Thursday, 22 November 2018

తాను నేను

మనసుకు ఆంక్షలు విధించినప్పుడు
మౌనం పహారా కాస్తుంది..
ఇష్టాన్ని కసురుకున్నాక
చనువు చివుక్కుమంటుంది..

నిశ్శబ్దమే మన చుట్టూ
అలజడులో ఎన్నో ఎదలో..
పెదని చాటున దాగిన ప్రశ్నలెన్నో
జవాబు కోరని కోరిక అడ్డుగా నిలబడింది..

ఆలోచనల సాలె గూడులో
మెదడు,మనసు చేస్తున్న పోరాటాలు ఎన్నో..

జరిగింది నిజమని
జరుగుతున్నది మనది కాదని
జీవితం చెబుతునే ఉంది
జీర్ణించుకోమని..

ఆశించింది అంచనాలకు
అందనంత ఎత్తులో ఉంది..
పొందింది ఏమో
నువ్వు ఎవరు, ఏమౌతావనే అనే ప్రశ్నను సంధించి తిరిగి చూడకుండా పోయింది..

కానివారు చేసే గాయం
కన్నీటి చుక్కతో తుడుచుకు పోతుంది..
అయిన వారు ఇచ్చిన గాయం
ఆహుతి కోరుతుంది..

అంతే... అర్ధమయ్యే మనసుకు ఒకమాట చాలు
అర్థం కాని మనసుకు మౌనం కూడా పొగరులా అనిపిస్తుంది...

✍అరుణిమలు

Thursday, 15 November 2018

తాను నేను

మనసుకేం తెలుసు అలుసైతే ఎంత కష్టమో...
ఇష్టం ముందు ఏదైనా దిగదుడుపే దానికి..

తల వొంచినా, తలంపులో నువ్వే ఉండాలి అంటుంది..
గాయపడినా లేపనం నువ్వే కావాలంటుంది..

నిందలు, నిష్టూరాలు మోసిన పెదవి తెరవకు అంటుంది..
కసురుకున్నా, కను మూలలో దుఃఖాన్ని ఆపేయమంటుంది..

తక్కువ చేసినా నేనెక్కడ ఎక్కువ అంటూ తగ్గమంటుంది..

ఈ మనసుకు అభిమానంతో పనిలేదు..
దాని అభిప్రాయాలతో అవసరం లేదు..

ఇష్టమైన వారితో ఇష్టంగా ఉండిపోతే చాలు అంటుంది..
ఎంత స్వార్ధమో కదూ....కాదంటే, కూడదంటే వేదనకు అర్థం చెబుతుంది..

ఏకాంతాన్ని కూడా కరువు చేసేలా నస పెడుతుంది..
దేహాన్ని వదిలి పోయా నా ఇష్టం దగ్గరకు
నేను కావాలంటే నువ్వే రా అని దారులన్ని మూసేస్తుంది..

ఆలోచనలను ఆక్రమించేస్తుంది తన ఇష్టాలతో
ఎటు పారిపోతావు నా మాట వినకుండా అని..

బహిరంగ శత్రువులనైనా జయించోచ్చు కానీ
ఈ అంతర్గత శత్రువును ఎదుర్కొనే ఆయుధం ఉందా అసలు...

✍అరుణిమలు

Wednesday, 14 November 2018

తాను నేను

నాలుగు రోజులు రాయడం మానేసానేమో
నా పుస్తకంలో ఖాళీ కాగితం కూడా ఒక కథలా కనిపిస్తుంది...

ఆలోచనలన్ని సాలెగూడులా
ఎదంత చిందర వందరగా ఉంటే ఏమని రాసేది...

భావాలన్ని ఒకచోట ఆగి కదలనంటున్నాయి
ఏకాంతం అంటూ ఎక్కడ ఉందని వెతుకుతున్న..

శూన్యంలో ఎన్నో రాస్తున్న
ఎటు పోతున్నాయో ఆ పదాలు
ఎక్కడికి చేరాలని ఉందో...ఏమో

నా పదాల జాడ నాకే కానరావడం లేదు
మళ్ళీ చదువుదామంటే..

కొన్ని పదాలు తడిచి పోతుంటే
మరికొన్ని మెరిసిపోతున్నాయి

నాకు నేను దూరంగా
అక్షరాల వనంలో విహరిస్తున్న..

నీకు దగ్గరగా...

✍️అరుణిమలు

Saturday, 13 October 2018

తాను నేను

అక్షరాల పై అదుపు లేదు
భావాలన్ని చెల్లాచెదురుగా పడి ఉన్నాయి
ఆలోచనల వేపు నుండి మనసు ఎటో మళ్ళింది

నీ నుండి దూరం జరిగాక
నాకు నేను కూడా దూరమయ్యాను

వెనుతిరిగిన ఇష్టం
కష్టపెడుతుంది క్షణం క్షణం
కానీ ఏం చేయగలను..

దారులన్ని మూసేసావు తొందరపడి
అభిమానం తలవంచలేక వెనుతిరిగింది

మనసుకు మాత్రమే తెలిసిన వ్యధ ఇది
విప్పి చెప్పేందుకు పదాలు లేవోయ్..

చదవడానికి కన్నీళ్ళు మిగిలాయి
చదవగలవా ఈ మనసు వేదన..

దేహాన్ని విడిచిన ప్రాణం లా
జీవం మరచిన ప్రాణిని అయ్యాను..

✍అరుణిమలు

Sunday, 7 October 2018

తాను నేను

నాతో నే చేస్తున్న అంతర్యుద్ధాలు ఎన్నో
అవునంటే కాదంటు
కాదంటే అవునంటు

హద్దులంటు మనసు చుట్టూ కంచెను వేసి ఏకాంతంలో పడేస్తున్న..
స్వేచ్ఛ అంటూ గిరి గీసి.. ఆలోచనలను గిరి అవతల వదిలి నేను ఇవతల చోద్యం చూస్తున్న..

మనసుకు కళ్ళెం కావాలంటు...కళ్ళకు ఆంక్షలను వివరించాను

ఆత్మాభిమానం అంటు ఈదుతున్న ఎదురొడ్డి ఆటుపోట్లకు..

నిజాయితీనే ఆయుధంగా మలిచానేమొ
రెండు వేపుల పదును తేలి ఉంది గాయాలను చేస్తూ..

తప్పు చేస్తానా అంటూ చేసే పనులను తరచి తరచి మరీ చూస్తున్న..
తప్పటడుగు పడనీకంటు పదే పదే మనసును హెచ్చరిస్తున్న..

పొగరుంటే చాలా..

ఏమో తలొంచని ఆ పొగరంటే చాలా ఇష్టం....
ఎన్ని వదిలేసిన,
ఎంత మొండిగా నిలబడిన,
ఎన్ని ఇష్డాలను తుడిచేసిన,
ఎన్ని కన్నీళ్ళు కారిన,
ఆఖరుకు ఒంటరినైనా కూడా
తలెత్తి నా పొగరును చూడటం నాకు గర్వం..

✍️అరుణిమలు

Saturday, 6 October 2018

తాను నేను

ఏం చేస్తున్నావో అనే ఆలోచనల లోకం నుండి బయటకు వచ్చి చూస్తే.....
ఎదురుగా ఉంటావోయ్...పిలిస్తే ఎదురొచ్చిన వాడిలా..

ఎలా ఉన్నావో అంటూ అడగమంటుంది మనసు...
ఎదుట పడలేని మాటలకు రూపాన్ని ఇవ్వగలనా..

వెతికి వెతికి అలసిన పాదాలను చేర్చేది ఎలా నీ ముందరకు..
చులకన కాలేని పలకరింపును పక్కకు పెట్టేస్తున్న...

ఎక్కడ నువ్వంటు వెతికే చూపులకు గంతలను కట్టేస్తున్న...
నన్ను నా నుండి వేరు చేసి నీ ముందర పెడతాయేమో అని..

పలవరింతలేమో పదే పదే పలకరిస్తున్నాయి..
నీ మనసు ఎక్కడ అని ప్రశ్నలను సంధిస్తూ..

నమ్మకాన్ని నీకు ఇచ్చేసా
ఆశలను నీ గడపలో వదిలేసా
కోర్కెలను కసిరి పంపేసా
నాలుగు నవ్వులను ఇచ్చేసి
కాసిన్ని కన్నీళ్ళను తీసుకున్న

నెగ్గాలని లేదోయ్
తగ్గాలని లేదు
కలిసి నడవాలని మాత్రమే ఉంది
ఇక అదీ వద్దు..
✍అరుణిమలు

తాను నేను

అభిమానం గాయపడింది...
ఔషధం ఏదంటు వెతుకుతుంది మనసు...
నాది నాదని అరచేత దాచినదే గాయం చేస్తే బాధ చెప్పుకునేది ఎవరితో..

దోసిట ఉన్నది జారవిడిస్తే ఒక యాతన...
పట్టి ఉంచితే మళ్ళీ మళ్ళీ గాయాన్ని తట్టుకునే శక్తి ఉందా అని ప్రశ్న మిగిలి ఉంది..

ఇష్టంగా చేరిన కొమ్మ నీడలో సేద తీరుదామంటే
రాలే ముళ్ళను హత్తుకునేది ఎలా...

గర్వంగా నిలిచిన నాదన్న చోటే
కదులుతుంటే
ఎలా నిలదొక్కుకునేది అక్కడ..

తోడు కోరని చెలిమివే
నాదనే ధైర్యానివే
నగు పాలు చేస్తే నే నవ్వేది ఎలా...

నిన్ను చూడగానే పెదవి పై పూచే నవ్వుకు తోడు
కంటిలో చెమ్మ కూడా చేరుతుంది..

మనసుకింకా ధైర్యం ఉంది
నీ మనిషినే అని చెప్పేందుకు కానీ
నాకేది...ఆ శక్తి ఉందా అని సందేహంలో పడేసింది..

నచ్చినచోటు దక్కదేమో
దక్కిందే నచ్చిందని నప్పుకుపోవాలి ఏమో...
కానీ ఎలా...చేతకాదే

ఎన్ని జరిగిన ఈ ఇష్టానికి ఇరుగుడు దొరకడం లేదు
నన్ను నేను నీ నుండి దూరం చేసేందుకు..

✍అరుణిమలు

తాను నేను

తూల నాడటం సులువే
తడిచిన కన్నులను తుడవడమే కష్టం..

అరచేత వెన్నముద్దనే నీ చల్లని నీడలో
నీ శ్వాసలో మార్పు చాలోయ్ నే కరిగిపోయేందుకు..

ఎంత సున్నితం‌‌ ఈ మనసు
కదిపిన చేతిని వదిలి, కన్నులకు శిక్షను వేస్తుంది..

పరాయి వాడివైతే పోరాడే దాన్ని ఏమో
నా వాడివయ్యావేమో పరాజయమే మేలంటు దారి మళ్ళించేస్తుంది మనసు..

తలొంచని పొగరుని ఎలా నేను వంచేది లోకం ముందర..
నీకై వాలిన కనురెప్ప లలో తుఫాను రేగుతుంది ఇక్కడ..

నీ ముందర నన్ను నేను తగ్గించగలను
నా మర్యాదను నీలో చూస్తున్న కనుక..

లోకం ఎదురుగా తలొంచేది ఎలా
నీ పరువును నేను అనుకున్నాక..

పేరులు కలవలేదేమో కానీ
ఇచ్చిపుచ్చేసుకున్నాం ఎన్నో వాగ్దానాలను
వాటిని మీరేది ఎలా..

✍️అరుణిమలు

తాను నేను

శరీర సుఖం క్షణాల్లో మరుపై పోతుంది..
వాంఛలన్ని చెమట చుక్కలై ఆవిరై పోతాయి..

రెండు దేహల రాపిడిలో వేడెక్కిన వాతావరణం నిట్టూర్పుల తాపానికి తడిసి పోతుంది..

అలిసిన శరీరాలు నిద్రావస్థలో నుండి తేరుకున్నాక మిగిలేది అనుభూతి మాత్రమే..

కానీ ఙ్ఞాపకాలు దొరికేది చిన్న చిన్న పనులలో, నవ్వులలో, జారే కన్నీటి చుక్క ల్లోనే....

కలిసి గడిపిన ప్రతీ ఘడియను హత్తుకునే మాటలు ఎన్నో.... కోపాల చాటున దాగిన భాద్యత...
అలకల చాటున దాగిన అల్లరి తనం...
బుజ్జగించే వేళలో చూపించే ఆత్మీయత...

నీకై రాలే కన్నీటి చుక్కను దోసిట పట్టి నన్ను గుండెలకు హత్తుకునే భరోసాను..

నేనున్న అంటూ నవ్వుతా కన్ను ఎగరేసే కొంటెతనంలోని చిలిపితనం..

విసుగుల మధ్య మూతి విరుపులు...బుంగ మూతితో ఆడే పెదవి ఆటలు...నా దేహం పై అల్లికలు అల్లుతా మెలికలు తిరిగే నీ చేతి వేళ్ళు...

ఎన్నెన్నో ఙ్ఞాపకాలోయ్... ప్రతీ క్షణం ఒక బహుమతిగా మారి..
నీ ఒడిలో కుదురుగా నిదరోతుంది నాకేమంటూ, నాకేంటంటు..

పొంత నిండని ఈ ఙ్ఞాపకాల సంపద చాలోయ్ నీ నుండి...
దూరమైనా,దగ్గరైనా వాటిని చెరిపే శక్తి ఏముంది ఇలలో...

✍️అరుణిమలు

తాను నేను

నిద్రని తలగడకు వదిలేసి
నే ఆలోచనలలో కునుకేసా..
నిదురించిన రేయి కలవరిస్తుంది
కంటికి మింటికి ఈ ఏకదార దేనికని..

రెప్ప పడుతుంటే ఏ పిలుపో వినిపిస్తుంది
ఉన్నావా అంటు..
నిదురను చెరిపేసిన అలజడి ఏదో
ఉలిక్కిపడి లేపింది..

చుట్టూ చీకటి
బాగుంది
నాకు నన్ను కనపడనంత చిక్కదనం..

ఏదో చేజారిందేమో
మనసు ఆరాట పడుతుంది వెతకమంటు..

వదిలి వచ్చేసిన చోటే ఆగి పోయింది ఏమొ వెర్రి మనసు..
ఇంకా నాదే అనే భ్రమలో ఉంది..

ఏ కీచురాళ్ళు చప్పుడు చేసిన బాగుండేది
కాస్త మనసు అటు మళ్ళేది ఏమో..

కునుకుపాటు పడుతుంది మంచం
జో కొట్టి కొట్టి ..

వేల తారలను అలంకరించిన ఆ ఆకాశం మెరిసి పోతుంది చలనం లేకుండా..
అచ్చు నవ్వులను అద్దుకున్న నా మనసులా

✍️అరుణిమలు

తాను నేను

ఆటు పోట్లు ఎన్నో
ఎద హోరెత్తుతు ఉంటే

పాదాలను తాకుతున్న చెమ్మ వెచ్చగా ఉంది
ఏదో భారంగా దిగజారి నేలను తాకి చెమ్మగిల్లినట్టు

పెదవి ఏదో చెప్పాలి అంటుంది
ఏదో ఉప్పగా తాకుతుంది మనసుని అని..

ఇష్టాన్ని ఇసుకలో రాస్తున్న గాలికి చెదిరి పోతుంది
చేతికి చిక్కని రేణువులలో ఆశలన్ని చెల్లాచెదురుగా చెరిగి పోయాయి..

కోపంగా కడుతున్న దేనికో సమాధిని..
మనసుకు నచ్చలేదు ఏమొ... శ్వాస వాడికి సమాధి చిధ్రమై పోతుంది..

పాదాల ముందరి చెమ్మలో రాస్తున్న మనసు తెరచి
అక్షరాభ్యాసం చేసినట్లు తడబడుతూ..

చిత్రంగా అవి చెదిరి పోలేదు
అక్షారాభిషేకం కొనసాగుతుంది గుండెను గొంతుగా మార్చి
మౌనాన్ని మాటగా మలిచి
భావాన్ని అక్షరానిగా తీర్చి

ఏ సాగర ఘోష నా చెవిన పడలేదు ఇప్పుడు
నా మనసు హోరు ముందు

నా బలం నేనేగా
నాకు నేను అక్షరాలుగా మారుతు
నాకు నేను తోడుగా ఉన్నాక..

ఏ దిక్కుకు నేను చూడాలి
ఏ గడపకు నా చూపులను తోరణాన్ని చేయాలి ఇప్పుడు..

✍️అరుణిమలు

Saturday, 29 September 2018

తాను నేను

నువ్వంటే ఎంతెంత ఇష్టమొ
అరచేత అద్దిన గోరింటలా చూపించనా..
నీ మీద ఉన్న కోపాన్ని
ఎరుపెక్కని కంటి కొనలలో దాచి చూపించనా..

నీకై నా ఆలోచనలో ఎన్నో చెప్పలేక
ఆ ఆకాశంలో చుక్కలన్ని అంటూ చూపించిన..
నీలో తప్పి పోయిన నన్ను వెతుకుతున్న అని
ఆ విశ్వాన్ని బొమ్మ గీసి చూపించనా..

నీకోసం ఎదురు చూసిన చూపులను వర్ణించనా
ఆ కొలనులో కలువ, చందమామ లను ఉదాహరణ చేసి..

నీ ముందర ఆడిన ఆటలను
ఓడిన అలకలను నీకేమని చెప్పను..
నీ భుజాలపై తలవాల్చిన పాపాయిని అయ్యి మాటలే మరచిపోయా అని..

ఏ అగాధాలను తవ్వలేని కోపాలు
కరిగిపోతునే ఉన్నాయి మన మధ్య
మళ్ళీ మళ్ళీ పుడుతూ..

దయలేదంటూ మధ్యకు వచ్చిన దూరాలు దయచేస్తున్నాయి చోటు ఏదంటు..

చాలు ఇలా మనం
చెదరని చెలిమికి చిరునామాగా..
చెంతన లేవు అంతే
ఉన్నది మనసులోనే కదా..

✍️అరుణిమలు

Wednesday, 26 September 2018

తాను నేను

అనుభవాలు ఎప్పుడు మంచివే
కొన్ని పరిచయాలే కంటిలో నలుసులా మెదులుతూ ఉంటాయి..

మరుపుకు చోటు ఇవ్వవు
మనసును వెంటాడం మానవు..

ఙ్ఞాపకాలన్ని జలగలే
మనల్ని పీల్చి పిప్పి చేసేందుకు..

అనుభూతులు కథలుగా అక్షరాలలో మిగిలాక
పఠించేందుకు పెదవి కూడా వణుకుతుంది..

మనసు పుస్తకంలో ఎన్ని మజిలీలో
మలుపు మలుపుకు మనసు భారం పెరుగుతునే ఉంది...

నీతో గడిపిన భాగం చుట్టూ
మనసు పరిభ్రమిస్తుంది..
ఇంకా ఇంకా నీతో పంచుకోవాలనే తపన దేనికో...

కన్నీటి కలువలే ఈ అక్షరాలు
తడుస్తూ మెరుస్తూ ఉన్నాయి
నా కలల సాగరంలో..

✍️అరుణిమలు

తాను నేను

నా మౌనాన్ని చేదిస్తావెందుకు
నేను వైరాగ్యాన్ని మచ్చిక చేసుకుంటుంటే..

పిలిచాన రమ్మని
నా ఒంటరితనంలో ఒయాసిస్ లా..

నా ఏకాంత లోకంలో
నాతో నేను
నాకై నేను
సాగుతుంటే నీ రాకపోకలు
రేపుతున్న అలజడులు ఎన్నో..

నన్ను నా నుండి దూరం చేసి
మచ్చిక చేసేసుకోకోయ్ నీకు..

నువ్వనే అలవాటు నుండి
నాకు విముక్తిని ఇచ్చేయ్..
ఈ అనుబంధాల సంకెళ్ళను వేయకు
మనసు మోయలేనంటుంది..

కలలను సైతం కబ్జా చేసేసావుగా
కాలాన్ని ఎదిరించి నన్ను దాచేయకు ఇలా నీలో..

కొన్ని కొన్ని ఘడియలు నన్ను ప్రశ్నిస్తున్నాయి
నీలో దాగున్నది ఎవరని..
వారించే నా పిలుపులకి వినపడనంత దూరం
పోయింది నా నీడ నన్ను వదిలి..

వద్దు..ఏది వద్దురా వదిలేయ్
ఏ తీరం చేరని ఈ బంధాన్ని..

రేపు విడదీయాలన్న వీడిపోనంత
ఏకమైనా ప్రాణాలను ఇబ్బంది పాలు చేయక ముందే తెంపేయ్ మన ఈ బంధాన్ని...

✍️అరుణిమలు

Monday, 24 September 2018

తాను నేను

చూపులను సైతం తడిమేసే నీ చూపులను తప్పించుకుని తిరుగుతున్న...

నువ్వు లేని చోటేదంటు వెతుకుతూ కదులుతున్న
నా మనసు...పదే పదే నీవేపు తిరిగి చూస్తుంది..

ప్రాణం నీతో ముడిపడి పోయింది ఏమో
పాదమెటు పద పద మంటున్న మనసు నాతో రానంటుంది...

నీ ముందు బలహీనమవుతున్న ఆలోచనలు
ఆచరణకు ససేమిరా అంటున్నాయి...

కసిరిన, నిందించిన,దండించిన మార్పు లేదోయ్
దేనికైనా సిద్దమే అంటూ ఎదిరిస్తున్నాయి...

నీతో జరిగే పోరు తక్కువ
నాలో నాతో జరిగే సమరం ఎక్కువ...

అలుపన్నది లేదు నీ తపనలకు
అదుపే లేదు నీ ఊహలకు..

నీ ఎదలో ఒక పూటకు పూచే పువ్వును
కావాలని లేదోయ్..
నిను వీడని నీ నీడకు ప్రతిరూపాన్ని కావాలని ఉంది...

ఎంతెంత దూరం నేను నీకు కదులుతానో
అంతంత చేరువే అవుతుంది నా మనసు..

మనసు గిచ్చి మరీ చెబుతుంది
ఎందుకే ఈ దూరాల ఆట ఆడుతున్నావని...

✍️అరుణిమలు

Sunday, 23 September 2018

తాను నేను

అతిధిగా వచ్చావా ఈ మనసులోకి
ఆతిధ్యం ఇచ్చావా నా మనసుకు

అవసరాల ముసుగులో లోకం ఉంది
నేను నీ అవసరాన్ని కాను కదూ

కోరికల వలయంలో వయసులు ఊగుతున్నాయి
నీ కోరికలో నేనొక వస్తువును కాను కదూ

కాలక్షేపానికి ఆటలు ఎన్నో ఈ మనసులతో
నీ ఆటలో నేనొక బొమ్మను కానుగా

హక్కులు కోరే సమాజంలో
నా హక్కువు నువ్వే కదా

అధికారం ఆశించే అంగడిలో
ఇద్దరం అమ్ముడు పోలేదు కదు ఎవరికి

సమూహంలో నువ్వు ఉన్నావు
ఆ గుంపులో నేను ఒకదానిని కాదు కదా

నేను సమూహంలో ఉన్నా
నువ్వు నాలో సగ భాగానివై మాత్రం కనిపిస్తావు

హ్మ్్్్్్్్

ప్రశ్నలన్ని పదాల పేరికగా మిగిలాయి
జవాబులన్ని భవిష్యత్తులో దాగున్నాయి

✍️అరుణిమలు

తాను నేను

కొన్ని మాటలు మౌనాన్ని వీడాక
నిర్ణయాలు నిశ్శబ్దం నీడకు చేరుతాయి

తెంచేయలేని పదాలను
పంటి కింద పడి నలిపేస్తూ
మనసును తుంచేసి కదులుతుంటే
ఆ కాలమే ఒక సాక్ష్యమై చూస్తుంది..

ఎదంతా అల్లకల్లోలమే
ఒడ్డుకు చేరిన తుఫాను తాకిడికి
ప్రకృతి విలయంలా మారిన దేహపు
అవస్థలు అంతర్లీనంగా దాడి చేస్తున్నాయి..

ఉప్పు నీటికి కరువేముంది
ఉపకారం మరవని దేహం ఇచ్చిన కానుక కదా..

రెప్ప బరువుల్లో ఎన్ని భావాలో
తేల్చ లేని అనుభవాల్లో ములిగిపోతూ..

ఆనవాళ్ళుగా చారికలు మిగిలాయి
ఆనవాయితీగా మనసుకు సర్ది చెప్పుకోవడం జరిగాక..

✍️అరుణిమలు

తాను నేను

దూరం కూడా దూరమయ్యేందుకు
ఇష్టపడనంత దగ్గరతనం దేనికోయ్ మన మధ్య...

ఎగసే అలలే మన మనసులు
అలిసిన వేళ అలకై తీరాన్ని తాకి చల్లారుతూ..

ఏ మౌనాలు కట్డేసాయో
ఈ శరీరాలను ఏకం చేసి..

నా గతంలో నువ్వు లేవేమో
భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూస్తే
నా ప్రతి అడుగు జాడలో నీ తలపు ఉంటుందోయ్..

మనసెందుకో ఇంత సున్నితం
నీ చూపులను తాళ లేను
నీ మౌనాన్ని వినలేను..

ఇష్టమైన గాయాలు నీ ఙ్ఞాపకాలు
కష్టమైనవి నీ సమక్షంలో క్షణాలు..

నీ చిరునవ్వులతో ఎదను తడిమేయకోయ్
అవి నా పెదవులను అంటి చెరగను అంటున్నాయి..

రెప్ప లేవని నా కనుపాపల పందిరిలో
రెప్ప వాల్చనివ్వని నీ తాకిడులు ఎన్నో...

తట్టి లేపుతున్న ఉదయాలను
తలగడకు వదిలేసి...
నేనింకా నీ ఎదలోనే నిదురిస్తున్న వెచ్చగా...

నీ సొత్తునే ఎప్పటికి
ఎదురుగా నువ్వున్న, లేకున్న
ఎదను ఇచ్చేసింది నీకే కదా..

✍️అరుణిమలు

తాను నేను

నీ చుట్టూ తిరుగుతున్న నా ఆలోచనలలో
ఏముంది రా... బయట పడనివ్వడం లేదు..

నీ ఎదురు పడకుండా ఉండలేను
చూసాక చూడనట్టు వెళ్ళడం ఇంకా ఇష్టం..

మాట్లాడకుండా అస్సలు ఉండలేను
కానీ నిన్ను గిల్లే మాట అనడం ఎంత ఇష్టమో..

తగవులకు నే సిద్దం అంటా
నీతో తలబడితే తగువుకు కూడా తంటానే మనతో..

అలకలలో ముందు ఉంటా
అలిగిన వేళ నా తలపులలో నిన్ను ఉక్కిరిబిక్కిరి చేయడం మహా ఇష్టం...

ఎదురు చూపుల విసుగుల్లో
ఎన్నెన్ని వింత ఆలోచనలో నీకై, కష్టమైన అవీ ఇష్టమే...

అందీ అందని మన ఆటలో
దూరం అనే భయం భయపెడుతుంది
ఏదో రోజు తప్పదంటు...

మనిషికి దూరం ఉందేమో
మనసుకు దూరం లేదని ఆ భయానికి తెలియదు కదా...

ఎద గదిలో దాచేస్తున్న ఙ్ఞాపకాలు ఎన్నో
రేపటికి నీ తలపులకు ఆయువు పోసేందుకు...

ఈ క్షణాలను అనుభవిస్తూ
రేపటికి మనసు పడే యాతనకు సిద్దమే అంటున్న
సిధ్దమేనా...

ఏమో.......

✍️అరుణిమలు

తాను నేను

ఆహ్వానించావు చేయి అందించి
ఆజ్ఞాపించావు నువ్వు నాకేంటో తెలుసుకోమంటు

అధికారం అందుకున్నావు
నువ్వు నాలో సగమంటు

అజమాయిషీ ఇచ్చావు నీపై
నా హక్కని గుర్తించుకోమంటు

మందలించావు
మరుపుకు ఇక్కడ చోటు ఇవ్వకంటు 

నువ్వు నా దానివే అన్నావు
నేను నీ వాడినే అని సందేహం దేనికంటు

నీ బలం నేనయ్యానేమో
నా బలగం నువ్వుగా మారావు

నా అలకలు ఎంతసేపోయ్
నీ పిలుపు నా చెవిన పడనంత వరకు

నా మరోజన్మకు మూలానివి
నా మమతలన్నిటిని ఏలే రాజువి

నా గతజన్మ ఋణానివి ఏమో
నీ మనసు ఖైదులో బందీని అయిపోయా..

✍🏻అరుణిమలు

Monday, 17 September 2018

తాను నేను

నన్ను నేను ఎక్కడ దాచుకున్నాను
నన్ను నా నుండి దోచింది ఎవరు..?!

ధైర్యం నవ్వుతుంది నిబ్బరంగా..
మనసు వెతుకుతుంది
కారణలను కాగడాల వెలుగులో..!!

చూపులనిండా మనశ్శాంతే..
ఒకసారి ఆ చూపుల దారి వేపు చూస్తే
కనిపించేది అంతా అశాంతే..!!

మోము నిండా మనో నిబ్బరం..
మది లోతుల్లో
పొరలు పొరలుగా దాగిన
మానసిక సంఘర్షణ..!!

ఆవేదనలో వేదన లేదు
అవకాశం తీగలా అల్లిన చిక్కుముడులే ఉన్నాయి..
ఎలుగెత్తి అరవాలని ఉంది
ఎద బావిలో దాగిన దుఃఖాన్ని తోడేయాలని..!!

దహిస్తున్న నిన్నటిని
నేటితో చెరిపేసి రేపటిని ముస్తాబు చేయాలని..
అద్దుకున్న నవ్వులను కాస్త పక్కన పెట్టి
గుక్క పెట్టి మరీ గొంతులో దాగిన దుఃఖాన్ని బయటకు విసిరేయాలని ఉంది...!!

ఏది ఆ వేళ
ఊరించే ఎండమావే అది..
దేహానికి ఆ ధైర్యం ఎక్కడ ఉంది
ఆ ఉద్రేకాన్ని ఊరడించేందుకు..!!

బద్దలయ్యేందుకు సిధ్దమే అగ్నిపర్వతాలు
ఎదురెళ్ళి ఆర్పే నాధుడు ఏడి
కన్నీరు తప్ప..!!

✍🏻అరుణిమలు

తాను నేను

నీతో కలిసి ప్రపంచాన్ని చూడాలని ఉంది.. చూపిస్తావా.. ??

ఆ ప్రపంచం అంతటా నువ్వే కనిపించాలి
నా ప్రపంచం నువ్వైపోవాలి..
నీ లోకం నేనే కావాలి..

కలిసిన ఇద్దరి హృదయాలే కదా
మన'సు గా మారేది..
ఆ మనమైన మనసును
లోకానికి చూపించేద్దాం..

✍️అరుణిమలు

Friday, 14 September 2018

తాను నేను

ఏ రేణువై వచ్చావో
మదిని వేణు రాగమై మీటావు

ఏ స్వప్నమై వచ్చావో
నిదురించిన కనులలో కలవరం మొదలైంది

ఏ పాల మీగడల రుచి చూసావో
నా పెదవులకు తీపి తీపి నవ్వులను రుచి చూపించావు..

ఏ రచనలు రచించావో నన్ను చేరేందుకు
నా ముంగురల కొనలో దారి తప్పావు

ఏ ఏకాంతాలను జయించుకు చేరావో చెంతకు
నీ కాంతగా మారి చేరికై పోయాను

ఒంటరితనాన్ని పక్కకు తోసి
ఒడిసి పట్టేసావు నీ బాహు బంధనంలో

గాలి కబురులను ఉఫ్ అని ఊదేసి
నీ మాటల ఊటలలో ఊరించేసావు

వయ్యారాలు తెలియని వయసుకు
నీ వాడి చూపుల వడ్డనలే విందు అయ్యింది

ఓయ్....వినుకో
వింతలన్ని నీ ముంగిట ఉన్నాయి
ఏలుకోమంటు...

నే వింతను కానోయ్
నువ్వు ఎన్నుకొన్న నీ కన్యను...

పసుపు గడపకు పారాణినై
నీ ఎద గదిలో అడుగు పెట్టా..

మరో అడుగు పడేది
జీవితానికి ఆవలి వేపే నిన్ను వీడి...

✍🏻అరుణిమలు

Monday, 10 September 2018

తాను నేను

నీ చూపులను చదివే కొద్ది
నా అక్షరాలలో చనువు పెరుగుతుంది..

పెదవి మరిచింది నవ్వడం
నీ ముందర విరుపులు చెల్లవని..

నీ మనసును తట్టి లేపేందుకు
నా మౌనం మువ్వగా మారింది..

నదికి ఎదురొచ్చిన సాగరానివై
అణువణువునా ప్రవహించేయ్
నన్ను కలిపేసుకుంటూ..

సరసుడివే మనసును చైత్రమై మీటావు
మేను వేణువై పోయి రాగాలు పలుకుతుంది..

కనుల కౌగిలింతలో దాచేయకోయ్ నన్ను
నీ చూపుల కోకను తొలగించేసి..

వెక్కిరింతలు దేనికో నా అక్షరాలంటే
నా భావాలు నీ వెంట పడుతున్నాయి అనా..

పదాలలో దాగింది మనమే
ఈ మనసనే పదవులను పాలించేది మనమే..

✍️అరుణిమలు

తాను నేను

నిజమై నువ్వు ఎదురు పడితే
అందులో నా పాత్రను నే చూడాలని ఉంది..

బ్రహ్మ రాతవో
ఖర్మ ఫలానివో
ఏ కార్యానికి ప్రతిఫలానివో నాకై నువ్వు అని..

నువ్వు రచించిన చరితలో
అవసరాన్నా
ఉపయోగాన్నా..

ఎవరిని నేను..??

బాటసారి వై సేద తీరావా
బాటేసుకు వచ్చావా ఆకలితో

ఎవరివి నువ్వు..??

బదులు లేని ప్రశ్నలలో ఒక ఇష్టమైన ప్రశ్నవు
శేషం తెగని ఒక సశేషానివి..

కాలక్షేపానికి శరీరాన్ని ఇచ్చేయలేను... కానీ
నాదనే మనసుకు నా మనసును
ధారాదత్తం చేసేయగలను ఈ జన్మకు..

✍️అరుణిమలు

Saturday, 8 September 2018

తాను నేను

రాసినవి చెరిపేయగలను
రాలుతున్న కన్నీటి చుక్కలను తుడిచేయగలను
గతాన్ని ఏం చేయగలను.?

నీడలో నీడై పోయిన నీ ఙ్ఞాపకాలను ఎలా కడిగేయను..
రాజుకుంటున్న దుఃఖం ఆరనంటుంది..
తలపులు చేస్తున్న గాయాలను తాకుతున్న కన్నీటి చెమ్మ మంట పెడుతుంది..

ఆశలన్ని ఇసుక రాతలుగా గాలిలో కలిసిపోయాయి
నీ వాగ్ధానాలన్ని వట్టి మాటగా వడిలి పోయాయి
ఎవరికి ఎవరం అవసరమై పోయామో
ఎవరికి ఎవరం శాపమై పోయామో..

ఎంత రాసిన తరగని వ్యధ
ఎంతెంత రాస్తున్న మిగిలే ఉన్న మన కథ
అంతంత రాసిన నిన్ను మరుపుగా మార్చలేని నా మనసు వేదన..

భావానికి మనసును ఊతగా చేసి
ఇంకిపోని కన్నీటి సిరాలో ముంచి మరీ లిఖిస్తున్న..

నీ ఆటను...
నే ఓడిన నా మనసును..

✍️అరుణిమలు