Thursday, 30 November 2017

తాను నేను

ఏం ఊహించని...ఆశించని రోజులు అవి
నాకై నేను...నాకోసం నేను గడిపే కాలం అది
నేను....అనే నన్ను విచ్ఛిన్నం చేయాలని భావించిందేమో కాలం....
నిన్ను పంపింది నా జీవితంలోకి కనికరం లేకుండా...
ఏం కావాలో ఏం చేయాలో అనుకుని మరీ వచ్చావురా నువ్వు....
ఎందుకు వచ్చావో...నాకేం కావాలో కూడా తెలియకుండానే నిన్ను ఆహ్వానించేసాను కదూ...
నిశ్శబ్దంగా ఉన్న నా మానసాన అలజడులు రేపి...కాలం కోరిన కోరికను నెరవేర్చి విజేతగా వెళ్ళిపోయావు...
కాని గెలిచి ఓడిపోయావురా...నిన్ను నిన్నుగా స్వీకరించిన మనసును...
నీదెప్పుడూ రంగుల లోకమే కదూ...అవును ఎదుటి మనసు కన్న కలలను కల్లలు చేసి మరీ రంగుల అద్దుకుంటావుగా నీ రేపటికి....
ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఓడిన మనసు కాదు...
విలువ ఇవ్వలేని ఒక అబద్ధం ఇక చాలంటూ నన్ను నా నిజాయితీకి వదిలి గెలుపును ఇచ్చేసింది కదా...
అవును ఈరోజు ఏకాంతం నా నేస్తం, కన్నీళ్ళు నాకు ఓదార్పు,గాయపడిన మనసు ఒక గుణపాఠం...
నీకు వెల కట్టలేదు ఏనాడు...విలువ ఇచ్చాను అది నన్ను మించి మరీ....
నువ్వు నా బలహీనతవు...ఇప్పుడు నువ్వే నా బలానివి కూడా...
నమ్మితే ఎమౌతామో చెప్పావు...ఎలా మెలిగితే ఒకరి మనసును విరిచేయొచ్చో చెప్పావు...
ఇవి చాలవా నేను ఇంకొక తప్పటడుగు వేయకుండా...
నేను బాధపడకుండ ఇంకొకర్ని బాధపెట్టకుండా ఎలా బతకాలో నేర్పావు....
ఈ కష్టం కొన్నాళ్లు మాత్రమే నువ్విచ్చిన అనుభవాలు జీవితాంతం నావెంటే ఉంటాయి తోడుగా నిన్ను గుర్తు చేస్తూ....
అనుభవాలను ఇచ్చే నీ ఆట బాగుంది...కాని గెలుపెప్పుడూ ఒకరి సొంతం కాదురా....

.............అరుణిమలు..............

తాను నేను

ఏముంది నీలో నను బంధించే మంత్రం...
ఈ ఆకర్షణశక్తి ఏంటోయ్ నీలో....
ఏ మూలనున్న నీవైపు లాక్కొచ్చే ఈ మాయ ఏంటి....
తెలుసుకోలేని ఈ వింతేనా ప్రేమంటే...
నీ పరిసరాలలో నేనుంటే చాలోయ్...
నీ మేను పరిమళాలు నన్ను మత్తులో ముంచేస్తాయి...
ఇంక నా ముందు నువ్వుంటే....
నాకు నేను ఎవరినో కూడా తెలియదే...
ఏయ్....కాస్త ఎడబాటు మంచిది కదా....
ఇలా నిన్ను నాకు అలవాటు చేయకురా....
రేపన్న రోజున నీకు దూరమైతేనో నేను ఊహించలేనోయ్.
నా లోకమంతా నీలోనే, నీతోనే ఉంది...
మరి నువ్వు దూరమైతే ఈ విశాలమైన ప్రపంచంలో నేను ఏకాకిని అయిపోతాను సుమీ...
నా వ్యసనానివి  కావోద్దురా అస్సలు...ఇంక నాకు నేను కూడా మిగలను....
ఇలా నీ శ్వాసలతో నాకు ఊపిరి పోస్తూ నాలో అణువణువునా నిండి పోయావు....
నువ్వు మలచిన వేణువునే నేను మరి నువ్వు లేకపోతే మూగదై పోతుందోయ్....
నా ప్రాణం ఉండాలంటే నీవెంట నడవక తప్పదోయ్ మరి నీవెంటే నేను.........నీ జంటనై

.............అరుణిమలు............

తాను నేను

మనం కలుసుకోవటం ఇలా ఇది మొదటిసారి అయితే కాదు అంటుంది నా మనసు....
మనల్ని చూసి పరవశించిన ఈ ప్రకృతే అందుకు ఋజువు....
నా మనసులోని పులకింతలన్నీ ఇలా వరాల జల్లై నను తాకుతూ ఉంటే...
పులకరింతలన్నీ పరవళ్ళు తొక్కుతూ నను చినుకై తాకి తడుముతుంటే....
నా అరచేత ఇలా క్షణకాలములో పడిజారే చినుకు లాంటి వాడివి నువ్వు...
నీ రాకపోకలకు సాక్ష్యం ఈ చేతికంటిన చెమ్మే సుమీ...
ఓయ్....దిక్కులు చూస్తావేం దిగాలుగా
సీత ఇటు ఉందోయ్..
ఇంకెన్నాళ్ళు ఈ సుందరాకాండ మన మధ్య
నిను తాకిన గాలి తాకిడి చాలోయ్ నాకు నా ఆశలకు జీవం పోయడానికి...
చినుకు చినుకుగా తాకి నేలంతా చిత్తడి అవుతున్నట్టే...
నీ ఊహలు నన్ను చిత్తు చిత్తు చేస్తున్నాయి చూడవోయ్ చిన్నోడా....
చూడకపోతే పో అటు శూర్పణఖేగా ఉంది చూడు బాగా...

...........అరుణిమలు............

తాను నేను

చిన్న చిన్న ఆనందాలే కదా జీవితమంటే...
కాసంత సమయం నువ్వు నేను మనమై గడిపితే చాలదా...
నీ కళ్ళలోకి చూస్తూ కరిగిపోతున్న కాలాన్ని మర్చిపోతూ భవిష్యత్తును చూడటం చాలా ఇష్టం...
మనసారా నే పిలిచే పిలుపు నిన్ను తాకుతుందో లేదో కాని నీ పేరు పలుకుతుంటే నా ఎద ఎన్ని హోయలు పోతుందో నీకు తెలియదు...
నా మాటలకు ఊ కొడుతూ నాకు ఊతపదాలను అందిస్తూ ఆట పట్టిస్తుంటే నాకు ఊపిరి ఆడదోయ్....
ప్రతీ చిన్న మాట నీ చెవినేయాలి...తెలిసిన విషయంలో కూడా నీ సలహ అడగాలి...
నీతో జాగ్రత్తలు చెప్పించుకోవాలి...నాలుగు చీవాట్లు తినాలి...
నీతో బాగుందని అనిపించుకుంటేనే కాని నా కంటికి ఇంపుగా కనిపించదే ఏది....
ఒక్కమాటలో నా కళ్ళను, నా మనసును నీముందు తెరిచి ఉంచుతాను నీమీద ఉన్న ప్రేమతో సహా....
అరచేత ఆశలన్నింటిని ఇలా పేర్చుకున్న చూడు...
పండించవోయ్ ఎర్రగా ఆ తూర్పున పొడిచే సూర్యుడిలా...
ఏ చీకటి నీడలు పడనివ్వకే తట్టుకునే శక్తి ఎక్కడదోయ్ ఈ మనసుకు...
ప్రేమకు అర్ధాలు తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే...
నా సంతోషం నీలో ఉందని...నీ సంతోషానికి కారణం నేనవ్వాలనీ ఇంతే....
వెనుదిరిగి చూసే కాలంలో నువ్వు ఒక ఙ్ఞాపకానివే కాదు రేపటి నా భవిష్యత్తుకు బాటవి కూడా....
ఓయ్....నిన్నే నా నిర్ణయానికి ఎక్స్‌పైరీ డేట్ లేదోయ్ గురుతుంచుకో...

........అరుణిమలు........

తాను నేను

ఙ్ఞాపకాలలో అలా మనసు ఊయలూగుతోంది
మన నవ్వులు విరబూసిన ఆ నిమిషాలు తలంపుకొస్తే...
అదరాలపై ఇప్పుడు సిగ్గును అద్దుకున్న నవ్వు పూసింది నీ పేరుమీద....
విరిసిన ఆ నవ్వుల విరులను మాల కడుతున్న నా మనసనే దారంతో....
నీ పేరు పలికే నా పెదవులు సోయగాలు నిన్ను ఊరించే ఆ రోజులు....
ఆనాడు తొలిజాము దాటినా కనుకు చేరని ఈ కంటిపాపలు....
జోకొట్టిన నిదురపోని రాత్రులు ఎన్నో మనం ఒకటై గడిపినవి...
మన మాటల పూదోటలలో పరవశించి మనం విహరిస్తుంటే....
మన గాలి తాకిన చోటంత మన మనస్సుల గుభాళింపులు మత్తు మందును జల్లుతుంటే....
మది ఆలపించిన రాగాల తోటలో మన ప్రణయం మారుమ్రోగింది...
మనమై మనం ఏకమై...నువ్వు నేననే మనం మనమై...
మనసుల ముడి పెనవేసుకుని పోయిన ఆ రోజుల ఙ్ఞాపకాలు ఏనాటికైనా నావే....
ఓయ్......ఈ ఙ్ఞాపకాలు నా సొంతం...
నేను పోగేసుకున్న పున్నాగ పూల రాశులు...
వీటి గుభాళింపు నీవు ఏనాటికి ఆస్వాదించలేవు...
నీకు పరిచయాలు ముఖ్యం కాని మనుషులు కాదు కదా....

.............అరుణిమలు..............

తాను నేను

నీతో నా అనుభవాలను రాయనా...అనుభూతులను రాయనా...
అనుభవాలేమో ఏడేడు జన్మలకు సరిపడా గుణపాఠాలు...
అనుభూతులేమో తాకేందుకు కూడా చోటు లేనన్ని గాయాలుగా మిగిలాయి...
గతమేమో భవిష్యత్తును శాసించింది ఆశలను తుంచేసి మరి....
భవిష్యత్తేమో భారంగా చూస్తుంది వెను తిరిగి ఎందుకింత బరువును ఇచ్చావంటూ....
ఎన్నో ప్రశ్నలు నిన్ను అడగాలని ఉన్నా...అక్కడ వచ్చే జవాబు ఒకటే....క్షమించు !!!
నువ్వంటే ఇష్టం అంటూ కోరి వచ్చింది నువ్వు...
తరువాత నేనొక అవసరాన్ని అన్నది నువ్వే...
ఇప్పుడు నేనెప్పుడూ నిన్ను ఇష్టపడలేదు అంటూ... క్షమించి మరచిపో గతాన్ని అని నువ్వంటుంటే...
నిన్నేమని అడగాలి....శరీర గాయానికి మందుంది ఈ మనసు గాయానికి మందుంటే ఇవ్వవా అనా....
మనసుతో ఆడుకోడానికి నేనే దొరికానా నీకు అని అడగనా...
నిన్ను నమ్మిన నేరానికి ఇంత శిక్షా....నేనెప్పుడూ నిన్ను ఇష్టపడలేదు ఈమాట చాలదా నన్ను దహించేయడానికి..
ఎవరివని వచ్చావు అసలు, అధికారం ఎందుకు  తీసుకొన్నావు..
మనసుకు మూడు ముళ్ళ బంధాన్ని సైతం వేసి ఈ రోజు మరచిపో అంటే నన్ను నేనే మరచిపోవాలనుంది ఇప్పుడు ...
ఆటబొమ్మనా నేను....నేను మనిషినిరా అని గొంతు చించుకొని అరవాలనుంది...
క్షమించు అనేమాటతో నువ్వు నీ తప్పును కడిగేసుకుని ఆ నీళ్ళను నామీద జల్లేసావు నా పాపంలో కాలిపో అంటూ....
ఒక్క అర ఘడియ నా మనసు భారాన్ని మోస్తే నీకు తెలిసేది నువ్వు చేసిన గాయాల లోతు ఎంతుందో....
జీవితంలో నిజాయితీగా ఎప్పుడూ ఎవరినీ నువ్వు ప్రేమించకురా...
కర్మ సిద్ధాంతం నిజమే అయితే ఇక్కడ నాకు నువ్విచిన ప్రేమ లాంటి ప్రేమ నీకు తిరిగి రావొచ్చు కదా....
నువ్వు అనుభవించగలవా ఇంతటి ఊహకు అందని నరకాన్ని....
ఇప్పుడు నవ్వుతునే ఉన్నాను జీవం లేని నవ్వు నా మనసు ఘోషను వినలేక...
ఇప్పుడు ఇంతకు నేను నిన్ను ప్రేమించానన్నది మరచిపోవాలా...నువ్వు నన్ను ప్రేమించలేదు అన్నది మరచిపోవాలా
ఏది మరచిపోవాలి.............??????

...................అరుణిమలు..................

తాను నేను

తొలకరై నువ్వు తొంగిచూస్తే నే పిల్లగాలినై నిను అల్లుకుపోతా....
చినుకువై నువ్వు నను చేరితే తొడిమనై విచ్చుకుంటా....
జడివానై నువ్వు జోరుమీద ఉంటే హరివిల్లై నిన్ను పెనవేసుకు పోతాను....
వాసంత సమీరాలు వయసును తట్టి లేపుతున్నాయి...
ఓణి కట్డిన వయ్యారాలు ఏరువాకకు సిధ్దంగా ఉన్నాయి నువ్వు నాగలి పట్టేది ఎప్పుడా అంటూ....
ఉరుకులు పరుగుల మీదున్న ఈ గంగను ఆపేందుకు సిద్ధమేనా మరి....
కలిసిపోనీ ఇలా ఈ గంగను నువ్వనే సాగరాన....
ఓయ్....బాటసారి ఇలా చూడవోయ్ ఒకసారి ఆ నడకను ఆపి....
ఒకర్నే ప్రేమించడం, ఆ ఒకరికే అంకితం అవ్వడం అంటే తెలియని నీ పయనానికి ముంగింపు ఎక్కడోయ్....
తనువు కోరిన వ్యామోహం తీరేది మనసు నిండా ప్రేముంటేనే....
చిత్తడి నేలను వదిలి ఎండమావుల వెనుక నీ పరుగులు ఇంకా ఎన్నాళ్ళోయ్....
ప్రేమించడం నేర్పిన మగడా...ఒక్కర్నే ఎన్ని విధాలుగా ప్రేమించాలో తెలియని....తిట్టనులే
ఆ ఆకాశమే సాక్షి నా విశాలమైన ప్రేమకు... అది నువ్వు ఎక్కడికి వెళ్ళిన నీ నీడై నీ వెంటే ఉంటుంది....
చల్లని వెన్నలనై ప్రేమను పంచగలను...నీ తప్పులను మందలించే మంటను నేను...నీ నిర్లక్ష్యాన్ని మౌనంగా భరించే ఆ అమావాస్య చీకటిని నేను....
తిరిగి తిరిగి అలసిన రోజున..మన గూటికి నువ్వు చేరే రోజున ఆ గడప కాడ ఎదురుచూస్తూ ఉంటా....

................అరుణిమలు.................