది
భరించేయడంలో
నేను నమ్మిన నాదనే నమ్మకాని నిలుపుకోవడంలో..!!

✍️అరుణిమలు

తాను నేను

పదిమందిలో ఆపలేని నీ ఙ్ఞాపకాలను
ఏకాంతంలో ఆపేది ఎలా..

కలవరించే కళ్ళను కట్టడి చేసేదెలా
ఎదురు చూపుల వలలో చిక్కిన నయనాలను సేద తీర్చేది ఎలా...

నా పెదవులలో చిక్కిన నీ తలపును
తగ్గమనేది ఎలా...
చుట్టూ ఎందరో కానీ ఈ ఏకాంతం ఇలా ఎలా అతుక్కు పోయింది..

అందరు నా వారే
కాని నువ్వెక్కడ అందులో
నిన్ను ఎవరిలో వెతకను లేను
నువ్వు లేని నా ఆలోచనలను కూడా ఊహించ లేను..

నా చూపులు నీ వెంట ఉంటే
నా ఆలోచనలు నీ చుట్టూ ఉంటాయి

నిన్నటిని దాచుకుని రేపటి వేపు అడుగు వేసే సాహసం నాది...
నేటిని ఙ్ఞాపకంగా మలచి రేపటికి ఊపిరి పోసే తెగువ నాదే..

ఈ నా ధైర్యానికి ఆయువు నీవే
నిన్ను నా నుండి వేరు చేయలేననే నిజం ఇచ్చిన నమ్మకం ఇదే...

✍️అరుణిమలు

తాను నేను

నువ్వు నన్ను ఎందులోను గెలవ లేవు లే
అనే నీ నవ్వులో నా గెలుపును చూస్తున్న....

నీ పెదవి పై చిరునవ్వుకు
కారణం నేనవ్వడం కన్నా గేలుపేముంది ఈ లోకంలో..

నీ నవ్వులో నేను దాగే
ఆ కొద్ది క్షణాల  కోసం ఎన్ని ఓటములు అయినా ఇష్టమే...

కావాలంటే...నిన్ను పందానికి పిలిచి మరీ పోరాడి ఓడిపోనా
నా పొగరు నీ నవ్వులో గర్వంగా వెలుగుతుంటే తనివి తీరా నిన్ను నా కళ్ళల్లో దాచేసుకోనా...

ఈ చిన్ని చిన్ని బహుమానాలే కదా నా సంపద, నా బలం...
ఇలాంటి ఙ్ఞాపకాల ఖజానా కోసం ఎన్ని యుద్దాలకైన నే సిద్దమేనోయ్...

✍️అరుణిమలు

తాను నేను

మనసు పెళ్ళికి భాజాలు దేనికి
మంత్రాలు ఎందుకు..

నాలుగు కళ్ళు సాక్షిగా
నాలుగు అడుగుల తోడులో
నవ్వులను అద్దుకున్న మత్తైదువుల లాంటి అధరాల ఎదురుగా
పంచభూతాలను ప్రేక్షకులను చేసి
రెండు మనసులు చదువుతున్న వేద మంత్రాలు సాక్షిగా
జరిగేది కూడా మనువే..

ఆత్మ సాక్షి ముందు చేసిన వాగ్ధానం ఇది
నేను చేసింది ఆత్మ నైవేద్యమే..

నీ పక్కన నే లేకపోయినా
నా పక్కన నీ చోటు ఖాళీ లేదెప్పుడు..

మనసును ఒకరికి
తనువును ఒకరికి
పంచుకోవడం తెలియదు కానీ

ఒక పేరుకు మనసా వాచ
అంకితం అవ్వడంలో ఉన్న అనుభవమే వేరు..

బతుకుని నీకు రాసిచ్చేసా
లాభనష్టాల లెక్కలు నాకెందుకు...
ఫలితంలో నువ్వెప్పుడు నా గర్వానివై కనిపిస్తున్నాక..

ఓయ్.....ఎవరికి చెందనిదే ఇది
నీకై మాత్రమే పుట్టింది ఈ ప్రాణం..

✍️అరుణిమలు

తాను నేను

ఎన్నెన్నో ఆలోచనలు
జరిగిన, జరుగుతున్న వాటికి మధ్యలో
అయోమయాలను సృష్టిస్తూ..

ఎలా మొదలయ్యిందో
తెలియని మన కథలో ఎన్నెన్ని మలుపులో..

ఎలా చెప్పాలో తెలియని
భావాలు ఎన్నో...
ఎందుకిలా తడబడుతున్నాయి అంటే ?
ఏవేవో ప్రశ్నలు నీ అడుగులు సందిస్తున్నాయి..

ఎన్ని సందేహాలను ఇస్తుందో ఈ కాలం
మన దగ్గరతనం లోకానికో సందేహం
మన దూరం మనకో పరీక్ష..

ఎలా ఉందామంటే
అలా ఉండనివ్వని మనసు
ఎలా ఉండకూడదంటే
అలాగే ఉండమనే లోకం..

విప్పి చెప్పడానికి ఏం లేదు కానీ
మదిలో వాదోపవాదాలు ఎన్నో..

నిన్ను గెలుచుకోవడానికి రాలేదు
నిన్ను గెలిపించుకోవాలనే తపనే నాది..

నిన్ను పొందాలనే కాంక్ష లేదు
నీలో నేననే ఒక చెదరని ఙ్ఞాపకాన్ని వదిలేయాలని కోరిక తప్ప..

నేను నీ దానినే ఎప్పటికి
నువ్వు మాత్రం నా భావానివే ఎన్నటికి...

ఏదో చెప్పాలని ఉందోయ్
కళ్ళ నిండిన గంగ సాక్షిగా
కానీ అభిమానం అడ్డుగా నిలబడింది..

✍️అరుణిమలు

తాను నేను

బిడి కౌగిట బంధీనై చెప్పాలనిపించే
మాట ఒకటే...
నీ పేరును పంచుకున్న ప్రాణం నాదని..

కాలం ఏ తీరానికి చేర్చిన
కలలు కల్లలైనా
కోరికలు కరిగిపోయిన
ఈ జీవి నీ పిలుపు లోనే జీవం పోసుకుంటుందని..

నమ్మకాల నీడలో
నిన్ను నింపేసుకున్నా ఏమో
నే తెంచేసుకోలేని నాలో ఒక భాగానివి నువ్వు..

కాలక్షేపానివి కావు
అవసరానివి అంతకన్నా కావు
ఇష్టాన్ని దాటేసిన
ప్రేమ గడప దాటని
ఆరాధనే నాది..

రాసేసా నా నుదుటి రాతను
నువ్వనే మనసుకు నేను అంకితం అని

నువ్వెంత అంటే చూపించలేను
నేనింత అని చెప్పలేను
మనమింతే అని చెప్పగలను

✍️అరుణిమలు

తాను నేను

ఎవరికి అలవాటు కాకు..
ఎవరికి అలవాటు పడకని..
కాలం ఎప్పటికప్పుడు నేర్పుతునే
ఉంటుంది...

మనమే నేర్చుకోము...
మనసు ఒంటరి తనాన్ని భరించలేకనే
మనిషికి ఈ తిప్పలు...

ఎప్పటికప్పుడు ఎదురయ్యే పరిక్షలు
దిద్దుబాటు లేని తప్పులు కొన్ని
జవాబు లేని ప్రశ్నలు ఎన్నో...

కొందరు ఏమౌతారో తెలియదు
కానీ తామే అన్ని అనిపిస్తారు..
కొన్ని కోరికలు నీటిలో నీడలని తెలియదు మనసుకు..

ఏం ఆటలే కాలమా
మనసుతో ఆడతావు
జీవితానికి ఫలితం ఇస్తావు..

ఎదురు చూసే చూపులకు ఫలితం ఉండదు
గడపకు ఇవతల తనువు ఉంది
గడపకు అవతల మనసు ఒంటరిగా మిగిలింది..

నలిగే ఆలోచనలలో
నవ్వుల పూతలు ఎన్నో
పెదవికి తెలియని పలుకులు
ఎదకు మాత్రమే తెలిసిన ఊసులు

ఎవరికి ఎవరో
ఊతమివ్వని ఆశలతో
ఒంటి నడక ఎక్కడికో..

✍️అరుణిమలు

తాను నేను

గోరువెచ్చని పొద్దులో
నీతో ఏకాంత ప్రయాణం ఉంది చూడు
😍😍😍

పెనవేసుకున్న మనసుల అలజడిలో
ప్రకృతి మురిసిపోతుంది

జంటగా ఏకమైన దేహాల నడుమ
మౌనంగా సాగుతున్న నిశ్శబ్ద యుద్ధాలు ఎన్నో..

నా బలానివేమో నువ్వు
ధైర్యం గుండెలలో నుండి నీతో కలిసి పడే అడుగులతో జత కట్టింది..

ఊసులకు సెలవిచ్చేసాం ఏమో
ఊపిరి సైతం ఏవేవో లిఖించేస్తుంది తనువు పై

మిడిసిపడకే కాలమా తొందరగా పరుగెత్తుతున్న అని
ఈ క్షణాలను నేను ఎప్పుడో బంధించేసా కదా

పెంకి దానినో, మొండి పిల్లనో
లాలనతో కట్టేసావుగా ఎటూ కదలనివ్వకుండ..

దా....నా గుండెల లోకి అని నువ్వు అంటుంటే
కళ్ళల్లో తడి, పెదవులకు ఈ మడి దేనికంటూ అంటుంది...

కసిరిన నోటి తోనే కవ్విస్తావు చూడు
పంతం అంతా ఏ కోన లోకో పోతుంది..

చాలు చాల్లే
మన మధ్య జగడాలకు
ఈ జత కూడే పదాలకు అలుపే లేదు..

✍️అరుణిమలు

తాను నేను

మనసులో ఒక తోడుతో
ఒంటరి అడుగులు ఎక్కడికో...

ఎన్నో ఆలోచనలను నింపుకున్న మది మాత్రం మౌనంగా ఉంది..
తుఫాను ముందు నిశ్శబ్దంలా..

వెంట నడవలేని ఇష్టం
చెబుతుంది వేసే అడుగు అడుగు ఎంత కష్టమో..

అలలు లేని తీరమా నవ్వకే అలా
నీలా నాకు స్పందన లేదేమో అని...

మింగేస్తున్న వెచ్చని చుక్కులు
గొంతు దాటుతు ఎదను కదిలిస్తున్నాయి..

శ్వాసలో నిండిన ఏ మనసో
సేద తీరుస్తుంది
నీ లోనే నే ఉన్న అనే అనుభూతిని ఇస్తూ..

గుండెల మీద ఆ మాత్రం బరువును కాలేనని
ప్రాణమై పోయి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావా..

గొంతు దాటని గాదేదో ఉంది
గుండెల్లో దాగుని ఉంది..

లోకమా నీకు అవసరమా
అడగకు, కదపకు,నవ్వకు..

వదిలేయ్ ఇలా..
నవ్వులను, కన్నీళ్ళను లెక్కలు వేయకు ఇక..

✍అరుణిమలు

తాను నేను

ఎటు నుండో నన్ను తాకిందో పిలుపు
ఎలా ఉన్నావని...

చెక్కిలిని తాకిన తన శ్వాస
అది ఊహ కాదని చెబుతుంది.

నిన్నటి వరకు నేను ఏమో
ఈరోజు నువ్వే నేనయ్యాను..

నా ఇష్టం ఏదని అంటే
నిన్నుగా నాకు పరిచయం చేసింది..

నా గర్వం ఎక్కడ అని అడిగితే
నీ చిరునవ్వులో మెరిసింది..

నా అభిమానం ఏదని వెతికితే
నువ్వు పిలిచే పిలుపులో దాగున్న అంది..

నా మనసెక్కడ అని పిలిచా
నీ ఎద సవ్వడి చెప్పింది ఇక్కడే అంటూ...

ఎలా ఉన్నానో ఇప్పుడు తెలిసిందా
నా క్షేమం నీ చేతుల లోనే ఉందోయ్..

నేనెవరినో కూడా తెలిసిందా
నీ విలువను నేను..

దాచుకుంటావో
దార విడిచేస్తావో
నీ ఇష్టం..

✍️అరుణిమలు

తాను నేను

కొన్ని క్షణాలను ఇచ్చేస్తావా నా కోసం
జీవితాన్ని తనివితీరా రుచి చూడటానికి..

కలిసి నడవలేని అడుగులు మనవి..
మనసులు మాత్రం తారమారు అయిపోయాయి ఎప్పుడో మనకు తెలియకుండానే..

కదిలి పోతున్న రాత్రులకు తెలుసు
నా కలల కౌగిలిలో నీకై కరిగి పోతున్న ఆలోచనలు..

అడగాలని ఉంది ఒకటి
కానీ..... ఎవరిని అడిగేది

జంట కాలేని వారిని
ఒకరికొకరు అనే అనుబంధంలో ఎందుకు ముడి వేసావని...

నవ్వులలో దాచుకున్న సంతోషాన్ని
కనులలో దాగిన దుఃఖాన్ని
మోసేది ఎన్నాళిలా..

నీకై పుట్టానని ఎద సవ్వడి చెబుతుంది అమాయకంగా..
దానికి ఎలా చెప్పేది నువ్వు ఎవరి తోడువో అని..

ఎందుకో ఈ పరిచయాలు
ఏ ఒడ్డుకు చేర్చని తుఫానులు పాలు చేయడానికేగా..

ఒక్కరిగా బతకడం సులువోయ్
ఎవరి కోసమో ఎదురు చూసే మనసుతో కలిసి బతకడం అంటే....

ఇలా అక్షరాలలో సాధ్యమే కానీ
వాస్తవానికి దానిని జీవితం అనరేమో..

✍️అరుణిమలు

తాను నేను

గుండెలో దాగిన ప్రేమ
గొంతు దాటనంటుంది కానీ
మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇస్తునే ఉంటా అంటుంది..

ఎందుకో...!!
ఆ ప్రేమ లేకపోతే ఊపిరాడదా
ఊసుపోదా ఈ పిచ్చి మనసుకు...

ఆకతాయి మనసు
నిన్ను చూస్తే ఆగలేదు మాట కలపకుండా..

కొంటె వయసుకు
ఎంత హుషారో నీతో జత కలవడానికి..

ఇదేం మాయ
నువ్వు చేసావో...నేనే సృష్టించుకున్నానో

విప్పి చెప్పలేనంత ఇష్టానికి
ఎన్ని పదాలని తీసుకొచ్చి పేర్చినా తరగడం లేదే..

మనసు పడే మదనాన్ని
ఈ మౌనంతో ఎంతవరకు చూపించగలనో..

గుండెలపై చేయి వేసుకో ఒకసారి
కళ్ళు మూసి
ఒక్క ప్రశ్న వేసుకో నేనెవరిని నీకు అని...

నీకై విరిసే నా నవ్వు
నీకై వస్తున్న ఈ కన్నీటి చుక్క
ఏం చెబుతుందో కూడా నీ ఎదనే అడుగు..

ఇంతకుమించి
చెప్పడానికి చేతకాదు..
దాచడానికి దాగేది కాదు..

కళ్ళ భాష ఎలాగూ రాదు
పదాలలో పరుషమే కానీ నే దిగమింగుతున్న దిగులు నీకు అర్థం కాదు..

ఓయ్....అనే పిలుపు గొంతులోనే ఆగిపోతుంది
పిలుపు కూడా నీ పలుకులకు ఉలిక్కి పడుతుంది ఇక్కడ..... ఇక ఏమని బదులిచ్చేది బండోడా..

✍️అరుణిమలు

తాను నేను

గుప్పెడు ఙ్ఞాపకాలు చాలవా
గుండెను ప్రేమగా లాలించడానికి..
శూన్యం కూడా వేరు చేయలేని
వెలుగు రేఖలు మన మనసులు..

దూరం కూడా ఇంత అందంగా ఉంటుందా !!
ఏమో...!!

నిన్ను వదిలి రానన్న మనసును
నీ దగ్గర వదిలేసి కదిలిపోయేది దేహమే కదా..
చీకటి మనసులో అలజడులు రేపే
మరో మజిలీవి నువ్వే అవుతావనుకోలేదు..

గడియ పడిన మనసు తలుపు తట్టేది
కోరికలతో కాదు !! ఎలా ఉన్నావో అనే ఆత్రుతతో..

ఎందుకో ఈ అలజడి
అక్కడ అలికిడి లేకపోతే..
మౌనాన్ని కూడా తెంచేయగల
బంధమేదో నీతో ముడి వేసుకుంది..

నే దగ్గర కాలేని దొరవు నువ్వు
నా నుండి దూరం కాలేని ఇష్టానివి నువ్వు..

పదిమందితో పంచుకోవడానికి
నా ఆకలి తీర్చే ఫలానివి కాదు..
నా శ్వాసలో నిండిన వాయువు నువ్వు..

అల్లంత దూరాన ఉన్న తారనే నేను
అవసరమైన రోజున నువ్వు పిలవకుండానే నీ పక్కన నిలవగల నమ్మకాన్ని కూడా..

ఉండిపోదాం ఇలా..
ఒకచోటున లేకున్న
ఒంటిగా లేక జంటగా
ఎలా ఉన్నామో తెలుసుకోవాలనే లోకానికి ఒక ప్రశ్నగా..!!

✍️అరుణిమలు

తాను నేను

నీ చేతిలో చేయి వేసి నడుస్తూ నువ్వు నా ధైర్యానివి అని చెప్పాలని ఉంటుంది..

నీ నీడలో ఆడుతు, నా తోడువు నువ్వని మరచిపోకంటు గుర్తు చేయాలని ఉంటుంది..

నీ మాటలలో నా మాటలను కలుపుతూ, నా పేరును నువ్వు పిలుస్తూ ఉంటే నీ బిడ్డనై పోవాలి అనిపిస్తుంది..

నీ ఒడిలో పడుకుని అల్లరి చేస్తూ నీ స్నేహాన్ని అవ్వాలి అని ఉంటుంది..

నీ గుండె లపై తలవాల్చి నా గుడిలో నేనో చిరుదివ్వెను అని మురిసిపోవాలి అనిపిస్తుంది..

నీ భుజానికి ఆనుకుని కూర్చుని ఈ ప్రపంచాన్ని నీతో కలిసి నీలా చూడాలని ఉంటుంది..

నే తలెత్తి చూసే నా గౌరవానివి నువ్వు, నా తల వొంచనివ్వవనే నమ్మకానివి నువ్వే..

వెనుక నుండి నిన్ను హత్తుకుని నీపై నా ఇష్టం ఎంతో నీకు స్పర్శగా మారి తెలియజేయాలి అని ఉంటుంది..

నీ నుదుటిపై ముద్దునై ముద్ర వేసి, క్షణ కాలంలో కరిగే సుఖానివి కావు నువ్వు నాకు...కలకాలం నా గుండెలో చెదరని రూపానివని నీకు చూపించాలని ఉంటుంది..

నీ నుండి నాకేం వద్దు
ఆశించడానికి నా అవసరానివి కావుగా
నాకు దొరికిన కానుకవు నువ్వు

దగ్గరవ్వాలని లేదు
దూరమవ్వాలని లేదు

కనిపించే చందమామలా
అందని జాబిలిలా నిలిచిపోతే చాలు

✍️అరుణిమలు

తాను నేను

మేఘసందేశం, హంస రాయబారాలు
అవసరమా అసలు...

అక్కడ ఆ మనసు తలంచితే
ఇక్కడ ఈ మనసు కదురు తప్పుతుంది కదా..

మనసును మించిన రాయబారం ఏముంది,
కళ్ళను మించిన లేఖలు ఏమున్నాయి..

చేతలను మించిన పదాలు ఏవి
నవ్వులను మించిన జవాబులు ఉన్నాయా..

ఏ దూరానికి బలముందోయ్ నా నుండి
నిన్ను వేరు చేయడానికి..
ఏ కోపానికి అంత తెగువ ఉంది నా కోరికను
కాల రాయడానికి..

ఏ అలకకు అంత శక్తి ఉంది నా ఆలోచనలలో
ఉన్న నిన్ను అణిచివేయడానికి..

ఎదురుగా ఉంటే పలకరింపువు...
ఎడబాటులో ఉంటే పలవరింతవు..

ఈ విషయం కాలానికి కూడా తెలిసిపోయింది ఏమో..
మీ మధ్యలో నన్ను లాగొద్దని తప్పించుకు పోతుంది..

జవాబులు మీరే
ప్రశ్నలు మీరే
బదులు నా దగ్గర లేదంటూ..

✍️అరుణిమలు

తాను నేను

నొప్పికి, బాధకి రూపానిచ్చేదే కన్నీరు...
నొప్పి కలిగితే నాకోసం వస్తుంది..
బాధ అనిపిస్తే నీకోసం వస్తుంది..

మొండి చేతులకు దండించడమే తెలుసేమో...
చెంపన ఉన్న వెచ్చని చుక్కని తాకడం కష్టమే లే..

నాకోసం ఏనాడు రాని కన్నీరు నీకోసం ఆగనంటుంది..
ఎంత అలుసో దానికి నేనంటే..

కళ్ళల్లో దాచుకున్న నిన్ను ఆ బాధతో పాటే జారవిడిచేయాలని అనుకున్న..
తోడుతున్న కొద్ది గంగ వస్తునే ఉంది కానీ నీ జాడ ఏది...

ఊట బావికే ఊపిరివా నువ్వు
ఇక నిన్ను కదిలించేది ఎలా..

నిన్ను వదిలి పోవాలని వెనుతిరిగాను కానీ...
ఆలోచన ఒక అడుగు ముందుకు వేస్తే,
మనసు ఒకడుగు వెనుకకు లాగేస్తూ ఆఖరుకు ఉన్నచోటనే ఉండిపోయా ఇలా..

నాలో నిన్ను దాచేసుకున్నానో,
నీలో నన్ను పారేసుకున్నానో కానీ
నాకు నిన్ను వదిలే శక్తి లేకుండా పోయింది..

✍️అరుణిమలు

తాను నేను

వెన్నెలలా తాకుతున్న చూపులు
తేలుతున్న ఊహలను పట్టి ఆపాయి

కోతకు వచ్చిన కోరికలా
కొత్త కోక రంగుల అద్దకాన్ని అద్దుకుంది

చందమామ చుట్టూ వెన్నెల గూడు కట్టినట్టు
నా చుట్టూ పెనవేసుకున్న నీ ఇష్టం

అల్లరి ఏదో చేస్తుంది
కాదు..చెబుతుంది సరికొత్త కిటుకులను

ఈ ప్రేమ..
ఒక ప్రయోగశాలగా మారింది ఇప్పుడు

ఉరికే జలపాతమై కదిలి
స్వేదమై ఆవిర్భవిస్తుంది తుదకు

నిప్పుల కొలిమిలో కాలుతున్నాం
ఒకరిని ఒకరు తీర్చిదిద్దుతూ..

ప్రణయమో, ప్రయోగమో
పక్వానికి చెరో అడుగై కలిసి జయిద్దాం..

✍అరుణిమలు