Sunday, 30 August 2020

తాను నేను

ముసురేసిన మనసు
వర్షిస్తుంది..

చీకటి తాకిడికి
చెల్లాచెదురు అవుతుంది..

తెల్లారేసరికి
తీరం చేరిన తుఫానులా మారిపోతుంది..

ప్రతీ రాతిరి
చీకటి సాక్షిగా
ఆ మనసు ఓ తుఫానులో
చిక్కుకుని విలవిల లాడుతుంది..

తనని తాను
ఓదార్చుకుని తెల్లారికి తేరుకుంటుంది.. 

✍️అరుణిమలు

తాను నేను

నువ్వు నడిచే దారి
గమ్యం నేను కాకపోవచ్చు..

కానీ
నీ ప్రయాణంలో
నేనో ఙ్ఞాపకంగా నిన్ను పలకరిస్తూనే ఉంటా..

నువ్వు అలసిన వేళ
నిన్ను లాలించే తలపును నేనౌతా.. 

✍️అరుణిమలు

తాను నేను

కలలో కథలా 
కదిలిందో బాధ..

కటిక చీకటిలో
కన్నులలో కలహాల తాకిడి..

కవ్వించిన ఓ నవ్వు
కసురుకున్న ఓ మాట..

కనురెప్పల మాటున
కలవరింతలలో కదిలిందో రూపం..

కాటుక గడప ఆవల
కనుచూపు దూరంలో నిలిచింది..

కలలన్ని తీరాన్ని తాకాలని
ఎదపై దాడి చేస్తుంటే..

నువ్వో కన్నీరు చుక్కవై
జారుకుంటున్నావు..

ప్రతీ రేయి
నువ్వో కథలా పలకరిస్తావు..

ప్రశాంతతను
ప్రకోపంలా మార్చి తప్పుకుంటావు..

✍️అరుణిమలు

తాను నేను

నువ్వు నీలానే ఉన్నావు
నేనే నిన్ను నిన్నుగా చూడలేదు ఏమో..

పదే పదే నువ్వేంటో చెబుతానే ఉన్నావు
మాటల్లో, చేతల్లో..

గాయాలైన ప్రతీసారి కన్నీరై కరిగాను
నువ్వు వద్దంటు వెనుతిరిగాను..

నాకు నేనే ఓదార్పు నై 
నన్ను నేనే నిలబెట్టుకుని మళ్ళీ నీవైపే అడుగులు వేసా...

పిచ్చి తనమో, వెర్రి తనమో
అహం, ఆత్మాభిమానం కలిసి ఉండలేవని తెలిసినా కూడా మరొక అవకాశం అనుకున్న..

గతాన్ని తిరిగేసి చదివా
నా అక్షరాలలో నిన్ను ఎంత అందంగా మలుచుకున్నానో..

నాలో నా కన్నా ఎత్తులో నిన్ను రచించా
నా ఆశలకు మరో రూపంగా మలిచా..

వాస్తవాలకు చాలా కోసుల దూరంలో
అతిశయోక్తికి దగ్గరగా ఉన్నాయి నాలో నీ ఊహలు..

నీ దూరం పెట్టిన పరీక్షలను చదివా
కొట్టిన చేతికి కారుణ్యం లేదని కనిపించింది..

అక్షరాలలో లక్షణాలు
అతనిలో ఎక్కడ కనిపించలేదు..

నీ జ్ఞాపకాలలో నన్ను వదిలేసి
నువ్వు నీ దారిన వెళ్ళిపోయావు అతిధిలా..

నీపై కోపమా....కోపానికి చోటు ఎక్కడ ఉంది
దేనికి చోటు లేనంత బాధలో నన్ను నిలబెట్టేసావుగా..

✍️అరుణిమలు

Thursday, 20 August 2020

తాను నేను

ఎందుకు వచ్చావో
ఎందుకు వెనుతిరిగావో

నీ రాకపోకలు మధ్య
నలిగిన నా మనసుకు
జవాబు ఉందా నీ దగ్గర

నువ్వు వచ్చి వెళ్ళిన మధ్య కాలంలో
జరిగింది అంతా మాయ

ఏమని నిన్ను ప్రశ్నించేది
మాటలు రాని మూగ దానిని చేసేసావు

ఏమని నిందించేది
మనసును చీకటి చేసాక

ఏమని బదులు కోరేది
మన బంధమే నీటి బుడగని తెలిసాక

ఏమని సర్దిచెప్పుకునేది
నీ మాటల్లో మసక బారిన మనసుకు

ఏమని చెప్పేది కన్నీటికి
ఇక చాలని
చలించకే ఏ ఙ్ఞాపకానికని

నన్ను నేను 
సర్దిచెప్పుకోలేని చోట నిలబెట్టి
నీ దారిన నువ్వు సాగిపోయావు

✍️అరుణిమలు

Wednesday, 19 August 2020

నేనిలాగే చెబుతా

ఏ గొడవలోకి దూరి న్యాయ అన్యాయాలు మాట్లాడనంత వరకు అందరికి ఐన వారమే...మంచి వారమే...

నేనిలాగే చెబుతా

ఎంత దగ్గరయ్యావని కాదు...ఎంత అర్థం చేసుకున్నావు అనే దాని మీద ఆదారపడి ఉంటుంది

ఇద్దరి మధ్య సాగే బంధమనే ప్రయాణం..