Friday, 2 February 2018

తాను నేను

వెళుతూ వెళుతూ వెనుతిరిగి చూసే ఆలోచనలు
అరికాలిన నలిగే నగవులకు రూపాలు...

అస్తమించే భాస్కరుడి అరుణారుణ వర్ణాలులా
సెగలు పుట్టించే ఆలోచనల అంచులు వాడి..

నువ్వు ఎవరవని అడుగుతుంటే ??

దహించని దాహాన్ని....దగ తీరని దేహాన్ని...
సుడులు తిరిగే దుఃఖాన్ని....సాయం లేని స్వతంత్రాన్ని...
నాకై నన్ను కోల్పోయిన నర్మగర్భమైన నిజాన్ని..
నడిచే దేహాన్ని...నవ్వే యంత్రాన్ని..
నమ్మకానికి చెల్లిన మూల్యాన్ని...నటించిన మనిషికి దాసిని..

నా నీడల జాడలలో నన్ను నేను వెతికే అమావాసని..
మనసా వాచా కర్మణా నా మనసున మనసుకు బానిసని..

✍️అరుణిమలు

తాను నేను

నీతో గడిపే ప్రతీ క్షణాన్ని జీవించాలి అనుకునేది నేను.....అనుభవించాలి అనుకునేది నువ్వు....

అందుకే నేను నీకు గతమై మిగిలాను....
నువ్వు జ్ఞాపకమై పోయావు ఇక్కడ....
💗💗💗💗

✍️అరుణిమలు

తాను నేను

నా కొంగు చాటు దాగిన చందమామవి..
పైట మాటున నక్కిన నడిరేయి నేరేడువి..

నిశీది కోకను నాకు కానుకను చేసి ఈ ఆటలు దేనికింకా..
పరదాల మాటున దాగిన పరువాల పర్వాలను పఠించినది చాలోయ్..

ఒక్కో తార ఒక్కో సిగ పువ్వుగా అలంకరించినది చాలురా..
నిదురొస్తున్న నేల ఆవళింతలకు అణుకువ లేదని కసరకు..

రాత్రి పుష్పానివై వికసించి విరుల జల్లులను వెన్నెలగా పోసేయకు..
తడిచిన నేల వెచ్చదనం కోసం ఒళ్ళు విరిచి మేల్కొంటుంది..

ఆ గగనాన విహారాలు చాలించి నను గూటికి చేరమని సైగ చేస్తుంది..
చలించిన రేయి చాపరాయిలా జారుకుంటుంది..

తమకాలన్నీ తాపాలుగా మారి తడి కోకను పిండి ఆర పెడుతూ..
తొలి కోడిని కూయమని కంగారు పెడుతంది..

ఎదురు చూసిన క్షణాలన్ని కరిగి ఈ ఘడియను నన్ను నీకు కానుకను చేసాయి..
ఈ నిమిషం మిగిల్చిన ఈ జ్ఞాపకం...
నూరేళ్ళకు చెదరని అమృతాక్షరాలుగా ఈ మది గోడలపై చెక్కబడ్డాయి..
ఇక ఆ గాయాలతో ఈ ఙ్ఞాపకాలతో నువ్వనే భావ చెరసాలలో జీవించేస్తా...

✍️అరుణిమలు

తాను నేను

వెన్నెల వాయనాలు వన్నెలకు..
వయసు తాంబూలాలు సొగసులకు..
వడ్డింపుల వేళకు సిగ్గుల కోక  షికారుకు..
నడిరేయిలో నంగనాచి నడకలు చాలింకని..
గూటికి చేరిన చకోరాల ముచ్చట్లు ఇవి..
❤❤❤❤

తాను నేను

నా నవ్వుల నవరత్నాలలో...
నువ్వో మణివై వెలుగులు అద్దుకుంటావు....

మన మనసుల ముసురులలో నువ్వో మెరుపువి...
నా ఇష్టంలో ఇమిడిన ఆకర్షణివి...

కోరికలలో కొలతలు ఎరుగని కాముడివి..
నా అనుభవాలలో గాయాలుగా మిగిలిన అనుభూతివి..

ఊహలలో ఊరు వాడ హోరెత్తించే హుషారువి..
ఉసూరమనిపించడంలో ఎడారి ఎండమావివి..

నా కలల కోలాహలంలో రంగులు లేని ఇంద్రధనస్సువి..
నా అక్షరాల జాడలలో రూపు లేని రూపానివి..

మొత్తానికి నువ్వో మనసున మనసైన మనసు లేని మనిషివి...
అవునా అంటావు....అవసరాల బొమ్మని కదా ఇంతకన్నా ఇంక ఏం చెప్పను...

✍️అరుణిమలు

తాను నేను

సాయం లేని సాయంకాలంలో...
ఏకాంతాలు పొడిచిన పొద్దులో...
పసిదనాలను అద్దుకున్న పడుచు ధనాన్ని నేను...

పంచదార బొమ్మను, నులి వెచ్చని సెగలతో తడిమి తడిమి రుచి చూస్తున్న రవి కిరణాల కొంటెదనం...

పరువాల సంపెంగిని, లతలా ఒంపులు తిరుగుతూ అల్లుకుని...
కోకను దారి తప్పిస్తూ,కురులను సవరించే గాలి గిలిగింతలు..

పాలపుంతల సోయగాన్ని, నేలపైన చూసిన ఆ మామ.. భానుడి అస్తమయ సమయాన్ని భరించలేని ఆరాటంలో వేడి వెన్నెల సెగలు జల్లుతుంటే...

అలంకారానికి ఆభరణాలు దేనికోయ్...
మనసుగా నువ్వు చేరాక ఇక్కడ...

పన్నీరు చిలకరింతలే నిన్ను చూసే నా కళ్ళకి...
చలికాలం వెచ్చని చెలికాలమే మనసైన మనకి...

ఓయ్... పగలు రేయిగా మారాలంటే...
నా తలపులలోకి నువ్వు పరకాయ ప్రవేశం చేస్తే చాలోయ్...

✍️అరుణిమలు

Monday, 4 December 2017

తాను నేను

సడి లేని రేయి గడిచి పోతుంది..
నీకై ఎదురుచూపుల పరదాల మాటున..
ఒకటా రెండా అంకెల లెక్కలకు, అంచనాలకు అందనన్ని గడియలు జారుకుంటున్నాయి నిరాశలకు తోడై...

ఎప్పుడు వచ్చావో ఆ దారి ఆ వరుస తెలియదు కానీ..
నువ్వు తిరిగెళ్ళిన దారి వేపే నిలిచిపోయాయి చూపులు స్థాణువులై..

కాలం మాత్రం గడిచిపోతుంది జ్ఞాపకాల ఊతకర్రను తోడు తీసుకొని..
నీకు మనుషులంటే చులకనో...నమ్మిన మనసులంటే అలుసో ఇప్పటికీ అర్థం కానీ ప్రశ్నే ఇక్కడ...

నే ఇచ్చిన విలువలో వర్ణశోబితమై మెరిసావు...
కానీ నీ విలువలో నే వివస్త్రనై దాగి పోయాను...

అందుకునే నాడు నీ చేయి క్రింద ఉన్నా...
ఇచ్చిన నాడు నీ దోసిలి నింపానేమో కదా ఆ ఎక్కువకు నీకు తెలిసిన విలువ విధిలించడమే అయ్యింది..

దాసోహానికి దాపరికాలు ఉండవు...
ఇష్టానికి కొసరులు ఉండవు...
నీపై అయిష్టానికి చోటు ఉండదు..
నా ఈ కష్టానికి ఆయువు ఉండదు..

నువ్వో రేయిలో నే కోరని కోర్కెవై రాలిన ఉల్కవు..
నీ ఙ్ఞాపకం చిరాయుష్షు పోసుకుంది..
నీ జాడ మాత్రం చితా భస్మమై మిగిలింది..

✍️అరుణిమలు