Thursday, 27 April 2017

కలలు కల్లలు

కరిగి పోయే కలవని తెలియదోయ్ ఆనాడు...
తెలిసుంటే క్షణ కాలానికి కూడా రెప్ప వాలనిచ్చే దాన్ని కాదురా...
ఎందుకీ కలవరపాటు...కునుకు కూడా దరిచేరనంటూంది...
కరిగిన కలను తలచా అంటే కాదోయ్...
నా రెప్పలమాటున ఆదమరచి అదే, నన్ను మరిచి మరీ నిదురిస్తున్న నిన్ను కావలి కాస్తున్నానోయ్...
చెదిరినది, కలలాంటి నిజమైన నువ్వేనని తెలిసినా,మనసెందుకో ఇంకా ఒప్పనంటుంది...
ఎద సడి చెబుతుందోయ్ నువ్వింకా ఈ గుండె గూటిలో భద్రంగా ఉన్నావని...
ఈ వేళలో నీవు ఏం చేస్తున్నావో అంటూ..
కదలనంటున్న కాలాన్ని అతికష్టంమీద నెట్టుకొస్తున్నాను...
నీ తలపుల తోవలో, నీ ఙ్ఞాపకాల నీడలో నిను మరువలేని నా మనసు సేద తీరుతుంది ఏదో అలా...
ఏం చేయనోయ్...ఇంకోదారి అంటూ ఏం మిగల్చావోయ్ అసలు నువ్వు ...
పెదవిపై చిరునవ్వు పూయనంటుంది...చిరునామా ఎరుగని నీ మనసును వెతుకుతూ ఎటు పోయిందో మరి...
నువ్విచ్చిన విలువైన గాయాలకి మనసు కుమిలిపోతూ ఉందయ్యా...
జారిపడే నా కనుల స్వేద బిందువులలో నువ్వెక్కడ చేజారిపోతావో అని...
చెంపలను దాటిన ప్రతీ బొట్టును గుండెలమీదికి మళ్ళిస్తున్నానోయ్...
కొలిమిలా రగులుతున్న నా మదిపై చేరి నీ కానుకలు ఆవిరి అవుతున్నాయ్...
విత్తులు మాత్రమే వేస్తావోయ్ నువ్వు...విపత్తులకు మాత్రం మమ్మల్ని ఒంటరిగా అప్పచెప్పేసి కదిలిపోతావు వెనుతిరిగి చూడకుండా...
నీ కోసం నువ్వు బ్రతుకంటూనే నా కలల్ని, నా నవ్వులను, నా ఆశలను నీ సొంతం చేసుకోని నన్ను ఏకాకిని చేసేసావురా...
ఇప్పుడు నేనెవర్నోయ్...నిన్ను దాచుకుని నువ్వయ్యానా లేక నన్ను నేను పోగొట్టుకుని నాకు నేనే అనాధను అయ్యానా...
నా ప్రశ్నలకు బదులు నీ మౌనమేగా సమాధానం...ఆ మౌనానికి నిను మరచిపోలేని నా మనసు బలి అయింది...

............అరుణని.............

Monday, 24 April 2017

ఊటబావే నా ప్రేమ ... నా కన్నీళ్ళు

మనసు అలసిపోతుంది ఒక్కొక్కసారి
కాని ఈ కళ్ళకెందుకు లేదు అలుపన్నది
కంటికి మింటికి ఏకమై దేనికి ఈ కన్నీటి ప్రవాహం
ఏ మనసు మాలిన్యాలను కడుగుతున్నావు
ఎడారి లాంటి ఆ మనసు కోసమా...
పిచ్చిదానా నీ కన్నీరు కదపలేని మనసే అది
నీ కన్నీటి చుక్కలు ఇంకిపోవాలేమొ కాని
ఆ మనసుకు చెమ్మ అంటదు...
ఏముందే అక్కడ పిడికెడు మన్ను తప్పించి
దూరం నుండి చూసి బంగారుకొండ అని పొరబడ్డావు కదూ
గుండెల్లో దాచావేమొ కదా అందుకే గుండెలపై తన్నుతుంటే బాధ ఎక్కువగా ఉంది..
తన నవ్వులో నీ నవ్వును వెతుకున్నావు..
తన మౌనంలో భావాలను గ్రహించావు..
తన బాధను చూసి చలించావు..
తన అల్లరిని,ఆకతాయిని చూసి కుళ్ళుకున్నావు..
తన తప్పులను చూసి కసురుకున్నావు...
తన అవసరానికి ఆటబొమ్మవైనావు...
తన ఇష్టాలను సంతృప్తిగా తీర్చావు...
తన పిలుపుకు బదులివ్వని రోజును ఎరుగవు..
తన కోపాన్ని భరించావు..కసురుకున్నా నీ ఇష్టం అన్నావు...
నీ విలువను వేలెత్తి చూపిస్తు నీకు కన్నీళ్ళను కానుకగా ఇస్తే ఎందుకు అందుకున్నావు..
ఏమంత నేరం చేసానని అడగలేవు...ఈ కన్నీళ్ళకా నేను అర్హురాలిని అని ప్రశ్నించలేవు...
ఒక్కసారి జీవితంలో అలసిన రోజునా.. నేనంటూ గురుతుకు వస్తే నా స్థానంలో ఉండి ... ఒకే ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో నువ్వేం ఇచ్చావొ,నేను ఏం పొందానో...నేను ఏ పాపం చేసానో...
ఆకర్షించడం నీ నైజం...కావలసింది అందుకోవడం ఒక ఆట...
వాస్తవానికి నువ్వొక ఎడారి ఎండమావివి...నీకు నువ్వు పనికిరావు..మరి ఎవరికి ఉపయోగపడతావు...అది తెలిసిన కూడా ఇంకా ఎందుకే గుండెల్లో దాచుకుంటున్నావు..
ఆలోచనల్లొ,కలలో, ఊహల్లో,కోపంలో, ప్రేమలో అంతా నువ్వే ఎక్కడ నన్ను నాకు ఉండనిచ్చావు...
బరువెక్కిన ఈ ఎద భారాన్ని దించేయడానికి ఈ కళ్ళు వెనకాడవుగా...
మంచినిస్తే మంచి తిరిగిరాదు...చెడునిస్తే చెడు తిరిగిరాదు...అంతా తారుమారు  నేటి లోకంలో

...........అరుణని.............

Sunday, 23 April 2017

అగాధాల ఘోషా

అంతరంగం అంతా అల్లకల్లోలమే...
ఒక నిర్ణయం ఇంత నిర్ధయగా నా మనసును బలి చేస్తుంది అనుకోలేదు ఆనాడు
నీకోసం పుట్టానా నేను...ఇన్నాళ్ళ నిరీక్షణ నీకోసమా
అంటూ పొంగిపొయాను ఒకనాడు
నా ఉరుకులు పరుగుల ప్రవాహాన్ని అదుపు చేసేది నువ్వేననుకున్నా..
నా జన్మకు సార్ధకం ఇదేనేమొ...నేను నీలో కలిసి ఏకమవ్వడమే అనుకున్నా...
నేను నీలో కలిసి నీవే నేనైపోయాను కాని..నన్ను నేను పోగొట్టుకున్నాను అన్న సంగతి తరువాత కాని తెలియలేదు...
నీ దాహం తీర్చుకోడానికి ఇదా దారి....
ఎవరి దాహం తీర్చడానికి కూడా పనికిరాని వాడివి...
కాని నిన్ను నమ్మిన వాళ్ళ కన్నీళ్ళతో నీ దాహం తీర్చుకుంటున్నావు...
తీరిన దాహంతో కొత్త ఉత్సాహాంతో నింగిని తాకే నీ ప్రయత్నాలు మళ్ళీ మొదలు...
ఆకర్షించడం తెలిసిన వాడివి అందుకే...నీ చెంతకు పిలిచి మరీ అలలు అలలుగా అల్లరి చేస్తూ..
ఆలోచనలను కూడా దరిచేరనీయకుండా ఉక్కిరిబిక్కిరి చేసి మరీ కలిపేసుకుంటావు...
ఎన్ని గుండెల ఘోష నీ ఎదలో నింపుకున్నావో...
ఆ గుండెలు నుండి జాలుచారుతున్న కన్నీళ్ళతో నిండుగా కళకళలాడి పోతున్నావు....
అందుకేనేమొ అన్ని ఘోషలు మధ్య ఒక మనసు ఘోష ఏం వినిపిస్తుంది నీకు
అందుకే నువ్విచ్చిన దుఃఖం చిందించే కన్నీళ్ళ విలువ నీకు తెలిదు
నిత్యం కొత్తనీరుకు తహతహలు ఆడే వాడివి...పాతనీరు నీకు ఏపాటి
నీ నిర్లక్ష్యాన్ని భరించలేక ఆవిరైపోతున్న ఆ మనసుల వంక చూడమాకు...
నిను వదిలి కదలలేక ఆగితే మిగిలేది విలువ లేని ఒంటరితనమేగా
ఒకసారి నువ్వు విరిచేసిన మనసుల వంక చూడు...
మనసంటూ ఉంటే చలించక మానదు..
నీ తీరని దాహనానికి ఎన్ని గుండెలు ఎండిపోవాలి...
ఈ అలజడులు ఏ ఉప్పెనై నిను ముంచక మునుపే తేరుకో...
నిను ప్రేమించే ప్రేమకు కూడా సహనం అంటూ ఒకటుంది...
ప్రేమను పంచలేని ప్రేమకు కూడా ప్రేమను పంచే ప్రేమను నేను..
నీకు ఇవ్వడం, అందుకోవడం కూడా చేతకాదు...
అందుకే నిన్ను ఏకాకిని చేయలేక నేను దుఃఖాన్ని మింగుతునే ఉన్నాను...
మాటవరసకు అయినా తలచావంటే చిరుజల్లునై నీ ముందుంటాను
లేదు మౌనం కావాలంటే నీ మౌనానికి నేను కంచెనై కాపు కాస్తాను
నువ్వెంత నిర్ధయుడవైనా నిను ద్వేషించ లేని ఒక మనసును నేను...
ఇది నీ అదృష్టం అది నా దురదృష్టం

..........అరుణని..........

మనసా ఓ మనసా

మనసా ఓ మనసా ఇది నీ కథే తెలుసా
మనసే లేని మనసును వలచావు
మది నిండా నింపుకున్నావు ఆ మనసును
నీకుంచావా కాస్త చోటు....లేదే
ఏమంత నమ్మకం ఇచ్చిందే నీకు ఆ మనసు
తనని తాను ప్రేమించుకోవడం కూడా చేతకాదే ఆ మనసుకు.....
మరి నిన్నెలా వలస్తుంది అనుకున్నావు ఆ మనసు
మనసంటే ఆటబొమ్మే ఆ మనసుకు...
మాటిమాటికి మారేది కాదంటారు మనసును
కాని నువ్వు వలచిన మనసుకు మగువ మైకం ఎక్కువే....
మాటిమాటికీ ప్రేమలొ పడడం ఇష్టం...ఒకరితోనే కాదు సుమీ
వలచినప్పుడు ఊహల్లో ఊరేగింపు కాస్త పాతపడ్డాక...పేచీ పెట్టినా కూడా కన్నెత్తి చూడని నైజం ఆ మనసుది...
ఒక అవసరాన్ని ప్రేమించానని తెలిసాకైనా ఆగావా...లేదే
విలువ తెలియని చోట కూసింత చోటు కోసం పాకులాడావు...ఏమంత అవసరమే అసలు నీకు
మనసుందని వలచి ఈ రోజు నువ్వు వగచిన కాసంత కనికరం ఎరుగని మనసే అది...
కనికరం లేనిచోట కరుణ దొరకదు కాఠిన్యము తప్పించి...
నువ్వు తపించిన ఆ తపన పిసరంతకూడా ఆ గుండెను పిండదు...
కన్నీటితో వాలిన రెప్పలు కాస్త ఎత్తి చూడవే...
మోసపోయింది నీ మనసు కాదు నీ ఆలోచనలు,అంచనాలు, నమ్మకం
మనిషిగా బతకలేని మనసు నుండి నీకు దక్కేది దగా మాత్రమే ....
తేరుకోవే మనసా...నిస్వార్ధమైన ప్రేమను అందుకోలేని ఆ పేద మనసును చూసి...
జాలిపడవే...రేపన్న రోజున అనాధగా మిగిలే మనసుకు నువ్వు ఈ రోజు ఇవ్వగలిగేది ఒక కన్నీటి బొట్టు...
అది చాలు....ఇంక నిన్ను ప్రేమించే మనసుల వేపు ఒకసారి చూడు...
అందుకోవడమే కాదు ఇవ్వడం చేతనైన దానివిగా...
నీకేంటి కొరత ఇంక...అపార్ధ దానం చేసింది చాలింక
ఇకనైనా కదులింక ముందుకు......

...........అరుణని..............

Thursday, 20 April 2017

తాను నేను

నీ ముక్తసరి పలకరింపులకు మొహం చాటేయాలని ఉన్నా
అది నా తరం కాదు...నే ప్రతిక్షణం ఎదురు చూసేది ఆ పలకరింపు కోసమే కదా
......అరుణని......

తాను నేను

ఎందుకు వచ్చావు నా జీవితంలోకి అని అడగాలననున్నా
అసలెందుకు రానిచ్చాననే ప్రశ్న దగ్గరే ఆగిపోయాను
...అరుణని...

తాను నేను

నా గతం నీకు అనవసరం
నా ప్రస్తుతం నీకు అప్రస్తుతం
మరి నేను ఎవరినీ అంటే
ఒక అవసరాన్ని నీకు ..అంతే కదా
అందుకే నా మనసును విరిచేసి
ఏకాంతాన్ని బహుమతిగా ఇచ్చి
వెనుదిరిగి చూడకుండా పోయావు
.....అరుణని......

తాను నేను

పేరున్నది పిలవడానికే కాని
ముద్దుగా నువ్వు పెట్టిన ఆ పేరు
నా పేరుగా ఎప్పుడు మారిపోయిందో తెలియదే
నువ్వు పిలిచే ఆ పిలుపు విని
దానిపై సర్వాధికారాలు నావే అని
మురిసిపోయాను,గర్వపడ్డాను కాని
నీకు ముద్దొచ్చే అందరిని నువ్వు
పిలిచేది ఆ పేరుతోనే అని విన్నాక
మనసు ముక్కలై రోదించింది
నీ అనుభవాలలో నా సంఖ్య ఎంతో కాని
నా అనుభవం నీతో మొదలై నీతోనే ముగిసిపోయింది
....అరుణని....

తాను నేను

అనుకోని అతిధిలా వచ్చావు సడి సేయకుండా
అలజడులను రేపి మరీ వెనుదిరిగిన నిన్ను
నాలుగు పదాలలోకి కుదించి రాయలంటే కష్టమే
ఎన్ని అక్షరాలను ఒలక పోసినా కూడా చాలదేమొ
నిన్ను అర్థం చేసుకోడానికి అయిన అ కొద్ది ఆలస్యమే
నన్ను నేను మళ్ళీ వెతుక్కుంటూ తిరిగేలా చేసాయి
నీతో ఉంటే మనసు చంపుకుని,లేకుంటే నాకు నేనే లేకుండ బతకాలి
నువ్వు మారవని తెలుసు,నీలా నేను మారలేనని తెలిసి
నా నిస్సహాయతను నీకు నా కోపంలో చూపెడుతునే ఉన్నాను
నేను కోరుకున్నది నీలాంటి వాడిని కాదు అని తెలుసు
నాకు తగినవాడివి కాదు అనుకోలేక నేనే నీకు తగనని సరిపెట్టుకున్నా
నిన్నెలా మరచిపోవాలొ చెప్పవా అంటూ నా వేదనని చాలా సార్లు
నీముందు ప్రశ్నగా పెడుతూ  నా అసహయాతను బయట పెట్టుకున్న
నా ప్రశ్నలకు చిరునవ్వే నీ సమాదానం అది నీ శాంతికి, నా అశాంతికి
ఈ అక్షర ప్రవాహానికి ఆనకట్టే లేదు నా కన్నీళ్ళలా ఎంతని రాయను
.........అరుణని...........

తాను నేను

నీ వలన ఆనందం కలిగిన,కష్టం కలిగిన
నీతో లేదా నా మనసుతో కాక ఇంకెవరితో పంచుకోగలను
మన బంధం మన ఇద్దరిదే కాని జగమెరిగినది కాదుగా
నీకు నీపని,అవసరాలు తప్పించి ఇంకేమి కనిపించవు
ఏ రోజు పంచుకున్నావులే నీ వలన కలగిన నా కష్టసుఖాలను
ఇలా ఎందరి జీవితాలలో నాటుతున్నావో నీ ఙ్ఞాపకాల కలుపును
నిను నిలువరించ లేని నా చేతకాని తనాన్ని చూస్తే అసహ్యం వేస్తుంది
నీ ఆట నాతో ఆగుతుందనే ఆశతోనే నీ ఇష్టాలని నెరవేర్చాను
నా మనసు గొంతు నొక్కిపట్టి మరీ...కాని ఇవేవీ నీకు పట్టవు
నీ విశాల హృదయంలో ఎందరో.. ఆ అందరిలో నేనగా నీకెంత
అందరి మధ్య ఉక్కిరిబిక్కిరి అయి ఇక ఉండలేనని బయటపడ్డాను
.......అరుణని........

తాను నేను

మౌనం శాసిస్తుంది మనసుని బయటపడమని
మదిలోని భారాన్ని ఇంకెన్నాళ్ళు దాచిపెడతావని ప్రశ్నిస్తూ
......అరుణని......

తాను నేను

నువు మాట్లాడని రోజులలో నేను పడ్డ బాధ.. ఏ పాటిది
నువ్వు పిలిచిన రోజున నీకు సమాధానం ఇవ్వకుండా
నను నేను నిలువరించుకోవడానికి పడిన యాతన దగ్గర
........అరుణని........

తాను నేను

అప్రయత్నంగా కారే ఈ కన్నీళకు కారణం నువ్వని తెలుసు
కాని, ఇలా ఇంకా ఎన్నాళ్ళు చాలింక.. అంటున్నా కూడ ఆగవే
గతి తప్పిన నా మనసునేమొ నీ వెంట తీసుకుపోయావు
ఇక్కడ నన్ను నా దుఃఖానికి తోడుగా వదిలేసి
మనసు లేని వాడి వెంట ఇంకాన నీ పరుగులు
ఇటు చూడు ఒక్కసారి....ఓ మనసా
.......అరుణని........

తాను నేను

అందరి ప్రశ్నలకు నేను సమాదానాలు ఇవ్వగలను..ఒక్క నీకు తప్పించి
నీ మాటలు,చేతలు చేసిన గాయాలు నను సుతి మెత్తగా మాట్లాడనివ్వవు
నిన్ను బాధపెట్టే పనులే కాదు,మాటలు కూడా నా వలన కాదు
నీ ప్రశ్నలకు జవాబివ్వనూ లేను, నిన్ను ప్రశ్నించనూ లేను
నీ కష్టానికి నేనొక ఓదార్పుని, నా ప్రేమకు నేనొక భానిసని
అందుకే నా ఈ మౌనం...నిను తాకేది ఎప్పుడో,కదిలించేది ఏనాటికొ..
...........అరుణని............

తాను నేను

తుళ్ళి పడిన నా మనసు నిద్రనుండి మేల్కొంది
పక్కని తడుముతున్నది గాబరాగా ఆ చీకటిలో
నా గుండె చప్పుడు చెబుతుంది అదెంత విలువైనదొ
మంచం పక్కన కూడా వెతికాను కంగారుగా
దొరకలేదని బాధ ఒకవైపున,చేజారిపోయిందనే దుఃఖం మరో పక్కన
నామనస్సును కుదురు పెట్టుకొని ప్రశ్నించుకున్నాను
నా వెతుకులాట దేనికోసం అని,అసలేమయిందని
కలలోకి వచ్చింది నువ్వు కాదే నీ పేరు మాత్రమే
నిరంతరం నా పెదవి పలికే పేరు,నా చిరునవ్వుకు మూలం
నా మనసుని కానుకగా చేసి  సర్వహక్కులు రాసిచ్చేసిన పేరు
ఆ అయిదు అక్షరాల పేరు జారి కింద పడినట్లుగా
అంతే జారపడిన నా మనస్సుని అందుకునేందుకు నా గుండె లయ తప్పింది
పేరుకేనా ఇంత కలవరం అని సర్ది చెప్పుకున్నా కాని
ఎందుకో ఎలా ఉన్నావు ? అని అడగాలనిపించింది ఆ సమయాన
దూరంగా పోయినా ఎక్కడున్నా నీ సుఖం నువ్వు చూసుకుంటావని తెలుసు
కలత నిద్రలు...కల్లలైన కలలు నాకు మాత్రమే సొంతం..
నీది ప్రశాంతమైన మనసు..వచ్చేవాళ్ళు వస్తూంటారు,పోతూ ఉంటారు కదా
...............అరుణని..................

తాను నేను

సమయం....ఒకరికి ఇవ్వగల అతి విలువైన బహుమతి
నేను కోరింది...నువ్వు ఇవ్వలేకపోయినది
మన ఇద్దరి మధ్య ఈ దూరానికి మొదటి కారణం
ఎప్పుడు వస్తారో తెలిసి చూసే ఎదురుచూపు వేరు
ఎదురుగా ఉండి ఎప్పుడు ఇటు వస్తావో అని చూసే ఎదురుచూపు వేరు

కాలానికి ఇంత తొందరేంటి ఇలా పరుగెడుతోంది అనుకునే దాన్ని
ఇప్పుడు కాలానికేంటి ఇంత నిదానం ఎక్కువైపోయింది అనిపిస్తుంది

ఇంతేనా నేనంటే నీకు,ఇంతకు మించి ఏమి కానా అంటే
ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు అంటావు
నేనెప్పుడూ నిన్ను అలా చూడలేదు,చాలా విలువ ఉన్నాది అంటావు
కాని సమయాన్ని మాత్రం కేటాయించ లేవు
మాటల్లో ఉన్న అర్ధం చేతల్లో కనపడదు కనుచూపుకి కూడా

కావలసిన దానికోసం వెతికేటప్పుడు ప్రపంచం చాలా పెద్దదిలా
వద్దని తప్పించుకొని తిరిగేటప్పుడు ప్రపంచం చాలా చిన్నది అయిపోతుంది

సమయాన్ని కేటాయించలేని ఏ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు
నీకు అవసరం వచ్చిన రోజున నేను కనిపించడం, లేని రోజున ప్రక్కన పెడితే
అది నీకు ఎలా ఉందో కాని నాకు మాత్రం... నేను నీకేంటి అన్న ఆలోచన
పదేపదే ప్రశ్నించి, అగ్నిపరీక్ష పెడుతూ .... నను దహించేస్తుంది
నీ చేతల అర్ధాలను ఊహించడానికి కూడ భయపడుతున్నాను
నన్ను నేను ఆ స్దానంలో చూసుకోలేక.....

..........అరుణని...........

తాను నేను

జీవితమంటే ఒక నాటక రంగమని, ఇక్కడ నటిండమే కదా పని అనుకున్న.. అదెంతపని.. నేనైతే జీవించేయగలను అనిపించింది కాని..
ఏమయిందని.. ?? అందరూ అడిగేవరుకు అర్థం కాలేదు..
జీవించడం దాకా ఎందుకు.. నటన కూడా చేతకాని దానిని అని
అర్ధమయింది ఇప్పుడు.. నటన అంత తేలిక కాదని........
..........అరుణని............

తాను నేను

నాతో నేను...నాలో నేను ఆ రోజు నుండి ఈ రోజు వరుకు
మాట్లాడుతునే ఉన్నాను.... మౌనంగా
నాకు అలవాటు లేనిది ఈ మౌనం అయినా నను అల్లుకుపోయింది
నా ప్రశ్నలకు జవాబులు వెతుకుతున్నాను
నను నేను ప్రశ్నించుకుంటు..బదులిచ్చుకుంటు..మందలించుకుంటు
నేను వెతుక్కుంటున్నది నన్నే అయినా నాకు నేను కనిపించడం లేదు
నా ఆలోచనలకు అలుపు అన్నదే రావట్లేదు
ఇదా నేను..కాదే..నచ్చలేదు ఇలా ఉండడం..
ఎవరి ఆనవాళ్ళో నాలో ఏంటి
తుడిచేయాలి..నాకు నేను చాలు
ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతకాలి అంటారు
పోగొట్టుకున్న చోటులో నా జాడలు ఆనవాలుకి కూడ మిగిలుండవని తెలుసు
అందుకే నాలో నేను.. నాతో నేను..సంఘర్షణ చేస్తున్నాను
వెతుకుతునే ఉన్నాను ఉంటాను దొరికేవరుకు
......అరుణని.....

తాను నేను

దేవుడంటే నమ్మకం లేదు
మనుషులంటే మమకారం లేదు
మనసంటే లెక్కే లేదు
మరి దేనిని నమ్ముతావు..

అంతరాత్మను నమ్ముతావా
అదెలా ఉంటుందో తెలుసా
ఆత్మ పరిశీలన ఎప్పుడైనా చేసుకున్నావా
కనీసం ప్రయత్నించావా ఒకసారైనా

తప్పొప్పులను ఎలా లెక్క వేస్తావు
ఎదుటి వారి దృష్టితో ఎప్పుడైనా చూసావా
ఎవరి ఇష్టాలకైన విలువ ఇచ్చావ
ఒకరి కోసం బ్రతకడం అంటే ఏంటో తెలుసా

నీ ఇష్టాలు నీ అవసరాలు నీవే
నీ సుఖం నీకు ముఖ్యం 
అందుకు వాడుకుంటావు నమ్మినవారిని
నమ్మకం పోగొట్టుకున్నాక తప్పించుకొని పోతావు

మరి నీ కర్మ ఫలం నిను చేరదా
నీ ఆత్మసాక్షి నిను నిందించదా
మనిషిగా ఉన్నావు కాదు నటిస్తున్నావు
మరెందుకు నీకు బంధాలు,బంధుత్వాలు

యంత్రాల మధ్య యంత్రంగా బ్రతుకుతున్న ఓ మనిషి
ఒక్కసారి ఆత్మ పరిసీలన చేసుకో
నిను నమ్మిన వారిని,నీతో ముడిపడిన వారిని వంచించకు
లోకానికి కాదు మనసుతో ముడి వేసుకొ బంధాలని

సాటి మనిషిని నమ్మలేని హీన స్థితిని తీసుకురాకు
నీ తలంపు చిరునవై ఉండాలి కాని తలవంపుగా కాదు
ఎవరేమి అనుకుంటే నాకేమి నేనింతే అంటే
నిను నమ్మినవారి కన్నిటిలో ఒదిగిపో కలకాలం

.......అరుణని.......

తాను నేను

అలికిడేది నా మదిలో...ఇంత నిశ్శబ్దం ఎప్పుడు చేరింది
కుదురేది నా ఎదకి...కలల బరువు మోయలేను అంటుంది
ఊసుపోని ఈ ఏకాంతం నాకు కానుకగా ఇచ్చావు
ఉలుకు పలుకు లేకుండా నాకు నేనే తోడుగా మిగిలాను
కోరిన వెంటనే తీరిపోతే అందులోని కమ్మదనం తెలియదనేమొ
నా కోరిక అందని ద్రాక్షలా ఊరిస్తుంది
ఏమంత పెద్ద కోరిక నాది నన్ను నాకు తిరిగిచ్చేయమన్నాను అంతేగా
తాకకుండానే నీ ఙ్ఞాపకాల తరంగాలు నా అంతరంగాన్ని తాకుతున్నాయి
ఎందుకీ తరంగాల అంతరంగాలు నాలో అలజడులు సృష్టించడం
తుఫాను ముందు నిశ్శబ్దంలా ఉంది నా మౌనం
నా మౌనాన్ని చేదించడానికి ప్రయత్నించకు ఎప్పుడూ
అక్కడ ప్రశ్నగా కనపడేది నీకు నువ్వే ..ఎందుకో అది నీకే బాగా తెలుసు
.........అరుణని..........

తాను నేను

నీ పిలుపు నా మనసుని తాకి పులకరింత పుట్టిస్తుంది
నిను చేరాలని నా పరువం పరుగిడుతు నీ ఎద ముంగిట నిలిచింది
ఎద లయలు ఏకమై తాళమేస్తున్నాయి ఒదిగి పొమ్మని ఒకరిలో ఒకరమై
సమయమా కదలకే కాసింత సేపు స్థాణువులా నిలిచిపో అంటుంది మనసు
కొంటె గాలి గిలిగింతలు పెట్టి అల్లరి పెడుతుంది ఎందుకీ దూరం అని
నీ ఎదను వాలిన క్షణం నేను నీవై... నను నేను వీడిపోతాను
ఆ చోటు నాది,నాది మాత్రమే అనే గర్వం రెట్టింపు అవుతూ 
నువ్వు నావాడివే అనే ధైర్యాన్ని ఇస్తుంది
చెక్కిలిని చేరిన నీ దరఖాస్తు దూరాలను చెరిపేసి చెరిగిపోని ముద్రను వేస్తుంది
నాది అనే నమ్మకం నా సొంతం అనే ధైర్యమే కోరుకుంటుంది ఈ చిన్ని మనసు

..........అరుణని..........

చీకటి లోకం

పగటి భారాన్ని పక్కన పెట్టి లోకమంతా నిద్రిస్తున్నది
చిక్కని చీకటిలో ఎన్ని కన్నీటి చుక్కలు ఆవిరైపోతున్నాయో...
నా ఆలోచనలకి పగలూ,రేయీ అన్న తేడా లేకుండా పోయింది..
నిద్రిస్తున్న ప్రపంచాన్ని చూస్తుంటే నా పెదవిపై అర నవ్వు ఎందుకో..!!
ఏమంత కష్ట పడిపోయావని అంత అలసట నీకు..!?
ఎన్ని గుండెల భారాన్ని గుట్టుగా దాచేసి అలసిపోయావో నీకే తెలియాలి..
ఈ రేయికి ఇంత నిశ్శబ్దం దేనికి..!?
నిశీధి  నీడలలో ఎన్ని పాపాల గొంతులు నొక్కిపెట్టిందో సడి చేయకుండా నీకే ఎరుక అది..
స్వార్ధపరుల కనుసన్నలలో నడుస్తున్న ఈ మానవీయ లోకం
పగలైనా రేయైనా ఒకేలా కనిపిస్తుంది
పగటిపూట కనిపించే అందమైన నీడలు రేయి గడవగానే
తెరచాటు నుండి బయటపడ్డ వికృత రూపాలుగా దర్శనమిస్తున్నాయి..
మోసాన్ని రుచి చూసి, ఓడిన మనసుకి ఏ రేయి అయినా ఒకటే..
నిజాన్ని ఏ పగటి వెన్నెలా ,చీకటి వెలుగులూ దాచిపెట్ట లేవు...
ఎక్కువ కాలం
అవే చూస్తున్నా..
మౌనంగా ఈ నాటకాల జగతిలో వేషగాళ్ళుగా జీవిస్తున్న పాత్రలని..                         
       ........అరుణని........

తాను నేను

నమ్మకం....

అడిగి తీసుకునేది కాదిది..
అడిగితే వచ్చేది కాదది..
కావాలి అనుకున్న వాళ్ళకి అడగకనే ఇచ్చే
బహుమతి...

పునాది అది నిన్ను నన్ను నిలబెట్టేది..
కలిసి నడిపించేది..
మాటలు నమ్మకాన్ని ఇవ్వవు..
నీ చేతలలో లేనప్పుడు..

మనసు విరిగేది ఎప్పుడో తెలుసా..?
నమ్మకం నామ రూపాలు లేకుండ
ఛిన్నాభిన్నం అయినప్పుడు..
ఆ శకాలలో వెతుకుతున్నాను ఇపుడు..

ఎక్కడ నేనని..? ఏది నా నమ్మకం..
నాకు నేను అసంపూర్ణంగా..
అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాను ఆ ముక్కలలో..
ఎలా.. ఎలా..మళ్ళీ నన్ను నేను నిలబెట్టుకునేది..

ఎవరినో కాదు..నన్ను నేనైనా నమ్మే స్థితి ఎప్పుడు వస్తుంది
నమ్మడం నా బలహీనత..అదే నీ బలమైనది..
నన్ను నాకు ప్రశ్నగా నిలబెట్టడానికి..
ఈ రోజు నీది..నీ ఈ గెలుపు నీదనుకోకు..
నిను గెలిపించడానికని నన్ను నేను ఈ స్థితిలో నిలబెట్టుకున్నాను..
ఇది గ్రహించ లేవు నువెప్పటికి..

నీ జీవితానికి ఎప్పుడు ఆటంకము కానని..
మాటిచ్చుకున్నాను..నా మనసుకి...
ఆ నమ్మకం కూడా నీకు నేను ఇచ్చాను,ఇస్తునే ఉన్నాను..
నువ్వు చేసిందే.. నేనూ చేస్తే.. నీకు నాకు తేడా ఏముంది..
నమ్మకాన్ని నమ్మకంగా చంపేయడం నీకు అలవాటు..నాకు కాదు
నేను మళ్ళీ నమ్మగలను నమ్మకాన్ని..ఆ నమ్మకం నాకుంది
ఈ రోజు కాకపోవచ్చు కాని.. నా నమ్మకం నన్ను నాకు
అప్పచెపుతుంది తిరిగి..
   
              ..........అరుణని..........

తాను నేను

ఏకాంతంతో సావాసం...
వీచే గాలి సవ్వడి వింటున్నాను..
లయలెరుగనిదేమో..
ఘడియ ఘడియకు రాగం మారిపోతుంది..!!
అంతలోనే గుభాళింపులు మోసుకొస్తుంది..
ఆహ..అనేంతలోనే...కుళ్ళిన మనసుల కంపును
నషాళానికి ఎక్కిస్తుంది...!!
ఒకపక్క ఈ మనసు నిమిషం కూడా మౌనంగా ఉండదు..
నీ ముందున్న.. నువ్వు చూసిన చేదుకన్నానా అని..
గిచ్చి మరీ గురుతు చేస్తుంది...గతాన్ని !!
ఈ ఏకాంతం నా గాయానికి వైద్యం చేస్తుందా,వ్యధను పెంచుతుందా..??
అర్ధంకావట్లేదు...??
బాధ తప్పించి ఏముంది ఈ మదిలో..దేనికి స్పందించని నా మనసుని ఈ ఏకాంతానికి అప్పచెప్పేసాను అందుకే..
మారాలనుంది ఎప్పటిలా...ఒకప్పటిలా...
మంచిని మాత్రమే చూడగలిగే ఆ మనసు కావాలి మళ్ళీ..
అన్నీ తెలుసనుకునే నాకు ఏమి తెలియని,తెలుసుకోలేని దానినని
ఎంత బాగా వివరించి చెప్పావు..ఎదురుగా ఉన్న అందమైన
అబద్ధాన్ని చూడలేని,గ్రహించలేని వెర్రిదాన్నని..అందుకే..
కొందరు నాలా,కొందరు నీలా..అందరిలో నువ్వు,నేనే
కనిపిస్తున్నాము ఇప్పుడు ..
ఏంటో ....ఈ గందరగోళం..చిత్రమైనది కదా ఈ మనసు..
అది పలికించే మాటలు..అది ఆడించే ఆటలు..
ఇదిగో ఇప్పుడు నాతో చేయిస్తుంది కదా..
గాలిలో వ్రాతలు...మౌనంతో మాటలు...మండుతున్న మనసుని
చల్లార్చడానికి కన్నీళ్ళు..ఇవే ఇప్పుడు నా దోస్తులు..

              .........అరుణని.........

తాను నేను

మణివో..మాణిక్యానివో అనుకుని..
నా మనసనే హరంలో పొదిగి మరీ అలంకరించుకున్న..
నా ఎదలొ చొటిచ్చి...ఆరాదించాను..
కాలం అనేది ఒకటుందనే సంగతి మైమరచేలా చేసావు..
కలా..నిజమా..ఇది అని ప్రశ్నించుకుని..
మేల్కొని చూసేసరికి తెలిసింది ఇదే..
నువ్వు కలలాంటి నిజానివని..
నేను చూసింది ఇదేగా.. నీ రాతి మనసుని..
నిన్ను పొదువుకున్న ఈ మనసు నీ భారాన్ని మోయలేక అలసిపోతుంది..
దూరంగా విసిరేయాలి అని ఉన్నా..చేతకావట్లేదే ఆ పని..
సర్వాధికారాలు నీవే అన్నానుగా అందుకే..
వెళుతూ  వెళుతూ  సర్వం నిర్వీర్యం చేసేసి పోయావు..
తిరిగి రాకెప్పుడు...ఇక్కడ నువు ఏలుకోడానికి మిగిలింది..
నువ్విచ్చిన ఙ్ఞాపకాల సమాదులు మాత్రమే..

            ........అరుణని........

తాను నేను

ఈ సిగ్గు దేనికని అంటావే
తెలియదా..నీకు 😍
నీ ఊహ సైతం నన్ను
ఉక్కిరిబిక్కిరి చేస్తుందే..
మరి నా చెంత నువ్వు
ఉంటే సిగ్గు రాక ఇంకేమొస్తుంది
నా నవ్వులు నీ ఎద
సవ్వడితో లయ కలుపుతుంటే
ఉలికిపడుతుంది చూడు
ఆ మారుతం
చల్లని వెన్నెల సైతం చందనాలు
జల్లుతూ  వందనాలు చెబుతుంది
మన ఇద్దరికీ
జాబిలి వచ్చి జామయ్యాకనా
నీ రాక అని అలగాలని ఉంది
కాని నీ నాలుగు కళ్ళు
నను నలువైపులా బందించేస్తున్నాయే
వెన్నెల కూడా వేడెక్కుతుంది
నీ అల్లరిని భరించలేక
చూడు మబ్బులు చాటున
దాగిదాగి మరీ తొంగి చూస్తున్నాడు
నా చంద్రుడుని ఆ చంద్రుడు

  ......అరుణని.....

తాను నేను

చెమ్మ ఎక్కువ అయిందేమొ కన్నులలో ..
మసక బారిన కంటిపాపలు విడనంటున్నాయి..
ఉబికి వస్తున్న ఈ కన్నీటి గంగని ఆపేదెలా..
జాడ లేని ఆ సముద్రుడి కోసం..
ఎంత వరుకు నీ ఈ ప్రవాహం..
చేరలేవని తెలిసి కూడా ఎందుకు ఈ ప్రయాస..
కన్నులలో కొలువై ఉన్నావే కంటిపాపలా..
కనులకు ఎందుకు ఇంత శిక్ష వేస్తున్నావు..
నిను కాంచక మరి ఏ చిత్రం కంటికి చేరక..
లోకమే శూన్యము అయిపోయింది..
చెంపను తాకుతున్న వేడి గుండెలకు చేరుతుంది..
నిన్ను మాత్రం కరిగించ లేకపోతుంది ఎందుకో..
నువ్వు చెంతనుంటే నేను మంచు బిందువునై..
కరిగి నీలో కలిసిపోయి చిరునవ్వునై పోతాను..
చిరునవ్వుగా నిలిచిపోవా నా చిన్ని పెదవులపై కలకాలం..
మరి చేరేది ఎప్పుడు నా చిరునవ్వు నన్ను..
   
       .......అరుణని......

తాను నేను

నువు ఎప్పుడు వచ్చావు,ఎలా వచ్చావు నా మదిలోకి అంటే....
నాకే తెలియని జవాబును నీకెలా చెప్పను....
తెలిసింది ఒక్కటే నువ్వే నా లోకమని,నా శ్వాసవని....
నువుంటే నీ చుట్టూనే నా అడుగులు,అడుగు దూరం కూడా నీకు జరగలేను....
నిను చదువుతున్న కొద్ది ఇంకా చదవాలని ఉందిరా....
ఏం తెలుసుకున్నావని అడగకు నా నవ్వులలో జవాబులు ఏరుకోమంటాను....
ఏం చూసాను నీలో అంటే ఏమో ?? నీ నవ్వు చాలు నన్ను కట్టిపడేయడానికి....
కారణాలు లేకుండ కలిగేది...వివరణ చెప్పలేనిదే కదా ఈ ప్రేమ అంటే....
నువ్వు తెరిచిన పుస్తకానివి నాకు..అందులో బయటపెట్ట లేని పుటను నేను....
అక్షరాలలో కాదు భావానికి కూడా అందని లోతైన అగాధం నీ మనసు...
నీ మాటలు నన్ను నడిపించే మంత్రాలు..నీ మౌనం నా మరణం....
నిన్ను చదువుతున్నానా !! లేదా నన్ను వెతుకుతున్నాన నీలో....
ఏమో ఏం మాయ చేసావొ...ఇలా నన్ను నీలో...నిన్ను నాలో చూసుకోవడం ఏంటి...
నిన్ను కాదు చదివేది మన ఇద్దరిని,మన బంధాన్ని అని అర్ధమవుతుంది ఇప్పుడు...
ఎప్పుడూ ఆలస్యమే నిజం చూడటానికి,అర్ధాలు తెలుసుకోవడానికి....
ఈ రోజు మనది....రేపు మనది...అత్యాశే కాని ఏంచేయను నువ్వు ఉంటేనేగా నేనుండేది...
వెయ్యకూడని సంకెళ్ళే నీకు వేస్తున్నాను అని తెలుసు...
నా చేతిలో లేని నా మనసు కోసం...ఇది నా చేతకానితనం...
ఇంతకన్నా ఇంకేం చెప్పను నీతో... నా మనసుతో ...
నా మాట లెక్కలేని దాని కోసం.. నిన్ను బాదపెడుతున్నాను...
నిన్ను చదువుతున్నానంటు నన్ను నేను నీ ముందు ఉంచాను...
కాలాన్ని తిట్టాలని ఉంది.. కలవని ఈ తీరాల మధ్య ఈ ప్రేమను పెంచినందుకు...
కంటికి కనిపించని ఈ తుఫాను.. తీరం నిశ్శబ్దంగా చేరితే చాలని ఉంది...
     
                  ........అరుణని........

తాను నేను

ఎంత అలుసో కదా నేనంటే నీకు..??
ఎందుకు కాకూడదులే..
నా బలహీనత నువ్వేనని నేను ఒప్పుకున్నాక...!!
నా బలం కూడా నువ్వే అన్నాను తెలుసా..??
అనవసరమైనవి గురుతుంచుకోవు కదా...మరచిపోయాను
నన్ను కోరి నువ్వు వచ్చినా..
నిన్ను కోరి వలచింది నేనే కదా..!!
నీది ఇష్టం....నాది ప్రేమ
ఇంత తేడా ఉన్నాది.. మన ఇద్దరి మధ్య
మరి నేను అలుసు కాక ఇంకేమి కాను...
ఇంకా ... అర్థం కావలసింది ఏమన్నా ఉందా అంటే
ఉంది...నన్ను నా బలహీనత ఏ స్థితిలో నిలపెట్టిందో అన్నది..
అర్ధమయ్యే రోజే కాదు.. నా బలహీనతను నా బలంగా మలచుకోవడం ఎలాగన్నది కూడా తెలుసుకునే రోజు రావాలనుంది తొందరగా...
ఆత్మాభిమానాన్ని చంపుకోలేని నాకు ఇది ఎంతటి శిక్షో నాకే తెలుసు..!!

              .........అరుణని........