Saturday, 5 January 2019

తాను నేను

అనుకోని అతిధులే ఈ కన్నీళ్ళు
ఆలోచనలలో నేనుంటే అవి పలకరింపుకి వస్తుంటాయి...

నువ్వు దూరమైతే అవే తోడు
భావాల భారం అక్షరాలుగా మారే లోగా అవి కరిగి ఏరులవుతాయి..

రాయాలని లేదు
చెప్పడానికి ఏముంది
చూపించడానికి ఏం మిగిలింది

మౌనానికి హద్దులు లేవు
మనల్ని దాటి పోయాయి ఆ సరిహద్దులు
నిశ్శబ్దానికి ఆకారం లేదు
మన మధ్య ఉన్న ఏకాంతంలా

కదిలితే ఆగననే దుఃఖం తప్ప
ఎదంతా శూన్యమే ఇప్పుడు

చీకటిలో చప్పుడు లేని విస్పోటనాలు ఎన్నో
గొంతు దాటి రాని గరళం గుండెల్లో మంట రేపుతునే ఉంది

నే అడిగానని వచ్చావా
నే వద్దంటే వెనుతిరిగావా

హా.....వచ్చి
నాదని ఉన్న నా ఏకైక సొత్తు
మనశ్శాంతిని తీసుకుపోయావు

ఇక ఎదుట ఉన్నదంత పోరాటమే
నాతో నేను మాత్రమే మిగిలా మునుపటిలా

✍అరుణిమలు

Thursday, 3 January 2019

తాను నేను

నన్ను గెలుచుకున్న తీరు చూసి మనసెరిగి‌న వాడివి అనుకున్న..
గాజు బొమ్మ లాంటి మనసును కోరి జారవిడిచాక కానీ తెలియలేదు... ఆ మనసు వెనుక దాగిన కాఠిన్యం గురించి..

కంటికి‌ కనిపించేదంతా మాయే
ఏది నిజం
నీ అవసరం

ఏది అబద్ధం
నీ మాటలు

ఏది నమ్మకం
అతుకు పడని ముక్కలై మిగిలింది ఇప్పుడు

రెప్ప పాటులో మారిపోయే నటనలు
పలకరింపుల మాటున దాగిన కుయుక్తులు
నోటి మాటలన్ని నీటి మూటలని చెప్పిన అనుభవాలు..

నువ్వో గాయానివే..
గతం తవ్విన ప్రతీసారి
గతి తప్పిన నా అడగులకు ఋజువుగా జారిపోతుంటావు... కన్నీటి చుక్కవై

తాకాలని ఉన్న కూడా దాహం తీర్చని తడివని ఎక్కడ మళ్ళీ మరో మచ్చగా
నన్ను అంటుంది ఏమో అని భయం..

✍️అరుణిమలు

తాను నేను

అలసిన చూపులకు
నీ కలలే బలం

నీరసించిన మనసుకు
నీ రాకే అమృతం

దారులన్ని నీ రాకకై
ఎదురు చూస్తున్నాయి

దప్పికతో ఉన్నది మనసు
వాన చినుకువై నన్ను ముంచేయ్

మనసును మెలిపెట్టి మదించా
ఎందుకే నీకీ యాతన అని

మౌనమై ఉంటా సదా
నా పదాల మాటున అంటుంది

పరిధులు లేని ఊహల
లోకం ఊరిస్తుంది..

పరదాలు వేయలేని
నీ ఆలోచనల తీరంలో
ప్రతీ నిమిషాన్ని లెక్కిస్తున్న..

అక్షరాలలో ఆ లెక్క
నా పదాలన్ని..

ఓయ్......బాకీ పెంచుకోకు ఎక్కువ
మళ్ళీ మళ్ళీ జన్మకు కూడా వదల లేనంత

✍️అరుణిమలు

తాను నేను

భావాలేమో సున్నితం
మనసేమో మొద్దుబారి పోయింది...

ఆశలనేవి తెలియదు
కోరికలనే ఆరాటం లేదు
రేపటి వేపు దృష్టి లేదు
గడిచిన నిన్నటి కోసం చింత లేదు..

కాసిన్ని నవ్వులలో ఊపిరి పోసుకుని
కూసిన్ని కన్నీళ్ళను రెప్పకు అవతలే ఆపేసి

పెదవికి వైరాగ్యాన్ని నేర్పించి
తనువుకు తాపాన్ని రుచి చూపించకుండా

నమ్మకాన్ని వదిలేసి
అక్షరాల లోకంలో నన్ను నేను సరికొత్తగా చూసుకుంటూ
చిమ్మటి చీకటిలో ఎన్నో తర్పణలను చేస్తూ

మళ్ళీ మళ్ళీ పుడుతున్న
నా కోసం నేనే
నే గీసిన గిరిలో స్వేచ్ఛగ బతికేందుకు

కళ్ళ నిండా వెలుగులే
కనుపాపలో దాచిన చీకటి
ఆ కాటుక గీతకే తెలుసు

నేనో అందమైన అబద్దాన్ని
పువ్వును నేనే
ముల్లును నేనే

కదిలి పోతున్న కాలానికి మాత్రమే తెలిసిన నిజాన్ని
కన్నీటి చుక్కని నేనే
ఆనంద బాష్పాన్ని నేనే

✍అరుణిమలు

తాను నేను

ఎదుట లేవేమో కానీ ఎద నిండా నీవే కదా....ఎదురు చూసే క్షణాలకు తెలుసు యుగాల భారం ఎంత బరువుగా ఉందో...

అలసట లేని పయనం...
ఘడియలు గుండె చప్పుడతో లయ కడుతున్నాయి...

కాలం కవ్వింపులను కన్నెర్ర చేస్తూ
మనసు నిండిన నమ్మకంతో వేచి ఉన్న..

నీ తలపు పెదవి పై చిరునవ్వై
కుడి కంట జారే వెచ్చని బిందువుగా మారుతుంది..

నీతో గడిపే కూసంత కాలానికి
ఎన్ని యుగాల నిరీక్షణ కైనా సిద్దమేనోయ్...

నీతో ఉన్న ఆ కొద్ది సమయం నా ఎదకు ఆయువు పోస్తుంది..
మళ్ళీ నీతో గడిపే రోజు వరకు నన్ను నిలబట్టే బలమై మారుతుంది..

పరాయి సొత్తువేమో కదా
అతిధివే ఎప్పుడు ఇక్కడ

పరిచయం చేసిన కాలాన్ని నిందించనా
దాచుకున్న మనసును దండించనా

నా చేయి దాటిన మనసు
నా మాట వినను పొమ్మంది ఏనాడో..

అందుకేగా
అందుకోలేక
అజమాయిషీ చేయలేక

అందీ అందనంత దూరంలో
దిక్కుల నడుమ
పయనం ఎటో తెలియక
దిక్కులు చూస్తున్న

✍️అరుణిమలు

తాను నేను

ఒయ్యారాలు ఒలక పోస్తూ
వలపు కవ్వింపులా తాకే తెమ్మర లాంటిది కాదు
నా ప్రేమ...

నమ్మకానై నీ పక్కన ఉంటూ
ఇష్టాన్నై నీ చుట్టూ అల్లుకుంటూ
కోపాన్నై కసురుతూ
అల్లరినై నిన్ను ఆటపట్టిస్తూ ఉండేది..

క్షణాలను లెక్కలు కడుతూ
కళ్ళల్లో వెలుగు ఒత్తులను వెలిగించి
ఎదురు చూసే మనసును..

జాగ్రత్త అంటూ చెప్పే నా మాటకు అర్థం
మళ్ళీ నాకోసం నువ్వు ఎదురు వస్తావనే మాటను ఇమ్మని..

ఏ కళ్ళు నిన్ను తాక కూడదని
ఎవరి దృష్టిలో నువ్వు పడకూడదనే కుళ్ళు ఉంది..
ఏ మాయ నిన్ను మాయ చేసి నా నుండి దూరం చేస్తుందో అని...

నీ మాట మీద నమ్మకం ఉంది
ఈ వయసుల మీదే లేదు..

దేనినైనా నీ ముందు చూపించగలను కానీ
ఈ జలస్ ని చూపించలేనురా..

నా మాటలు విన్నాక
నువ్వు నవ్వే నవ్వు ఉంది చూడు
ఉఫ్్్్్...

వినలేనబ్బ...

✍అరుణిమలు

తాను నేను

ఒకరికొకరికి ఇవ్వగలిగేది ఏమన్నా ఉందంటే
అది సమయమే..

అవును...
కాస్త కాలాన్ని నాకోసం రాసి ఇచ్చేయ్ చాలు..

తీరిగ్గా తీరుబాటు అయ్యాక గుర్తుకు వచ్చే కాలక్షేపాన్ని మాత్రం చేయకు..

తీరిక చేసుకునే నీ సమయంలో నేనో భాగం కావాలి
అంతకు మించిన భాగ్యం ఏముంది..

నువ్వో అలవాటు కాకూడదు అని అనుకున్న
కానీ ఎప్పుడు వ్యసనానివి అయిపోయావో తెలియదు..

కొన్ని మౌనాలు,కొన్ని దూరాలు
మన మధ్య అల్లుకున్న అనుబంధాన్ని
ఎంత గట్టిదో చూపించింది..

కోరికలు ఏం లేవోయ్
ఏయ్ పిల్లో అనే పిలుపు ఈ చెవిన పడాలి

తీరిక చేసుకునే నీ తీరే నాకు తరగని బలం,బహుమానం..

✍అరుణిమలు