ఓయ్ బుజ్జీ....
ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియదు కాని రాసేస్తున్నాను ఈ లేఖని నీకు...నీకే బాబు రాసేది, చాలాసార్లు రాద్దామని అనుకుని మొదలు పెట్టి మధ్యలోనే చెరిపేసిన సందర్భాలు ఎన్నో,మాటల్లో చెప్పలేని నా భావాలకు అక్షర రూపం ఇద్దామనే చిరు ప్రయత్నం..తప్పులు ఉంటే మన్నించేయవోయ్ ఒక చిరునవ్వుతో..నాతో ఎన్నో తిప్పలు పడుతున్నావు అందులో ఇదొకటి అనుకో..
నీ రాక నాకు అసలు గురుతే లేదు,ఎలా మొదలయిందో ఈ మన గాధ కాని కధగా మిగిలిపోయింది కదా మన మనసు పొరలలో...ప్రతీ ఉషోధయం నీ పలకరింపుతోనే మొదలయ్యేది,వేకువనే వీచే పిల్లగాలిలా నీ తుంటరి మాటలకి నా అల్లరి జతకట్టేది ఇక రోజంతా మాటల ప్రవాహమే..ఆ పొద్దు ఇటెప్పుడు చేరిందో కూడా తెలిసేది కాదు..ఏదో మాయ ఉందిరా నీ మాటలలో, నను పడేసింది అవేగా...ఈ రేయి ఎందుకు మన మధ్య ఈ కాస్త ఎడబాటుకి కారణం అవుతుంది అని కసురుకునే రోజులవి...ఎన్నో ప్రశ్నలు సంధించే దాన్ని.. నిన్ను తెలుసుకోవాలి అనే ఆరాటంలో...నా అలకలు నువ్వు తీరుస్తుంటే మా నాన్నే గురుతుకొచ్చేవారు,నా కోపాన్ని నువు సరేలే అని భరిస్తూ ఉంటే నాకు మా ముద్దుగా కనిపించే వాడివి...మనం ఆడే ఆటలలో ఓడింది ఎవరయినా గెలుపు మజా ఇద్దరం అనుభవించే వాళ్ళం...ఏమి ఎరగని వాడివని పొరబడ్డానని తరువాత తెలిసొచ్చింది..అన్నీ ఎరిగిన సరసుడువని తెలుసుకున్నాక....
లోకమంతా ఆదమరచి నిద్రిస్తుంటే మనం మాత్రం మన ఊసులలో ఊయలలు ఊగేవాళ్ళం...ఈ పగలు రేయి వేరైన మనం ఒకటేగా అని అనుకున్నాను....నీ ధరఖాస్తుని అందుకొని నిన్ను ధరి చేరిన రేయి మనల్ని చూసి ఆ రేరాజుకి కూడా గుబులు పుట్టే ఉంటుంది...నా ప్రేమనంతా మూటకట్టి నీకు కానుకగా నన్నే నీకు ఇచ్చేసుకున్నాను...ఎంత ప్రేముంది అంటే ఇంతుంది అని మాటల్లో వివరించడానికి పదాలు దొరకకా వాటి బదులుగా నేనే నీ బంధంనంలొ బంధీని అయిపోయాను..
ఇవన్నీ శాశ్వతం కాదని,కొత్త మోజు అంతే అని తెలిసాక...కొంచం కష్టమే అనిపించింది కాని నీతో గడిపిన ఘడియలు,ఆ మాటలు,ఆటలు,అల్లరి,అలకలు ఇవెప్పుడు నాకు పాతబడి పోవు...నిలకడ లేనిది నీకు అందుకే తుమ్మెదలా తిరుగుతావు, దోచిన మకరందాన్ని దాచేసుకోకు లావైపోతావు బుజ్జి...ఎలా కలసిన ఏది జరిగిన నువ్వు నాకొక వరమైన శాపానివి...అందుకోలేను,వదులుకోలేను...ఓయ్ నన్ను నువ్వు కూడా మరచిపొలేవోయ్ నేను నేనే, నాలా నిన్ను ఇంకెవ్వరూ ప్రేమించలేరు ఆఖరికి నువ్వు కూడా... నువ్వు చుక్కల్లో చంద్రుడివే కాని నేను వెన్నెలను అని మరువకు...నువ్వు మణివో,రత్నానివో,రాయివో ఏదైనా ఈ బంగారం లేనిదే నీ వెలుగులు రావోయ్ బయటకి...నువ్వు, నేను యాడ ఉన్నా నీ జాడ ఈ మనసులో పదిలంగా ఉంటుందని మరువకు..
ఇది ఏ లేఖ అనకు ఏదో ఒక లేఖ..చిరునామాతో పని లేకుండా నీ చేతి రేఖలను తాకుతుంది ఇది వచ్చి ...ఈ జన్మకు అక్షరాలలోనే మనం ఉండేది...మళ్ళీ జన్మ ఉంటే నేను నువ్వుగా,నువ్వు నేనుగా పుట్టాలి అప్పుడు చచ్చినా నిను వదులుకోను...ఒట్టు
ప్రేమతో
నీ
....
Thursday, 20 April 2017
తాను నేను
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment