Sunday, 12 April 2020

తాను నేను

కొన్ని నవ్వులను ఏరుకుందామని వస్తే
కాసిన్ని కన్నీళ్ళను ఇచ్చి పంపుతావు..

మౌనంలో దాగిన వేదన
చదవ లేవు..
కన్నీటి చుక్క బరువు
తూయలేవు..

ఎందుకు మరి
ఎదను కోతల పాలు చేస్తావు..

సంతోషాన్ని ఏనాడైనా ఇచ్చావ
లేదు కదా...
మరి కన్నీటిని ఇచ్చే అధికారం నీకు ఎక్కడిదని అడగాలని ఉంది..

తప్పు నీది కాదు
ఆ అధికారం ఇచ్చిన నా మనసుది కదా తప్పు..

నిన్ను నన్ను మించి అభిమానించడమే
నా మనసు చేసిన తప్పేమో..
అందుకే నీ మాటలకు మనసు రోదిస్తుంది...

నీకు చేతనైతే 
మరో గాయాన్ని చేయకు..
మాను, మాకులా చూడకు మనిషిలా చూడు
అని అడగాలని కూడా లేదు ఇప్పుడు..

గుర్తింపును కూడా అర్ధించే చోట
బంధాలు ఏముంటాయి..
మానసిక మరణాలు తప్ప..

✍️అరుణిమలు

తాను నేను

మనసంటే లెక్క లేని చోట
కన్నీటికి విలువ ఉంటుందా..

కఠినమైన మాటలలో
కారుణ్యపు కోతలు ఎన్నో..

బరువెక్కిన కను రెప్పలలో
భారం ఎంతో 
కనులలో ఉబికే గంగకే తెలుసు..

నీతో తలపడిన ప్రతీసారీ 
మనసు అలసిపోతుంది...

తిరగబడటానికి నేను ఆయుధాన్ని కాను అభిమానాన్ని...
మౌనమే నా జవాబు..

✍️అరుణిమలు

తాను నేను

నీ పేరు నా చిరునామాగా మారి
నీ తలపో చిరునవ్వుగా నన్ను చేరింది..

నీకై మానసాన నే చేసిన తపస్సు
ఆరడుగుల రూపంలో నన్ను వరించింది..

నీ ప్రేమ తిలకం
నా నుదుటిన చుంబనంగా చేరాక..

నన్ను నీ నుండి 
విడదీసే శక్తి కాలానికి కూడా లేదోయ్..

మూరెడు తాడు పెనవేయక పోయినా
మనసును పెనవేసుకున్న ముడులు ఎన్నో ఇక్కడ..

ఎద పై చెక్కిన నీ పేరును
ఈ గుండెసడి ఎవరికైనా వినిపిస్తుంది ఏమో అని
మరే మనసుకు చేరువ కాలేదు కూడా..

గుప్పెడు గుండెలో ఉన్నది నీవే
ఈ ఎద చప్పుడు ఆగే వరకు..

కాలమేదైనా...తీరమేదైనా
నా ప్రయాణం నీతోనే
నీ ధ్యానం లోనే..

నేను ఎవరంటే
నువ్వేనంటా..

మరో తలపు
నా తలుపు తట్టదు..
నిన్ను దాటి నన్ను చేరేది
మెప్పించేది ఎవరోయ్..

✍️అరుణిమలు

Friday, 27 March 2020

తాను నేను

రాత్రి మేల్కొంటుంది
నీ కౌగిలిలో చేరాక..

ఆకతాయి అల్లరేదో
అల్లేస్తుంది మేనును..

పెదవుల లిఖించే
భాషకు లిపి లేదు కానీ
భావం తనువుకు తెలిసిపోతుంది..

మనువాడిన మనసులు
మరో లోకంలో విహరిస్తూ
యుగాలను దాటి‌ పోతున్నాయి..

చుక్కలన్ని మేనిపై 
వలపు కానుకులుగా మెరిసిపోతున్నాయి..

కరిగిపోతున్న కాలంలో
కలిసిపోయింది ఒక కావ్యం..

నిశ్శబ్ద యుద్దంలో
గెలిచింది మరో ఉదయం..

✍️అరుణిమలు

(కరోనా కలవరంలో కూడా ఇలా రాయగలిగానంటే పర్వాలేదు బుర్ర పదునుగానే ఉంది ఇంకా...)

Tuesday, 24 March 2020

తాను నేను

మిస్ యు పదం చిన్నదే
చెప్పడానికి ఇంకొక పెద్ద పదం లేదు..

ఎంత చెప్పిన నేను వివరించలేను కూడా 
ఎంత మిస్ అయ్యానో అని..

నాలో నేనే ఎవరికి చెప్పుకోలేని 
పంచుకోలేని బాధవి నువ్వు, సంతోషానివి నువ్వు..

నీ జ్ఞాపకాలలో నా ప్రయాణం
ఒంటరిగా సాగలేదు ఏ క్షణం...

ప్రతీ ఆలోచనలో ప్రతీ పనిలో 
నిన్ను కలుపుకుని‌ బాధ పడ్డా, 
మురిసిపోయా కూడా..

నువ్వు ఎందుకు కలిసావని ప్రశ్న వేసుకున్న
నా మనసుకు ఒక తోడుగా ఉండటానికి అనుకున్న..

మన మధ్య ఏముంది అంటే 
ఇదని చెప్పలేం...
చెప్పడానికి చూపించడానికి ఏం లేదు..

కానీ ఏదో ఉంది
ఒకరినొకరిని కలిపి ఉంచుతుంది..

ఇది అదేనా
అది ఇదేనా..

✍️అరుణిమలు

Friday, 20 March 2020

తాను నేను

నా సంతోషం లోనే కాదు
నా కష్టంలో
బాధలో
నిరాశలో
ఆశలో కూడా నువ్వు గుర్తు వస్తావు..

అసలు మరచిపోతే కదా
గుర్తు తెచ్చుకోవడానికి..

అంటే...
నా కష్టం, సుఖం, ఆలోచనలు, అభిప్రాయాలు అన్ని నీతో పంచేసుకుని...
నీ దగ్గర ఓదార్పు పొంది, సలహాలు తీసుకున్నానని కాదు..

మన మధ్య అంత సమయం ఎప్పుడు లేదు
పలకరింపులు కూడా ముక్తసరే..

ఏదైనా ముందు నీతో పంచుకోవాలని ఉంటుంది
కానీ ఎప్పుడు నిరాశే మిగిలింది..

ఆశ పడటం 
అంతలోనే నిరాశ పడటం 
అలవాటు ఐపోయింది..

ఏ విషయం లోతుగా మాట్లాడుకోము..
మన మధ్య మాట్లాడు కోవడానికి ఏది లేనట్లు..

ఎక్కడ మనం ఇంకా ఇంకా దగ్గర అవుతామేమో అని నేను...
ఎక్కడ నీ ఇష్టం బయట పడిపోతుందో అని నువ్వు అంటీ అంటకుండా తిరుగుతున్నాం..

ఒకరి ఆలోచనలు ఒకరికి తెలుసు...కానీ బయట పడం..
ఒకరికొకరం దూరంగా ఉండటానికి పడే కష్టం తెలుసు కానీ కలవము..

బాగా నటిస్తున్నాం ఇద్దరం
ఎవరిని మెప్పించడానికో మరి..

రాత రాయని ఆ దేవుడినా
రాతలో ఉన్న మన బంధాలనా

✍️అరుణిమలు

Sunday, 15 March 2020

తాను నేను

ఆశగా ఎదురు చూసిన కాలం
తోడుగా ఉంటా అంటూ వచ్చింది కాసేపు..

ఎన్నో కబుర్లను
తీపి తీపి తాంబూలాలను
పంచింది...

చిలిపి తగాదాల ఘాటు
చెక్కిలిని తాకిన కానుక
చేతిలో చేయి వేసిన నమ్మకం..

ఇంత అందమైన వాతావరణంలో...
ఎదలో ఏదో ఆందోళన..

కాలాన్ని ఇలా ఆగిపొమ్మనే చిన్న కోరిక
మాటల్లో చెప్పలేని దిగులు
నువ్వు లేని ఘడియల్లో నన్ను భయపెట్టే ఏకాంతం
ఉక్కిరిబిక్కిరి చేసే నీ ఆలోచనలు
మళ్ళీ నీ రాకకై ఎదురు చూసే చూపులు
ఒంటరితనాన్ని వెక్కిరించే నీ ఙ్ఞాపకాలు..

నన్ను పరీక్ష పెట్టడానికి ఇవన్నీ సిద్ధం
వాటిని ఎదుర్కొనేది ఎలా అనే
ఆలోచనల యుద్ధం చేస్తుంట అంతరంగాన‌‌..

చెప్పలేని బాధని
చూపించలేని అసహనాన్ని
పెదవి చివరన చేరగానే చిరునవ్వగా మార్చేస్తుంటా..

నా చిరునామా నువ్వే కావాలని
బ్రహ్మ రాయని రాతని చెరిపేయాలని..

మనసున ముడివడిన ఈ బంధం
మట్టిలో కలిసే వరకు తెగిపోదని..

ఎన్నో ఎన్నో చెప్పాలని ఉంటుంది
అన్ని మనసు గుమ్మంలో మౌనంగా ఆగిపోతున్నాయి..

చెరిపేదెలా...నా ఎద గోడ పై చెక్కిన నీ రూపాన్ని
చెప్పేదెలా...చెమ్మగిల్లిన గుండెల్లో ఊపిరి నువ్వే అని

ఇది అక్షరం కాదు
నేను నాతో పంచుకునే
నీ భావన..

ఐతే నువ్వు లేదా
ఈ అక్షరమే నా వ్యసనం
నాకు లేదే ఇంకే వ్యాపకం..

✍️అరుణిమలు