మౌనానికి లిపి లేకపోవచ్చు కాని నీ భావాలు నను తాకుతునే ఉన్నాయి
మన ఇద్దరి మధ్య దూరానికి లెక్క ఉండొచ్చు కాని
నా మదిలో ఉన్న నీకు నాకు మధ్య దూరానికి కొలత అంటూ ఉందా అసలు
మన మధ్య జరిగే మాటల యుద్ధంలో నువ్వు ఓడి గెలిచినా...నేను గెలిచి ఓడినా మనం ఒకరిని ఒకరం గెలుచుకుంటాము ఆఖరికి
నీ చేతలు చేసే గాయాలు ఎన్నో కాని అవన్నీ నీ పలకరింపుతో పరుగు అందుకొని కనుమరుగై పోతాయి ఎందుకో నీకు తెలుసా...!! నాకు తెలియదులే ఎందుకో ??
ఓయ్ బుజ్జీ....అని పిలుస్తాను ఎన్నో చెప్పాలని కాని అదేమిటో నువ్వు చెప్పు అనేసరికి అనుకున్న మాటలన్నీ ఆవిరైపోయి ఏంలేదు అంటాను..
ఆ చెప్పు అనే పదంలో మునుపున్నంత హుషారు కానరాక..నా కబరులన్ని కంచికి చేరని మన కధలా నిశ్శబ్దంగా నీరుగారి పోతాయి
మన గురించి తెలిసింది ఎవరికి ??..నీకు నాకే కదా
మరి ఎవరితో మన గాధను పంచుకోవాలి, నీ వలన కలిగిన ఆనందాన్ని ఎవరితో చెప్పుకోవాలి, నువ్విచ్చే కష్టాన్ని ఎలా దించుకోవాలి ఎలా ??
ఇదిగో ఇలా నా అక్షరానికి ఊపిరి పోసాను ఇంకో దారిలేక ....
ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి అవికూడా ఒక్కోసారి నా ఎద భారాన్ని మోయలేక
ఏం చేయను మరి...వాటిని హింస పెట్టక తప్పటంలేదు వాటికి నోరు లేదు కనుక సరిపోయింది లేదా అవి నన్ను ప్రశ్నించేవి
తప్పటడుగు వేసింది నువ్వు తిప్పలు మాకా, తప్పించుకొని పోవడం చేతకాని దానివి నీకెందుకు ఈ ప్రేమ,నమ్మకం,మనసు లాంటివి అని
సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో అందులో ఒకటి నా గుడ్డి ప్రేమ
ఇదే నా జవాబు...
........అరుణని........
No comments:
Post a Comment