Saturday, 8 May 2021

తాను నేను

నువ్వు నాకొద్దంటు
మనిషిగా నిన్ను వదిలిపోయా
కానీ మానసికంగా ఇంకా అక్కడే ఆగిపోయా

నేను తెంచుకోలేని బంధానివి నువ్వు
నాలో దాచుకున్న ఆశవు నువ్వు

మనంగా ఉండాలి అంటే
నన్ను నేను ఏమార్చుకుని
నిన్ను మెప్పించేందుకు నటించాలి..

నటించే చోట ఉండేవి బంధాలు కావు
బంధీఖానాలు అవి..

ఏనాడైనా నీ జ్ఞాపకాలను నేను కదిలించితే
నువ్వు వెనక్కి తిరిగి చూస్తే
నేను ఇంకా అక్కడే కనపడతా...

నేను ఆగిపోలేదు, ఆగిపోను అని నిన్ను నమ్మించాలనే...

మనసు గొంతు నొక్కేసి
నా అక్షరాల దారిని మార్చుకుని కదులుతున్న..

ఆవేదన అంతరంగంలో ఎగసి పడుతున్న
అలలా మళ్ళీ మళ్ళీ పడి లేస్తున్న...

నేను ఆగిపోయాను
కానీ ఇంకా నువ్వే కావాలి అని కాదు
నిన్ను వదులుకుని కదలడం తెలియక..

ఆగిపోయాను
ఆకలి, దప్పికలు మరచి..

ఆవేదన నిండిన మనసు గతిని 
నీకు విన్నవించాలని కూడా కాదు

శిక్ష అనుభవించేయాలని..
ఆయుధాన్ని వరిస్తే
వేటు వేస్తుంది, గాయాన్నే చేస్తుంది కదా..

✍️అరుణిమలు

Thursday, 6 May 2021

తాను నేను

కథలో రాకుమారుడివి అనుకున్న
కాదు నా కల్పనలో ఒక ఊహవి మాత్రమే నువ్వు

నేను మెచ్చిన వ్యక్తిత్వాన్ని
నీ రూపంగా మలుచుకున్న

అందుకునేమో నీకు నా దృష్టిలో
నాకన్నా ఎక్కువ చోటిచ్చా

వాస్తవానికి నువ్వేంటో తెలిసినా
నేను నిన్ను నా అక్షరాలలో రచించిన తీరు వేరు

నిజమే... నిన్ను నిన్నుగా
స్వీకరించాలని అనుకుని ఓడిపోయా..

నీతో కొన్ని జ్ఞాపకాలని వెనకేసుకుందామని
నీ వెంట పడిన ప్రతీసారీ
నువ్వేంటో నువ్వు చెబుతానే ఉన్నావు..

కానుకలు ఏమడిగా
కాసంత విలువ
కూసంత కాలం..

అవి కూడా ఇవ్వలేని పేద వాడివి
అవును... నిజమేగా..

నా ఊహలు వాస్తవాలు కావని తెలిసినా
వలపుని చంపుకోలేక పోయా

ఏదో రోజు అర్థం చేసుకుంటావు
ప్రేమంటే ఏంటో అని ఎదురు చూసా

నువ్వు కల్పనివి కదా
నీ నుండి ఆశించడం
నీడని నిజమనుకోవడం ఒకటే..

✍️అరుణిమలు

Tuesday, 4 May 2021

తాను నేను

నీ అధరాల లిపిలో 
ఏ బ్రహ్మ రహస్యాలు ఉన్నాయో...

నీ మునివేళ్ళు విప్పే చిక్కు ముడులలో 
ఎన్ని అనురాగాల చేష్టలు దాగున్నాయో...

✍️అరుణిమలు

తాను నేను

నీ ఆలోచనలు నుండి
నన్ను నేను దూరం చేసుకోవడానికి
నేను చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో..

ఏ దారిలో సాగిన
ఏ పనిలో మునిగిన..

క్షణ కాలం తీరిక 
నా మనసుకు దొరికినా..

ఈ కళ్ళల్లో నీళ్ళు
నా మనసులో నీ దిగులు
నన్ను పలకరిస్తునే ఉన్నాయి..

నీ నుండి దూరం కాగలిగిన
నీ ఆలోచనలు నుండి కాలేనేమో అనిపిస్తుంది..

ఎలా నీ తలపులతో
నేను సాగేది చెప్పవా..

పిలవని చుట్టానిలా వచ్చావు
ఊహించని మలుపులో వదిలి మాయమయ్యావు..

మనసు మీద కొడితే
మనసు చచ్చిపోవాలి మనిషిని మరచిపోవాలి 
ఇలా మధ్యస్థంగా కొడితే ఎలా..

✍️అరుణిమలు

తాను నేను

కొన్ని రాత్రులు 
శాపాలై వెంటాడుతాయి..

లోకమంతా నిదురిస్తే
కొన్ని మనసులు మేల్కొని ఉంటాయి..

కటిక చీకటిలో అంతర్యుద్ధం
గాయాలను గుచ్చి గుచ్చి లేపుతుంది..

గతం మిగిల్చిన ఆనవాళ్ళు
మనసును చీల్చి ఛిద్రం చేస్తుంటే..

బాధతో బిగ్గరగా అరవాలి 
అనుకున్న స్వరం..

చీకటిని చూసి
హత్తుకుని ఏడ్చింది..

ప్రతీ రాత్రి ఓదార్చుతునే ఉంది
కానీ కన్నీరు ఇంకిపోలేదు ఇంకా..

పగటి వేషం నవ్వులలో
రాత్రి వేషం నిర్వేదంలో
గడిచిపోతుంది కాలం..

✍️అరుణిమలు