నా దినచర్య రోజు ఒకటే...గురుతున్నాన అంటూ పలకరించడం...
ఆ పలకరింపుకి అవకాశం ఇచ్చిన ఆ ఇద్దరినీ మరచిపోలేను...
అందుకు కారకులు, సాక్షులు వాళ్ళే ఒకరున్న చోట ఇంకొకరు ఇమడలేని ఆ సూర్యచంద్రులు...
ఒకప్పటి నీ పాత్ర అదిప్పుడు నా దినచర్యగా మారింది...
గురుతుంచుకోమని గురుతుచేయడం గమ్మత్తుగా లేదు కాని ఏమొ అలా ఏదోలా ఉంది...
గడిచిన ఈ క్షణం మరుక్షణానికి ఒక ఙ్ఞాపకమే కదా...
నాకు ప్రతీ క్షణం ఙ్ఞాపకమే...నీకు గురుతు చేస్తే కాని గురుతు రాని ఙ్ఞాపకాలు...
ఏ క్షణం నా కళ్ళలో పడ్డావో కాని కళ్ళలో కన్నీరువై కొలువై పోయావు...
రేయి చాటు స్వప్నానివేమొ కదా రెప్ప చాటున దాగి ఒక్కొక్క చుక్కని జారవిడుస్తూ సంబరం చూస్తుంటావు...
తప్పు నీదా కాదుగా....ఆ స్థానం ఇచ్చిన నాది కదా...
కన్నీటికి రంగు లేదు కనుక సరిపోయింది లేదా ఈ తలగడ కూడా నా గోడుని గుట్టుగా వినడానికి సిద్ధపడేది కాదేమొ...
కళ్ళనిండా నింపుకున్న చెలమలతో అలిసి నిదురించేది శరీరమే మనసు కాదు...
భానుడి కిరణాలు నులి వెచ్చగ నను తాకుతుంటే,చల్లని గాలి కిటికి గుండా వచ్చి నన్ను తడుముతుంటే...
రెప్పలు తెరవని నా కన్నులలో దాగున్న నువ్వు, గోరు వెచ్చని బిందువై ....
నా నాసిక మీదనుండి అంచులకు చేరి ఇంక ఉంటాను అంటూ నేలను చేరి ఆవిరౌతుంటే ...
నిదురించని నా మనసు తట్టి లేపుతుంది లే ఇంక అటు చూడంటూ...
అందుకునేంతలోనే నిజం లాంటి నువ్వు చేజారిపోవడం ప్రతి పొద్దు పొడుపున జరిగేదే...
నా నిట్టూర్పుకి ఒక నవ్వును జోడిస్తూ నా దినచర్య మళ్ళీ మొదలు పెడతాను గురుతున్నాన అంటూ....
ఇది నాకలవాటు గ్రహపాటో,పొరపాటో ఏదైనా నా తలరాత ఇదే...
కొరివితో తలగోక్కుంటే మంట కాకపోతే మంచు కురుస్తుందా....
...............అరుణని...............
No comments:
Post a Comment