చెప్పు అంటే ఏం చెప్పను.....
ప్రతి నిమిషం నే ఎదురు చూసిన ప్రశ్నే కదా ఇది...
అయినా మూగబోయింది నా మనసు బదులేమివ్వలేక...
పెదవి గడప దాటిన పదాలన్నీ మనసును తాకవు...
మది లోతుల్లో నుండి రాని నీ పలుకులు నా ఎద వాకిటనే ఆగిపోతున్నాయి...
ఎన్నో మాట్లాడాలని తెలిసినవి,విన్నవి చెప్పాలని...సలహాలు అడగాలని,సందేహాలను తీర్చుకోవాలని..అల్లరి చేయాలని,ఆట పట్టించాలని నిన్ను ....నన్ను ఆట పట్టిస్తే ఉడుక్కోవాలని ఇలా ఎన్నో ...
ఒకనాటి అలవాట్లు అవి ఈనాటి కోరికలు..ఎంత మార్పు
ఆశించడం, అంతలోనే నిరాశ చెందడం..సర్దుకుని సర్ధుకుపోవడం అలవాటు అయిపోయింది..
లేదులే అలవాటు చేసేసావు..
కాలం నేర్పని పాఠాలెన్నో నువ్వు మౌనంగా నేర్పేసావు...
ఆశలన్ని చచ్చిపోయాయి ఎప్పుడో ...
నిర్ణయాలు అన్నీ నీవే ఊ కొట్టే కీలు బొమ్మను మాత్రమే నేను...
ఒక నిర్ణయానికి రావడం అంటే రెండు వేపుల సమ్మతం ఉండాలోయ్ అదీ పట్టదు నీకు..
నా మాట చెల్లేది ఆనాడు కాని ఈనాడు కాదు కదా...
నిండు కుండలా ఉన్నాను నీ ముందు...చెప్పు అంటూ నువ్వంటే ఏమని చెప్పను,ఏదని చెప్పను...
మాట్లాడినా నా మాటల్లో అర్ధాలు, ఆర్ధ్రత నీకు కనిపించదు...
నీ తప్పులను ఎంచుతున్నట్టుగా లేదా నిందిస్తున్నట్టేగా నీకు అర్ధమయ్యేది..అందుకే నా మౌనం
అయినా నీ మాట నీ మనసు నుండి వస్తే నన్ను నేను జవాబు ఇవ్వకుండా ఆపగలనా....లేదే
ఎందుకోయ్ అంత కష్టంగా పలకరించడం ఇంకా ఏడిపించడానికి కాకపోతే ....
మాటలకి, చేతలకి పొంతన కుదర్చడం నీకు చేతకాదు..
ఆ తేడా నన్ను తేలిక చేస్తూనే ఉంది ...మాటల్లో ఆ తేడా ఏంటో నీకు చెప్పలేను, చేతల్లో చేసి చూపనూ లేను
ఏం చేతనౌను అంటే ఇలా మౌనంగా కన్నీటిని వదిలేయడం, నిన్ను ప్రేమించడం మాత్రమే వచ్చు...
............అరుణని............
No comments:
Post a Comment