Monday, 21 September 2020

తాను నేను

తనివి తీరదోయ్
నీతో నే గడిపే కాలానికి..

నీ మాటలకి
నీ ఆలోచనలకు‌ తనివి తీరదుగా..

నీ జ్ఞాపకాల ఆయుష్షు నూరేళ్ళు ఏమో
నీతో నా అడుగుల తోడు జన్మలనే దాటేసింది..

తనువు తెల్లారే వరకు
నీకై నిరీక్షణకు తనివి తీరదు..

మన మధ్య దూరాలలో
తరగని దారులలో
నా నడకలకు తనివి తీరదే..

నీకై రాసే అక్షరాలలో
నీ భావాలలో నా పదానికి తనివి తీరదుగా..

తనివి తీరనంతగా మదిని తడిమేసావు
తనువులు కలవని బంధానికి నేనో బానిసత్వం చేస్తున్నా తనివి తీరడం లేదు..

ఎన్నాళ్ళో‌ ఈ దాహం
నా దేహాన్ని దహించే వరకు..

✍️అరుణిమలు

Tuesday, 15 September 2020

తాను నేను

చేతి గీతలు కలిసాయి
చేతి రాతలు కలవలేదు ఏమో..

ఒకటవ్వ లేని మనం
ఒకటైన నువ్వు, నేను..

ఏకాంతంలో
మన మౌనాలు మాట్లాడు కుంటున్నాయి..

మాటలకు దూరంగా
మనసుకు దగ్గరగా హత్తుకుని ఉన్నాం..

ఒకరికొకరు ఎదురైతే ప్రమాదం
దూరమైతే విచారం..

కలిసి విడిపోయే అలవు నువ్వు
కోతలను కూడా వరమనుకునే తీరాన్ని నేను..

✍️అరుణిమలు

Tuesday, 8 September 2020

తాను నేను

నీ ఆలోచనల మహత్తు ఏమో
నా చుట్టూ నీ ధ్యాసే 
నీ చుట్టూ నా ఊహలే..

వినిపించని పిలుపు విన్నట్టు
కనిపించని రూపం కదిలినట్టు

నీ ఊపిరి నన్ను తాకినట్టు
నీ చూపులు నన్ను చుట్టేసినట్టు

నీ నవ్వులు నన్ను గిచ్చినట్టు
నీ పెదవులు నా చెంపను హత్తుకున్నట్టు

నీ చేతలు రాసే లేఖలు
నీ చేతుల్లో చిక్కిన మేను

నీ తీపి గాయాల తుఫానులో
నన్ను ఏ తీరం చేర్చేవో కదా

✍️అరుణిమలు

తాను నేను

నా అరచేత చందమామవి కదా
నా చేతి గీతలలో నీ పేరు రాసి ఉందేమో..

పండిన గోరింట చూసుకున్న ప్రతీసారి
ఆ ఎరుపులో ఏదో మెరుపులా కనిపించే రూపానివి..

నిజంగా...
నన్ను నువ్వు ఎక్కువ ప్రేమిస్తావ
అని నవ్వుకునే నవ్వులు..

ఈ రంగులలో మన ఊహలు
కదలాడుతుంటే..
నా కళ్ళల్లో మెరుపులు, పెదవుల్లో సిగ్గులు దాచేదెలా...

ఏ అమావాస్యకు అందకుండా
నిన్ను అరచేతిలో దాచేసుకోవాలనే చిలిపి ఆశ..

రేపటిని ఆ రంగుల్లో చూసుకుని
నా చందమామని ముద్దిచ్చి మురిసే కళ్ళల్లో
కొలువయ్యేది నువ్వేనా...

జాడ తెలియని దారి వైపు చూస్తూ
పేరు తెలియని నిన్ను మౌనంగా
తలంచుకుందోయ్ ఓ తారక...

✍️అరుణిమలు

Sunday, 6 September 2020

తాను నేను

మనసే లేని మనిషికి మనసులో చోటు ఇచ్చాక
గాయాలు కాకుండా ఉంటాయ..

తనువంతా గాయాలే
మనసంతా విలయాలే

నవ్వే నా కళ్ళల్లో
నీటి చెలమలే నువ్వు మిగిల్చిన ఙ్ఞాపకాలు..

మనువాడిన మనసు మోడుగా మిగిలింది
మనసంతా చీకటి నిండింది..

అక్షరం మీద శ్రద్ధ లేదు
భావం‌‌లో‌ అనుభూతి లేదు..

అనుభవాలు అంధకారంలో నిలబెట్టాయి
ప్రశ్నలను శరాలుగా వదులుతూ..

ఎవరిని నిందించలేను..
ఆయుధానికి తెగ నరకడమే వచ్చు కానీ 
ఆదరించడం తెలియదుగా..

ఆయుధాన్ని వరించి
గాయాలు కాకూడదంటే ఎలా...

తెలియక వరించినా
తెలిసాక భరించాక
బాధ వద్దంటే ఎలా..

చీకటిని పలకరించే నీ ఙ్ఞాపకాలు
నీ ఆలోచనలను పలకరించే కన్నీటి చుక్కలు..

ఇవే నువ్వు మిగిల్చిన ఆనవాళ్ళు నాలో
బతుకంతా బాధ్యతగా మోస్తాలే వీటిని..

నిన్ను మరచిపోయే రోజు వరకు..
నీ తలపు కూడా నన్ను తట్టి లేపని చివరి గడియల వరకు..

✍️అరుణిమలు

Wednesday, 2 September 2020

తాను నేను

అచ్చు కానీ భావాలు
అక్షరాలుగా మారని జ్ఞాపకాలు ఎన్నో..

తనతో తాను 
మౌనంగా పెదవులు పలికే ఊసులు..

పదాలుగా మారి
మనసును ఊరడిస్తాయి..

ఒక్కోసారి అక్షరాలు కూడా అలసిపోతాయి
ఎదలో చెక్కిన గాయాన్ని రచించ లేక..

మరచి పొమ్మని మస్తిష్కం అంటుంటే
మరచిపోలేనని మతి చేసే మారాన్ని..

బాధని భరించలేని నిస్సహాయత
మరోసారి గుండెల్లో గాయపు రాతని కదిలించలేను అంటుంది..

నాతో నేను మాట్లాడకూడదు
నన్ను నేను ఓదార్చకూడదు
నన్ను నేను మరచిపోవాలి

ముఖ్యంగా ...
నువ్వు చేసిన గాయాన్ని నీ కళ్ళ బడనివ్వకూడదు

అందుకే... అక్షరాలు కూడా ఆశ్రయం ఇవ్వనంటున్నాయి నా భావాలకు...

నీ తలపో చిరునవ్వులా మిగిలిపోవాలని వరమడిగా
నొప్పిగా మిగిలిపోవాలి అనుకున్నావేమో..

ప్రతీక్షణం నన్ను కదిలిస్తూ
కాల్చేస్తూ
శాపంగా మిగిలావు..

✍️అరుణిమలు

మది మథనం

కావాలి అనుకున్న వారి కోసం కారణాలను వదిలేస్తాం.... కానీ అకారణంగా ఎంతకాలం బాధ పడుతుంది మనసు...

ఒకరోజు వస్తుంది 
ఆ బాధకు అసలు కారణాన్ని వదిలేయడానికి...

ఆ రోజు ఏ కారణం
తన అడుగులకు అడ్డుపడదు ఆగమని..