Thursday, 16 March 2017

కావాలనుకుంటే బంధాల నడుమ బందీలమే కదా

పరిచయాల మొదలు ఎప్పుడు ఎంత అందంగా ఉంటాయి...
ఆ చిగురు తొడిగే తీరు చాలా ముచ్చటగా ఉంటుంది..
అది రేపటి అందమైన ఙ్ఞాపకం కదా మనకి...
అవి పేక మేడలో,నమ్మకం మీద వేసిన పునాదో కాలమే తెలియచేస్తుంది...
పరిచయాలు పెంచుకోవడానికి కష్టపడక్కర్లేదు కాని వాటిని బంధంగా తీర్చి దిద్దుకోవాలి అంటే మాత్రం..
నిరంతర శ్రమ తప్పదు లేదా కళ్ళముందే కూలిపోతాయి..
అందులో ఆ శ్రమ భారం ఒకవైపే ఉంటే హహహహ...
మనిషిని గెలవాలి అనుకుంటే ఒకటే దారి మనసును గెలిచేసుకో చాలు...
మనిషితో పాటు సమస్తం నీ అధీనం అయ్యి నీకు బంధీ అయ్యి నీకు దాసోహం అంటుంది ...
ఇది ఎరిగిన వాడివేమొ మరి ఎప్పుడు ఆడేవో..ఎప్పుడు గెలిచావో కాని నా మనసుని నీ సొంతం చేసేసుకున్నావు..
నీ గెలుపు అక్కడితో ఆగిపోయింది...నా గెలుపుకు నేను నిరంతరం శ్రమిస్తునే ఉన్నాను,ఉంటాను...
నువ్వు గెలుచుకున్న ఈ గెలుపును శాశ్వతం చేయడానికి...
ఒకసారి సిద్ధ పడి దిగానేమొ మరి నా శక్తినంతా కూడదీస్తున్న....
నువ్వు ఒకడుగు ముందుకు వేయకపోయినా నేను పదడుగులు వేయడానికి వెనుకాడను...
అహంకారాన్ని నా దరి దాపుల్లోకి రానివ్వకుండా కాపు కాసుకుంటున్నా...
కోపాన్ని అణిచి వేస్తూ పడ్డ పంటి గాట్లను నా శరీరం లెక్క చేయడం మానేసింది...
నీ తప్పులను తప్పించుకుంటూ, సరిపెట్టుకుంటూ మనసుకి మాసిక వేస్తున్నాను....
ఎన్నైనా భరించడానికి సిద్ధపడి మొండి బారిపోయాను..
నా చుట్టూ కాదు నాలో ఎన్ని అగ్నిపర్వతాలు బద్దలౌతున్నా నీ ముందు మంచు బిందువులా స్వచ్ఛంగా  ఉండడమే నాకు అలవాటు....
మనసారా నువ్వు పలకరించే ఒక్క పలకరింపు చాలు...నా ఎద భారమంతా ఏడు సముద్రాల ఆవలికి ఎగిరిపోతుంది...
ఎందుకింత భారం అవసరమా అంటావా?...నా మనసునే గెలిచేసావుగా మరి ఏమిచేయను అని మాత్రమే అనగలను...
అవును నా మనసును గెలిచిన వారికి నేను బంధీనే
నాకు మాత్రం సాధించుకోవడం రాదు..

        ..................అరుణని..................

No comments:

Post a Comment