Thursday, 6 September 2018

తాను నేను

కొన్ని ఇష్టాలను తెలపడానికి మాటలు చాలు
కొన్ని భావాలను చూపించాడానికి పదాలు చాలు..

మాటలలో చెప్పలేని నా భావాలకు అక్షరాలే ఆసరా
రంగులని అద్దిన సీతాకోకచిలుకలా ముస్తాబు చేసా..

సుగంధాలను అద్దిన కాగితంపై రచిస్తున్న
విరహాన్ని తామరాకు పై నీటి బొట్టుగా జారవిడచేసా..

అక్షరాల మాటున దాగిన నా జాబిల్లివి
నీపై నా భావాలన్ని...భావోద్వేగాలను నింపుకున్న నీటి బొట్డుగా రాలుతున్నాయి..

తడిసిపోవోయ్...
నీ తనువులో అణువణువునా నన్ను నింపేసుకుంటు.

ప్రేమ పల్లకీలో వయసు ఊరేగింపు
వరుడు నీవై వధువు నేనై..

ఊపిరి దేహాన్ని మోసినంత కాలం
సాగిపోవాలి ఈ పయనం..

ఏ చూపులు తాకని చోట
నిన్ను నేను దాచుకున్న ..
తనువును తాకకుండా నే
నువ్వు దోచేసిన ఆ చోటున..

అరచేత నా ముద్దుల చందమామ వై
నా కంటి పాపలో చిరునవ్వుల రాజువై నిలిచిపో..

✍️అరుణిమలు

సరదా ముచ్చట

వెళుతూ వెళుతూ వెనుతిరిగి చూసే చూపులో ఏదో గమ్మత్తు అయితే ఉంది..😍😍😍

నీ కోసం తిరిగొస్తా అంటు కళ్ళు చేసే వాగ్దానం..ఎదురు చూసే మనసుకు ఊరటనిస్తుంది..😇😇😇

నా కోసం ఎదురు చూసే మనిషి ఒకరున్నారనే బలం, బాధ్యత కవచంగా మారుతుంది 👉❤👈

పెద్దలు అందుకేనేమో ఒకసారి వెనక్కి చూసి వెళ్ళు అంటుంటారు 🤗🤗🤗

తాను నేను

మనసు అలసిపోతే
మౌనం చాటున దాగుంటుంది..

ఆలోచనలకు అలుపొస్తే
మరుపు ముందుకు వస్తుంది..

కలలు చెదిరితే
నిదుర దూరం అవుతుంది..

కలతలు ఎక్కువ అయితే
కనులలో కారు మేఘాలు కమ్ముకుంటాయి..

ఙ్ఞాపకాలు బలమైనవి అయితే
గాయాలు మాననంటాయి..

నువ్వు ఎదురైతే
గుండె సడి ఉరకలు వేస్తుంది..

నీ పిలుపు వింటే
ఉలిక్కిపాటే శరీరానికి..

నీ తలపొస్తే
నాకు తలుపేసేయాలని ఉంది..

గడియ పడని తలుపే
నీకై నా తలపులు..

తాళం నీ దగ్గరే ఉంది కదా
రాకపోకలన్ని నీ ఇష్టమే..

అనుభవాల
అనుభూతులు మాత్రం నావి..

✍️అరుణిమలు

Tuesday, 4 September 2018

తాను నేను

వెన్నెలవై నువ్వు వస్తే
చెకోరాన్ని నేనై నీ బాహువులలో బందీని కానా..

నాలుగు పెదవుల కలయికలో
రెండు కళ్ళు చేస్తున్న మౌనపోరాటాలు..

గాలికి తావే లేని కౌగిలిలో ఎదలు చెప్పుకునే ఊసులను వింటు..

శ్వాసల ఊయలలో ఏ ఊహాతీరాన్నో తాకుతున్నాయి తనువులు..

నిప్పు పొత్తిళ్ళల్లో ఒదిగిపోయానేమో
కణికనై వెలుగుతున్న ..

నే ఓనమాలు దిద్దిన
మరో పాఠశాల నీ దేహం..

బిడి కౌగిలిలో యుద్ధాలు బిడియాలన్నిటిని బట్టబయలు చేసేసాయి..

చెక్కిళ్ళు చెకుముకి రాళ్ళుగా మారి చెమట చుక్కలను అద్దుకున్నాయి..

ఓయ్.....పగటిని రేయి హత్తుకుందా...
రేయి పగటిని హకత్తుకుందా 🤔🤔

కాలం గోల చేస్తుంది
నన్నిలా కట్టి పడేయకండని..

లోకం కోసం కాస్త దూరమనే
విరామం తప్పదు కదా..

మళ్ళీ మళ్ళీ కలుద్దాం
మనసనే మంచె కాడ..

✍️అరుణిమలు

తాను నేను

పగటి కలలు పంతం పట్టాయి
నిదురను చెడకొడతామంటు..

కళ్ళ ఎదురుగా
నిలవడం కాదోయ్..

కలవై వచ్చి కౌగిలించేసుకో
నీ ఎద నీడన సోలి పోతా..

జోలపాటవై చేరిపో
జామురాతిరి కాస్త జోజో మనడం
మరచిపోయేలా..

పగలంతా పంతాలు
రాతిరికేమో పట్టింపులు

ఆ దూరం దేనికోయ్
ఏ దడి నిలబడింది మన మధ్య..

నీ తలపుల జాగారాలు ఎన్నో
శ్రావణాన్ని శివరాత్రిని చేసేస్తున్నాయి..

✍️అరుణిమలు

తాను నేను

నీకు,నాకు మధ్య
మూడో వ్యక్తి రావడం కష్టం
ఒకరి మీద ఒకరికున్న నమ్మకం అలాంటిది...

నిన్ను, నన్ను
దూరం చేయడానికి
ఏ మూడో వ్యక్తి తరం కాదు
మన బంధం బాహ్యమైనది కాదు కనుక..

నీ అహం, నా అభిమానం
చాలు మన మధ్య దూరాలకి
దారి వేయడానికి...

విడిపోవడానికి ఇద్దరం కలిసి లేము
కలిసి ఉండటానికి ఇద్దరం వేరు కాము...

మనమింతే
కలుసుకోలేం
విడిపోలేం

✍️అరుణిమలు

తాను నేను

తుడిచేద్దామని ఉంటుంది
కొన్ని ఇష్టాలను...

దూరం జరగలేనివి
దరికి చేరలేనివి..

నా చూపుల దూరాన్ని
తాకని తలపులలో
నీతో కలిసి నడుస్తున్న..

నా ఆలోచనలు అందని కోనలలో
నీ ఊహలలో విహరిస్తున్న..

నీ శ్వాస నా మేనుపై లిఖిస్తున్న
నీ ఇష్టాలను చెరపలేక పోతున్న..

నీ చూపులు చేస్తున్న గాయాలకు
ఏ లేపనాలు వద్దనిపిస్తుంది..

నీ చేతలు చేసే చర్యలకు
అచేతనంగా నిలిచిపోతున్న..

ఎందుకు ఇవి..
ఇవేం ఙ్ఞాపకాలు..
ఎందుకో ఈ ఇష్టాలు..

✍️అరుణిమలు