Saturday, 2 December 2017
తాను నేను
ఈరోజు రేపటికి గతం అవుతుంది...
ఈరోజు భావాలు రేపటికి ఙ్ఞాపకాలుగా మిగులుతాయి...
గతాన్ని మళ్ళీ తీసుకు రాలేం...ఙ్ఞాపకాలను చెరపలేం...
అదేంటో కలం కాగితాన్ని తాకితే మన కథే రాయమంటూ భావాలను కదిలించి ఆలోచనలను పరుగులు పెట్టిస్తుంది...
అటు ఇటు కాని ఆలోచనల నడుమ మనసు నలుగుతునే ఉంది...
కావాలనుకున్నది కోరుకోదు అలాగని వద్దని వదులుకోదు..
గతం నీడలలో క్రీనీడగా ఈ ఙ్ఞాపకాలు ఎప్పుడు మరుపుగా మారుతాయా అని చూస్తున్న...
ఎందుకీ ఙ్ఞాపకాలు అంటే నీవు మిగిలింది ఈరోజు అక్కడేగా మరి, ఎలా వాటిని సమాధి చేయడం...
భవిష్యత్తు లేని బంధానికి నిన్నటి భరోసావి కదా నువ్వు...
నిన్నటి భావాలని నెమరేస్తునే ఉంది మనసు...
నాతో లేవనే మాటే కానీ నువ్వు లేని చోటు లేదు...
ఒకనాటి సంతోషానివి, ఆనాటి ఆశవు, ఒకప్పటి వరానివి...
తుఫాను ముందు చల్లగాలిలా వచ్చావు తన్మయం నుండి తేరుకునే సరికి నాకు నేనంటు మిగలని శిధిలాలను మిగల్చావు...
నీ నీడన నను తాకిన దుఃఖం నువ్వు వీడినా అది నను వీడను అంటుంది...
గుప్పెడంత గుండె నిండా నీ పై ప్రేమ అలాగే ఉంది...
కళ్ళ నిండు కుండలే కళకళలాడుతూ నీ రూపాన్ని దాచుకుని మరీ...
పెదవి దాటని ఆవేదనెంతో మౌన ముద్రలో ఉంది...
మాటలలో తరగని కోపం ఉంది...
నీ ఆటకు నేనొక బొమ్మనని తెలిసేలా చేసిన నీ చేతలు చేసిన గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి...
నీ మీద అసహ్యం మాత్రం ఇప్పటికీ నా దరి చేర లేదు..
ఇంకెంత దిగజారాలి తాను నీకు అసహ్యం కలగాలంటే అని మనసును అడుగుతునే ఉన్నా...జవాబు లేదు..
ఏయ్....నీ దిగజారుడు తనం చూస్తే నిన్ను దాచుకున్న మనసుకు ఆవేదన మెలి పెడుతుంది ఇంకా...
అసహ్యం కలగని నా నిస్సహాయతను చూస్తే నా పై నాకు జాలి కలుగుతుంది...
నువ్వెలాగు మారవు నేను కూడా మారనా అనిపిస్తుంది...
నువ్వేదో ఇచ్చావు అని కాదు...నిన్ను నిన్నుగా కావాలనుకొన్న మనిషిని కదా అందుకేనేమో...
ఇన్ని జరిగినా నా నుండి జరగనంటుంది నువ్వనే భావం...
కోపంతో గురుతు చేసుకోవడంలో కూడా ఒక కిక్ ఉంది సుమీ..తిట్టుకోవడంలో...కన్నీరుగా మారడంలో..
నువ్వనే ఆలోచనే ఒక ఔషధం నాకు...గాయానివి నువ్వే కదా మరి...
✍️అరుణిమలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment