Thursday, 15 February 2018

తాను నేను

ప్రేమికుల రోజట.....
అస్తమయం ఎరగని నా ప్రేమకు ప్రతీ ఉషస్సు ఆయువును పెంచుతుంది....
నువ్వనే వెలుగు నీడలలో ఆదమరచి సేద తీరుతున్న....
నీ పేరు ఎద సవ్వడై పలుకుతుంటే...
నువ్వనే ఆశను శ్వాసగా నింపుకున్నాక....
హే.....విడగొట్టి, వేరు చేసి చూపించడానికి ఏం మిగులుంది....

రెండు పదాలుగా మారిన ఇద్దరం...
రెండు తనువులను ఏకం చేసి ఒక ఆత్మగా మలిచాక....
మనమనే ఒకాశ ఆకశాన జాబిలై వెలుగుతుంటే...
ఈ బంధనానికి ప్రేమ అనే ముడివేసాక....

ప్రతీరోజు ప్రణయాల నడుమ ప్రేమ యాత్రలు జరుగుతునే ఉన్నాయి....
బుజ్జగింపుల జోలపాటలన్నీ నీ ఒడిలో వింటూ ఉంటే...
నా పెదవికి వెలుగులు అద్ది లోకమంతా చీకటై పోయింది...

ఓయ్.....నిన్ను తలవని గడియన జరుపుకోవోయ్
ప్రేమికుల రోజు....

✍️అరుణిమలు

తాను నేను

కొన్ని కన్నీళ్ళను ఆపతరం కాదు....
వదిలేయడం మంచిది...
కారణాలు అనేకం ఉన్నా
అన్నిటికి కన్నీటి చుక్క కరగదు...

అనుభవాల నలుగుబాటులో
అంతరంగం చేసే అర్చన...
చీకటిని కడుగుతూ జారుతున్న
కంటనీరు కంటికింపుగా మారుతుంది...

ఏం ఆశిస్తామొ అవే వెక్కిరిస్తాయి...
ఏం చేయకూడదు అనుకుంటామో
అవే ప్రశ్నలుగా పరీక్ష పెడతాయి...

మనలో నుండి మనల్ని విడగొట్టి
నేనుగా బయటపడటం అంటే
ఎన్ని కన్నీటి కడలలను దాటి రావాలో...

బయట పడటం అంటే...
నీ ఎదురుగా లేనేమో కానీ
నా తలపుల నిండా తలగడ నిండిన చెమ్మవై ఉన్నావని ఎలా మరచిపోను....

హద్దులు లేని పరిచయాల నడుమ నలిగే బదులు
చూసి చూడనట్టు మనసును చంపుకుని
మనిషికో నీతిగా మారిన బలహీనతల మధ్య
నేను ఇదీ అంటూ గిరి గీసుకోనా, ప్రశ్నించనా....

అవధులు లేవి అతి ప్రేమల నడుమ
లోకానికి హేళనగా కనపడే బదులు
నాలుగు కన్నీటి చుక్కలు తోడుగా మన అనే బంధాన్ని తెంచుకుని బయటపడటం మేలు కదూ....

కష్టమే.....కానీ ఆత్మాభిమానం వదులు కోవడం
ఆత్మవంచన చేసుకోవడం ఇంకా కష్టం...

✍️అరుణిమలు

తాను నేను

ఏవిటో కొంటె తలపులు కమ్ముకుంటాయి
అలా మూసుకుంటు, మోసుకొంటు నీ జాడలను...

అప్పుడెప్పుడో మనల్ని ఒకటి చేసిన ఊసులు
నెమరేస్తూ ఉండాలనిపిస్తుంది...

నే నీకు ఇచ్చిన చోటు అలాగే ఉంది....
నువ్వు ఇచ్చిన మాట మాత్రం లేదక్కడ...

ఎప్పుడు ఉరుమై ఉరుముతావో..
ఎప్పుడు కురిసి, తడిపేసి పోతావో...

మెరిసే మెరుపువే కంటికి...
ఎదురు చూసే మనసుకు మాత్రం పిడుగువే...

నీ కోసం వెతికిన దారులలో ఎండమావివై కనిపిస్తావు...
నా దారిన నే పోతే ఎదురు పడతావు....

ఊరించేది నువ్వే....
ఉసూరనిపించేది నువ్వే....
కాస్త నిదానించవోయ్ కావలసిన వారి కోసం...
కాస్త కన్నెర్ర చేయవోయ్ ఈ దూరాల పై...

✍️అరుణిమలు

తాను నేను

గాలి వచ్చి నను తాకుతూ అంది, నాతో ప్రయాణించవా అని...
కల్మషాల లోకాన్ని వదిలి కాసేపలా సీతకోకలా అనుభూతుల రంగులను అద్దుకుని కదిలా....

అప్పుడే విరిసిన తావులన్ని పసిపిల్లల నవ్వుల్లా కళకళలాడుతూ ఉన్నాయి...
అమ్మ ఒడిలా తనను తాను మలుచుకున్న మహావృక్షాల నడుమ అలిసిన పాపాయిలా సేద తీరుతూ....

తూనిగలు మోసుకొచ్చిన కథలను వింటూ...
పడుచు పిల్ల వయ్యారాలకు మూలం మేమే అంటూ పైరు కొనలు గాలికి నాట్యం ఆడుతా ఉంటే...

పంట కాలువలో అప్పుడే ఈత నేర్చిన చేప పిల్లనై...
ఏ చిగురుల చాటునో చిలక ముక్కుకు చిక్కని జాంపండుని అందుకని...

వగరైన నేరేడు కోసం ఆ చిటారు కొమ్మను అందుకోలేక ఊరించే ఉసిరిని కసిరి కొట్టి అందుకొని బుగ్గన పెట్టుకొని...

వాలే పొద్దులో తోడుగా వచ్చిన మిణుగురుల స్వర్ణ కాంతిలో తారలను లెక్కపెడుతూ నిద్దరోతూ ఉంటే....

ఇది కాదా అనుభూతి అంటే.... ఇంతకన్నా ఇంకేం కావాలి ఈ మనిషికి అని ప్రశ్న వినిపించింది....

✍️అరుణిమలు

తాను నేను

ఏకాంతాన్ని కౌగిలించుకొని ఉన్న
శూన్యంలో ఒంటరినై....
సత్యా అసత్యాలు కూడా ఒకేలా కనిపిస్తున్నాయి...

కనులు మూసి ఉన్నానా, తెరిచి ఉన్నానో తెలియని మది గుడారంలో ఓ మూలగా...
దిశలు ఎరుగని, దారులు లేని చోట అజ్ఞాతవాసం...

నాలో నేను ప్రయాణిస్తూ, నన్ను నేను తొంగి చూస్తూ...
అనంతమైన లోతులను తాకే ప్రయత్నంలో అలసి కన్నీటితో దప్పిక తీర్చుకొని సేదతీరుతున్న...

ఆశనిరాశల, గెలుపోటముల సంభరాలు మౌనంగా జరిగిపోతున్నాయి...
నిండుగా ఉన్న సరస్సులో ఒక మంచు బిందువు తాకిడికి రేగిన అలజడిలా తేరుకున్నానా చుట్టూ వెలుతురే...

నాతో నేను సాగించే ప్రయాణానికి విరామం మరో వెలుగు రేఖల అనుభవానికి...

మళ్ళీ వస్తా నన్ను నేను నిశితంగా పరిశీలించడానికి....నిస్సిగ్గుగా ప్రశ్నించుకోవడానికి...

✍️అరుణిమలు

Friday, 9 February 2018

తాను నేను

అన్ని పంచుకోలేం
అన్ని దాచుకోలేం
చెబితే కానీ తెలుసుకోని నీకు ఏమని చెప్పను...
చెప్పకనే గ్రహించగలవు ఎందుకంటే
ఇక్కడ ఉన్నది నిన్ను దాచుకున్న నీ మనసు కనుక...

నిన్ను ఊపిరిగా నింపుకున్న, మనసు నలుగు బాటు నీకు తెలియదా...
తెలిసి తెలియని నీ నటనల మధ్య... నువ్వు పొందింది ఎంతో కానీ నన్ను నేను కోల్పోయాను నీ దగ్గర...

బదులు రాని ప్రశ్నలు సంధించేది...
బరువెక్కిన గుండెను కుదుటపరిచేందుకే...
కానీ,కుదురు లేని ఈ మనసుకి నిత్య జాగారాలే...
నిత్య అభిషేకాలే నీ నామార్చనతో...

జారే కన్నీటి చుక్కకి బదులు కోరను
అనుభూతికి, అనుభవానికి, ఆశించిన దానికి
నడుమ జరిగే సంఘర్షణకు అందిన ఫలితం కనుక...

అలాగని నన్ను నేను సముదాయించి...
మరుపు మాటుకు పోనూ లేను...

✍️అరుణిమలు

తాను నేను

కలిసుండటం అంటే రెండు దేహాల సహా జీవనం కాదు....
నువ్వు నాతో ఉన్న, లేకున్నా నా స్థానాన్ని కబ్జా చేయడం...

తలపులో తిష్ట వేసుకుని కూర్చోవడం
చెరగని జ్ఞాపకాల కానుకలు
చెదరని ఆశలు
ఎదురు చూపుల వశమై పోవడం

ఈ దూరాల కొలత
శూన్యం అనిపించేంత చేరువలో నువ్వు ఉండటం...
ఆకాశంలా నా నీడగ...
అడుగడుగునా ధరణీ లా నా తోడువై...

ఊహలలో ఊరించి...
కన్నీరుగా కరిగించి...
పెదవంచున తీపి తాంబూలమై...
నువ్వెక్కడ అనే ఆలోచనను బంధించి...
నన్ను నీలో శ్వాసింప చేయడం....

మొత్తానికి నేను ...
నువ్వు రాకముందు, నువ్వు వచ్చాక అనే భాగాలుగా మిగిలిన తోడును....

✍️అరుణిమలు