Wednesday, 8 August 2018

తాను నేను

నీ నిర్భంధపు ఆలోచనలలో నేనో ఖైదీని
నీ నిర్భంధపు కౌగిలిలో నేనో మధురమైన ఙ్ఞాపకాన్ని..

నీకు బంధీగా మిగిలిన నా మనసు బంధనంలో
నువ్వు లిఖించిన ఓ పెదవి లేఖనాన్ని..

నిన్ను చేరని, చెరగని ఒక భావాన్ని
లిపి లేని నా కంటి బాసకి నువ్వో పాఠకుడివి..

మన మధ్య దూరాలను కొలుద్దామా
తీరాన్ని తాకిన కంటి అలకే తెలుసోయ్ ఆ దూరం..

నా మది పుస్తకంలో నువ్వో శిలాక్షరానివి
కామాలు తప్ప పులి స్టాప్ పడని కథ మనది..

కానీ ఈ దగ్గర తనం ఎప్పుడూ భయపెడుతుంది
ఏ దూర తీరాలలో ఏ అపరిచితులమై ఎదురుపడతామో అని..

నీకు కాలక్షేపమో, ఒక అనుభూతో, ఒక అనుభవమో నేను ఏమో ....
నువ్వు ఎవరనేది మాత్రం నా ఎదురు చూపులే చెప్పక చెబుతాయి..

తెలుసుకో గలిగితే...!!

✍️అరుణిమలు

తాను నేను

నన్ను నేను మరచిపోవాలి
నన్ను నేను మాయ చేసుకపొవాలి..

నన్ను నేను పోగొట్టుకోకూడదు
అంటే తప్పదు ఏమో
నీ నుండి దూరం అవ్వాలంటే
ముందు నాకు నేను దూరం కావాలి కదూ..

అందుకే నా చుట్టూ నేను సృష్టించుకునే నవ్వులు, ద్వేషాలు ఎన్నో
నన్ను నేను దాచేసుకొని లోకాన్ని మాయ చేస్తుంటే బాగుంది..

నాకు నేనుగా తెలిసిన నేను....నేనుగా ఎవరికి తెలియనివ్వనుగా..
నేనింతే అంటూ నే గీసిన గిరి అవతల మాత్రమే చూపిస్తా..

ఇవతల ఉన్నది నిజం...ఆవల ఉన్నది అబద్దం
నన్ను తెలుసుకోవాలంటే కష్టమే...
నాలా నువ్వు మారలేవు,
నా చోటుకు నువ్వు రాలేవు..

నేనేనా...మనమంతా ఇక్కడ ఇంతే కదూ..😎😎

✍️అరుణిమలు

తాను నేను

నువ్వనే తలపు తడిమితే చాలు
మనసు స్తబ్దుగా అయిపోతుంది
ఎదంతా భారంగా
మది అంతా మౌనమై పోతుంది..

ఎటు నుండి ఎటూ కదలని ఆలోచనలు
అలికిడే మరచిన ఙ్ఞాపకాలు ఒకపక్క

అలిసిన గత కాలపు అలజడులు
ఎందుకో ఇంత అలుపు
అంత భారమా నీతో నే పెనవేసుకున్న నా ఆశలు..

ఇంత ఇరుకుగా వున్న
నా ఆలోచనలకు నీ గాలి సోకిన చాలోయ్..
మనసులో వేదనంత దూది పింజలా
జాడ తెలియని ఏ చోటునో పోయి రాలిపోతుంది..

ఉనికిని కోల్పోయిన మనసు
కొత్త కోకను కట్టినట్టు మెరిసిపోతుంది
నీ కళ్ళను తాకిన నా మోములో
ఏ ఆలోచనల నీడలు నిను తాకనంత కొత్తగా..

ఆ దూరాలలో బేలతనం
ఈ దగ్గరలో నిండుతనం
ఏవిటో...ఎక్కడికో ఈ మనం

✍️అరుణిమలు

తాను నేను

ఏం మిగలని చోట వెతుకులాట దేనికో
కనిపించని ఏ తునకైనా మిగిలిందా
అనే ఆశ ఎందుకో..

శూన్యాన్ని కూడా చదవాలనే తపన దేనికి
కంటికి కనిపిస్తు, చేతికి చిక్కని ఈ చీకటిని
ఎలా పఠించను..

నువ్వంటూ మిగలని చోట
ఇంకా ఓ ఆశల విత్తు రాలుతునే ఉంది
నాకై చీకటిని చీల్చే వేకువై వస్తావని..

నన్ను దాటి పోయిన నువ్వు
నాకు ఎదురౌతావనే ఆశకు ఏదైనా కొత్త పేరు పెట్టాలమో..

నీ అడుగుల జాడలలో నేననే
గుర్తులు లేక...
ఎవరు నువ్వంటు అవి అడిగే ప్రశ్నలకు జవాబు నిట్టూర్పుగా ఇస్తు సాగుతున్న..

అలా ఎలా కదిలిపోయావోయ్
కాలానికి నన్ను వదిలి..

నువ్విచ్చిన మాటలన్ని గాలి పాలైతే
నా రాతలు కన్నీటి పాలువుతున్నాయి..

ఏ గాలి వాటుగా నీ మాటలు
నిన్ను చేరినా చలించకు,
వెనక్కి తిరిగి చూడకు..

నువ్వు మిగిల్చిన శూన్యం
నిన్ను తనలో దాచేస్తుంది ఏమో
వెలుగులకు అలవాటు పడ్డావేమో
చీకటి నీకు కష్టమోయ్..

✍️అరుణిమలు

తాను నేను

బరువెక్కిన గుండెకు ఎంత బాధ్యత ఉందో
తనను తాను సముదాయించుకుంటు
మనిషికి ధైర్యం ఇస్తూ..

ఎన్నెన్నో నిర్ణయాల ఫలితాలు
కళ్ళ ముందు ప్రశ్నలుగా ఉంటే
వెనక్కి వెళ్ళని కాలం వెక్కిరిస్తుంది..

తడబడిన మనసు ఆలోచనలు
తప్పటడుగులై ఎటు పోతున్నాయో
కాలం పెట్టే పరీక్షలకు అంతు లేదు
ఇంత కసి ఏంటో మనసున్న మనిషంటే..

ఎద నిండా ఏకాంతమే
నా ఇష్టం, నా ఆలోచనలు, నా తప్పొప్పుల
తప్ప...అంతా ఏకాంతమే..

భవిష్యత్తు వైపు అడుగులు లేవు
వర్తమానంలో మాత్రం
చుట్టూ అరువు తెచ్చుకున్న ఆనందాలే..

ఎన్నెన్ని లావాదేవీలో
గుప్పెడు ఆనందాన్ని అలంకరించేందుకు..
ఎన్ని ఆత్మవంచనలో
రేపటికి కలగా మిగిలే ఙ్ఞాపకాల కోసం..

✍️అరుణిమలు

తాను నేను

నీ ఎద వీదికి ఎన్నిసార్లు వచ్చానో తెలుసా
ఎన్నిసార్లు నీ ఎద వాకిటిలోకి తొంగి చూసానో..

నిను పలకరించాలని
నీ మాటలలో మైమరచి పోవాలని
నిను వీడని దూరాన్ని మన మధ్య పెనవేయాలని..

ఇలా ఎన్నెన్నో ఆశలు, ఊహలతో
నీ తలపుల బరువును నింపుకుని
నీకై చూసే నా ఎదుర చూపుల విన్నపాలు
నిను చేరాలని ఎన్నిసార్లు
నీ ముంగిట్లో ముస్తాబయ్యానో మొగ్గనై..

కాస్త కనికరం కూడా లేదోయ్
ఒక్కసారి అయినా నీ ఆలోచనలను
నేను తాకానో లేదో తెలియదే..
నన్ను చేరని నీ చూపులు చెబుతున్న
అర్ధాలు ఎన్నో...

పలకరిద్దామంటే మాటలు ఏరుకునే తడబాటు
ప్రశ్నిద్దామంటే నీ జవాబును వినగలనా అనే సందేహం...
వెరసి ఇలా మౌనాన్నై నీరీక్షిస్తున్న
నన్ను నేనే పరీక్షించుకుంటు..!!

✍️అరుణిమలు

తాను నేను

బిడియం కాస్త బరువై బెట్టు చేస్తుంది
నిన్ను చూసిన చూపులను దాచేసుకోమని..

కనులలో దాగి దోబూచులాటలు ఆడేయ్
అలసిన నయనాలకు దాహం నీవే కదా..

దప్పిక తీర్చే నెపంతో దోచేసుకోవోయ్
దగ్గర లేని ఏకాంతాన్ని నా దోసిలి నింపేసి..

నే కనలేని చెలిమివి నీవేమో
నీ మానస తీరాన విహరిస్తున్న నే హంస నై..

అద్దేసుకో నా నవ్వుల మకరందాన్ని
నీ ఎదపై నా భవిష్యత్తుకు ఙ్ఞాపకంగా..

✍️అరుణిమలు❣️❣️