Thursday, 2 September 2021

తాను నేను

నిశ్శబ్దంగా మారిన మనసును కదిలించడానికి
పిలిచిందో స్వరం..

నిశ్చలంగా ఉన్న కొలనులో
అలజడి రేపుతూ..

చీకటిలో మెరిసిన
మిణుగురులా..

అలసిన మేనుని
పిల్లగాలి తాకినట్టుగా..

బీడు నేలని
తొలకరి పలకరించినట్టుగా..

రాగాలు మరచిన కోయిలకు
వసంతం కదిలించినట్టుగా..

శిలలా మారిన హృదయాన్ని
శిల్పంలా మలిచేటట్టుగా..

మాటలు మరచిన బొమ్మకు
పలుకులు మళ్ళీ నేర్పగలవా..

అలసిన మనసును
లాలించడం నీ తరమేనా..

ఎదురు చూపు లేని చోట
వెనుకటి జాడలు చెరిపేయగలవా..

అన్ని ప్రశ్నలే..

గాయం చేసినంత తేలిక కాదు
గతాన్ని తుడిచేయడం అంటే..

మళ్ళీ మొదలైన కథకు
ముగింపు ఏమై ఉందో ఈసారి..

✍️అరుణిమలు

Thursday, 22 July 2021

తాను నేను

నన్ను వెతుకుతూ వచ్చిన‌
నీ ఆలోచనలు ఏదో చెబుతున్నాయి..

మనసు విన్న ఊసులకు
మాటలు నేర్పేది ఎలా..

ఆ మాటలను
అక్షరాలలో పొదిగేది ఎలా..

✍️

అరుణిమలు

Wednesday, 14 July 2021

తాను నేను

బాధ కూడా బాధ్యతే కదా
ఇష్టం మిగిల్చిన నష్టమే బాధ

వేదనంత వేడుకలా
నిరాశాలన్ని కానుకలా

జ్ఞాపకాలన్ని గతంలో నుండి ఊరిస్తూ
నిట్టూర్పులేమో రేపటి వైపు నడిపిస్తుంటే

అద్దుకున్న నవ్వులలో
అర్థం లేని వ్యధను అనుభవిస్తున్న

అద్దంలో నీ రూపం
అందుకో లేని ఆశలు నావి

నాడు నీడలా నేటికి నాతోనే ఉంది
కళ్ళకు ఎదురుగా చేతికి చిక్కనంటు

ఆహ్వానించే మనసు లేదు
అక్కున చేర్చుకునే ఆలన లేదు

ఐనా కూడా
బాధ అమృతంలా మారి
ఆయువు పోస్తుంది..

ఈ వాడిన మోడులో
ఏ వసంతాల రాక రాసి ఉందో అని

✍️అరుణిమలు

Tuesday, 13 July 2021

తాను నేను

ఆదమరిచేంత నిద్ర
అర్ధించిన అందడం లేదు..

పగలంతా 
నా నుండి నేను పారిపోతున్న..

ప్రతీ రాత్రి 
నీతోనే నా ప్రయాణం..

నీ పేరు పలకలేదు
నిన్ను వరసతో పిలవను లేదు..

ఐనా ధ్యాసంతా నువ్వే
తలపంతా నీకోసమే..

కోపం లేదు
అది నీకు చెప్పాలని లేదు..
బాధ ఉంది
కానీ నీకు చూపించాలని లేదు..

నిన్ను అడగడానికి
చెప్పడానికి కూడా ఏం లేదు..

ఐనా 
ఎందుకో ఇంకా ఈ చింత..

నువ్వు అనే 
కోరికే చచ్చిపోయింది..

నీ పిలుపు వినిపిస్తే
ఆనాడు మనసు పురి విప్పేది..

నీ తలుపు 
పెదవులపై నవ్వులను మెరిపించేది..

నీ జ్ఞాపకం
సిగ్గులను పూయించేది..

ఏది
ఇప్పుడు
ఏది లేదే

నీ పిలుపు కూడా
నిస్తేజంగా

నీ పలకరింపు కూడా
అతుకులుగా

ఇంతలా 
ఎప్పుడు నా మనసును మార్చేసావు..

నవ్వులు లేవు
సరదా లేదు
ఆటలు లేవు
అల్లరి లేదు

ఉన్నాను అంతే
నీ పరిచయానికి గుర్తుగా

నువ్వు వదిలిపోయేలా చేసావు
నా మనసు నన్ను వెలివేసింది

నువ్వు ఏమన్నా
పడమంటుంది అది

పడలేను అంటా నేను
అందుకే హింసిస్తుంది..

నా మనసును
నాకే శతృవును చేసావుగా

నువ్వు లేని లోటు
అది పూడుస్తుంది

దండిస్తూ
బాధిస్తూ
వేదిస్తూ

✍️ అరుణిమలు

Saturday, 3 July 2021

తాను నేను

కొన్ని ఆశలు, ఊహలు
కాగితం పడవలు లాంటివే..

ఆశించటానికి అందంగా
అందుకోవడానికి అక్కరకు రాకుండా ఉంటాయి..

కొన్ని పరిచయాలు కూడా
ఈ పడవ ప్రయాణం లానే మిగిలిపోతాయి..

ఆనంద పడినంత సేపు
సాగదు ఆ పరిచయాల‌ పయనం..

అందినట్టే అంది
మునిగిపోయే బంధాలు అవి..

ఏ అలలు లేవు ఆపడానికి
ఏ తీరం లేదు కోతకు..

కనిపించని తుఫానులు
కట్టిపడేసే అభిమానాలు అడ్డు పడతా ఉంటాయి..

మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినా
ముందుకు
సాగేవి కావు ఆ పరిచయాలు..

✍️అరుణిమలు

Thursday, 1 July 2021

తాను నేను

మనుషులను చదివే విద్య నేర్చావు 
కానీ మనసులను చదవడం ఎలాగో తెలుసుకోలేదు..

నటించే అందరిని 
అమాయకులు అనుకునే నువ్వు..

నేనింతే అనే వారిని 
అబద్దమని చదివావు..

నీ తారుమారు లెక్కలతో
మనసును ఎందుకు తూట్లు పొడుస్తావు..

ఒకసారి నీ అంచనాలకు
పడ్డ మార్కులు ఎన్నో చూడు..

ఎంత నేర్పరివో
తెలుస్తుంది..

నిన్ను నిందించాలని లేదు
నిజం చూపించాలని ఉంది..

నీ గిరిలో 
నువ్వు ఉండిపోతున్నావు..

నువ్వు కావాలి అనే వారు
నీకోసం రావడం
నీ వలనే దూరం జరగడం..

ఎందుకో ఒకసారి ఆలోచించు ??

ఎప్పుడు 
వెళ్ళిన వారు తిరిగి వస్తారు అనుకోకు..

వెనక్కి రావాలని ఉన్న
రాలేనంతగా మనసు విసిగిపోవచ్చు..

భరిస్తుంది కదా అని కొడతా ఉంటే
రాయి కూడా ఒకరోజు పగిలిపోతుంది..

✍️అరుణిమలు

Monday, 28 June 2021

తాను నేను

కౌగిళ్ళ కారాగారంలో
కొత్త కాపురం..

నీ ఆలోచనల పరవళ్ళలో
తీరం చేరని పయనం..

ఆకలి మనసుకు
ఇరు దేహాల నైవేద్యం అవుతుంటే.. 

నీ ఊహల స్నానాలలో
ఊసులే మరిచారయ్యో..

గాలి చొరబడని చోట
మౌనం చేసే సంతకాలు..

రాతలు కానివి
అక్షరాలు చేర లేని భావాలు..

ప్రతీ రేయి
ఒక రచనైతే..

ప్రతీ రాత్రి
ఇక జాగారమే..

✍️అరుణిమలు