Saturday, 9 November 2019

తాను నేను

మనసును ఒప్పించలేని నిర్ణయాలు దేనికో
పెదవి పలికే వద్దనే పదం చిన్నదే కానీ
పదునైనదే మెదడును తొలిచి వేయడంలో..

వద్దు అనుకోవడం ఎంత తేలికో కానీ
ఆ వద్దనే మాటని మనసు ఒప్పుకోదే..

మనసుకు, మెదడుకు మధ్య యుద్ధం సాగుతుంటే
ఆలోచనలు ఒకపక్క పరిగెడుతుంటే
ప్రస్తుతం మౌనమై పోతుంది..

వాస్తవాన్ని అంగీకరించలేను
అబద్దంలో బతకలేను
నడి మధ్య నాటకమే కదా ఈ జీవితం..

మాటకే తప్ప చేతలలో చేతకాని వదిలేయ్ అన్న మాట...
ఒకడుగు ముందుకు పది అడుగులు వెనుకకు లాగుతుంటే ఈ పయనం సాగేదెలా..

మనసు ముందు ఓడిపోవాలని ఉంది
కానీ బతుకులో గెలిచే దారేది...

నిను వెతికే కనులకు అలసట లేదు
నిన్ను స్మరించే పెదవులకు విసుగు రాదు
కానీ... కలవని తీరాలమని కాలం ఖచ్చితంగా చెబుతుంటే..

గమ్యం లేని పయనం వేపు
విననంటు ముందడుగు వేయనా..
గతి తప్పిన నాది కాని దారిలో
నీ జతగా నా అడుగులను ఆపేయనా..

చాలింక.....అని ఎన్నిసార్లు అన్న
నా మనసు చెలించదేమి..

చూడకింకా అన్న
నా చూపులకు నువ్వో వ్యసనానిగా మారావే..

ఇక వదిలేయ్
అనే మెదడు ఇచ్చే హెచ్చరికలు
మరిచానేమో పదే పదే
కళ్ళ నిండా చెలమలే నిండుగా..

నిను కలవడం ఓ వరం అయితే..
నీకు జరగాలన్న ఈ దూరం ఒక అగ్నిపరీక్షే నాకు..

దహిస్తుందో
దారి వేస్తుందో
కాలమే చెప్పాలి ఆ జవాబు

✍️అరుణిమలు

No comments:

Post a Comment