నన్ను నేను ఎక్కడ దాచుకున్నాను
నన్ను నా నుండి దోచింది ఎవరు..?!
ధైర్యం నవ్వుతుంది నిబ్బరంగా..
మనసు వెతుకుతుంది
కారణలను కాగడాల వెలుగులో..!!
చూపులనిండా మనశ్శాంతే..
ఒకసారి ఆ చూపుల దారి వేపు చూస్తే
కనిపించేది అంతా అశాంతే..!!
మోము నిండా మనో నిబ్బరం..
మది లోతుల్లో
పొరలు పొరలుగా దాగిన
మానసిక సంఘర్షణ..!!
ఆవేదనలో వేదన లేదు
అవకాశం తీగలా అల్లిన చిక్కుముడులే ఉన్నాయి..
ఎలుగెత్తి అరవాలని ఉంది
ఎద బావిలో దాగిన దుఃఖాన్ని తోడేయాలని..!!
దహిస్తున్న నిన్నటిని
నేటితో చెరిపేసి రేపటిని ముస్తాబు చేయాలని..
అద్దుకున్న నవ్వులను కాస్త పక్కన పెట్టి
గుక్క పెట్టి మరీ గొంతులో దాగిన దుఃఖాన్ని బయటకు విసిరేయాలని ఉంది...!!
ఏది ఆ వేళ
ఊరించే ఎండమావే అది..
దేహానికి ఆ ధైర్యం ఎక్కడ ఉంది
ఆ ఉద్రేకాన్ని ఊరడించేందుకు..!!
బద్దలయ్యేందుకు సిధ్దమే అగ్నిపర్వతాలు
ఎదురెళ్ళి ఆర్పే నాధుడు ఏడి
కన్నీరు తప్ప..!!
✍🏻అరుణిమలు
No comments:
Post a Comment