Thursday, 30 August 2018

తాను నేను

నువ్వెవరో అనుకున్న
నాకేంటి అనే ఆలోచన కూడా లేదు ఒకనాడు..

నువ్వెవరో... ఇప్పుడు తెలుసుకున్న
నీకేంటి నేను అని కూడా తొంగి చూసా..

మనమెవరు అనుకున్న..
తీరానికి చెరో వేపు ఎదురెదురుగా ఉన్నామని కనిపించింది..

ఎంతవరకు ఇలా అని ప్రశ్న వేసుకున్న..
నువ్వనే శ్వాస నన్ను వదలనంత వరకు అని చెప్పింది..

మన మధ్య దూరం ఎంతుందో అని కొలిచా..
కొలమానానికి కూడా చోటు లేదని మనసు పొమ్మంది ..

ఇంతకు, ఇప్పుడు మన మధ్య ఉన్నది ఏంటి
తెగని బంధమని ఋజువులు దొరికాయి..

విడదీయగలమా ఆ నింగిని, ఈ నేలను
వేరు చేయగలమా ఆ విశ్వాన్ని, ఈ చుక్కను..

✍️అరుణిమలు

తాను నేను

ఎవరికి ఎవరు శాశ్వతం..?
ప్రతీ దగ్గర తనం మధ్య
ఏదో రోజు దూరం అనేది దూరుతుంది..

పొందింది ఏముందో
పోగొట్టుకున్నది ఎంతో

అందనివి ఎన్నో
కోరనవి ఎన్నెన్నో
చెరగని మరకలు ఎన్నో
చెదిరిపోని అనుభవాలు ఎన్నో
చెరిపేయలేని జ్ఞాపకాలు ఎన్నో
బంధీగా మిగిలిపోయే భావాలు ఎన్నో
తెంచేసిన వాగ్దానాలు ఎన్నో..

తుంచేసిన కాలం వాడిన మాలై పోయింది నేడు
ఏరి కోరి కూర్చిన ఆశలన్ని నిర్జీవమై నవ్వుతున్నాయి..

ఏం శాశ్వతమని ఇంత కాలానికి అంత చోటిచ్చావు
ఏ అపురుపాన్ని గుండెల్లో అంత గుట్టుగా దాచేసావో..

ఆ కాలం ఒక బహుమతి
ఈ కాలం ఒక అనుభవం

శాపమై వచ్చిన కాలాన్ని అనుభూతుల బావిలో తోసేసి..
అక్షరాలను తోడుతున్న తరుగుతుందా ఈ వ్యధ అంటూ..

✍️అరుణిమలు

Tuesday, 28 August 2018

తాను నేను

మన మనసుల నీడన
మొలిచిన ఒక‌ మధుర స్వప్నం..

నిన్ను కలిసాక
నన్ను విడి పడిన జాడ
మనమై కలిసింది ఇలా..

చీకటి ముచ్చటపడి
చిత్రించిన చిత్రం..

రేయి సంబరపడి మరి
రచించిన మన కథ..

రాతిరి కలలు
ఇచ్చిన తీర్పు
వేకువన దీపమై వెలుగుతుంది..

ఏనాటి బంధమో ఇది
ఇలా
ముడిపడి మాయ చేస్తుంది మనసును..

పరాకులేమో ఏమో కానీ
నీ పిలుపే నా పరువానికి మేలుకోలుపోయ్..

✍️అరుణిమలు

తాను నేను

మనిషిని ఎక్కడున్నా
నా చూపుల నీడలు నీ వెంటనే ఉంటాయి..

తనువు ఇక్కడే ఉన్న
ఆలోచనలు అన్ని నిను అల్లుకునే ఉంటాయి..

ఈ క్షణంలో నేను ఉంటే
మరు గడియలో నా తలపులలో నీతో దోబూచు లాడుతా..

అక్కడ నువ్వు, ఇక్కడ నేను
ఇద్దరిలో ఎవరు దారి తప్పామో అని ఎదురు చూస్తున్న నీకై..

ప్రథమ స్థానం నీదే ఇక్కడ
తరువాతే కదా నేను ఉన్నది నాకై..

అవకాశానివి కాదు,అవసరానివి కాదు
అందుకోలేని నా మనసుకు అధిపతివి..

నిర్లక్ష్యం నా నుండి నీ వేపుకు రాదు
అలక్ష్యానికి నేను అందని చిరునామాను..

అలకలకు మాత్రం పుట్టినిల్లును
ఏం చేయను మరి..
కోపం కూడా నీ పిలుపు వినపడనంత సేపే కదా
నా చెంత ఉండేది..

✍️అరుణిమలు

తాను నేను

ఎదురుగా ఉన్న నీకై ఈ తలపులు ఏంటో
కసరాలని ఉన్న కారణమే మని అనను..

ఎదురపడనంత సేపు దిగులు తోడవుతుంది
ఎదుట నిలిచాక మౌనం పరకాయ ప్రవేశం చేస్తుంది..

ఆలోచనల అంగడి నుండి నిన్ను అందుకున్న
నన్ను నేను నీకు రాసి ఇచ్చేసాక..

ఎదురు చూపులను ఊరించే నీ రాకపోకలు
నువ్వు ఎదురయ్యాక అలకల మూతి ముడుపులు..

నన్ను నేను నీ ముందు పారేసుకోలేను
అలాగని నిన్ను నేను పోగొట్టుకోలేను..

ఎంతిష్టమో చెప్పలేను ఇంతకుమించి
ఎంత కష్టమో కూడా చెప్పలేను
నీ ముందు నా మౌనం..

ఆశ ఉన్నచోట ఆశించడం ఉంటుంది
ఆ ఆశ వెంట నీరాశ ఉందని
ఎప్పటికప్పుడు ఋజువు
అవుతునే ఉంది..

అయినా కూడా
ప్రతీరోజు వచ్చే ఉదయం లానే
నీకై నా ఆశ
మళ్ళీ మళ్ళీ పూస్తునే ఉంటుంది..

ఓయ్....నా చందమామ
చూడటమే కాదు,
చెప్పింది
గుర్తు పెట్టుకోవయ్య..

✍️అరుణిమలు

Thursday, 23 August 2018

తాను నేను

ఎందుకిలా....
ఎందుకో ఇలా...

పగలకు ఎంత ఆరాటమో
కలలో అయినా నిన్ను చూడాలని..
రేయికి ఎంత కంగారో
కలవై వచ్చిన నీవు కరిగిపోతావని..

స్వప్నానిది ఎంత అదృష్టమో
నువ్వు తనను వెతుకుతూ వస్తున్నందుకు..
తలగడ కూడా నీ తలపులలో
తూలుతుంది రేతిరంతా..

చూపులను గురి పెడుతున్న
గాయాలను చేయడానికి కాదోయ్..
గుండెలో నువ్వు రగిలుస్తున్న
వేడి నిన్ను తాకాలని..

మౌనమై ఎదురు నిలుచున్న
పదాల కొరతలో ఉన్నానని కాదోయ్..
నా పలుకలలో నీ పేరు
నలిగి ఊపిరాడదేమో అని..

గాలికి గంధాలను పూస్తున్న
నీ ఊపిరిలో చేరి నీలో సగమై పోవాలని..
నా అడుగుల గురుతులను చెరిపేస్తున్న
నీకై నువ్వు, నాకోసం నన్ను చేరాలని..

కాలానికి ఎదురు నిలబడి ఉన్న
గతమనే గడపను దాటి
రేపటి ఉదయాన్నివై ఎదురు వచ్చేయ్...

✍️అరుణిమలు

Wednesday, 22 August 2018

తాను నేను

ఏ పూజకో పూచే నవ్వులను ఏరుతున్న
ఏ నోముకో కోరే వరాన్ని వెతుకుతున్న..

ఏ వరానివై వచ్చి వరిస్తావనో
మనసు గడపకు రాసిన పసుపై ఎదురు చూస్తుంది..

ఏ మహిమవై వచ్చి మాయచేస్తావో అని
ముస్తాబయ్యింది ఈ సొగసు..

అరచేత చందమామ వై
పాదానికి అద్దిన పారాణివై
నుదుటి మధ్యన పొద్దు పొడిచే భాస్కరుడు వై
నాలో భాగమై పోతావని..

జుంకాలు చెబుతున్నాయి నీ చిలిపి చేతలు
మట్టి గాజులు చెబుతున్నాయి ఆనక మేం చేసే గాయాలను కసరకంటూ..

ముడిస్తే నిలవని కురుల అల్లరి
మాట మాటకు వస్తున్న వెక్కిళ్ళు చెబుతున్నాయి
నీ రాక దగ్గర్లోనే ఉందని..

కోరికల పల్లకిలో
భవిష్యత్తు బాజాల నడుమ
ఆశల బాసికాన్ని కట్టుకుని
విచ్చేయవోయ్..

✍️అరుణిమలు