Monday, 4 December 2017

తాను నేను

సడి లేని రేయి గడిచి పోతుంది..
నీకై ఎదురుచూపుల పరదాల మాటున..
ఒకటా రెండా అంకెల లెక్కలకు, అంచనాలకు అందనన్ని గడియలు జారుకుంటున్నాయి నిరాశలకు తోడై...

ఎప్పుడు వచ్చావో ఆ దారి ఆ వరుస తెలియదు కానీ..
నువ్వు తిరిగెళ్ళిన దారి వేపే నిలిచిపోయాయి చూపులు స్థాణువులై..

కాలం మాత్రం గడిచిపోతుంది జ్ఞాపకాల ఊతకర్రను తోడు తీసుకొని..
నీకు మనుషులంటే చులకనో...నమ్మిన మనసులంటే అలుసో ఇప్పటికీ అర్థం కానీ ప్రశ్నే ఇక్కడ...

నే ఇచ్చిన విలువలో వర్ణశోబితమై మెరిసావు...
కానీ నీ విలువలో నే వివస్త్రనై దాగి పోయాను...

అందుకునే నాడు నీ చేయి క్రింద ఉన్నా...
ఇచ్చిన నాడు నీ దోసిలి నింపానేమో కదా ఆ ఎక్కువకు నీకు తెలిసిన విలువ విధిలించడమే అయ్యింది..

దాసోహానికి దాపరికాలు ఉండవు...
ఇష్టానికి కొసరులు ఉండవు...
నీపై అయిష్టానికి చోటు ఉండదు..
నా ఈ కష్టానికి ఆయువు ఉండదు..

నువ్వో రేయిలో నే కోరని కోర్కెవై రాలిన ఉల్కవు..
నీ ఙ్ఞాపకం చిరాయుష్షు పోసుకుంది..
నీ జాడ మాత్రం చితా భస్మమై మిగిలింది..

✍️అరుణిమలు

Saturday, 2 December 2017

తాను నేను

పరవశాల‌ ప్రాంగణమే నీ వలుపల ఒడిలో... మైమరుపుల విరుపులే మది ముచ్చట్లలో... వెలితేది నీ తలపులకు... వేతనమిదే ఈ వయసుకు... వెతలన్ని వెలుగులకు వదిలేసి... కాటుక కన్నుల మాటున దాగిన.. నీ కౌగిలింతల చెరలో నే బందీనైతే... మురిపాల పెదవులు విరుపులను ఒలకబోస్తున్నాయి... జగమంతా చీకటే నీ ఊపిరి చెప్పే ఊసులలో నే ములిగిన వేళ... తనువంతా వసంతాల వయ్యారాలే మరి... ఎదురపడని ఈ వెతలతో దాగుడుమూతలు ఎన్నాళోయ్... పిడికిలిలో నువ్వనే ప్రపంచం చేరిందేమో... దూరమంతా కరిగిపోతుంది... తాపమంతా తరిగిపోతుంది... ప్రేమ మంత్రం మనసును మాత్రం వదలనంటుంది... ఓయ్.....తనివి తీరని తపనవి నువ్వు... తరగని,తరలి పోని తాపత్రయం నువ్వు... తలుపులు లేని తలపుల తొలకరివి నువ్వు...
✍️అరుణిమలు

తాను నేను

నింగిని ఏలే రాజువోయ్ నువ్వు... వెన్నెల కాంతులను ఒంపుతున్నావా... కప్పేసుకోనా నిన్ను మేని ఛాయలా... దాచేసుకోనా నాలో నిన్ను ముత్యమల్లే... నింపేసుకోనా నాలో నిండు పున్నమిని... తురుముకోనా నా సిగలో ఆ జాబిల్లిని... పోటు మీద ఉన్నది ఒడ్డుకు చేరడానికి కాదోయ్... అలల పైఎద పై నిన్ను ఊయలలు ఊపేందుకే... ❤❤❤❤ ✍️అరుణిమలు

తాను నేను

అస్పష్టమైన రూపాన్ని చక్కదిద్దేది ఎలా... చెల్లా చెదురైనా కలలను కలిపేదెలా... నీకు ఊడిగం చేస్తున్న ఊహలను ఏమని కసిరేది... ఊసుపోని నిమిషాలెన్నో నన్ను నాకు దూరంగా నిలబెట్టాయి... నీ గాలి సోకని క్షణాలు యుగాలుగా మారి యజ్ఞం చేయిస్తున్నాయి... నీది కాని దానిమీద నువ్వు అధికారం పొందింది దేనికోయ్... ఈ మనసును ఏలడానికా.....నిర్వీర్యం చేయడానికా... చెల్లించిన కన్నీటి సుంకాలు చాలవా... రాకపోకల నియంత్రణలు నీకు ఉన్నాయి... లోబడిన నా మనసుకే లేదు... హద్దులు లేని ఈ మానస మందిరాన్ని మధించి వదిలేసావు... ఎన్ని దాడులో ఈ మనసు పై... గెలిచాననే గర్వంతో...ఓడి గెలిపించిన మనసుతో ఆడుతూ ఉన్నావు... తోడుగా ఉంటూ ఒక ఆట....నీడగా ఉంటూ ఒక ఆట... ఏమి కాని వాడిగా వెళ్ళి ఒక ఆట... గెలిచావు నువ్వే మరవలేని ఙ్ఞాపకాలను నాకు ఎదురిచ్చి మరీ....గెలిచావు నన్ను నేను జయించే వరకు... నీ భావాలకు బందీనీ... పరాదీనమే సర్వం...ఊపిరి తప్ప... నా ఆనవాళ్ళు లేనిచోట నా గతముంది మౌనంగా... చూస్తున్న....చితికిన మనసును చేతపట్టి... ✍️అరుణిమలు

తాను నేను

మాటలు లేవు కానీ సందేశాలు ఉన్నాయి... మన మౌనాల మధ్య ఆపేక్ష ఉంది... మనసుకు అందని లెక్కల్లో యాతన ఉంది... రాసే కొద్ది తరగని భావాలు ఉన్నాయి... అక్షరాల నీడల్లో సేద తీరుతున్న ఒక మనసు ఉంది... అచ్చం నువ్వు నేనులా ఉన్నాయి ఈ పగలు, రేయి... ఒకరికోసం ఒకరం ఆరాటమే కానీ... ఎదురు పడే చోటు ఎక్కడ ఉంది ఈ భువిపై... నే నడిచే ప్రతీ చోట నా నీడవై ఉంటావు... చేతికి అందని తోడు వై... నా కంటికి కనిపిస్తూ నాతో సాగుతావు... కనికరించని ఒక తారకవై... నింగినై నిన్ను అలంకరించుకున్న... ఉదయించే ఆశలు..రాలిపోయే ఉల్కలవుతుంటే... ద్రవించిన మది చినుకై నేలను చేరి... నా ఆశలను ఊపిరిగా నింపుకొని.. నీకై ఎదురు చూస్తున్న అభిసారికనై ఈ దివిలో... రావడం...నీ ఇష్టం... వదులుకోవడం నా మనసుకు కష్టం... వదల లేకపోవడం నీకు ఎంత కష్టం అంటే... నా ఎదురు చూపులంతా... ✍️అరుణిమలు

తాను నేను

పొగడపూల తొడిమల్లే నే నిలుచున్న... పున్నాగపూల పందిరిలో... తూనిగల తోరణాల నడుమ... మిణుగురునై నే మెరిసిపోతున్న... నీ పున్నమి కాంతులు నన్ను తాకినంతనే.. సువర్ణ గన్నేరులా సొగసులు అద్దుకుని ఎదురు చూస్తున్న.... ఓయ్... నా చందమామ మబ్బుల మాటున వేసిన మునకలు చాలోయ్... చలిమంటలు చెలితో కాచే వేళ చెరిసగమవ్వగ రావోయ్.. ✍️అరుణిమలు

తాను నేను

ఆలోచనలకు ఆనకట్ట అందనంత ఎత్తులో ఉంది... అణిచే కొద్ది అందుకోమని సవాలు విసురుతుంది... కళ్ళలో ప్రశ్నలు పరవళ్ళు తొక్కుతున్నాయి... జవాబుల కోసం ఆ సాగరంలో అన్వేషించడానికి... మౌనం వహించి చెలనం మరిచాయి పెదవులు... మనసు మాత్రం గొంతు చించుకొని అరుస్తుంది... పిలుపుకు పలకని మెదడు పద్మాసనం వేసుక్కూర్చుంది... తనువు మాత్రం స్పందిస్తునే ఉంది ఎద సొదకు... కలుపుకోవడం సులువే మనలో ఒకర్ని... నిలుపుకోవడం మాత్రం నిప్పుల మీద నడక లాంటిదే... బదులుకోరని ప్రశ్నలు ఎన్నో బరువై నిట్టూర్పులను మిగులుస్తున్నాయి... భాద్యత మరిచిన బంధాలను పెనవేసుకొని... తిరిగి రాకోయి ఓ అనుకోని అతిధి... ఆతిథ్యం ఇచ్చేందుకు అక్షయ పాత్ర లేదిక్కడ... కనికరం ఉంటే నువు ఇచ్చిన కానుకలను తీసుకుపో... ఈ అవసరాల కోకలు..కోరికల తాయిలాలు నాకొద్దు... చెదిరి పోయిన కలలను కంచికి పంపి... మన కథను కాశీలో గంగ పాలు చేసేయు... ఈ కళ్ళలో గంగను ఆ గంగ అక్కున చేర్చుకొని... నువ్వు తాకిన మనసును సుద్ది చేసి పెడుతుంది... మళ్ళీ వెనుతిరిగి చూడకుండా నీ ఙ్ఞాపకాలను చెరిపేసి... చెరి సగం కాదని చెరో దారిలో పొమ్మనే జ్ఞానాన్ని ఇస్తుంది... ✍️అరుణిమలు

తాను నేను

ఎదరుగా ఎవరున్నారని ఆ చూపంటే...ఏం చెప్పను ఎదురు చూసే మనసు‌ ఏదో చూపిస్తుంది, చూడమని... నాకు మాత్రమే కనిపించే నీడవి కదూ... నే చిత్రించే భావానివే కానీ భ్రమవు కాదు సుమీ... కానరానీ దూరాలు ఉన్నది కంటికే కదా... ఆ ఆకాశం నీడనే ఉన్నాం మనం... కలిసేది మాత్రం కలల తీరాన..ఊహల వెన్నెలలో... నిదురని చెరిపి....చెదరని ఙ్ఞాపకాల పంట పండించేది అక్కడే కదా.... కలల సరోవరంలో కలువలమే ఇద్దరం... ప్రేమనే వెన్నెల జలపాతలలో తడిసే గువ్వలం... రేయి అనే పలకపై మనం అని లిఖించే అక్షరాలం... అంతేనా......అంటే, రాసే కొద్ది భావాలు ఊరే చెలమలం ... నింగిన విహరించే రాయంసలం.... ✍️అరుణిమలు

తాను నేను

లిపి లేని భాష అసంపూర్ణం...నువ్వు లేని నా ఊహ లా... నా ఆశ కి ప్రాణం నువ్వు....నా భావాలకు భాషవు నువ్వు... నా లిపికి రూపానివి నువ్వు...పదాల మాటున నా అనుభవాల ప్రతిబింబం నువ్వు... నీ ఆలోచనల జడివానలో చిక్కిన చెలిమిని నేను... నువ్వనే ఙ్ఞాపకాల జడివానలో నిలిచిన మనసును నేను... ఆ నింగి ఈ నేల సాక్షులేమొ మన బంధానికి.. నా మనసు బీడుగా మారిన ప్రతీసారి,ఇలా నన్ను తేరుకోమని వర్షిస్తుంది.. తెప్పరిల్లమని మదిని తడిమి చెబుతుంది... చెంపలపై చేరిన చారికలను చెరిపి మరీ స్వాంతన ఇస్తుంది... కానీ నాలో నువ్వనే రూపాన్ని మాత్రం చెరపలేక మధన పడుతుంది... ఆరని నా గుండె మంటలను...ఆగని కన్నీటిని మాత్రం చూస్తూ నిరుత్సాంగా వెను తిరుగుతుంది... కాలమా కాస్త ఇటు చూడవే...నీ చేతలకు నే లేపనాలు పూయలేక పోతున్నా అంటూ చిన్న బుచ్చుకుంటుంది... నా నిట్టూర్పలను చల్లబరిచే చెలిమివి నువ్వు కావే... చెరిసగమని కలిసిన చెలిమి చెల్లాచెదురు అయ్యాక.. ఒక్కొక్క చినుకుగా చేరి నన్ను ఊరడించలేవు... మళ్ళీ రా...మనసును మానసాన ముంచేయడానికి... ✍️అరుణిమలు

తాను నేను

పెంకి పిల్లను.. ఎంకి లా మార్చిన గడసరోడివి.. పాల నురగలను లేత బుగ్గలకు నిమిరి... తేనె పూతలను పెదవులకు అద్ది... మంచు పుష్పాన్ని ముక్కెరగా మలచి.. తూర్పు కొండల నడుమ నే అద్దిన నీ చూపులను... మాపటేలకు పడమటి కొండల్లో విరిసిన రేరాజు వై... వెన్నెల గందాన్ని అరగదీస్తూ... నుదుట నుండి జారవిడిచి.. చిగురాశలను చిత్తడి చేస్తూ..,. పసిడి ప్రాయాన్ని నీ గుండెల మాటున దాచి.. మెల్లగా అస్తమించి.... ఆ పక్కకు చేరేవేంటోయ్ నా నెలవంక... ఏ వంకలు లేని నిను తురుముకున్న కురులను తొలచి... మళ్ళీ ఉదయించావు పెదవలుపై పలకరింపుగా... ఏ జామో తెలియని మైకం కమ్మే మత్తువోయ్.. నీ సన్నిదిలో పగలు రాత్రి పాలు,పంచదారే... ✍️అరుణిమలు

తాను నేను

వసంతాల వాకిట్లో వర్ణాల వయ్యారినై ఒదిగున్న.. సీతాకోకచిలుకలా నా రాముడి కోసం సింగారించుకొని సిగ్గులు అద్దుకున్న... వాసంత సమీరానివై నువ్వు దరిచేరితే... దాచేయనా నిన్ను నా దోర వయసు నడుమన దగ తీర్చని దాహాన్ని నింపు కున్న తుమ్మెదవై, నీవు ఉంటే... నే దప్పిక తీర్చే తేనియలను పొదువుకున్న పుప్పొడిని కానా.. ఓయ్...ఏమైనా, ఏదైనా ఎలా రూపాంతరం చెందిన నా అంతరాన దాగిన రూపం నీవేనోయ్.. ఏ శిశిరం కళ్ళబడనివ్వని నా'రేడువి నువ్వు... నా గడసరి తనాన్ని తట్టి లేపిన నా తేనెటీగవు.. చాలు చాలింక నీ వర్ణనలు అంటుంది, బెట్టుచేయనివ్వని నా మనసు... ఇలా వచ్చి అలా మాయమయ్యే ఇంద్రధనస్సుకు ఇన్ని హంగులే కాదు... పొగడ్తలు కూడానా అని ప్రకృతి కూడా కుళ్ళు కుంటుంది.. ఆలింగనాల మహోత్సవం మొదలైన వేళ నీ, ఈ ప్రకృతి కాంతకు ఎన్ని హోయలో.. ఏయ్.....రేయి చాటు నా సూరీడా... కాంతను ఏలగ తొందరగా రావోయ్... ✍️అరుణిమలు

తాను నేను

ఎదురు చూపుల ఆకలి నీకెంత ఉందో కానీ.. ఈ నిరీక్షణను నేను మాత్రం రచిస్తున్నాను రుచిగా... ఏ రసాన్ని వదలని రసరమ్యమేనోయ్ మన కావ్యం.. వేల ఉగాదుల రుచులను జోడించి మరిపించేలా... మరీ మరీ నువ్వు కొసరి కొసరి రుచి చూసేలా... కానీ కానీ నువ్వు కనికరించిన రోజున.. నా కనికరం నిన్ను చేరదేమో... ఏకాంతాలను నీ కాంతకు అలవాటు చేయకోయ్... ఎడబాటు తడబాటు పడినా... నిలువరించే చేయూత నువ్వు మాత్రమే కావాలనే నా కోరికను కలవరపెట్టకిక.. ఇంతకన్నా ఇంకెలా చెప్పేది నీకు మగడా... ✍️అరుణిమలు

తాను నేను

మదిలో మదిస్తున్న ప్రశ్నలకు బదులేదని అడిగేందుకు పెదవులకు ధైర్యం లేదు... బలహీనతను బలంగా మార్చి...మదిని తేలిక చేసేందుకే మనసు బావిలోని భారాన్ని అక్షరాలుగా తోడుతూ మనల్ని ఆవిష్కరిస్తున్న పదాలలో... ఇష్టాన్ని కష్టాన్ని కలిపి జోడు కావిళ్ళు చేసి భుజాన ఎత్తుకున్న... ప్రేమను ఆవేదనను రెండు కళ్ళలో నింపుకుని నిన్ను చూస్తున్న.... ప్రతి రోజు నీకై సరికొత్తగా పుడుతూ నీలో జీవిస్తూ...నువ్వనే ఆవేధనను హత్తుకుని... నవ్వులకు నీ ఊహను పూతగా పూసి... నీతో ఏడడుగులు వేసి...నీ పానుపపై విరినై నలిగి ఆ నీశీది రేయిలో నా రేడు నీడన నే రాలుతున్నా... ఇంతకన్నా ఇంకేమని చెప్పేది నేను ఎలా ఉన్నానో నీ మనిషినై ఇక్కడ... ఏమని చెప్పను నువ్వు తాకిన తనువు...నువ్వు అడుగిడిన మనసు స్థితిగతులు...... అందుకోవాలనే కోరిక లేదీ నాడు... కానీ అణువణువు నీతో నిండిన దేహంతో నే సహజీవనం చేస్తున్న... నీకై అలంకరించిన ఈ మనసు నీ కోసం తపిస్తుంది కానీ నిను చేరాలని లేదు... తలపులలో మునకలేసిన మనసుకెన్ని మాసికలో... దాచి దాగని దాగుడుమూతలు మన మధ్య రాజ్యమేలుతుంటే నే రచిస్తున్న ఈ తాను నేను సమరం ముగిసేది ఏనాటికో... ✍️అరుణిమలు

తాను నేను

మాటలన్నీ మైమరిపించేవే నీ నోట పలికితే... మనసులో పొందికగా అమర్చి.. కూర్చే రాతలే అవి.. కళ్ళకు తాకిన భావాలన్నీ కావ్యాలుగా మనసు గోడల మీద లుఖిస్తున్నాయి.... నా మనసు వినమని గుసగుసలాడుతూ చెబుతుంది... నా చుట్టూ అక్షరమాలల పరిమళాలు గూడు కడుతుంటే.. నాలో నేను నవ్వుకుని....సిగ్గుపడుతుంటే... ఏమయిందని కను సైగతో నువ్వు అడిగితే... బదులుగా చూపించడానికి ఎక్కడ ఉన్నాయి అవి.... అందుకే నీ చేతిలో నా చేయి వేసి... నే లిఖించని నా చేతి రాతలను నా కళ్ళలో నీకు చూపించమని... మనసుకు సందేశం పంపుతూ.... నీ మనసుకు కూడా విన్నవించుకున్న... నీ చేతిలో ఇమిడిన నా మనసు ద్వారా... కాస్త చదివి చెప్పవే అని.... ఇవేనా అనకు చదివి... అవే ఎక్కువ... నిను తాకిన గాలి కూడా నాకు అమృతమే... నా మనసు పుస్తకంలో నీ పేరున చేరిన ప్రతీ అక్షరం... నువ్వు రాసే నా నుదుటి రాతే సుమీ.... ✍️అరుణిమలు

తాను నేను

కదిలే కాలానివో...కరిగే కలవో తెలియదు కానీ... కాపు కాసే మనసుకు తెలియదా ఇది అత్యాశ అని... పారే నదివే కానీ... తీరం తెలియని గమ్యానివి.. నీ వెంట దేనికో ఈ పరుగులు... ఏకాంతమా కసరకే ఇంకెన్నాళని...నే జీవించేది నీతోనే అని తెలిసి కూడా.. కల్పిత కథవని సరిపెడదాం అంటే...కాచుకుని ఉన్న కన్నీరు మరిగిపోతుంది బాధతో... కలం కన్నెలా మారి...నిన్ను సిరాలా మదినిండా నింపుకుని మరి రచిస్తుంది మనసు పుస్తకాన్ని... అలుపెరుగని అడుగులు సవ్వడేదో వినిపిస్తుంది...కానీ నను చేరేవి...నే కోరే మనసువి కావవి... నీ రుచులు ఎరిగిన నేను...నీ కోరికను కాగలిగాను కానీ నీ నీడ కోర లేకపోయాను... నీ జాడనై నీ ఛాయను అయ్యాను కానీ... అది పడగ నీడని నువ్వనే విషం ఎక్కే వరకు తెలియ లేదు... నువ్వు నాటిన ప్రేమ బీజాన్ని పీకేయడానికి చేతులు రాక...నే కరిగి దారనై జీవం పోస్తున్న... నా ఆయువు నువ్వే... నీకు అందితే నీ చేతి బొమ్మను..అందకుంటే నా మనసు చేతిలో బొమ్మను... మొత్తానికి నను మరచి నీ మాయలో చితికిన చిత్రాన్ని నేను... ✍️అరుణిమలు

తాను నేను

అలా నువ్వు వదిలి వెళుతూ ఉంటే... నీ వెంట వచ్చేది నీ నీడకు జాగ్రత్తలు చెప్పేటందుకే... నా శ్వాసను నిన్ను నమ్మి పంపుతున్నా... గడియ కూడా వదలకని ఒట్టు వేసి మరి.. గడప దగ్గర మనిషిని ఆగుతున్న... ఆత్మను నీ వెంట జంటగా వదిలేసి... అలా నువ్వు వెళుతూ వెళుతూ.. వెనుదిరిగి చూసిన చూపులలో నా మనసు చిక్కుకుని నీతో సాగుతుంది... వెళ్ళొస్తా అనే మాటలలో భరోసా గుండెలను సముదాయిస్తుంది... కళ్ళతో జాగ్రత్త అంటూ నువ్వు నవ్విన చిరునవ్వు ధైర్యాన్నీ దోసిట నింపుతుంది... గడప మీద ఆగిన నా అడుగును వెనుకకు తీసినా... నా ఎదురు చూపులు ఆ గడపకు పసుపు పూతలా మారిపోతాయి... ఎడబాటులో తడబడుతున్న తనువు తహతహలు..నిన్ను మళ్ళీ చూసే వరకు తనివి తీరదు... ఓయ్...నీలో సగం ఇక్కడ అసంపూర్ణంగా ఉందని మరువకు... లోలోన గుబులును గుట్టుగా దాయగలను కానీ... కళ్ళలో కలవరాన్ని దాయలేను రా... స్వాగతం చెప్పడానికి మనసు ఉరకలు వేస్తుంది... తొందరగా..........వచ్చేయ్ ✍️అరుణిమలు

తాను నేను

కావలి కాస్తున్న మనసు గడపలో... ఎదల మధ్య ఎడబాటు ఏంటోయ్ మనుషుల మధ్య కానీ.. మానసాన మంటలు రాజేస్తూ చలి కాచుకుంటున్నావుగా వెచ్చగా... అందనంత దూరంలో ఉన్నావా, కాదే... అద్దంలో కనిపించే చిత్రమల్లే ఎదురుగానే ఉన్నావు... చింతలన్నీ చిరునవ్వు మాటున నక్కి చూస్తున్నాయి.. తడి కనుల నిండా నీ వెలుగులు నిండిపోయాయి.. ఎటు చూసిన తారల తోరణాలే.. పగటి పూట కూడా... ఆకశానికి ఎంత ఆశ్చర్యమో..ఇంత ఆశ ఏమిటే తల్లి అని.. అవని కన్న బిడ్డను కదా...భారం ఎంతైనా బరువు తెలియదు... గుండెల నిండా ఉన్నావు బంధానివై...ప్రాణానికి భారం కాని వాడివి నాకేం బరువు అవుతావు... ఎదురు చూపుల వరానివై...వరించావు నిరీక్షణకు నన్ను పరీక్షించమని అప్ప చెప్పావు... వరం లాంటి శాపానివై...శయనించావు నా మనో మందిరాన... కాచుకుని ఉన్నా......కనులు తెరిచే వేళ కోసం... కనుల గడప సాక్షిగా... ✍️అరుణిమలు

తాను నేను

ఎలా ఉన్నావని మనసు అడుగుతుంది... బదులు రాని బండను నే ఏమని కోరను... మనసు లేని వారితో లంకె పడితే లంకణమే అవతలి మనసుకు... ఆవలి తీరాన ఊరిస్తూ...ఉసూరనిపిస్తూ ఆడుకుంటుంది.. మూడు అక్షరాల పదానివి...కానీ మూగదానివే మనసా నువ్వు... మాటలు వచ్చు పలకడం చేతకాక..ఆడిస్తావు మనుషుల చేత... నువ్వు ఎలా ఉంటావో చూడాలని ఉందే ఒకసారి... ఇన్ని శిక్షలు వేస్తున్నావుగా ఎంత కటువుగా ఉంటావో కనిపించవే ఒకసారి... రెండు వేపుల పదును తేలిన దానివి సుమీ... వదిలేద్దాం అన్నా కష్టమే...అందుకుందామన్నా కష్టమే... అచ్చు నీలాంటిదే నా మనసున దాగిన మనసు కూడా... ఆ మాటకు అర్థమే తెలియదు కదా దానికి... అర్ధాలకు కొత్త అర్ధాలు చెప్పగలదు కానీ...తానేంటో తెలుసుకోదు కదా... మధించిన మాటల రాసులలో నుండి మౌనం ఇలా చివరగా పుడుతుంది అని ఆనాడు తెలియలేదు... తెలిసుంటే మాటలు పలకని మౌన మాల ధరించేదాన్ని... ఇలా ఇప్పుడు ఈ ఎదురు చూపుల ఎడబాటు ఉండేది కాదు... నీ క్షేమ సమాచారాల కోసం పరితపింపు ప్రాప్తి అయ్యేది కాదు... ✍️అరుణిమలు

తాను నేను

ఆలోచనలు పరవళ్ళు తొక్కుతుంటే... వాటి తీరాన ఇష్టమైన ఙ్ఞాపకాలను తలంచుతూ అడుగులు వేస్తున్న... అలా అలా నడుస్తూ వెనుదిరిగి చూస్తే అడుగులు జాడలు లేవాయే... మనసు నవ్వింది...కాలం గురుతులను కడిగేస్తూ ముందుకు కదులుతుందని మరిచావా అంటు.. అలా అలా వచ్చి పోయే అలలు లా..ఆలోచనలలో ఆటుపోటులు ఒకపక్క.. పాదాలను ముద్దిడే నీటి తరంగాలులా...మేను తాకే నీ ఊహల తాకిడి ఇంకొక వేపు... వంపులు తిరుగుతూ రూపం మారే తీరాన్ని చూస్తే...నీ నిలకడ లేని నిర్ణయాలులా కనిపిస్తున్నాయి... కోతకు గురువుతున్న ఒడ్డుకు నా మనసుకు తేడా ఏముందోయ్... నీ ఇష్టాల ఫలితమే ఈ మది కోతకు కారణం... కళ్ళు వర్షించడం మొదలయ్యాక తేరుకున్న మనసు ఏమయిందని ప్రశ్నించింది... ఇందాక ఏరిన రంగు రాయి గుచ్చుకుందోయ్ అరిచేతిన..గులక రాయని ఇప్పుడు అర్థమయింది.. ఆ పరవళ్ళలో రాయిని విడిచి..చేయి కడిగి చూసా చేతి రేఖను మార్చేసింది ఆ గాయం.. ఇష్టంగా అందుకున్నది ఏమో కదా...గాయం లోతుగానే ఉంది... కళ్ళలో నుండి జారుతున్న లవణ బిందువులను దాహం తీర్చుకోవడానికి అన్నట్టు..ఆ పరవళ్ళు పొదివి పడుతున్నాయి... నువ్వనే ఙ్ఞాపకాన్ని తర్పణంగా వదిలేద్దామా అనుకున్న కానీ.. మెదడుకు అక్కడ ఎండిన నీటి చారల మరకలు మాత్రమే కనిపించాయి... ఏం మాయే మనసా నీది...వదలనీవవు...ఉండనీవవు...గాయాలని మాననీవు ✍️అరుణిమలు

తాను నేను

వాసంతం అద్దిన ప్రకృతి అంటే ఎవరికి నచ్చదు.. అచ్చు ప్రేమనే భావం లాంటిదే కదా... ప్రేమనే అధ్బుతమైన భావనను అనుభూతి చెందగలం కానీ... అందుకోవటానికి ఎన్ని గాయాలను గేయాలుగా మలచాలో కదూ... శిశిరం పడిన పురుటి నొప్పుల ఫలితమే వసంతం.. ఎన్ని ఆశలు నేల రాలి కొత్త ఆశలకు ఊపిరి పోస్తాయో... నిజమే కొత్త ఆశలకు శ్రీకారం చుట్డాలంటే... ఫలించని ఆశల ప్రయాసలను చంపేయాలి.. మాట వినని మనసుతో ఎన్ని మౌన పోరాటాలో... ఊపిరి వదిలేయలేని బాసలను పారేయడం అంత తేలికా.. కాలమే సమాధానం చెబుతుంది అంటే ఇదే అనుకుంటా .. దండించేది తానే...చేయి అందించేది తానే... అక్కరకు రాని వారిని అందుకోమనేది నువ్వు... అవే అనుభవాలు అంటూ దూరం జరగమనేది నువ్వే... కాలానికి మాత్రం అందనిదే మది ఆరాటం, పోరాటం ఎప్పటికి... ఓయ్....వసంతమై వచ్చావు కానీ శిశిరమై తిరిగి పోయావు... శిధిల పత్రాలపై లిఖిస్తున్న లేఖలు నిను చేరవు కానీ నువ్వు నింపిన ప్రేమ మలినం కాకుండానే మరో బలంగా మారుతుంది... అదే మళ్ళీ మళ్ళీ నీకై చిగురించి రాలడానికి నే సిద్దమంటూ... ✍️అరుణిమలు

తాను నేను

అలసిన మనసుకు, రేయి వక్కను ముక్కలు చేసి తాంబూలం అందిస్తున్న... చిలకలు చుట్టిన ముంజేతి వేళ్ళను మునిపంటితో కొరికే వేళలో... ప్రేమకు పరీక్షా సమయం‌ ఇదే కదా...అంటూ సిద్దం కమ్మంటుంది మనసు... జాగారానికి నజరానాలను కోరనులే .... రాత్రిని నలిపి కురులకు విరులుగా మలిచి కానుకను చేసి ఇచ్చాక... అధరాల కొనలలో అధిరిన భావాన్ని నీ కన్నులు పసిగట్టాక...పెదవి తాంబూలం పండినట్టే ఇక... చల్లని రేయి వెచ్చగా మారి కరిగిపోతానేమో అని మబ్బుల చాటున దాగున్నట్డు నీ ఎద మాటున నే దాగున్న... నా నగవులు నీ ఎదను చెక్కిన చిత్రాలు ఆరనే లేదు ...ఇక చాలంటు ఆరాటం పెరిగిన భానుడు తొందరపడి మేల్కొన్నాడు... కనుల తెరిచి చూసానా చుట్టూ.. ఎక్కడ నువ్వంటూ... మనసు మురిపెంగా తెలిపింది...కలలను ఇలలో వెతకరాదే అని...❤❤❤ ✍️అరుణిమలు

తాను నేను

రచిస్తున్నానో..పదాలను పేరుస్తున్నానో తెలియడం లేదు.. వెలి వేయలేని భావాలలో బందీని కాలేక ..నాకు నేను రాసుకుంటున్న భరోసా ఇది.. ఙ్ఞాపకాల బారం ఎంతుందో తెలుసా అంటే...రుచి చూడమని కన్నీరు పెదవిని తాకుతుంది.. రంగుల కలలు చూపించావేమో...ఆ రంగులన్నీ తెచ్చి ఒక చోట అద్ది చూసాను.. దిష్టి చుక్కలా మారి వెక్కిరిస్తున్న ఆ కలలను కాటుకగా అలంకరించా.. అందుకనేమో కనులకు కునుకు లేదు.. నీ ఆలోచనల నుండి తప్పించుకునే దారిని కూడా మూసేసావు...నిదరుని చెదిరించి మరి... నవ్వులను అద్దుకున్న పెదవులు పలికే... బాగున్నాననే పలుకులను విని ఊరుకో... కళ్ళలోకి మాత్రం చూడకు నటించడం వాటికి రాదు కదా... నిన్ను కదిలించ లేకపోయినా అవి చెలించి పోతాయి... నీ జీవితంలో నేనొక చిన్న పాత్రను మాత్రమే... మరి నువ్వో...చూస్తున్నావుగా చదువుతూ నా... మన ఈ పుస్తకాన్ని.. అన్నిటా నువ్వే కదూ.. నేను ఎక్కడ అని వెతికి చూడు..నువ్వు అడుగిడిన నాడే కనుమరుగై పోవడం కనిపిస్తుంది.... నిండుగా ఉన్నాను సాగరంలా...అనంతమైన ఘోషను నాలో నింపుకొని... ఒడ్డుకి చేరాలనే తపనతో పోరాడుతున్న కెరటంలా నిరంతరం శ్రమిస్తూ.. సాగర గర్బంలో దాగిన నువ్వనే నిశ్శబ్దాన్ని దిగమింగుతూ...‌ నదిలా స్వచ్చంగా చేరానురా నీలో.... ఇన్ని అక్షరాల సుడిగుండంలో వదిలేస్తావనుకోలేదు.... ✍️అరుణిమలు

తాను నేను

దోసిట నింపుతున్నా నవ్వులను అతి కష్టంగా... నువ్వనే ఆలోచన చెంపలను తడుముతూ దోసిట్లో పడి నవ్వులను కనుమరుగు చేస్తుంది... మది సాగరం అనంతం కదా...నాలో నీ తలపుల్లా... ఎవరు నువ్వంటే ....నే చెప్పేదేమొ నీ గురించి ఏంటి నీ ఇష్టం అంటే...నా చిరనవ్వులో మెరిసేది నువ్వు ఎందుకు ఈ కష్టం అంటే..నా మౌనంలో దాగున్నది నువ్వు ఎంతవరకు ఈ భారం అంటే...నా బలం తానేగా తానున్నంత వరకు ఎన్నాళ్ళు ఈ కన్నీళ్ళు అంటే..నా మనసులో తాననే అగాధం నిండే వరకు ఎందుకంత ప్రయాస అంటే...నన్ను నేను మరిచినంత ఆరాధన ఉంది కనుక ఇష్టాన్ని, కష్టాన్ని... నువ్విచ్చిన ప్రతి క్షణానికి అక్షర రూపాన్ని ఇచ్చేది... మళ్ళీ మళ్ళీ నువ్వనే భావానికి ఊపిరి పోయాలని... ఆ అక్షరాల మాటున దాగిన నీతో దాగుడుమూతలు ఆడటం నా అలవాటు... ఆ అక్షరాలను తడుముతుంటే మనసు తడి ఆరుతూ ఉంటుంది... కలలు కనేది నీ కోసం...కలవరాలు మిగిల్చిన గతాన్ని కాకుండా కొత్తగా కనిపించేది అక్కడే కదా... ఇలా అందరికి ఆటోగ్రాఫ్ లు ఇవ్వమాకయ్యా... నువ్వనే ఙ్ఞాపకం చెదలులా కాదు చెదిరిపోని చిరునవ్వు అవ్వాలి... ✍️అరుణిమలు

తాను నేను

కునుకు జాడ లేదు.. కళ్ళు మూసి కలవరించినా... కలలకు అంతు లేదు.. కలకలం రేపుతున్నా... పగటి కలలను నిజమని నువ్వు చూపించావు... అవే ఇప్పుడు పీడకలలై వెంటాడుతున్నాయి... అందుకోవడం అంటే వాడుకోవడం కాదు... ఇచ్చిన దానిని పొదివి గుండెలకు హత్తుకోవడం... అవసరం తీర్చుకోవడం అంటే మనిషితో ఆడటం కాదు... మనసును గెలుచుకోవడం అంటే మానసికంగా చంపేయడం కాదు... ప్రేమంటే రెండు పదాలు కాదు... ఫలిస్తే ఫలితం ఇస్తుంది... విఫలమైతే విచ్ఛిన్నం చేస్తుంది మనసును... రూపాయి పెన్ను ఋణం ఉండిపోయావు కదా... అందుకే ఆ ఋణాన్ని ఇలా లిఖిస్తున్న... మెలకువలో నీ తలపులు.. నిద్రలో నీ పలవరింతల తుళ్ళిపాట్లు..తప్పేలా లేవు... తప్పించుకోలేని...తప్పుకుపోలేని...తిప్పలు తక్కువ పెట్టావా నీ సరదాల కోసం... ముగింపుకు చేరవా అంటున్నా మూతి ముడిచేసి,చేతులు ఎత్తేసింది కాలం...నా వలన కాదంటూ... ఇలా మనసులను కాల్చేసిన పండుగలనే చేసుకుంటావు కదా... రోజు నీకు పండుగే మరి...రోజు చెప్పలేను కాని ఇవ్వాళ అందుకో నా పండుగ శుభాకాంక్షలు... ✍️అరుణిమలు

తాను నేను

నువ్వు వచ్చే వరకు తెలియదు... నవ్వులకు నగిషీలు చెక్కవచ్చని.... నిన్ను చూసే వరకు తెలియదు..కళ్ళకు కాటుక కూడా అడ్డమని.... నిన్ను తలచే వరకు తెలియదు...తలపులకు తాళం వేయొచ్చని.... నిన్ను దాచుకునే వరకు తెలియదు...నా మనసు ఇంత ఇరుకైనదా అని... నిన్ను ఇష్టపడే వరకు తెలియదు...ఇష్టాన్ని ఏ కష్టం కరిగించలేదని.... నువ్వు ఎదురు పడేవరకు తెలియదు...సిగ్గులో ఎన్ని సిత్రాలు ఉన్నాయో.... నిన్ను తాకే వరకు తెలియదు...స్పర్శ తనువును కాదు మనసుని తడుముతుందని... దగ్గరతనం అంటే కలిసి ఉండటం కాదు....ఏ దూరాలు చెరపని,చేర్చలేని తీరం మనమని... అసలేం తెలుసు నాకు...నువ్వు వచ్చేవరకు నాకు నేనే తెలియదు... నువ్వు వచ్చాక తెలిసింది...అసలు నేనంటు ఎక్కడ ఉన్నాని...నువ్వు నేనులో నేను ఒక భాగం మాత్రమే అని.... వెలుగులకు నమ్మకాన్ని ఇచ్చేద్దాం...చీకటికి కన్నీటిని ఇచ్చేద్దాం.... మనం మాత్రం ...తాను నేనుగా తనువులు వేరైనా మనసులను ఒకటిగా కలిపి మలిచేద్దాం అరుణిమలను.... ✍️అరుణిమలు

తాను నేను

చుట్టూ చీకటే...మన కన్నులలో తప్ప... ఒంటరితనమా ఆ చీకటికి ఇచ్చేద్దాం... జీవితానికి ఈ క్షణాలను కానుకను చేద్దాం... వెలగులను నింపేద్దాం మన మనస్సులో... శ్వాసలను పంచుకొని మరో కొత్త జన్మ ఎత్తుదాం... మౌనానికి లిపిని చెక్కుదాం మన రూపాలలో... బాసలకు ఊపిరి పోద్దాం మనమై... కోరికలను కరిగించి కాటుక చేసి బహుమతిగా ఇచ్చేయు అలంకరించుకుంటా... ఏకాంతాన్ని రేయికి జతచేసి వాళ్ళ ముచ్చట్లు చూద్దాం... ఓయ్....ఒకటే జీవితం...ఒకటే మనసు...ఒకరికే చోటు..అంతే మరి, నాకు కూడా చోటు లేదక్కడ... ఏలేసుకో చెలికాడవై.... ఎదను ఏడు జన్మలకు నాకాడ కుదవ పెట్టి మరీ ❤❤❤ ✍️అరుణిమలు

తాను నేను

ఈ దగ్గర తనంలో ఎంత దూరముందో కదూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేనంత... నా కనుల నిండా ప్రశ్నలే కనిపిస్తున్నాయా నీకు... చూడటానికి కూడా కష్టంగా ఉంది కదూ... వాస్తవాలకు నువ్వెంతెంత దూరం అంటే నా పెదవికి,మెదడుకు ఉన్నంత దూరం అంటుంది మనసు... అవును మెదడు కదిలిస్తున్న ప్రశ్నలు, పెదవి గడప చేరే సరికి మనసు హెచ్చరిస్తుంది ఎందుకిప్పుడని... పరాయి అయితే ప్రశ్నించేదాన్ని... వద్దనుకుంటే కడిగేసేదాన్ని... మనసువి అయిపోయావు కదూ గట్టిగా అడగాలంటే ఊపిరి కూడా ఉలిక్కి పడుతుంది... వాస్తవాలను చూపించలేక అలాగని సర్దుకుపోవడం చేతకాక నలుగుతున్న మనసు వేదన వినపడదే నీకు... ఒక్కసారి నా కళ్ళలోకి చూడవయ్యా, నీ గుండెల మీద చేయి వేసుకొని అంతా అర్ధమవుతుంది... చేతకాని తనం ఏమో మరి ఇది, నా ప్రాణం అయిన నిన్ను హింసించలేక నా శరీరం చీలి చీలిపోతుంది ఇక్కడ... జీవితం ఒకటే కానీ ఈ మజీలీల మలుపులు మరీ ఇంత కర్కసంగా ఉన్నాయి ఏంటో... నువ్వనే సిరా చుక్క అచ్చుగా మిగిలిపోయింది ఈ మది కాగితం పై... చెరిపేయనా ఎలా.....చింపేయనా అదెలా..... ఇదే మనసుకు లోంగిన వారి చేతకాని తనం అంటే... ✍️అరుణిమలు

తాను నేను

ఎవరు నువ్వని అడిగాను, నేనొక నమ్మకాన్ని అన్నావు.. నమ్మొచ్చా అంటే నీ ఇష్టం అంటూ స్వేచ్ఛను ఇచ్చావు... ఎమోషన్స్ లో నేనొక బందీని,ఈ దగ్గర తరువాత దూరాలు నాతరం కాదన్నాను.. నేను అంతే అని నమ్మపలికావు...నిజమే నా అన్నాను నిజానికి అర్ధాన్ని వివరించావు అర్థం కాలేదు కానీ నిజమేమో అనిపించింది.. పొర బడిన ఆ క్షణం ఇంత పగబట్టి ఇలా వెంటాడుతుంది అనుకోలేదు... ఎన్నాళ్ళు ఈ ఙ్ఞాపకాల చిత్రహింసలు ఈ ప్రాణానికి... ఊహ తెలియని పాపాయి తండ్రి మాటలు నమ్మినట్టు నమ్మాను... నీ వేలు పట్టి అడుగులు వేయడం నేర్చుకుంటున్నానా అనుకున్నాను.. నువ్వు చెప్పే జాగ్రత్తలలో నా పై ఆపేక్షను మాత్రమే చూసాను ఆనాడు... ఎవరిని నమ్మ వద్దు అనే నీ మాటలు విని ఎవరో ఎందుకు నాకు నువ్వు చాలవా అనుకున్న... చందమామ రావే జాబిల్లి రావే అనేలా నువ్వు చెప్పిన కథలన్నిటికి ఊ కొట్టాను... తాయిలాలు కావాలని మారం చేయడం ఎరగను కదా... మరి ఎందుకోయ్ తాయిలం బదులు అడగకుండానే విషాన్ని చిమ్మావు... గడియ కాలం మాటలను, పనులను పక్కన పెడితే చాలు నీ ఆలోచనలు అనే గతం కళ్ళముందు కదులుతుంది.. నిండుగా ఉన్న నా అంతరంగ కొలనులో నువ్వనే తరంగాల తాకిడి ఒడ్డుకు కన్నీటిగా మారి బయట పడుతుంది... ఋతువు లాంటి వాడిని నమ్మకని చెప్పలేక పోయావు నిజాన్ని... నువ్వనే నిజం ఈ జన్మంతా వెంటాడుతునే ఉంటుంది.. వాడకాలు ఎలా ఉంటాయో అనుభవంలో చూసా కదూ మరచిపోలేక పోతుంది పిచ్చి మనసు... నమ్మకురా చెడేవని ఉత్తినే అనలేదు కదా పెద్దలు... ✍️అరుణిమలు

తాను నేను

నీ ఆలోచనలు నాలో చేరిన క్షణం చుట్టూ వాతావరణం మారిపోతుంది ఒక్కసారిగా... అవును దుఃఖంలో దహించే క్షణాలు లాగానే... నువ్వనే మోహంలో మునిగే క్షణాలు ఎన్నో... మనసు నీ వసమైన నాటి నుండి నువ్వు ఎదురు పడిన క్షణంలోనే కాదు నిను తలచిన క్షణాలలో కూడా గండె డబుల్ స్పీడ్ అందుకుంటుంది అదుపనేదే మరచింది... బిడియాలన్ని బెదిరి పారిపోయేవి నీ ముందు.. సిగ్గులకు తిలోదకాలు ఇప్పించావుగా నీ చేతుల్లో నా చేయి పెట్టి మరి... జాగారాల నగారాలు మొగిన రాత్రులు ఎన్నో... యుద్దానికి సిద్దమా లేక సందికి సిద్దమా అనే నీ కబురు ఇంకా చెవుల్లో వినిపిస్తుంది... వెన్నెల దాటిన గడపల్లో వేల వసంతాలు వచ్చిపోయేలా కాలం ఆగి మరీ కరిగిపోమ్మనేది... ఎవరు నువ్వని పలికించిన పలుకులు పలకరిస్తునే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఎవరు నువ్వని... పెదవులకు అలవాటైన పేరును మది పలుకుతుంటే అధరాలపై మధువు మరుగుతుంది... కళ్ళలో నుండి ఎప్పుడు జారావో ఎదలోకి చెక్కిళ్ళకు చెమటలు అద్దుకున్నాయి... ఎదురుగా లేని ఈమాత్రనికి ఈ గిలిగింతలు అవసరమా అంటు కసిరితే వినను పొమ్మంటావే... ముంగురుల మాటున దాచిన మోమును చూడాలంటూ మారాం చేయకోయ్... నీ ఊహల తలపుల్లో తడిసిన మేనుకి చలేస్తుంది...కాస్త తమాయించుకోనివ్వు.... నీ దూరాల నిట్డూర్పులలో చలి కాచుకోనివ్వు... తేరుకోనివ్వవా నువ్వనే నీడల నుండి బయట పడనివ్వు... కనుమరుగై పో మనం నుండి నువ్వుగా నా మనసులో.. చల్........ఇక పో ✍️అరుణిమలు

తాను నేను

నాలో నేను జీవిస్తున్న.... నువ్వు చెల్లా చెదురు చేసిన నన్ను నేను కూడగట్టడానికి... కానీ చేతకాని దానిని అవుతున్న ఎందుకో.. అవును, ఏం చేసావు పది అబద్దాలు, నాలుగు మాయ మాటలు కొన్ని వాగ్ధానాల నీటి మూటలు ఇవేగా... వీటికే ఇంత చిధ్రమయి పోయాన... అవును నేను మనసున్న మనిషిని కదూ అందుకే ఈ యాతన... వదిలేయడానికి నిన్ను నేను వాడుకోలేదు కదా... పారేయడానికి పరాయి వాడిలా చూడలేదు కదా... మరచిపోడానికి మతిలేని దానిని కాను కదా... మనసును ఇచ్చాను, భద్రంగా దాస్తావని... అడుక్కుని ఉంటే బాగుండేది... ఇచ్చిన దానానికి ప్రతి ఫలం కోరకూడదనే జ్ఞానం నాకు ఉంది కనుక ఈ వేదన ఉండేది కాదు ఈనాడు.. విలువలను పాతేసిన పాత్రవని తెలియదే అప్పుడు... రక్తసంబంధాలకు విలువ ఇవ్వని నీ దగ్గర విలువ కోరుకోవడం హాస్యాస్పదం... కడుపు నిండితే చాలు నీకు అది కాకి ఎంగిలో,విస్తరో,ఎంగిలి విస్తరో ఏదైనా ఒకటే... శిక్షించాలని ఉన్నా నా మనసుని శిక్షించడానికి చేతులు రాకా నా తనువును హింసిస్తున్న నీ ఙ్ఞాపకాలతో... ఎలుగెత్తి గొంతు చించుకుని నీ పేరును అరవాలని ఉంది.. ఇదిగో నువ్వు ముంచిన నా కన్నీటిలో నే కలువనై వికసిస్తున్న చూడని... చూడటానికి కళ్ళు, వినడానికి చెవులు, తెలుసుకోడానికి మనసనే లేని రాతి మనిషివి కదా... ఓయ్....ఎవరు నువ్వు అంటావు కదూ... నువ్వు చెరిపేసుకున్న నీ గతాన్ని నేను... నీకు గతాలతో పని లేదు భవిష్యత్తు ప్రణాళికలు తప్పించి...హ్మ్ ఏ గతం నిన్ను కదిలించక పోవచ్చు కానీ రేపు....... ✍️అరుణిమలు

తాను నేను

చదవాలని ఉంటుంది లోకాన్ని... తెలుసుకోవాలని ఉంటుంది సాహిత్యాన్ని... వర్ణనలలో విలీనం అయిపోవాలి అనుంటుంది... భావాలలో బందీని కావాలనుంటుంది... అక్షరాల కూర్పును కూడాలని ఉంటుంది.. కానీ, జీవితాన్ని చదివితే ఇంకా బాగుంటుంది ఏమో అనిపించింది... నన్ను నేను చదువుకోవాలని మొదలు పెట్టిన ఘడియలు ప్రభావమేమో... నిన్ను తీసుకొచ్చి నా ముందు ఉంచింది, చదివి చూడని... నాలో నన్ను వెతకడం మానేసి నీలో నన్ను నేను వెతకడం మొదలు పెట్టాను... ఇదేమి చిత్రమో లోకమంతా నీలో ఇమిడినట్టు కనిపిస్తుంది... నీ చూపు తడిమిన చోటల్లా, ఏడేడు వర్ణాల ఇంద్రధనస్సు నీడలై నా మీద పరుచుకుంటున్నాయి... నా భావాలలో లీనమైన నిన్ను అక్షరాలుగా లెక్కలు వేస్తుంటే మనసు జంకుతుంది లెక్క తప్పుతానా అని... నాకు నేను తెలియదు...నేనెవరు అంటే నిన్ను మాత్రమే చూపించగలను... తాను ఎవరంటే నేనే అని కొంటె జవాబు ఇవ్వగలను... మళ్ళీ మళ్ళీ నిన్ను చదువుతునే ఉన్నా, చదివే ప్రతీసారి నువ్వు కొత్తగా,వింతగా కనిపిస్తున్నావు... ఇంతకి ఒక్కడిగా కనిపించే నీలో ఎందరున్నారో... ఆ అందరిలో నేను ఎవరికి చెందానో ఇప్పటికీ అర్థం కాలేదు... అర్ధాలకు అర్ధాలు చెబుతావు కానీ నువ్వొక అర్థం లేని పదానివి... ఓయ్ శేషం........నువ్వెప్పుడు శసేషమే నీకు...నాకు కూడా... ✍️అరుణిమలు

తాను నేను

రేయి అంతా నన్ను అల్లేసి.. నను ఆక్రమించి నువ్వు అలికిన నా మేను వాకిలి మెరిసి పోతుంది నువ్వనే పేరుని అద్దుకొని.. మురిసిన మనసు పరవశించి నిన్ను హత్తుకుంది నా దప్పిక తీర్చే దాహానివని... వేయి రాత్రులు కలిసి కరిగిన ఈ రేయి నీ నీడలో నటిస్తున్నాయి మీరెవరంటూ.. ఇద్దరా, ఒకరా అనే జవాబుకు నే బదులు ఇచ్చేలోపు ఎవరు చూస్తారో అన్నట్టు... తెల్లారేసరికి కరిగి ఆవిరై జాడ కూడా లేనట్లు కనుమరుగై పోయావు... ప్రతి రేయి నీ రాకకై ఎదురు చూస్తున్న మళ్ళీ మళ్ళీ చకోర పక్షిలా... ✍️అరుణిమలు

తాను నేను

ఇలా నీ ఎదపై ఈ కాస్త చోటు చాలోయ్... బ్రహ్మాండం బద్దలు అవుతుంది అన్నా చిరునవ్వుతో స్వాగతిస్తా.... ఆద మరిచి నే నిదురించే చోటది ఏ బెదురు చేరని నా అంతరంగమనే నా మది గది అది.... నాన్న గుండెలపై బొజ్జున్న ఆనాటి పసిపాపలా మారిపోయేది మళ్ళీ ఇక్కడే కదా..... నమ్మకం అదే ఆ పిడికెడు స్థలం నాదేనని..నేను మాత్రమే దానిని ఏలే రాణిని అని... ఇంతకన్నా ఏ ఆడదైనా కోరే చోటు,అడిగే కోరిక ఇంకేమైనా ఉంటుందా... నను కావలి కాసే నా కంటి రెప్పవి కదూ, ఆ కన్నులలో కాంతిని నేనై... సడి చేయని నీ ఊపిరి శాక్షిగా, ఎన్నెన్ని బాసలు చేస్తుందో నా శ్వాస... నా ఆయువు ఆగే వరకు నువ్వు నా ఎదలో పదిలమే అంటు.... ష్ ష్ ష్ ష్ ష్ ఇవి మనసులు చెప్పుకుంటున్న మాటలు ;) ;) ✍️అరుణిమలు

తాను నేను

మరవలేని నా గతాన్ని రచించావు కానీ... నా భవిష్యత్తును శాసించలేదు నీ గెలుపు... వర్తమానం మాత్రం నీవై నిండిపోయావు... రేపు చిత్రించే నా రేపటిలో నువ్వు ప్రతిచోటా ఉంటావు... ఎన్నో ఎన్నెన్నో రూపాలలో నను తాకుతూనే ఉంటాయి ఙ్ఞాపకాలై అని ఖచ్చితంగా చెప్పగలను... మరుపే తెలియని మనసులో నా మనిషిగా మిగిలి ఉంటావు... కానీ నీ ఆలోచనలు అవరోధాలు కాదు కాలేవు... నువ్వు నా బలహీనత...అవును బలం కూడా నువ్వే.. చెలిమివి నువ్వే...చెలికాడువు నువ్వే..చెదిరిన స్వప్నంలో చిరునవ్వువు నువ్వే... ఎక్కడ లేవు నువ్వు...ప్రేమ అనే రెండు అక్షరాలలో సగ భాగానివి... నన్ను ముద్దుగా పిలిచిన నా పేరులో చిరు సవ్వడివి... స్నేహాన్ని అందించి చేయి చాపిన నమ్మకానివి... ముద్దుతో దరఖాస్తులు పంపిన మాధుర్యానివి... మనసును మొలిచిన ఆశవి...గుడెలకు హత్తుకున్న ఎద సవ్వడివి.. నా ఊహలకు రూపానివి...నా భావంలో అక్షరానివి... కనిపించని గుండె ఘోషవి....మానని గాయానివి నా కన్నీటిలో కరగని చిత్రానివి..కనుమరుగు కాలేని కాఠిన్యానివి.. నిర్లక్ష్యం, నమ్మకం,విలువ అనే పదాలను చేతలలో రుచి చూపిన వాడివి.. ఆట గాడివి కదూ...గెలిచావు నను వీడని తలపువై ఉండి పోయి... అన్నీ నువ్వై, అంతా నీవై...కష్టానివై, ఇష్టానివై నను ఏలే రాజువి నువ్వే ఎప్పటికి... నా స్థితి ఎరిగిన వాడివి నువ్వొక్కడివే..ఇది మన కథ అదే నువ్వు రచించిన నా రాత కదా... ఆత్మపరిశీలన చేసుకోకు ఎప్పుడు...నా కన్నీటికి నువ్వు జవాబు ఇవ్వలేవు అక్కడ... అందర్నీ మోసం చేయు ఎంతోకొంత లాభ పడొచ్చు కానీ నిన్ను నువ్వు మోసం చేసుకుంటే మిగిలేది ఏముండదు.. ✍️అరుణిమలు

తాను నేను

భవిష్యత్తు ఏంటి తెలియదు కానీ... కాలం అయితే కదిలి పోతుంది... ఎన్నో అనుభవాలు మరెన్నో ఙ్ఞాపకాలు మధ్య నన్ను కదిపి,కదలనివ్వని ఆలోచనలు మాత్రం నీవే... ఎందుకొచ్చావనే ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది... గాలికి ఎగిరొచ్చి నీ చేతిలో పడిన చిత్తు కాగితాన్ని అనుకున్నావా... ఇష్టం వచ్చినట్లు నచ్చినట్టు గీసేసి నీ ఇష్టాలను... కోపం వచ్చినప్పుడు చింపేసి... నీ అవసరం తీరాక విసిరేసి పోవడానికి... ఆడుకున్నావు కదూ బొమ్మను చేసి... అందుకే అంతు లేని కన్నీటి సంద్రంలో తీరం తెలియని ప్రయాణం చేస్తుంది నా మనసు... ఓయ్ ఆడటానికి నీకేం హక్కు ఉందయ్యా... నీ చేతిలో ఊపిరి పోసుకోలేదు ఈ ప్రాణం నీ ఇష్టం వచ్చినట్లు నలిపేయడానికి... గాలివాటు మనిషిగా నిన్ను చూసుంటే బాగుండేది... నా ఊపిరివి అనుకున్నాను పొరబడి అందుకే నీ ఆటలు ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి... నమ్మకాన్ని వాడుకున్నందుకు నిన్ను ఏమనాలో ఏమో... నమ్మినందుకు అసహ్యంగా మాత్రం ఉంది నా మీద నాకు... జీవితమనే నా ఈ పుస్తకంలో నువ్వనే మజిలీ శిలాక్షరాలుగా లిఖించుకొని తప్పు చేసాను... చెరపలేను...చెదిరిపోలేను...ఛి అని నిన్ను అనుకోలేని ఈ పిచ్చి మనసును చంపేయను లేను.. ✍️అరుణిమలు

తాను నేను

ఆ చూపులతో ఇలా కట్టేయకోయ్.. కాలాన్నే కాదు నన్ను కూడా ఇలా స్ధాణువును చేయకురా... నీ ఊపిరిని తాకిన గాలి నను తాకిందేమో... అణువణువు పరవశించి పోతుంది తనువు... లోలోపల రాజుకుంటున్న నువ్వనే కోరికను అణిచేందుకు మనసు ససేమిరా అంటుంది... కళ్ళు కలవరిస్తున్నాయి నీ రూపాన్ని ఊహకైనా చూపించమని మెదడును... అదరాలు అమృతాన్ని అద్దమంటున్నాయి నీ పేరు పలికి... సిగ్గు సింగారించుకుంది నీ కోసమే నేనంటు... ఇన్ని గిలిగింతలు పెడుతున్నావు ఎక్కడో ఉండి... ఊరించే ఈ ఊసులకు ఊ కొడుతున్నావా మౌనంగా... నన్ను నన్నుగా చూసింది నువ్వు... నిన్ను నిన్నుగా చదివింది నేను... ఈ దూరం చాలా దగ్గరగా ఉంది....బాగుంది నీలా....నిను దాచుకున్న నా మనసులా చాలా బాగుంది.. ✍️అరుణిమలు

తాను నేను

కలిసిపో ఈ కళ్ళలో....కరిగిపో ఈ కాలంలో..❤❤ ఒదిగిపో ఈ ఒడిలో..ఓరవలేని భవిష్యత్తును వెక్కిరిస్తూ..❤❤ వెలుగులను వెలివేద్దాం మన లోగిలికి వెన్నెల నీడలు చాలని...❤❤ మౌనం పెదవులకు ఇచ్చేద్దాం మనసులను మాట్లాడుకోమని...❤❤ తనువులను తరించి పొమ్మందాము ఆ భావాన్ని మనతో విడదీయలేనంత లోతుగా...❤❤ శ్వాసలను ఏకమై పోనీవు నువ్వు నేను వేరుకాదని మనసుకు ఇచ్చేద్దాం భరోసా...❤❤ ప్రేమను ముద్రించేద్దాం మనం కూడా చెరపలేనంత చెలిమిని చెక్కిళ్ళపై...❤❤ కోరికలకు కొసరంటు మిగలనివ్వొద్దు కాంక్షను కొలిచేద్దాం..❤❤ ఆశలకు ఆవిరులు పట్టి కరిగిపోతున్నాయి ఊపిరి సెగలు తగిలి...లిఖిస్తున్న ఆ ఆ'విరిలో నువ్వే నేనని...❤❤ ఓయ్... నే తెలుసుకొని తేరుకునే సరికి కనుమరుగైపో లేదంటే నీ నీడనై పోతాను నేను...❤❤ ఒకమాట ఎంతెంత దూరం నువ్వు వెళ్ళిన...ఎంతెంత దూరాలు మన మధ్య వచ్చిన నువ్వు అనే భావంలో నే బంధీనే ఎప్పటికి 😘😘😘 ✍️అరుణిమలు

తాను నేను

ఏకాంత ప్రదేశంలో సీతాకోకచిలుకలా తిరుగుతుంది మనసు... అణువణువును పరికిస్తూ,పలకరిస్తూ... వెచ్చని రేయి కరగడానికి సిద్దంగా ఉందని నన్ను తాకిన గాలి చెబుతుంది... కాళ్ళను తాకుతున్న తేమ చెబుతుంది మంచు దుప్పటి తొలుగుతుందని... విరిసి విరియని మొగ్గలు చెబుతున్నాయి రాత్రి చేసిన జాగారం బరువు ఎంతగా ఉందో... ఎక్కడ ఈ చోటని...నేనున్నది యాడని...ఎందుకీ కలవరమని ప్రశ్నలు వేసుకుంటే.. చెక్కిళ్ళు ఎరుపెక్కాయి...ఎద సడి పెరుగుతుంది ఎందుకో... అదరాల మీద జారుతున్న సిగ్గులను తాకుతూ నలుగుతున్న పదాలలో ఎవరున్నారు... ముంగురులు సైతం మోముని తాకి అడుగుతున్నాయి ఏంటోయ్ సంగతని... కళ్ళు మాత్రం వెతుకుతున్నాయి ఈ కవ్వింతలకు కారణం కనపడదేం అని... ఇక్కడే ఉన్నా అంటూ మదిలో నుండి వచ్చిన పలుకులకు తోడుగా నీ రూపం ఇలా ఎదురు పడేసరికి... కలవరింతగా ఆ రెండక్షరాల నీ పేరును పలవరిస్తూ చప్పున లేచి కూర్చున్న.... చూట్టూ చీకటి...ఒంటరిగా నేను....నిట్టూర్పులో మాత్రం నువ్వు ఎదను తాకుతూ ఉంటే... నిజంగానే నల్ల కలువలలో అలజడి మొదలు... నువ్వు అక్కడ కలవరిస్తే, నే పలవరించానా ఇక్కడ... నా పలవరింత మరి నిన్ను చేరుతుందా కలవరింతగా... ఎందుకీ కలలు నాకు కల్లోలం రేపడానికి కాకపోతే... ✍️అరుణిమలు

తాను నేను

ఎలా, ఎప్పుడు వచ్చావో గురుతే లేదు నాకు... నీ రాకపోకలు గమనించే లోపే ఏదేదో జరిగిపోయింది... నువ్వనే ఆలోచన రాకూడదంటూ నిను తలవని గడియలు ఏవని లెక్క చూస్తున్న... నీలానే నీ ఆలోచనలు కూడా ఎప్పుడు ఎలా వచ్చి వెళతాయో తెలియదు... ఇలా వచ్చి అల్లరి పెడతాయి..మాటలు నేర్పుతాయి...కాస్త నవ్వులను అద్దుతాయి...కళ్ళలో కలవరింతలను రేపుతాయి...మరుక్షణం మునిపంటితో పెదవిని అణిచే దుఃఖం అవుతాయి... నీ ఙ్ఞాపకాలు ఇష్టం నాకు ఆయవును పోస్తున్నాయి అనేమో... నీ ఇష్టాలు ఇష్టం వాటిలో ఈరోజు నిన్ను చూసుకుంటున్నందుకు ఏమో మరి... నీ మౌనం ఇష్టం అక్కడ ఒకనాటి మనం అనే గురుతులను నువ్వు మరచిపోక ఏమో... నీ దూరం ఇష్టం నేను అనే ఒకనాటి నిజాన్ని నువ్వు మరచిపోలేదు అనడానికి అది ఋజువనేమో... నువ్విచ్చిన కన్నీరు కూడా ఇష్టమే నిను నేను మరువలేదని చెబుతుంది అనేమో... నీ ఊహలు ఇష్టం అక్కడ నా నుండి నిన్ను నువ్వు దూరం చేయలేవనేమో... నా మాటల నిండా నువ్వనే కోపం నిండిపోయింది... మనసులో నీ మీద పెంచుకోలేని ద్వేషాన్ని ఇలా మాటల్లో నింపేసుకున్న, నన్ను నేను మాయ చేసుకోవడానికి.. నువ్వనే పిలుపు మళ్ళీ నాకు వినపడకూడదు... ఈ కోపాన్ని, దుఃఖాన్ని పక్కన పెట్టేయడానికి నా మనసుకు క్షణం కూడా పట్టదు ఆ సమయంలో కానీ నా మనసు పడే ఆవేదనను కూడా నేను ఆపలేను... అవును నువ్వు నా వ్యసనం... అందుకే ఈ వ్యధ నాకు ఇష్టం... కారణం మాత్రం నువ్వే ఈ నవ్వుకు,ఆ కన్నీరుకు.. ✍️అరుణిమలు

తాను నేను

మనసుకెన్ని పరదాలో... తనని తాను చూసుకోడానికి వెనుకడుగు వేస్తుంది... మాట వినని మనసు నుండి...వెంటాడే ఙ్ఞాపకాల నుండి.. వద్దంటే ఆగని కన్నీటి నుండి...పారిపోవాలనుంది.. అద్దంలో చూస్తే రూపం నాదిగా ఆత్మ నీది గా కనిపిస్తుంది.. చెదిరిన నమ్మకం, చేజారిన ఇష్టం, చెల్లాచెదురైన నీ వాగ్దానాలు, చితికిన నా మనసు, నను చిదిమేసిన నీ చేష్టలు ఇలా ఏవని చెప్పను.... గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కళ్ళకు... ఇంత కళావీహినంగా మలిచావా నన్ను నీకు అప్ప చెబితే.. ఆడుకోవడం అంటే నాశనం చేయడం కాదురా... అందుకే నను నేను చూడటానికి భయంగా ఉంది... నన్ను నేను ఓదార్చడానికి నాకు మాటలు లేవు... నాకు నేను ఎదురు పడటానికి సిగ్గుగా ఉంది... అందుకే నాలుగు నవ్వులు ,అలుపు రాని ఊసులు మధ్య సేద తీరుతున్న... చుట్టూ అందరు నా వారే.. అందరు అయిన వారే....నువ్వు తప్పించి అందరికి అయిన దానినే..నాకు నేను తప్పించి ఏకాకిలా నీకు బతకడం అలవాటు అని ఇలా నీలా నిన్ను నమ్మిన వారిని ఏకాకిని చేయడం తగునా... ✍️అరుణిమలు

తాను నేను

ఈరోజు రేపటికి గతం అవుతుంది... ఈరోజు భావాలు రేపటికి ఙ్ఞాపకాలుగా మిగులుతాయి... గతాన్ని మళ్ళీ తీసుకు రాలేం...ఙ్ఞాపకాలను చెరపలేం... అదేంటో కలం కాగితాన్ని తాకితే మన కథే రాయమంటూ భావాలను కదిలించి ఆలోచనలను పరుగులు పెట్టిస్తుంది... అటు ఇటు కాని ఆలోచనల నడుమ మనసు నలుగుతునే ఉంది... కావాలనుకున్నది కోరుకోదు అలాగని వద్దని వదులుకోదు.. గతం నీడలలో క్రీనీడగా ఈ ఙ్ఞాపకాలు ఎప్పుడు మరుపుగా మారుతాయా అని చూస్తున్న... ఎందుకీ ఙ్ఞాపకాలు అంటే నీవు మిగిలింది ఈరోజు అక్కడేగా మరి, ఎలా వాటిని సమాధి చేయడం... భవిష్యత్తు లేని బంధానికి నిన్నటి భరోసావి కదా నువ్వు... నిన్నటి భావాలని నెమరేస్తునే ఉంది మనసు... నాతో లేవనే మాటే కానీ నువ్వు లేని చోటు లేదు... ఒకనాటి సంతోషానివి, ఆనాటి ఆశవు, ఒకప్పటి వరానివి... తుఫాను ముందు చల్లగాలిలా వచ్చావు తన్మయం నుండి తేరుకునే సరికి నాకు నేనంటు మిగలని శిధిలాలను మిగల్చావు... నీ నీడన నను తాకిన దుఃఖం నువ్వు వీడినా అది నను వీడను అంటుంది... గుప్పెడంత గుండె నిండా నీ పై ప్రేమ అలాగే ఉంది... కళ్ళ నిండు కుండలే కళకళలాడుతూ నీ రూపాన్ని దాచుకుని మరీ... పెదవి దాటని ఆవేదనెంతో మౌన ముద్రలో ఉంది... మాటలలో తరగని కోపం ఉంది... నీ ఆటకు నేనొక బొమ్మనని తెలిసేలా చేసిన నీ చేతలు చేసిన గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి... నీ మీద అసహ్యం మాత్రం ఇప్పటికీ నా దరి చేర లేదు.. ఇంకెంత దిగజారాలి తాను నీకు అసహ్యం కలగాలంటే అని మనసును అడుగుతునే ఉన్నా...జవాబు లేదు.. ఏయ్....నీ దిగజారుడు తనం చూస్తే నిన్ను దాచుకున్న మనసుకు ఆవేదన మెలి పెడుతుంది ఇంకా... అసహ్యం కలగని నా నిస్సహాయతను చూస్తే నా పై నాకు జాలి కలుగుతుంది... నువ్వెలాగు మారవు నేను కూడా మారనా అనిపిస్తుంది... నువ్వేదో ఇచ్చావు అని కాదు...నిన్ను నిన్నుగా కావాలనుకొన్న మనిషిని కదా అందుకేనేమో... ఇన్ని జరిగినా నా నుండి జరగనంటుంది నువ్వనే భావం... కోపంతో గురుతు చేసుకోవడంలో కూడా ఒక కిక్ ఉంది సుమీ..తిట్టుకోవడంలో...కన్నీరుగా మారడంలో.. నువ్వనే ఆలోచనే ఒక ఔషధం నాకు...గాయానివి నువ్వే కదా మరి... ✍️అరుణిమలు

తాను నేను

ముసురు పట్టింది మనసుకు నీ రాకతో మది గొడలకు పాకుడు పేరుకు పోతుంది ఎన్నెన్ని అలజడులో రేపుతునే ఉన్నాయి ఎదంతా కల్లోలంగా ఉంది నువ్వు చిలికిన అమృతం విషమని తెలిసాక నువ్వు చేసిన అల్లరి పనులు ఆటలని తేలాక గాలి విసురులకు అంతం లేకుండా పోయింది నీ చేతల బాణాలు నా చిరునవ్వులను చీరేస్తుంటే చెల్లాచెదురైన అలల తాకిడి కనుపాపలను తాకుతుంటే కదిలిన గంగలో లవణమే ఉందో నువ్వు ఇచ్చిన వంచనే ఉందో అడగాలని ఉంది నాలో సగమన్న నీ మాటల మూటలు ఈ గోదారిలో ఎటు దారి తప్పిపోయాయో అని కదిపి కదిపి చూస్తున్న... నీటి మీద రాతలేమో తడిమి తడిమి చూసిన జాడలు లేవు ఎక్కడ... ఏ ఒడ్డుకు చేరి ఏ కొత్త తీరాలకు చేరడానికి ఇంకొక తోడుకు మాటలు నేర్పుతున్నాయో అవి... ఏయ్...ఈ విశాల జగత్తులో నీ కంటికి నేనే ఎందుకు కనిపించాను అసలు ఏ బాకీ తీర్చడానికి వచ్చావోయ్ నువ్వు.. అప్పు ఉన్నావు తీర్చేయమని అడగకుండా నీ ఆటలకు నన్ను ఒక వస్తువును చేసుకున్నావా.. నీ మాటల ఆటల చేతలు నలిపేస్తుంటే ఈ గుండెలో నుండి కారేది నీరు కాదు నిన్ను నమ్మిన మనిషి ఆయువు కారిపోతుంది... ఇక్కడ ఉన్నది వస్తువు కాదు మనిషి... నువ్వు మనిషిగా మారితే కానీ నీకు తెలియదు ఈ నిజం నీకు కనిపించవు ఈ చారికలు.. నీకు వినిపించదు ఈ ఘోష.. నిన్ను కదిలించదు ఏ మనషి ఆక్రందన... మనసులను చంపి సమాధుల మీద సేద తీర్చుకో అప్పటి వరకు.... ✍️అరుణిమలు

తాను నేను

నీ ఊహల ఉవ్విళ్ళు నా ఈడు కావిళ్ళు నీ ఆశల జాడలు నా ప్రేమ ఆనవాళ్ళు అల్లిన అల్లి బిల్లి కథలలో చిక్కుకున్న రైక విసురులు నీ తోడు తొలేళ్ళలో పండిన నా పెదవి తాంబూలం సిగ్గు సవరించేను కుచ్చిళ్ళ వరసలను కన్నులను అలుముకున్న యవ్వనం అరమోడ్పు నవ్వులను అద్దుకున్నాయి లోకమా ఇటు చూడకంటూ నేలను గీసే బొటనవేలిని చూసి మురిసి పోతుంది నా మురిపెం ఎదురుగా లేవనే తలపుల వలపులలో బంధీని అయ్యా ఎదురుపడకు ఎప్పుడు ఎదను అదుపు చేయడం నాతరం కాదు నువ్వు మరచిని కాలాన్ని నా కన్నులలో బంధించి మది కేన్వాస్ పై చిత్రించాను చూడగలవా నువ్వనే రూపం ఈ ఊపిరిలో ఎలా ఉందో ✍️అరుణిమలు

తాను నేను

ఓయ్........ అలా లోకానికి దూరంగా నువ్వు నేననే లోకాన్ని ఒకటి నిర్మించుకున్నాం గురుతుందా... మాటలో మాటగా...ఊపిరిలో ఊపిరిగా కలిసిపోయాం... అడుగులో అడుగుగా అడుగడుగునా ఒకటై వేసిన అడుగుల జాడలు ఈ మదిలో ముద్ర పడిపోయాయి... అల్లరి చేసినా,అలిగినా,కసురుకున్న,హత్తుకున్న ఆఖరుకు కన్నీరుగా కరిగినది నీ ముందరే నీ దగ్గరే... మళ్ళీ మళ్ళీ చెబుతా నేను నేనుగా ఉన్నది నీతోనే... ఏ తోడు వద్దనుకున్న జీవితానికి తోడువై నీడగా నా వెంట ఉన్నావు గతమనే ఙ్ఞాపకంలో... గుండెల నిండా ప్రేముంది..దుఃఖం కూడా ఉంది అందుకే అలికిన కళ్ళకు నా ప్రేమ రూపం కనిపించట్లేదు ఇప్పుడు.... శ్వాసకు మాత్రం నువ్వనే భావం ఆయువును ఇస్తుంది... రూపం లేని ప్రేమా నీది, అంటే అది నీకే తెలుసు లోకానికి మాత్రం నేను ఒక భ్రమను... ఆరని ఈ కన్నీరే శాక్షి నువ్వు ఇంకా ఈ మదిలో వాడిపోని ఆశవని... ఎవరికి చెబుతున్న ఈ కథలు ఇంతకు.... నా జతలో వెలుగులు అద్దుకున్న నా జాబిలికి మాత్రమే.. పొద్దు పొడిస్తే నా నీడవు...రేయిలో నా కొంగు పట్టుకు తిరిగే నా మావవు కదూ... నువ్వు అనే ఈ ఙ్ఞాపకానికి ఇక్కడ అమృతాన్ని పోస్తునే ఉన్నా, నా ఉప్పు నీటి ఊట బావి నుండి తోడి మరీ... లవ్ యు అంటే లవ్ యూ నే కాలాలు మారొచ్చు కాని ఈ భావం మారదోయ్ పిచ్చోడ... ✍️అరుణిమలు

తాను నేను

లోకాన్ని మరచి నిదురిస్తున్న నిన్ను చూస్తుంటే మనసులో ఎన్ని ఆలోచనలో.... పసిపిల్లాడిలా నిదురలో నువ్వు నవ్వుతుంటే ఈ మనసులో ఏవో కదలికలు... నడి రేయిలో విహరిస్తున్న ఆ జాబిలొచ్చి అలిసిపోయానని నా ఒడిలో చేరిందా అన్నట్టు ఉంది... నిండుగున్నావోయ్ నా మదిని కదిలించే మనోహరుడివై... అల్లన నీ కురులను సవరించనా అని అనుకున్న కానీ నిన్ను తాకాలని లేదయ్య.. ఇలా నిను చూస్తూ నీలో కలిసిపోవాలనుంది... నా ముంగిలిలో సేద తీరిన నా రాజు కళ్ళు తెరిచి చూసాడు చిలిపిగా నా అనువణువును తడుముతూ ఆ భానుడిలా... రేయంతా నీకై పలవరించి,తపించి అప్పుడే చిగురు తొడిగిన చిగురాకులా నే ముడుచుకున్న నీ ముందుర... నా ప్రేమంతా నీ చూపుల తాకిడికి కరిగి చిగురాకు అంచున చేరిన మంచు బిందువులా మెరిసిపోతుంది... నీ ఆక్రమణ కోసం ఎదురు చూస్తున్నానేమో వేయి కళ్ళతో... రవి కిరణాలు తాకిడికి మెరిసిన మంచు బిందువు సప్తవర్ణాలను సంతరించుకోని తనని తాను అర్పించుకొని ఆవిరై నేలను చేరినట్టుగా నీలో కరిగిపోయా... ఓయ్ ఇక్కడ ఉన్నది కామం కాదోయ్ కాంక్ష మాత్రమే... మనసును జతచేసి అర్పించిన తనువు తాంబూలం మాత్రమే... పండిన మన బంధమే అందుకు నిదర్శనం...❤❤❤❤ ✍️అరుణిమలు

తాను నేను

మనసంతా మసకబారింది నీ చేతుల్లో పడ్డాక... మదిగోడలు చెమ్మగిల్లుతునే ఉన్నాయి... మాపటేల మారాజువని తెలియక తడబడ్డ అడుగుల గురుతులు కూడా ఇంకా ఆరలేదు... నాకు ఇప్పుడు నీ అవసరం ఉందన్న రోజున అర్థం కాలేదు నా అవసరం కొంతకాలం అని... గతమా వదిలేయవే అని, వేడుకుంటున్న నిట్టూర్పుల సెగలు రగులుతున్నాయి ఎదను తాకుతూ.... పూలమ్మిన చోట కట్టెలు అమ్మలేము కదా నిజమే... మనసును పరిచిన చోట అసహ్యాన్ని పరచ లేక పోతున్న ... కావలసినది అడిగావు కానీ దానమిమ్మని అడిగుంటే ఈరోజు ఉపయోగపడ్డాననే మది ఘోష నాకుండేది కాదు కదా... అడుగులో అడుగు వై తిరిగి అడ్డుపడుతూ నను తాకిన చెలిమి ఈ రోజు తన నడకలకు కొత్త అర్ధాలు చెబుతుంటే మాటలు రాని దానినై చూస్తుండి పోయాను... మనిషిగా నువ్వు నా ఆలోచనలలో మిగలాలనుకున్న కానీ ఇలా కాదు... నీ చేతలకు అర్ధాలను రాయడానికి నాకు పదాలు లేవు కానీ వాటి ఫలితం మొయలేక మౌనంగా నలిగే మనసుంది.... గతాన్ని కడగలేని ఈ కన్నీరు దేనికి...మనిషిగా మనలేని మనసు కోసమా ఛి వద్దు అనిపిస్తుంది... నవ్వాలని నవ్వుతున్న నా నవ్వుల్లో నాకు కనిపించేది నేనే...నన్ను నేనే చూసి నవ్వుకుంటున్న పిచ్చిదానా అని.. ప్రేమ, మనసు,మనిషితత్వం,విలువలు, ఫీలింగ్స్ ఇవేవి లేని మనుషులు ఉంటారని నాకు ఇన్నాళ్ళు తెలియదు... తెలిసే సరికి చేతులు కాళీగా ఉన్నాయి నాలో నాకే చోటు లేకుండా.... నన్ను నేను వెతుకుతునే ఉన్నా కానీ ప్రతీ చోట కనిపిస్తుంది నువ్వే... మరుపే ఎరుగని నా మనసుకు నీ ఈ ఙ్ఞాపకాల చితిని బాగా పేర్చావు దహించుకు పో అంటూ... పాప పుణ్యాల భీతి నీకు లేదు కదా అందుకే వెనక్కి తిరిగి చూడవు ఫలితాలను.... చిదిమే చేతికి తెలియదు తెగి పడే వ్యధ ఏమిటో...తెలుసుకోకు ఎప్పుడు...వద్దు చిగురించాలని ఉంది మళ్ళీ కొత్తగా.... నీ నీడ పడని రోజులలో చిగురులా... ✍️అరుణిమలు

తాను నేను

ఆ జాబిలి చుట్టూ అల్లిన వెన్నెల గూడు చూడవోయ్..😍😍 అచ్చు నా మనసులో నీ ప్రేమ అనే భావం అలాగే అల్లుకు పోయింది..❤❤ ఆ వెండి ముద్దకు బంగారు కంచెలా అద్దిన నువ్వు అనే ఆ అద్దకం నింగికే వన్నె తెచ్చింది...💗💗 నీరెండెల్లో దీపల్లా ఆకాశాన్ని హత్తుకున్న ఆ వైనం చూడు...💝💝 నీ ఊహలు నన్ను చుట్టుముట్టి అలా ఆలింగనం చేసుకున్నాయి...💞💞 నిశీది నుదురుకి పెట్టిన ఆ బొట్టును చూసావా...💕💕 ప్రేమగా నువ్వు నా నుదురుని చుంబించిన చుంబనం ఓలే...💘💘 చెమట చుక్కలు విసిరినట్టు ఆ చుక్కలు చెల్లా చెదురైనాయి...💟💟 నువ్వు నింపిన నా దోసిలి ఆ తారల తళుకులతో వెలిగి పోతుంది...💖💖 ఓయ్ చందమామ ఇటు రావోయ్ ఒకసారి...🌜🌜 ✍️అరుణిమలు

తాను నేను

అసంపూర్ణంగా ఎక్కడ ఉన్నాం మనం.. చెరిసగమై మనం ఒకటయ్యాక... అసంతృప్తి ఎక్కడ ఉంది మనలో... మది నిండిన మమతల దోసిలే అందుకు రుజువు... మన నవ్వుల రాసుల నుండి ఏరి మరీ కూర్చా మణి హారం... అది అలంకరించ లేదు నా మేనుని... నా ఆత్మకు దానిని కానుక చేసా నను నీతో ఇలాగే నడిపించమని శ్వాస నిలిచే వరకు.... ఎక్కడో నువ్వు ఉన్న ఇక్కడ నేను నీలో ఉన్నా నీతో నీ తోడుగా... నువ్వనే ఈ ఊహ చాలు...ఆ ఙ్ఞాపకాలు చాలు కదిలిపోవడానికి కాలంతో ✍️అరుణిమలు

తాను నేను

కన్నులకు కాటుక అనే గిరి గీస్తున్న కనుపాపను దాటి నువ్వు రాకంటు...💖💖💖 కళ్ళల్లోని చెలమలను కదపకే అవి రేపే అలజడుల కడలిలో నేను కరిగి పోతాను ఇక్కడ...💘💘💘 నిన్ను చూడగానే కాటుక కళ్ళలో ఎన్ని కాంతులో అందుకే దిష్టి చుక్క పెట్టా మనకు...💗💗💗 నిను చూసిన ప్రతీసారి అదే తొలి చూపా అన్నట్టు నాలో కలిగే ఈ స్పందనలకు ఆనకట్ట ఈ రేఖ.... 💕💕💕 ఎదలో ఉన్న నీకోసం కలువ కన్నులతో కావలి కాస్తున్న కాటుక గడపలలో...💟💟💟 నాలో నేను...నీతో మనమై ఇలా ఎంత హాయిగా ఉందోయ్ నా రేయి... ❤❤❤ కావాలంటే నా కళ్ళతో చూడవోయ్ నా మదిలోకి...మన సాగరసంగమం ఎలా ఉందో 💞💞💞 ✍️అరుణిమలు

తాను నేను

నిన్ను మరచిపోయానని అనుకున్న కానీ నన్ను నేనే మరచిపోయా అనుకోలేదు... నిన్నే లోకంగా భావించి నువ్వనే ప్రపంచం నుండి బయటపడటం అంటే నన్ను నేనే కోల్పోవడమా... అవునులే నువ్వే నా సమస్తమయ్యావు కదా ఆనాడు... ఏకాంతం ఎంత హాయిగా ఉందో ఈరోజు... నా ఆలోచనలకు ఆటంకం లేదు...నా ఊహలకు అదుపు లేదు...నా కన్నీటికి లెక్క లేదు.. ఏ సద్దు లేని ఈ ఏకాంతంతో నా గోడు చెప్పుకుంటుంటే నిండు కుండ లా తొణక్కుండా వింటుంది... మూడో కంటికి కనిపించని నువ్వు ఆడిన ఆటను గొంతెత్తి గుండె లోతుల నిండిన దుఃఖాన్ని బయట పెడుతుంటే శూన్యమై నన్ను చూస్తుంది... నిస్సిగ్గుగా నువ్వు రచించిన కేళిని నా కళ్ళలో చూస్తుంది చాలింక చెప్పకంటూ... నింగి నేల మధ్య నేనున్న నువ్వు వదిలిన త్రిశంకు స్వర్గాన్ని ఏలుతూ... మనసులతో ఆటలు.. నువ్వు గెలిచిన మనసు ఓడిన చప్పుడు నీకు తప్పించి ఎవరికి కనబడదు,వినబడదు కదా... విజేతవే నువ్వు ఒక మసును జీవచ్చవాన్ని చేసి ....నువ్వు ఆ మనసులో చచ్చి గెలిచిన గెలుపు అది... రెండు శరీరాలు కలిస్తే తీరే ఆకలి కోసం మనసుకు ఆయువునిచ్చే ప్రేమను పణంగా పెట్టేసావు... ఒకసారి శ్వాసను నిలువరించి చూడు ఎలా ఉంటుందో...మనసు మోసపోతే అలాగే ఉంటుంది.... ఆ సంగతి నీకు ఎప్పటికి అర్థం కాదు అయినా కూడా అది నీ మనసు కాదు కదా... చెమట చిందించి మరీ కష్టపడ్డావు కదూ... సేద తీరు ఇంకొక ఒడిలో మరో ఆటకు సిద్దమై... ఆత్మస్తుతి ఎప్పుడు చేసుకోకు అక్కడ అది లేదని తెలిస్తే నువ్వు మనిషిగా పోయి చాన్నాళ్ళు అయిందన్న నిజం తెలుస్తుంది ఆణిముత్యం... ✍️అరుణిమలు

తాను నేను

గోధుమ వర్ణాన్ని పులుముకున్న ఆకాశం నెమ్మిదిగా అలుముకున్న మబ్బులతో అచ్చు మన ఆలోచనలలా ముసురుకుంది..... కిటికీ గుండా వస్తున్న గాలి చల్లదనాన్ని మొసుకొస్తూ ఊరటనిస్తుంది... అనుకోకుండా పెదవిపై చిరునవ్వు ఆ గాలి గాడి తాకిడి ఎక్కడ ఎక్కడో తాకుతోంది మరీ సుతారంగా... అరటి ఆకుల చప్పుడు వినిపిస్తుంది గాలి జోరు పెరిగిందని... ఒక్కసారి గుండెల నిండా శ్వాస పీల్చాలని అది ఆకాశాన్ని చూస్తూ అనిపించింది... బయటకు వెళ్ళి చూసా పరుగు పందెం వేసుకొని ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ పరుగిడుతున్న మేఘాలు... కబుర్లు మోసుకుపొమ్మంటే కరిగిపోతాం మాకెందుకు అంటారు పెద్ద అంటూ ఆకాశాన్ని చూసి కన్నుగీటి కసురుకుని కూర్చుంటే.... చెప్తా నీ సంగతంటు చిలకరించేసాడు చినుకులను... ఒక్కొక్క చినుకు చురుక్కుమంటూ తాకుతుంటే తెలిసింది కన్ను గీటితో రియాక్షన్ ఇలా ఉంటుంది అని.. ఓహో నువ్వాడితే నే ఆడనా అని గొడుగేసుకొని వచ్చా బయటకు... మోమును తాకాలనే ప్రయత్నం చేస్తూ పాదాలను ముద్దిడుతూ అల్లరి చేస్తూన్నాడు... గాలితో విసిరి కొడుతూ వేడెక్కుతున్న వాడి వాడిని చూసి నవ్వొచ్చి ఎంత విసురో అని మురిసి... గొడుగును వదిలేసి చేతులు చాపి నన్ను అల్లుకుపొమ్మంటు పిలిచా... తడిపేసాడు అణువంత చోటును కూడా వదలలేదు తడిమి తడిమి మరీ... ఓయ్......మళ్ళీ ఎప్పుడొస్తావు అంటూ కన్నుగీటి ఇక నావలన కాదంటూ వాడద్దిన పారాణి పాదాల ముద్రలను ముద్రిస్తూ నీడకు పరుగందుకున్న.... ఏయ్....ఈసారి చూసుకుందాం నువ్వో,నేనో ;) ✍️అరుణిమలు

తాను నేను

ఏ మనసుకు ఏ మనసు సుపరిచితం కాదు ఎన్నటికి... నేను నీకు ఎంత అర్ధమయ్యానో తెలియదు కాని.. నాకు నేను ఏమిటో తెలుసుకున్నాను నీ సాంగత్యంలో.. ఈ నమ్మకం అనే బలహీనత నాలో ఎంతుందో తెలిసింది.. మళ్ళీ మళ్ళీ నిను నమ్మి దోసిట పట్టిన కన్నీటిని చూసినప్పుడు అర్థమయింది... నువ్వొచ్చాక ఎన్నో మాటలు నీకు చెప్పాలనుకుని చెప్పలేనివి రాయాలనుకుని రాతకు నోచుకోని పదాలు ఇంకా మౌనంగా ఉన్నాయి... ఏం రాయను నీ మీద ఇష్టాన్నా లేక నువ్వు రాజేసి వదిలేసిన బాధనా... ఏది రాయాలన్నా కళ్ళలో సుడిగుండాలు మొదలై కాగితం ముద్దవుతుంది... ప్రేమను పంచుకుందామంటే దాని విలువ తెలియదు నీకు... నీ నిర్లక్ష్యాన్ని వివరిద్దాము అంటే అదె ఎలాగో నాకు చేతకాదు...వినడం నీకు కష్టం చెప్పుకుంటే చిన్నవే కాని అనుభవించడానికి అవి.... ఏమన్నా అంటే నా కోపం మాత్రమే కనిపిస్తుంది కాని ఇక్కడ ఆవిరవుతున్న నిట్టూర్పులు నీకు పట్టదు... కలం కదిలితే కనిపించే పదాలలో నువ్వే ఉంటావు... అక్షరం అక్షరంగా కదులుతూ అనంతమవుతున్నావు అది కూడా వేదనగా మారి మరి... భావాలు నువ్వు ఇచ్చినవే కాని భరువుగా ఉన్నాయి రా మోయడానికి... నువ్విచ్చినవన్నీ అన్ని నీకు తిరిగిచ్చేయాలని ఉంది... అందుకోగలవా ఓపికగా... ఎందుకింకా ఇవి నా తోడుగా సాగడం...నీకిచ్చే అంత శక్తి నాకు లేదు కనీసం కరిగే ఈ గంగలో తర్పణం అయినా వదిలలేని బలహీనత నాకే ఎందుకు.... ఇష్టానికి మంచి గుళిక వేసావు కాని విరుగుడు కోసం వేసింది వికటించి ఇదిగో ఇలా అలమటిస్తున్న.... నిను చదవడానికి ఏముంది ఇంకా తెరిచిన పుస్తకానివి అయినా అసహ్యం కలగలేదు దానికి కూడా కనికరం లేదు నేనంటే అచ్చు నీలా... అచ్చు కాని మన కథ ఇలా అచ్చం మనలా మన మనసులో ఏ కంటికి కనపడని పుటగా మిగిలింది... అది నాకు గుణపాఠం...నీకు ఆటలో అరటిపండు... ఓయ్ జాగ్రత్త ఏదో రోజు జారి పడతావు మళ్ళీ ఏ ఆట ఆడకుండా.... ✍️అరుణిమలు

తాను నేను

అనుబంధం అంటేనే అప్పులు... ఏ ఋణానివై వచ్చావో మరి శేషమై మిగిలావు నా ఙ్ఞాపకంలో... ఏదా అనుబంధం.... ఓహ్ అదంతా నాటకం కదా !! జీవితాన్ని జీవించినట్లు ఉందేమో కదా ఆ నటన, ఇప్పటికీ అది నటనా అని ప్రశ్నించుకుంటున్న... తరలి పోయిన తుఫాను ఆనవాళ్ళు ఇంకా అలానే ఉన్నాయి.... నింగిలా మారిన నయనాలు జారవిడిచిన చినుకుల తడి అలానే ఉంది... పిల్ల కాలువలా మారి ఏ మనసు దాహం తీర్చాలనో వాటి తపన.... జాలి లేని గాలి విసురుకు రాలిన ఆకుల్లా.... నా ఆశలు ఒక్కొక్కటిగా నా నుండి తెగి విడి పడుతునే ఉన్నాయి ఇంకా.... తుఫాను తాకిడికి తలవంచిన విరుల రెక్కలు తన నుండి తాను దూరమైనట్టు నా ఆలోచనలు నా నుండి దూరమై పోతున్నాయి.... గూడు చెదిరిన గువ్వలు దిక్కుతోచక రెక్కలను విదిల్చి ఒక్కసారి ముందుకు కదిలినట్టు... ఈ బాధ తాత్కాలికమే అంటూ మళ్ళీ జీవించడం మొదలు పెట్టమన్నట్లు ఉంది నా మనసు కుదుటపడాలనే తపన... చెదిరిన కొద్ది కాలాన్ని ఊహలకు తోడిచ్చి వెనక్కి పంపేస్తున్న రేపటి వేపు చూస్తూ... మరచిపోలేదు, ఆలోచించలేదు కాని నువ్వు అనే ఙ్ఞాపకం మాత్రం పచ్చిగానే ఉంది ఇక్కడ ఇంకా.... ఏ మజిలీ చేరని ఈ పయనంలో నువ్వో బాటసారివే కాస్త కాలానికి... ఓడి భవిష్యత్తును గెలిచిన దానిని నేను... గెలిచి మనిషిగా ఓడిన వాడివి నువ్వు.... ✍అరుణిమలు

తాను నేను

అలజడిగా ఉన్న ప్రతీసారి నే పలవరించేది నిన్నే.. అలికిడేదని ముంజేతి గాజుల సవ్వడి అడుగుతుంది... ఆలోచనలలో లోచనగా కలిసిన నిన్ను చూడగలిగేది నా మనసొకటే... మోము పై సిగ్గుగా పూచే పూ రేఖవు నువ్వే... అల్లరిగా పిల్లగాలివై నా ముంగురలను సవరించేది నువ్వే.. ఈ వేళలో నేను ఏం చేస్తున్నానో నీకేం ఎరుక... ఏ వేళనైన నిను తలవని గడియ ఉందా అంటూ కాలాన్ని తరచి తరచి మరీ చూస్తున్న.... నీ మౌనం చెబుతుంది నేనేంటో నీకు.... మన ఇద్దరి మధ్య ఈ దూరం చెబుతుంది ఏమర్పుగా కూడా నువ్వు నను మరువలేదని... దగ్గర తనంలో ఏముంది అంతా ఇచ్చి పుచ్చుకోవడమే కదా... ఈ నిశ్శబ్దం చెబుతుంది నా నుండి నువ్వు వీడి ఎక్కడికి పో లేవని... నీకు నువ్వు నా నుండి దూరం జరగ గలవు కాని మనం అనే నా నుండి నీ తరం కాదు జరగడం.... నేను నీకు చాలా విలువైన, ప్రత్యేకమైన మనిషిని కదూ... అవును నా స్థానం ఇంకొకరు ఈ జన్మకు తీసుకోలేరు... నాలా నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోలేవు ఇంకెవరు నాలా నిను ప్రేమించేది.... నీ నటనలను నమ్మాను...నీ నిజాన్ని అంగీకరించాను...నిన్ను నిన్నుగా చూసి కూడా నీకు దూరం కాలేక పోయినంత ప్రేమ ఈ ఆత్మలో ఉంది... నిన్ను నిన్నుగా అంగీకరించిన వారు ఎవరున్నారని ఎప్పుడైనా ప్రశ్నించుకుంటే అక్కడ జవాబు నై నేనే ఉంటాను... ఎదురు చూపులు లేవిప్పుడు ఎద నిండిపోయావుగా ఎటు చూసినా నువ్వే... అవును నువ్వే నేను కదా అదే మనం కదా.... ✍అరుణిమలు

తాను నేను

ఎందుకు ఈ పరిచయాలు...ఎందుకు ఈ దూరాలు ఎందుకీ రంపపు కోత... ఆలోచనలను అదుపు చేయలేని నిస్సహాయత ఒక్కోసారి వెక్కిరిస్తుంది... ఎంత మభ్యపెట్టిన ఏదో ఒక ఘడియలో మరిచి పోవడం నీ తరమా అంటుంది మనసు... నవ్వులా అవి పై పై మెరుగులా సరిచూసుకో అంటూ వినిపిస్తుంది ఏదో మాట... సడిలేని సవ్వడులు చుట్టూ నన్ను తాకుతూ కదులంటున్నాయి... అటు పొద్దు ఇటు సెలవంటూ కాలాన్ని కదిలిస్తున్న నేనింకా స్థాణువులా నిలబడే ఉన్న నువ్వొదిలిన నీడల నీడల్లో... కదిలిపోతున్న నిన్ను చూసైనా కదల లేని అచేతన స్థితిలో పడేసావు నన్ను... నన్ను గాయపరిచిన గాయానివి నువ్వే...ఔషధం కూడా నువ్వే...కాని ఇవ్వడానికి నీకు చేతులు రావు అందుకోడానికి నా అత్మ కూడా అందుకు అంగీకరించదు... ఎలా మానుతాయో తెలియని నీ గురుతులను గురుతు చేసుకుంటూ ఇలా ఎన్నాళంటు నన్ను నేను ప్రశ్నించుకుంటున్న... నువ్విచింది అణు వంతే కాని నేను దానిని అనంతంగా హత్తుకున్నానేమో ఆ ప్రేమను నా గుండెలకు... అందుకే గొంతు తడి ఆరుతున్న, గుండె బరువెక్కిన ఆ సాగరంలా నిండుగా ఉన్నా... ఙ్ణాపకాల భారం చెంపలను తాకుతూ! చలించకే నేనున్న నిన్ను ఊరడించడానికి అంటున్నాయి... కనురెప్పలుగా మిగిలాం ఇలా కలిసి అలా విడిపోవడానికి మనం... దూరంగా ఉండలేను, దగ్గర కాలేను పక్కపక్కనే ఈ రెండు కళ్ళలా మిగిలాం.... అదిమి పెడుతున్న ఙ్ఞాపకాలు కదిలిన ప్రతీ సారీ ఓదార్చడానికి కావలసినన్ని కన్నీళ్ళు మాత్రం తోడుగా ఉన్నాయి... ✍️అరుణిమలు

తాను నేను

నా కథలో మలుపువు నువ్వు.. నేను ఊహించని ముగింపువు నువ్వు.. అర్ధానికి అర్థం కాని అద్దానివి నువ్వు.. పేరుకి మాణిక్యానివి మాటలకు అందని చేతలకు చిక్కని చెలికాడివి నువ్వు... ప్రేమకు నానార్ధాలు చూపించిన గడసరివి.. మాటల మంత్రగాడివి ముంచి తేల్చేయడంలో... నిలబడతావు నీడనే మా నీడల్లో క్రీ నీడ గా... మాట తప్పవే మాట మీద నిలబడనంటూ... అందరికి అయిన వాడివే కాని తరచి చూడనంత వరకు.. ఏమర్చగలవు నిను నువ్వు పోగొట్టుకున్నాను అనేంత.. అవును...ఎవరు నువ్వు ?? నేను మరచాననే నా గత మనసువి.. భ్రమలోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా బయట పడేసిన నా అనుకున్న ఒక మనిషివి కదా... లోకమంత ఒకపక్క, నువ్వు ఒకపక్క నాకు అప్పుడు...ఇప్పుడు కూడా... కాని నువ్వు అనే ఆశ మాత్రం లేదిప్పుడు... లోకం చాలా విశాలంగా కనిపిస్తుంది అందులో నిన్ను వెతకాలని లేదు ఈనాడు... మనసంటే అలుసు కదా కూసిన్ని మాటలను నమ్మి మైమరిచిపోయి నీవసం అయి నీముందు మోకరిల్లుతుంది అని... మనసు భాషే కాదు దానిని ఆడించడం ఎరిగిన నీకు అది చెదిరితే ఏమౌతుందో మాత్రం తెలియదు ఎందుకు... నీకు పూచిన పువ్వును తుంచడం మాత్రమే ఇష్టం కాని నీరు పోసి సాకడం కష్టం కదూ... ఓయ్ షేక్‌స్పియర్ నీ మాటలు నీటి మూటలోయ్ ... ✍️అరుణిమలు

తాను నేను

బాగున్నావా...... ఈ మాట పదేపదే మదిలో ప్రశ్నలా మెదులుతూనే ఉంది...ఈ మాత్రం అడగలేని దూరం మన మధ్య రాజ్యమేలుతోంది...గడిచిన ప్రతి క్షణం గతమౌతుంది కాని నిన్నలలో నువ్వు కూడా గతమై గతిస్తావనుకోలేదు...భవిష్యత్తు లేని బంధనంలో బందీని నేనైయ్యాను....ఈ గాలి, నీరు , భూమి, ప్రకృతి వీటిలో యుగాలు గడిచిన మార్పు రాలేదు కాని ఈ మనిషికి ఎన్ని కొత్త దనాలు కావాలో...అందరి ఆలోచనలు ఒకలా ఉంటే ఈ బాధలు ఉండేవి కావు కదా... నా భావాలకు ఊపిరి పోసింది నువ్వు....నా అక్షరాలకు జతగాడివి నీవు....నా ఊహలకు రూపం నువ్వు...నా నిన్నటికి తోడు నువ్వు....నువ్వు రుచి చూపించిన ప్రేమకు పుట్టిన ప్రేమ ఇది....ఆనాటి ఇష్టానివి నువ్వే ఈరోజు కష్టానివి నువ్వే....నిన్ను కోరిన మనసు ఇదే,ఈ రోజు ఏమరపాటుగా కూడా చూడాలని కోరని మనసు ఇదే...నీకై నువ్వు వచ్చావు, అడగకనే దోసిట పోసావు ఆశలను....నీకై నువ్వు దూరమయ్యావు పిడికిడంత ప్రేమను వదిలేసి....ఇంకా ఎందుకిదంతా అంటావా నాకై నేను రాలేదు, నాకై నేను పోలేదు కదా అందుకే ఇదంతా... మనసంతా నువ్వే కాని ఎక్కడ నువ్వు అంటే నాకు తెలియదు నీ జాడ...నా ప్రేమ నువ్వే కాని ఎవరని అడిగితే చూపించడానికి ఎవరు లేరు అక్కడ...మదినిండి పోయావు కాని మనిషిగా మాత్రం మిగలలేదు అంతే...నువ్వంటే వెళ్ళిపోయావు కాని నా భావాలలో నుండి, నా ఙ్ఞాపకాలలో నుండి,నా మనసు నుండి నిన్ను నువ్వు దూరం చేయలేవు...ఇదంత ఎందుకు ఇప్పుడు అంటావా...నా అక్షరానివి కదా నువ్వు నిత్యం అక్షరార్చన జరుగుతునే ఉంది కదా...ఈ అక్షరాలకు అందే ప్రశంసలో సగ భాగం నీదే అన్నాను కదా ఒకప్పుడు భాగం కాదు ఈ అక్షరాలతొ బాటు ప్రశంసను నీకే అంకితం ఇస్తున్నాను అని చెప్పడానికే బుజ్జి...నాలో నేను నీతో మనమై జీవిస్తున్న అది చాలు....కష్టమనిపిస్తే ఓదార్చడానికి కన్నీళ్ళు ఉన్నాయి, సంతోషమనిపిస్తే పెదవిపై చిరునవ్వు ఉంది....ఆ కన్నీటికి ఈ నవ్వుకు జీవం నువ్వే రా... *ఈ అరుణిమల అక్షరమాల నా అనే నా మనసుకు అంకితం.... ✍️అరుణిమలు

తాను నేను

నా అల్లరి అడుగులు ఆగింది నిను చేరాకే... నా నవ్వులు రంగులు అద్దుకున్నది నీ నవ్వులు జత అయ్యాకే... నా మాటలు తడబడింది నీతో మాట కలిపాకే... నిను చూసాకే ఈ చిన్నదాని చెంతకు సిగ్గు చేరింది... నా కళ్ళల్లో తళుకులు చేరింది నువ్వనే మెరుపు నా కంట బడ్డాకే... రేపటి రోజు కోసం ఆశలు మొదలైనది నీ తోడు కోరుకున్నాకే... నా మొండి తనం ససరెమిరా అని మొరాయించేది నీ ముందరే కదా... నా పంతం పట్టింపు ఎక్కడికో ఎగిరి పోయాయి నిన్ను చూసి... ఏయ్ పిల్లగాడా...యాడ పిల్లనో ఇలా ఆడపిల్లగా మార్చేసావేంటోయ్ హా నా తిక్కకు లెక్కలు నాతో లెక్కించడానికి వచ్చావ ఏంది... మాటలు నేర్చిన నాతో కొత్త ఊసులు నేర్పి మరి ఊ కొట్టిస్తున్నావు... ఎవరివోయ్ నువ్వు అసలు ఈ గడసరిని మార్చడానికి... మనిషి నీ వసమవ్వాలంటే మనసును గెలుచుకో చాలని చేసి చూపిస్తున్నావు... ఊసుపోని,ఊరుకోని,ఉండనివ్వని నీ ప్రేమని రుచి చూపించి ఇప్పుడు నేనేం చేసాను అంటావా... మనం కాని ఏ చోటున మనలేని ఈ మనసును మరీ మరీ నలిపేయకు... ఈ పిల్ల ఎప్పటికి నీ పిల్లే...ఎక్కడ ఉన్నా నీకోసం ఈ ఎదురుచూపులు ఆవిరైపోవురా... ఓయ్ వినిపించిందా...నా మనసున ఉన్న మనసుకు ✍️అరుణిమలు

తాను నేను

మనసులు పెనవేసుకున్న తరుణంలో
మనకు లోకంతో పనేముంది..
నువ్వు, నేననే మాట ఎక్కడ ఉంది మనం అయ్యాక..
జీవితానికి ఆవలి ఒడ్డు అంటే నీ ఒడేనోయ్ నాకు..
గడసరి సొగసులు సొంతం చేసుకున్న నీ సరసంలో మునిగున్నానేమో...
నా నవ్వుల హొయలు నగారాను మోగిస్తున్నాయి..
సిగ్గు గడప అవతల కాపలా కాస్తుందోయ్ కాలాన్ని ఆపి మరి..
బెట్టు చేయనివ్వని నీ మురిపాలు ముని వేళ్ళతో వీణను సవరించినట్టే ఉందిరా మేనును...
జగమంతా ఉయ్యాలే నీ ఎదపై నే చేరిన తరుణాన..
రాజేసిన సెగల ఆవిర్లు సుగంధాలై మన చుట్టూ గూడు కడుతుంటే...
ఓయ్....ఇప్పుడు చెప్పు నేనెరినోయ్ నీకు అని అడగనా ముచ్చటగా...
పొగడ్తల పరవళ్ళలో తేలియాడనా...
ఏవోయ్...మన సరసాల పాకం సిద్దమే కదా రుచి చూడని అధరాల విందుకు...

✍️అరుణిమలు

తాను నేను

ఏ బంధం ఎప్పుడు బరువు అవుతుందో..
ఏ ఇష్టం ఎప్పుడు కష్టంగా మారుతుందో..
ఏ భయం నిజమయి పగలబడి నవ్వుతుందో..
ఏ మాట ఆశలను నీటి మూటగా మార్సుతుందో..
ఏ అవసరం ఏ ముసుగు వేసుకొని వస్తుందో..
ఏ నిజం ఎప్పుడు నిప్పుగా మారి దహిస్తుందో..
ఏ రోజు ఎప్పుడు జీవితాన్ని మార్చేస్తుందో..
ఎదురుచూసిన చూపులు ఎదురై ఏ రోజు ఖాళీ చేతిని చూపిస్తుందో..
ఏ నవ్వులు ఎప్పుడు పరిహాసాలుగా మారుతాయో..
ఏ మంచి వెనుక వంచన దాగుంటుందో..
ఏ నీతి వెనుక ఏ నాటకం ఉందో..
మనసంటే మనసే మారి మారి మరిచిపోయేదని..
నువ్వొచ్చే వరకు నాకు తెలియదు రా జీవితమంటే ఇన్నుంటాయి అని...
ఇది లోకమంతా ఏకమయినా నేర్పలేని పాఠం..ఒకరు నేర్పగలరని..
ఒక మనిషిలో లోకాన్ని చూసాను...అదే మనిషి మలచిన అదే నను విరిచి మలిచిన నా రాతను చూసాను..
జీవితమంటే ఇదని నేర్పడానికి వచ్చావేమో..బాగా నేర్పావు నా పుట్డలో వేలు పెడితే కుట్టనా అని...
వాస్తవాలను చూసిన కళ్ళకు రంగులు కనిపించట్లేదు ఈరోజు...
మాస్టారు ఇక చాలండి...ఇలాంటి పాఠాలు ఎవరికి నేర్పకండి...ప్రపంచాన్ని ఇలా కళా విహీనంగా చూపించకండే..
గురుదక్షిణ ఏమివ్వను‌ కొత్త జీవితాన్ని ఇచ్చిన మీకు...
ఈ జన్మకు మరచిపోలేను మీ దెబ్బలను..మీ భోదనను..
మనసుతో పాటు జీవితమే నువ్వనుకున్న నా దగ్గర
ఇంతకు మించి దక్షిణ ఏముంటుంది...

✍️అరుణిమలు

తాను నేను

అలా చూడకు ఎదలో గిలిగింతలు పుడుతున్నాయి అంటున్నావు....
మరి నేల చూపులు చూస్తే సిగ్గా అని ఆటపట్టిస్తున్నావు....
నేను నవ్విందే లేదు కాని అలా నవ్వకు అంటావు...
నీమాటలు అర్ధం ఒకటైతే నీ ఉద్దేశం ఇంకొకటి...
నాకన్నా ఇంకెవరికి తెలుస్తుంది నీమాటల అర్ధం, అంతరార్థం....

✍️అరుణిమలు

Friday, 1 December 2017

తాను నేను

జ్ఞాపకాల తీరంలో ఉన్నా ఈరోజు...
నీతో కలిసి గడిపిన కాలం తక్కువే రా...
అమావాస్య చంద్రుడువి కదా నీ రాకపోకలు అంతా లెక్క మీద జరిగింది..
ఒడ్డున ఈ ఏకాంతాన నీ పలుకుల తరంగాలు తాకుతునే ఉన్నాయి ఇంకా...
ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావు అనిపించే ధ్యాస...
మళ్ళీ కనిపించని కలలా కరిగి ఇంకిపోయావు మదిలో..
ఆశల ఊట బావికి మాత్రం ఇంకా ఆశ తీరలేదోయ్ నువ్వొస్తావని...
ఎదురు చూపులు విసుగన్న పదాన్నే మరచాయి రా...
నీ మాటలు పేక మేడలని చెప్పలేదు కదా ఆ రోజు మాటిచ్చినప్పుడు...
ప్రవహించే నదివే నువ్వు కాలం మారితే కొత్త నీటితో పరవళ్ళు తొక్కాలనే కోర్కెలెక్కువ కదా...
పలకరిస్తూ,పరవసింప చేస్తూ, నీలో కలిపేసుకున్నాక మనం కాదు నువ్వు వేరు నేను వేరనే గొప్పవాడివి...
కావాలనుకున్న దాని కోసం స్వరూపాన్ని సైతం మార్చగలవు..వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకుండా పోగలవు ముందుకు...
నీ మది సుడిగుండంలో చిక్కిన ప్రాణాన్ని చూసి అయ్యో అనలేని కాఠిన్యం నీది...
ఎందుకోయ్ ఏ ఒడ్డును తాకకుండా పోరాదు ముందుకు, కుదరదే...
నీకు మేం కావాలి కాని ఒక అవసరంగా మాత్రమే కదూ...
నిను తాకిన గాలి నాకు ఆయువు అనుకున్న కానీ...ఈరోజు ఉక్కిరిబిక్కిరి గా ఉందోయ్
చాలింక ఊపిరి ఆగిన మంచిదే అనిపిస్తుంది నువ్వు అనే అనుభవం గురుతుకొచ్చినప్పుడల్లా...

✍️అరుణిమలు

తాను నేను

గడియ గడియకు గుండె లయ తప్పుతోంది...
ఏ క్షణాన నువ్వొచ్చి నామదిని తడతావేమో అని..
నిమిష నిమిషానికి మనసు పరుగులు పెడుతుంది..
ఎద వాకిలిలో నాకోసం కాచుకొని కాని ఉన్నావేమొ అని..
తెరిచి ఉంచిన నా నీ హృదయంలోనికి అనుమతి  దేనికి..
ఎదురు చూపులని, నా ఆశలని ఎండమావులు చేయమాకురా.. మావా
....అరుణిమలు...

తాను నేను

పరిచయాలు పెంచుకోవలంటే భయం పరిస్థితులు ఎలా ఎదురు తిరుగుతాయో అని..
అభిమానంగా ఉండాలంటే భయం అపార్దాలు వస్తాయేమో అని..
చనువుగా ఉండాలంటే భయం చులకన అయ్యిపోతానేమొ అని..
ఆశలు పెంచుకోవాలంటే భయం అవి అడియాసలుగా మిగిలిపోతాయేమో అని..
ఆరాదిద్దాము అంటే భయం అది ఎక్కడ ప్రేమగా మారుతుందో అని..
నమ్ముదామంటే భయం ఎక్కడ నట్టేట ముంచేస్తార అని..
హక్కుగా ఉందామంటే భయం ఎక్కడ అధికారం తీసుకుంటారో అని..
ఒంటరిగా ఉందామంటే భయం ఎక్కడ వెంటాడుతారో అని..
ఖటువుగా ఉందామంటే భయం మనసంటు లేని బండరాయిని అయ్యిపోతానేమొ అని..
నటిద్దాము అంటే భయం ఎక్కడ నటనలో జీవిస్తున్నాను అని గ్రహిస్తారేమొ అని..
కష్టాన్ని చెప్పుకుందామన్న భయమే ఎక్కడ ఉపయోగించుకుంటారో అని..
మాట్లడుదామన్న భయమే లౌక్యము చేతకాక ఎక్కడ నిజాలు చెప్పాల్సి వస్తుందో అని..
ఎదురు తిరుగుదామన్న భయమే ఎక్కడ దూరము అయ్యిపోతారొ అని..
భవిష్యత్తు గురించి అలోచించాలి అన్న భయమే ఎముంది అని ప్రశ్నిస్తుందేమొ అని..
నన్ను నేను ప్రశ్నించుకోవాలన్న భయమే జవాబులు నా అస్థిస్త్వాన్ని ప్రశ్నిస్తాయి అని..
భయమన్న భయమే ఇదెక్కడ బెదిరిస్తుందొ ఇంకెన్నాళ్ళు అని.. 

ఈ భయాలను ఊహిస్తూ రాసా రెండు సంవత్సరాల క్రితం కాని ఇప్పుడు అయితే ఇవన్నీ నిజంగా ఉండవలసిన భయాలే అని ఖచ్చితంగా చెబుతాను...

.........అరుణిమలు........

Thursday, 30 November 2017

తాను నేను

ఓయ్....నిన్నేనోయ్
చాలా రోజులు అయిందిరా నిను చూసి..
అదేలే...తేరిపార చూసి..
ఎక్కడ కళ్ళారా చూస్తే పదపద మంటుందో ఈ పాడు మనసని...నేల చూపులు చూస్తున్నాను మరి...
ఇప్పటికీ ఏ మార్పు లేదెందుకో మరి...
నిను చూసిన క్షణానే మదిలో పదనిసలు మోదలు..
చిరుగాలి తాకిడికి తన్మయంతో ఊగిసలాడిన ఆ విరుల్లా ఈ గుండె దడదడలు ఏంటోయ్...
నీ పేరు మది స్మరించిన ఘడియలో ఎరుపెక్కిన చెక్కిళ్ళు పెదవి సాయాన్ని కోరి మరి చిరునవ్వై విచ్చుకుంటున్నాయి...
నీ ఆలోచనల అలలు తీరం చేరేది నా కాలి గోటి గిచ్చుళ్ళతోనే సుమీ..
కళ్ళలో ఈ కలవరపాటు ఎలా ఆపేది ఎవరి కంట పడనివ్వకుండా...
నా నవ్వుల జలపాతంలో స్థానాలు చేస్తున్నానోయ్..
నీ ఊహల ఉరకలను ఆపేదెలా ఉప్పెనై నను ముంచక మునుపే...
చేయాల్సిదంతా చేసేసి ఏం ఎరుగని పుంగవుడిలా ఆ చూపు ఏంటో...
ఉలిక్కిపడుతున్న నా అదరాలను ఆపేదెలా నిను తలంచకుండా...
ఎదనేలే వేళ నా రాజువి..పానుపును ఏలే వేళ నా చక్రవర్తివి నువ్వే..
నీ రాజ్యం ఇక్కడ తనని ఏలే రాజు లేకుండా ఉందోయ్ నీకోసం ఎదురుచూస్తూ...
నీ గుండె గూటిలో తిష్ట వేసాను చాలులే అనకు..
ఉసురు తగులుతుంది ఈ వయసుది నాది కాదులే..
ఇప్పుడు ఏంటిదని తుళ్ళిపడకోయ్ నిన్ను ఎవరు ఆహ్వానించలేదులే...

                              అరుణిమలు

తాను నేను

ప్రేమ అనే రెండు అక్షరాలలో ఒదిగిపోయాం అనుకున్నాను...
కాని మనం అనే స్వార్ధం బదులు...
నేను అనే స్వార్ధంలోనే నువ్వింకా ఉన్నావని తెలిసాక కూడా...
ప్రేమను పంచగలను కాని ప్రేమను అర్దించలేను...
మనం కానిచోట నేను ఒంటరినే కనుక...
నీ ఏకాంతాన్ని నీకు కానుకగా ఇచ్చి నే వెళుతున్న...
వీలైతే ప్రేమించడం నేర్చుకో వాడుకోవడానికి కాకుండా...

......అరుణిమలు.....

తాను నేను

ఏం ఆలోచిస్తున్నావంటూ ప్రశ్నించడం మానేసాను మనసును...
ఒక ప్రశ్న నేను వేస్తే వేల ప్రశ్నలను ప్రశ్నలుగా నా ముందు ఉంచుతుంది కనుక....
నాకంటూ ఎన్నో హద్దులు పెట్టుకొని, గిరి గీసుకుని ఉన్నన్నాళ్ళు హాయిగా ఉన్నాను....
మన కోసం అంటూ నేను గీసుకున్న గిరి దాటి ఎంత తప్పు చేసాను కదూ....
అందుకే ఈ వెంటాడే ఆలోచనలు నన్ను అనుక్షణం ప్రశ్నిస్తునే ఉన్నాయి...
ఒకరి కోసం లోకాన్ని సైతం ఎదురించవచ్చు...కాని ఆ ఒక్కరిని మరచపోడానికి ఈ లోకం మొత్తం ఏకమైనా కూడా కష్టమే....
నీ ముంగిట నేడు పూయని నా నవ్వులలో సుగంధాలు లేవోయ్...
ఎవరు ఏమని పిలిచినా వినపడని ఏమరుపాటు...
నీ స్వరం జతకానిదే నా పేరుకి అందం ఎక్కడ ఉందిరా...
ఏ పిలుపుకు పలకాలని లేదు...ఎవరినీ పిలవాలని లేదు...
నలుగురిలో మెలుగుతూ నలుగుతున్న మనసు మూలుగులు వినలేకపోతున్నా నేడు....
కాని తప్పదు కదా ఉన్నచోటనే ఆగిపోతే పయనం సాగించేది ఎలా....
అడుగులు వేస్తున్న ఇప్పుడే నడకలు నేర్చిన పాపాయిలా అదీ చేయూత లేకుండా....
ప్రతీ మాటలో,ప్రతీ పనిలో,ప్రతీ పాటలో అసలు నువ్వు లేనిది ఎక్కడ ....
ప్రతీ ఘడియ నా ఈ బతుకు చిత్రం పై కనిపిస్తున్నది నీ రూపే....
చెరిపేయడానికి మనసు ససేమిరా అంటూ నా ఉసురు తీయకంటూ వేడుకుంటుంది....
ఓయ్.....ఎలా సాధ్యంరా ఒకర్ని చెరిపేసి ఇంకొకరికి చోటు ఇవ్వడం...
నువ్వున్న చోటును ఇంకొకరికి ఊహకు సైతం అసహ్యంగా ఉందిరా....
నా దృష్టిలో నువ్వు లేవని చెప్పాలనుకున్నాను కాని ఎలా....
నీకు శిక్ష వేయాలంటే నాకు నేను లేకుండా పోవాలి అంతే....

...........అరుణిమలు............