Thursday, 20 April 2017

తాను నేను

నువ్వు నన్ను చేరిన దారి వైపు చూస్తూనే ఉన్నాను
అది గతమే అయినా నా గతిని మార్చేసింది కదా
గతాన్ని మార్చలేనని తెలుసు కాని
అది చేసిన గాయం మాసేది కాదు కూడా
నువు పలికిన ప్రతీ పదం అసత్యమే...
ఆ సంగతి ఇప్పుడు ఇక్కడ నిలబడి చూస్తుంటే కనిపిస్తుంది
నేను ఎవరి వెంట పడలేదు ఏది ఆశించి
నా వెంటపడిన ఎవరిని నా దరిదాపుల్లోకి రానివ్వలేదు..
ఒక్క నిన్ను తప్పించి..తప్పించుకుని పోయుంటే బాగుండేది కదూ..
నీకు కాదు....నాకు
నేను నా వాళ్ళకోసం,లోకం కోసం బ్రతికినన్నాళ్ళు హాయిగా ఉన్నాను
నా కోసం నేను మొట్టమొదటి సారి తీసుకున్న నిర్ణయం నువ్వు
మళ్ళీ ఇంకొక్కసారి నాకోసం నేను ఆలోచించే సాహసం చేయకుండా చేసేసింది
ఇపుడు మనశ్శాంతి ఎటుపోయిందో తెలియదు
ఎన్నో గిరులు నా చుట్టూ నేను గీసుకున్నాను
మొదటిసారి గిరి దాటాను నా కోసం,నీ కోసం... తప్పుచేసాను కదూ..
నా కోసం పలికిన పలుకులు ఈ రోజు వేరెవరి కోసమో పలుకుతుంటే
నా ముందర సాగుతున్న నీ లీలలు వేరెవరితోనో చూస్తుంటే
నీ మనసు ఈ రోజు ఇంకొకరిని కోరుతుంది అని నువ్వు నాతో చెబుతుంటే
వస్తున్న దుఃఖానికి అదురుతున్న అధరాల్ని పంటి కొసలతో నొక్కిపెడుతు
నీ ముందర నేను చిందించిన నా దరహస భారం
ఈ జన్మకు లెక్కవేయలేవు నువ్వు
కడుపు కోసం తనువు అమ్ముకునే వెలయాలి వృత్తిని గౌరవిస్తున్నట్టు నటిస్తుంది...
తనకన్నా దిగజారిపోయాను నేను ఈ రోజు
కడుపు కోసం కాదు,తనువు కోసం కాదు
ప్రేమించిన వారిని ద్వేషించలేని నా బలహీనత కోసం ...
ఇంతటి హీన స్థితిలో నిలబడటానికి కారణం అయిన ఆ గతాన్ని ఎలా మరచిపోగలను..
నిన్ను, ఆ గతాన్ని మరచిపోయే అంత శక్తి నాకు వచ్చేది నా శ్వాస ఆగిన క్షణమే
నేను మనిషిని ప్రేమిస్తాను...పరిస్ధితులను కాదు
ఎలాంటి పరిస్థితి ఎదురైనా నా ప్రేమ...ప్రేమగానే ఉంటుంది ఎప్పటికీ

         ........అరుణని........

No comments:

Post a Comment